31, మార్చి 2009, మంగళవారం

భద్రాచలంలో శ్రీ రామ నవమి


ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఆరాధ్యదేముడవడం వల్ల ఎంతో మందికి జీవితంలో ఒక్కసారైనా శ్రీ రామ నవమికి భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించాలని కోరిక.ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా, మా అసలు ఊరు భద్రాచలం అవడంవల్ల ఆ కోరిక సులభంగానే నెరవేరింది. హైదరాబాదు వచ్చి 7 ఏళ్లు అవుతోంది. ఇక్కడికి వచ్చినా భద్రాచలంతో సంబంధ బాంధవ్యాలు తెగలేదు. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం 1,2 సార్లు వెళ్లి వస్తూనే వుంటాము.

ఎండాకాలం వచ్చేసింది. భద్రాచలం అనగానే శ్రీ రాముడి తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది ఎండలే. ఇక్కడ అప్పుడే ఎండలు తట్టుకోలేక అబ్బ ఏమెండలో మండిపోతున్నాయి అనుకుంటున్నాం. ఇక భద్రాచలంలో ఎండలు ఎలాఉంటాయో ఊహించండి. విచిత్రం ఏమో కానీ ఆ ఎండాకాలంలోనే శ్రీ రామ నవమీ వస్తుంది. మరింత విచిత్రం ఎండలు ఎంతలా పెరుగుతున్నాయో భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్యా అలా పెరుగుతూనే ఉంది. వీరి సౌకర్యం కోసం వసతి గృహాలుకూడా ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయి.

పూర్వం ఊరంతా తాటాకు పందిళ్లు వేశేవారుట. ఆకాశమంత పందిరి అన్నమాట. భద్రాచల తాటాకు పందిళ్ల గురించి ఆంధ్ర దేశమంతా చెప్పుకునే వారట. నాచిన్నప్పటికి అంతలా కాకపోయినా చాలా భాగం వేశేవారు. రాను రాను వీటి పరిమితి తగ్గినట్లుంది. కానీ ఇప్పటికీ గుడిలోనూ, కళ్యాణ మండపం చుట్టూతా, గుడినుండి గోదావరికి వెళ్లే దారిలోనూ చాలా బాగా వేస్తారు. భద్రాచలం వచ్చిన యాత్రికులు కొందరు ఆ పందిళ్లకిందే కాలక్షేపం చేస్తుంటారు.

ఇంకా ఆ కళ్యాణానికి వచ్చిన భక్తులకు తాటాకు విశనకర్రలు పంచిపెడుతుంటారు. భక్తుల దాహం తీర్చడానికి, వారికి వేడి చేయకుండా ఉండడానికీ కళ్యాణ మైన వెంటనే మిరియపు పొడి వేసిన బెల్లం పానకం, మజ్జిగా పంచి పెడుతుంటారు. కళ్యాణానికి వచ్చే జనం సంఖ్య వేలు దాటుతుంది. అందుకే పానకం పెద్ద పెద్ద డ్రమ్ములతో కలిపి కళ్యాణ మండపానికి నాలుగువైపులా పెడతారు. ఇదంతా దేవస్తానం వారే కాదు, భద్రాచలంలో ఉండే భక్తులు, వారి సాయంతో ఆశక్తి ఉన్న ఇతర భక్తులూ ఈ విశనకర్రలూ, పానకాలూ పంచిపెడుతుంటారు.

చిన్నప్పుడు శ్రీ రామ నవమి వచ్చిందంటే మాకు సందడే సందడి. ఎక్కడెక్కడి నుండో రకరకాల వ్యాపారులు వచ్చి చిన్న చిన్న స్టాళ్లు పెట్టే వారు జాతరలు జరిగినప్పుడు పెడతారే అలాగన్నమాట. కాకపోతే ఇక్కడ కాస్త ఎక్కువ. ఈ స్టాళ్లలో జీళ్లు, బొమ్మలు, కొత్త కొత్త ఆట వస్తువులూ, బట్టలూ అబ్బో ఒక్కటేమిటీ చాలా ఉండేవి. ఈ స్టాళ్లు నవమికి రెండు రోజుల ముందు నుండీ 2 రోజుల తరువాత వరకూ పెట్టే వారు. జైంటు వీల్, సర్కస్ లాంటివి కూడా ఉంటాయి. ఇది ఒక వైపు అయితే, మరో వైపు ఇంటికి చుట్టాలు వచ్చే వాళ్లు. గుడికి మా ఇల్లు దగ్గరగా ఉండడంతో సత్రాలు దొరకని పేద యాత్రికులు మాఇంటి ఖాళీ స్థలంలో వంట చేసుకుని, అక్కడే ఓ ప్రక్కగా పడుకునే వారు. బంధువులు వచ్చినా రాక పోయినా అంత బాధ అనిపించేది కాదు కానీ వీళ్లు రాక పోతే అరే ఫలానే వాళ్లు ఈ సంవత్సరం రాలేదే అని బాధ పడే వాళ్లం.
కళ్యాణ రాముణ్ణి చూస్తారా...!?


చాలా అందంగా ఉన్నారు కదు...
ఇంతకీ శ్రీ రామ నవమి ఎప్పుడో తెలుసా..? అందరికీ 3వ తారీఖున అయితే, భద్రాచలంలో మాత్రం 4వ తేదీన చేస్తున్నారు. అదేంటీ అంటే వాళ్ల వైష్ణవ ఆగమం ప్రకారం మిగులు తిథి చేస్తారు. ఇది చాలా కధ ఉంది లెండీ... మొత్తానికి శ్రీ రామ నవమి దశమినాడు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ రోజు కళ్యాణం చూడడానికి అదృష్టం ఉండాలి. ఈ సంవత్సరం నాకు చూసే అవకాశం దొరికే టట్టు లేదు. కానీ నా స్నీహితులు వెళ్తున్నారు... వీలయితే నాలుగు తలంబ్రాలు తెచ్చి పెట్టమని చెప్పాను లెండి. :)

4 కామెంట్‌లు:

  1. In some chapter Ekkirala Bharadvaja quotes Shirdi Sai as "Nobody actually wants to come to me. I only makes them come to me." So if Lord Rama wants you to go, you will be able to go. appaTi varakU ... rAmA kanavEmirA...

    BTW you are pretty lucky to be from B/Chalam. I went only once there for a visit and that was not on Rama Navami :-(

    రిప్లయితొలగించండి
  2. good.... munde rama navami.. darshanam chesinanduku.. danyavaadaalu..;)

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ చాలా బాగా రాశారు .ఎప్పుడూ టి .వి లో చూడటమే కాని భద్రాచలం వెళ్ళే భాగ్యం కలగలేదు .మీరు టపాతో పెట్టిన ఫోటోలు బావున్నాయి .కల్యాణంలో అమ్మవారికి అలంకరించే పూలజడ అంటే భలే ఇష్టం నాకు .మీరీసారి వెళితే మీ (మన ) రాముడికి మా నమస్సులందచేయండి .

    రిప్లయితొలగించండి
  4. అఙాతగారికి: ఇప్పుడు రామా కనవేమిరా.. అనే పాడుకుంటుంన్నానండీ. మీకు తప్పక శ్రీ రామ నవమి కళ్యాణ దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

    శివ చెరువు గారికి : ధన్యవాదాలు.

    పరిమళం గారికి : తప్పక తెలియజేస్తాను. ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.