20, ఆగస్టు 2009, గురువారం

వరసిద్ధి వినయకుని పూజకు కావలసిన పత్రి ఏమిటో తెలుసా ?



వినాయక చవితి వచ్చేస్తోంది. పిల్లలకీ పెద్దలకీ చాలా ఇష్టమైన పండగ ఇది. పెద్దలకంటే పిల్లల హాడావిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.

మా చిన్నప్పుడు చవితి ముందురోజు స్కూలుకు డుమ్మా కొట్టి పత్రి వేటకు వెళ్లేవాళ్లం. మాది భద్రచలం కదా.! ఓ బోల్లెడు చెట్లు. తెలిసినవీ తెలియనివీ రకరకాలు కోసుకుని వచ్చే వాళ్లం. పాలవెల్లికి కట్టడానికి పళ్లుకూడా సగం వరకూ కొనకుండానే సంపాదించే వాళ్లం. సీతాఫలాలు కొని తీసుకురావడమంటే నామోషీగా ఫీలయ్యేవాళ్లం.

మా స్కూలు రామదాసు ధ్యానమందిరానికి దగ్గరలో ఉంటుంది. రామాలయం పక్కనుండీ మస్కూలుకు వెళ్లాలి. రామాలయం నుండీ మా స్కూలుకు వెళ్లే దారిలో దారికి ఇరు ప్రక్కలా చాలా చెట్లు ఉండేవి. అది భద్రునికొండ కదా. దానిని మేము పెద్దగుట్ట అంటాము. ఆ గుట్ట మీద పడి వెతుకుతూ పోతే దొరకని మొక్కలేదు. బోళ్లెడు సీతా ఫలాలు కూడా దొరికేవి. పొద్దున్న ఇంట్లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చేవాళ్లం. ఓ సారి పళ్ల కోసం వెతుకుతూ చాలా లోపలికి వెళ్లాము. మాకు పాము కనపడింది. ఇక పరుగో పరుగు. రోడ్డు కనిపించే వరకూ పరిగెట్టాము.

ఇంటికి వచ్చిన తరువాత మట్టి గణపతిని తయారుచేసే పనిలో నిమగ్నమయ్యే వాళ్లం. మట్టితో రకరకాల ప్రయోగాలు చేసేవాళ్లం. మొదట్లో మట్టి బొమ్మలు చేసేవాళ్లదగ్గరకొనే వాళ్లం. కానీ వోసారి వాళ్లు ఎలా తయారు చేస్తున్నారో చూశాను. ఆ తరువాత నేనే మొదలు పెట్టాను.

ఇంట్లో ఓ గడియారం ఉండేది. దానికి ఓ ప్రక్క గణపతి, మరో ప్రక్క లక్ష్మీ దేవి బంగారం రంగులో మెరిసిపోయే వారు. ఓ సారి అనుకోకుండా ఆ గడియారం పగిలిపోయింది. ఆ బొమ్మలను ఆడుకోమని మాకిచ్చారు. నాకు గణపతి బొమ్మనుచూడగానే అయిడియా వచ్చింది. అది ప్లాష్టిక్ బొమ్మ. ఒకవైపే ఉంటుంది. మరోవైపు డొల్ల. అందులో మట్టి వేసి అద్దితే చక్కని మట్టి గణపతి బొమ్మ తయారయ్యింది. అలా ఆసంవత్సరం నుండీ గణపతిని నేనే చేసే వాడిని. ఆ గడియరం తరువాత మళ్లీ అలాంటి గడియారాన్నే తెచ్చారు నాన్నగారు. నేను మనసులోనే తెగ సంబరపడి పోయాను. ఈ గడియారం కూడా పగిలి పొతే ఆ గణపతి బొమ్మ మనకే కదా అని. చివరికి అది ఎప్పుడు పగిలి పోతుందా అని ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. :)

ఇలా చవితికి కావలసిన సకల ఏర్పాట్లనూ సిద్ధం చేసే బౄహత్ కార్యాన్ని మా భుజ స్కందాలకు ఎత్తుకుని నానా హడావిడీ చేసే వాళ్లం. మరునాడు మేము చిన్న పిల్లల మని నాకూ మా చెల్లినీ దూరంగా ఉంచి అమ్మావాళ్లూ మాత్రం పూజ చేసుకునే వారు. కానీ రాను రానూ మా గోల పడలేక మకూ మడి బట్టలు ఆరవేయడం మొదలు పెట్టేవారు. మాకూ తోరాలు కట్టేవారు. అలా పసుపు తోరాలు చేతికి కట్టుకుని మేమూ పూజ చేసుకున్నామోచ్ అంటూ మా స్నేహితులకి గొప్పలు చెప్పుకోవడం చాలా సరదాగా ఉండేది.

గణపతి నిమర్జనానికి గోదారికి వెళ్ళే విగ్రహాలన్నీ ( పక్క ఊర్లవి కూడా ) మా వీధి గుండానే వెళ్లాలి. ఇక ఆరోజు మాకు నిద్రలుండేవికాదు. పెద్దవాళ్లు పడుకున్నా పిల్లలం రాత్రి 2 గంటల దాకా వీధి గట్టు మీదే ఉండే వాళ్లం. అరోజులే వేరు. చిన్నతనంలో ఎప్పుడు పెరిగి పెద్దవాడినై పోతానా అని ఉండేది. ఇప్పుడేమో ఎప్పటికీ పిల్లవాడిలా ఉండిపోతే ఎంత బాగుండేది అనిపిస్తుంది.

ఇంతకీ వరసిద్ధి వినయకుని పూజకు కావలసిన పత్రి ఏ మిటో తెలుసా ?

1.మాచీ పత్రం- మాచి పత్రి
2.బృహతీ పత్రం- వాగుడాకు ( ఊడుగ )
3.బిల్వ పత్రం- మారేడు
4.బదరీ పత్రం- రేగు
5.అపామార్గ పత్రం- ఉత్తరేణి
6.తులసీ పత్రం- తులసి
7.చూత పత్రం- మామిడి
8.కరవీర పత్రం- గన్నేరు
9.దాడిమీ పత్రం- దానిమ్మ
10.దేవదారు పత్రం- దేవదారు
11.జాజీ పత్రం- సన్న జాజి
12.గండకీ పత్రం- గణకీ
13.శమీ పత్రం- జమ్మి
14.అశ్వథ్థ పత్రం- రావి
15.అర్జున పత్రం- మద్ధి
16.అర్క పత్రం- జిల్లేడు
17.దూర్వా యుగ్మం- జరిక
18.విష్ణు క్రాంత పత్రం- విష్ణు క్రాంత
19.కపిథ్థ పత్రం- వెలగ
20.సింధు వార పత్రం- వావిలి
21.భృంగిరాజ పత్రం- మేడి
ధత్తూర పత్రం - ఉమ్మెత్త
ఇంకా కొన్ని రకాలు కూడా ఉన్నాయి వాటిని తెలుగు వారు ఏమంటారో నాకు తెలియదు. అవి  కేతకీ పత్రం, అగస్త పత్రం మొదలైనవి.

7 కామెంట్‌లు:

  1. ఒకసారి వినాయకచవితి పర్వదినాన పూజకు కావలసిన పత్రి గురించి ఈ నా టపా చూడండి. http://vijayamohan59.blogspot.com/2008/08/blog-post_31.html

    రిప్లయితొలగించండి
  2. చూశానండీ.
    చాలా చక్కని వివరణ రాశారు.
    మీవల్ల నాకు ధత్తూర పత్రం అంటే ఉమ్మెత్త పత్రం అని తెలిసింది.
    ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  3. బాగు౦ది,నాకు పత్రి ఇవి అని తెలియదు,కనిపి౦చిన ఆకునల్లా పత్రి అని కొసేవాళ్ల౦ చిన్నప్పుడు.మట్టి గణపతి బొమ్మ అదా?అభిన౦దనలు అ౦డి పర్యవరణ౦ కి హాని చెయని మట్టి ప్రతిమా వాడిన౦దుకు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. ఈ ఒక్క పండుగ మాత్రం ఇంటిల్లిపాదికీ ఓ పని అప్పజెప్పేవారు నాన్నగారు. నాది పత్రి సేకరణ. ఉమ్మెత్త శాస్త్రీయ నామం అది. మాకు ఇక్కడ అందులోనే మరొక రకం బొకేల్లో వాడతారు. ఆ గణనాధుడి చల్లని దీవెనలు అందరిపై ఎల్లప్పుడు ఉండాలని ఆశిస్తూ వినాయకచవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.