24, ఫిబ్రవరి 2009, మంగళవారం

యుద్ధం

నేను పదిమందిలో ఉన్నప్పుడే కాదు.. ఒంటరిగా ఉన్నా.. ఆనందంగా గడపగలను. నరుగురిలో ఉంటే ఫర్వాలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనసూరుకోదు. చెలరేగి పోతుంటుంది. దానికి తోడు ఈ పాడు బుద్ధి ఒకటీ.. ఓ... తెగ ఆలోచించేస్తుంది. ఇక ఇవి రెండూ కలిసి చేసే గొడవ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఖాళీగా ఉండను. ఒకవేళ ఎప్పుడైనా ఉన్నా ఏ పుస్తకమో ముందేసుకు కూర్చుంటా. అప్పుడప్పుడూ బండి ఇంట్లో పడేసి బస్సులో పోవడం నాకు చాలా ఇష్టం. అలా అప్పుడప్పుడూ ఏ ప్రయాణంలో ఉన్నప్పుడో అదునుచూసుకుని మరీ యుద్ధానికి దిగుతాయి ఈ పాడు బుద్ధీ, మనసూ. అది నాకూ ఇష్టమేననుకోండి..

ఈ మధ్య ఓ రోజు అలాగే ఏదో సినిమాకి ఆర్. టి. సి. ఎక్స్ రోడ్ వెళదామని, మెహదీ పట్నం బస్టాప్ లో డైరెక్ట్ బస్(113 ఐ/m) కోసం ఎదురుచూస్తున్నాను. రైతు బజారుకూడా పక్కనే ఉండడంతో వచ్చేపోయ్ళే జనాలతో మెహదీపట్నం బస్టాప్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కూరలమ్మేవాళ్లూ, పళ్లమ్మేవాళ్లూ, కాలేజ్ స్టూడెంట్స్, తల్లీ బిడ్డలూ, ప్రేమ జంటలూ, ముసలి వాళ్లూ, ఉద్యోగస్థులూ ఇలా చాలామంది వచ్చి పోతుంటారు. అలా వచ్చి పోయే జనాలని గమనిస్తూ, వాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ కాలక్షేపం చేయడం నాకు చాలా ఇష్టం. జనాల మొహంలో నవ్వుంటే నాకూ నవ్వొస్తుంది. ఎవరైనా దిగులుగా కూర్చుంటే వీళ్ల దిగులుకు కారణమేమై ఉంటుందా అని నేనూ దిగులుపడి పోతాను. వాళ్ల కష్ట సుఖాల గురించి తెగ అంచనాలు వేసేస్తుంటాను. నా అంచనాలు నిజమైపోతాయని కాదు. కానీ అదో ఆనందం. అచ్చం సినిమా చూస్తున్నంత ఆశక్తిగా ఉంటుంది. (మీరూ ఓ పాలి ప్రత్నించి సూస్తే పోలే...) నేను వెళ్లాల్సిన సినిమాకి చాలా సమయం ఉండడంతో బస్సు గురించి కంగారుకూడా లేదు. ఇక మనకి తెలియకుండానే ఊహల్లో తేలిపోతూన్నాం. ఆ ఊహలన్నీ సినిమాస్టోరిలుగా కూడా అల్లేసుకుంటున్న సమయంలో... ఓ బిచ్చగాడొచ్చాడు. అతనికి కళ్లులేవు. ఓ 50 ఏళ్లుంటాయి అతనికి. అడగ్గానే ఓ రెండు రూపాయలేశాను. దూరంగా ఓ 10 ఏళ్ల అబ్బాయి ప్లాస్టిక్ సంచీలు అమ్ముతున్నాడు. వాడు చదువుకోకుండా కవర్లు అమ్ముకుంటుంటే వాళ్ల అమ్మా నాన్నా ఏమీ అనరా? ఒకవేళ వాళ్లే అమ్మిస్తున్నారా? అలా ఆలోచిస్తుంటే మళ్లీ ఓ 13 ఏళ్ల అమ్మాయి డబ్బులిమ్మని అడుగుతూ వస్తోంది. మాసిన బట్టలు అక్కడక్కడా చిరుగులు పట్టాయి. ఈమెకు డబ్బులు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. వొకవేళ ఇస్తే ఆమెను అడుక్కునేందుకు పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందేమో. ఇవ్వక పోతే ఆమె ఎంత కష్టంలో ఉంటే అలా రోడ్డున పడిందో? ఇంతలో నామనసు " వెధవాలోచనలాపి చేతనైనంత ఇవ్వవోయ్" అంది. ఇక దాని మాట కాదనలేక ఓ 2 రూపాయలు వెయ్యబోయాను. అంతలో దూరంగా ఉన్న స్వాతీ టిఫిన్స్ కనబడి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. డబ్బులివ్వడం కంటే టిఫిన్ ఇప్పిస్తే మంచిదనిపిచ్చి టిఫిన్ తింటావా..? అన్నాను. ఆమె తలూపడంతో ఆమెను తీసుకు వెళ్లి ఇడ్లీ ఆర్డరిచ్చాను. ఆమె అదోలా మొహం పెట్టి "దోసె చెప్పన్నా" అంది. సరే అదే ఇప్పించి వచ్చేశాను. ఇక అప్పుడు మొదలయ్యింది యుద్ధం. అది నాలో నాకు, నాతో నాకు ( మనసుకీ, బుద్ధికీ) జరిగిన యుద్ధం . దాని సారాశం సరదాగా మీముందుపెడతాను.

బుద్ధి: మనసా... నీపని నువ్వు చూసుకోక ఊ రికే నా ప్రతి పనిలో తలదూరుస్తావెందుకే..?
మనసు: నీ పనేంటీ.. నా పనేంటి బాసూ.. ప్రతి పనీ మనదే కదా? ఏదో ఆడపిల్ల అడిగింది. చేతనైనంత ఇవ్వక ఆ ఆలోచనలేటి?
బుద్ధి: ఆ మాత్రం నాకు తెలీదా? కానీ ఇలా ఎంతమందికి వెయ్యాలి? అదిగో అటు చూడు. దూరంగా ఇంకో నలుగురైదుగురు కనపడుతున్నారు. ఇంకాసేపు కూచుంటే వాళ్లుకూడా వస్తారు. వాళ్లక్కూడా వెయ్యాలా..?
మనసు: అందుకే నిన్ను `బుద్దూ' అనేది. నువ్వు ఇక్కడ కూర్చున్న అరగంటలో వాళ్లు క్యూ కట్టుకుని వచ్చేస్తారేంటి? వాళ్లొచ్చినప్పుడు గదా? అయినా రోజూ ఎంతమందికి దానం చేసేస్తున్నావేంటీ..? ఈ నెలమొత్తంలో ఎంతచేశావో..? ఓసారి లెఖ్కెయ్యమ్మా..!
బుద్ధి: ఆ... నిజానికి ఈ నెలలో ఇదే చెయ్యడం. కానీ ఇలా పదులూ పరకలూ ఖార్చు పెట్టేంత లేదుకదా మనకి. నువ్వు మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ రెండురూపాయలే వేసి ఊరుకుండే వాడిని, లేదా అసలు ఆపేసేవాడిని. అలాంటి చిన్నపిల్లల్ని చదువుకోమనో, కష్టపడి సంపాదించమనో చెప్పి ఆలోచింప చేయాలి కానీ కనిపించిన ప్రతీ వాడికీ దానం చెయ్యలేం కదా...
మనసు: ఆహా నీకు కనిపించిన క్షణంలో నీతులు బోధించేస్తావా.. వాళ్లు ఆచరించేస్తారనే...
బుద్ధి: దేనికైనా మనసుంటే మార్గముంటుంది. అంటే నువ్వు నాతోడుంటే ఏదైనా సాధించవచ్చు.
మనసు: టచ్ చేశావు. నేనెప్పుడూ నీతోడే మామా. కానీ ఎప్పుడైనా నువ్వు గాడి తప్పుతున్నా, మానవత్వాన్ని మరుస్తున్నా.. ఇలా గుర్తు చేస్తానంతే. ఈ మాటలు ఎవరైనా అమ్మాయిల దగ్గర చెప్పు వర్కవుట్ అవుతాయేమో..
బుద్ధి: ఇప్పుడొచ్చిన వాళ్లు కాస్త ఫర్వాలేదు, ఇకొంతమంది ఉంటారు తాగుబోతులూ, తిరుగు బోతులూ. వీళ్లకి వేరే పని చేతకాదు. అడుక్కోడమే వీరి పని. అడుక్కుని ఆ వచ్చిన డబ్బులతో తాగి రోడ్లమీద పడి దొర్లుతుంటారు. చిన్నపిల్లలకి డబ్బులేయడం ద్వారా వాళ్లని సోమరులుగా తYఆరు చేసినవాళ్లం అవుతాము కదా..? వాళ్లూ పనీ పాటా చేతకాక, ఇలా తాగు బోతులవ్వాల్సిందేనా?
మనసు:అయినా నువ్విచ్చే రూపాయికి ఇంతలా ఆలోచించాలా.. చూడగానే నీకు దానంచెయ్యాలీ అనిపించిందనుకో చేసేయ్... ఆలోచించకు. దానం చేసిన తరువాత వాళ్లు దేనికి ఉపయోగిస్తున్నారో అని కూడా బాధ పడకు... మంచి మనసుతో చేసే ప్రతి పనీ మంచికే దారితీస్తుంది.
బుద్ధి: నువ్వన్నట్టు రూపాయికీ పాపాయికీ ఆలోచించనవసరం లేదు. కానీ మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో తెలుసుకోవాలిగా? వాళ్లు నిజంగా కష్ట పడలేని ముసలివాళ్లూ, అవిటి వాళ్లూ అయితే ఇంతలా ఆలోచించను. కానీ చిన్న పిల్లలయితేనే కాస్త ఆలోచించాలి. సోమరి పోతులయితే అసలు వెయ్యమనుకో.. పైగా ఇప్పుడుంకో గొడవ వీళ్లని చేరదీసి రౌడీలు డబ్బులు సంపాదిస్తున్నారుట.
మనసు: నీకెలా తెలుసేంటి?
బుద్ధి: "సినీమాలు చూడట్లేదేంటి?"
మనసు: "నీకేం బాబూ" ఆలోచించడమే నీకు తెలీసు. కానీ స్పందించడమే నాకు తెలుసు. వాళ్ల కళ్లల్లో దైన్యమే కనబడుతుంది నాకు. కాబట్టి నామాట కూడా కాస్త విను. వాళ్లని పూర్తిగా మనమెలాగూ పోషించలేం. కనీసం మన స్థితిని బట్టీ, వాళ్ల పరిస్థితిని బట్టీ నీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వు. కానీ ఇచ్చేది మనసారా ఇవ్వు. ఆనందంతో ఇవ్వు.
బుద్ధి: అదే ఆ జెనీలియా డైలాగులే వద్దనేది. "నీకేం బాబూ" అంట... ఏమీ తెలియని నంగనాచిలా ఎంత అమాయకంగా చెబుతావో... ఎంత వారైనా నీ ముందు ఓడి పోవలసిందే కదా..
సరేలే.. ఆ బుంగ మూతి మార్చు. నీమాటలు నేనెప్పుడు కాదన్నానని.
మనసు:మిగతావాళ్లలా నా నోరు నొక్కేయకుండా.. నేను చెప్పేది కాస్త ఆలోచిస్తావు. అందుకే నువ్వు నచ్చుతావు గురూ..


ఇలా చాలా చర్చ జరిగిందండీ.

మరేమో నండీ... నాకేమో సంఘ సేవకుణ్ణయిపోవాలని పేద్ధ కలండీ. నాకులాగే చాలామందికి కూడా అదే కల అండీ. కానీ అది ఇంకా కలే నండీ.. నిజం కాలేదండీ... ఎందుకంటే మేమింకా రూపాయిల దగ్గరే పైపైన ఆలోచిస్తున్నాము కానీ కాస్త లోతుగా ఈ చెల్లా చెదురైన వాళ్ల జీవితాలు ఎలా బాగు పడతాయో ఆలోచించమండీ. ఎందుకంటే ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవలసి వస్తుందేమో అనే భయమండీ.

12 వ్యాఖ్యలు:

 1. మరేమో నండీ... నాక్కూడా సంఘ సేవకురాల్నయిపోవాలని పేద్ధ కలండీ. కానీ అది ఇంకా కలేనండీ..నిజం కాలేదండీ.:) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మరేమో నండీ.. నాకు మాత్రం మీరు రాసింది పెద్దగా ఏమీ అనిపించలేదండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "అదే ఆ జెనీలియా డైలాగులే వద్దనేది."
  హ హ హ.
  మీ బుద్ధిగాడు చాలా బుద్ధిమంతుడు.
  ఔను, భారతీయ నగరాల్లో నడుస్తున్నప్పుడు కాస్త మనసుండి స్పందించే గుణాం ఉన్న వారికెవరికైనా ఇటువంటి ఆలోచనలు చుట్టుముట్టక మానవు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "వాళ్లని పూర్తిగా మనమెలాగూ పోషించలేం. కనీసం మన స్థితిని బట్టీ, వాళ్ల పరిస్థితిని బట్టీ నీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వు. కానీ ఇచ్చేది మనసారా ఇవ్వు. ఆనందంతో ఇవ్వు......"

  నా డైలాగు కూడా ఇదేనండీ! ఆ క్షణం కనపడేది ఆ మనిషి దైన్యం, ఆకలి. beyond that.. ఇక వేరే ఆలోచనలు ఏవీ రావు.రోడ్ల మీద అడుక్కునే వృద్ధులని చూస్తే వాళ్లందరికీ ఏదో ఒక సహాయం చెయ్యాలనిపిస్తుంది. కానీ సాధ్యమా చెప్పండి.

  "ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని భయమండీ".......నిజమే ఇది! కానీ ఆలోచిస్తూనే ఉండాలండీ! కనీసం ఒక్కరి మొహంలోనైనా మనవల్ల చిరునవ్వు మొలిస్తే ఆ క్షణం విలువ చెప్పలేనిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏమిటీ చెత్త గోల. ఎవడి ఖర్మ వాడిది.
  నిజంగా ఇది పని లేని పనే(label)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కాస్త లోతుగా ఈ చెల్లా చెదురైన వాళ్ల జీవితాలు ఎలా బాగు పడతాయో ఆలోచించమండీ. ఎందుకంటే ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవలసి వస్తుందేమో అనే భయమండీ.
  బాగా చెప్పారండి..
  @Rakesh గారు మీకు మనసులేదనుకుంట! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అయినా నువ్విచ్చే రూపాయికి ఇంతలా ఆలోచించాలా.. కచ్చితంగా ఆలోచించాలి. అది రూపాయే కావచ్చు, లక్షే కావచ్చు.
  దానం చేసిన తరువాత వాళ్లు దేనికి ఉపయోగిస్తున్నారో అని కూడా బాధ పడకు .. అపాత్ర దానం mere waste.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నచ్చినవారికీ, నచ్చనివారికీ అందరికీ నా ధన్యవాదాలు.
  @ సుజాత గారు:ఆలోచిస్తూనే ఉండాలనే నేనూ అంటున్నానండీ...
  అసలు ఇదింకా చాలా పెద్ద చర్చండీ. అది మొత్తం ఇక్కడ చెప్పలేము.:)
  @ రాకేష్ గారు: మీ విలువైన కాలాన్ని పాడు చేయ కూడదనే "పని లేని పని" అని ముందరే చెప్పానండీ. :)
  @ విష్ణు గారు: నచ్చనంత మాత్రాన వారికి మనసు లేదని అనుకో నఖర్లేదండీ. :)
  @ క్రిష్ణా రవు గారు: అందుకే ఆ రూపాయి గురించి అంతలా ఆలిచించానండీ..
  అపాత్ర దానం చేయకూడదు అన్న దానినే నేను మరోలా . " సోమరి పోతులయితే అసలు వెయ్యమనుకో.. " అని చెప్పానండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాలో నేను...గారు.. నమస్కారం..

  మీ.. టపా వస్తువు... బాగుంది.. అయితే.. యుద్ధం.. అనే టైటిల్.. ఖొంచెం.. భారీగా ఉందెమొ..

  తక్క మిగతా అంతా బహు..చక్కగా ఉంది..

  శివ ఛెరువు

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.