25, అక్టోబర్ 2009, ఆదివారం

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా
కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా
- వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.

8 కామెంట్‌లు:

  1. చాలా చక్కని విషయాలు రాస్తున్నారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. పొద్దున లేచిన వెంటనే ఆ రొజును ఉత్తేజపరిచేదిగా, అన్నం తినడానికి ముందు, పడుకోవడానికి ముందు సేవా భావాన్ని ప్రేరేపించేలా, నిత్య జీవితంలో సేవా భావాన్ని పెంపొందించేలా కొన్ని శ్లోకాలు చెప్పగలరా? అవి పిల్లలకు. చాలా సులభంగా నోరు తిరిగేలా ఉండాలి. గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ప్రస్తుతానికి అవసరం లేదు. మీరు నిదానంగా సమయం ఉన్నపుడు ఎప్పుడైనా చెప్పగలరా? ధన్యవాదాలు. jeevani.sv@gmail.com
    కానీ మీరు టపా రాస్తే అందరికీ ఉపయోగం.

    రిప్లయితొలగించండి
  3. మన పురాణాలలో
    అహమన్నాద మహమన్నాద మహమన్నాదః
    అహమన్నమహమన్నమహమన్నం

    అని చెప్పబడింది కదా. దీని వెనుక భావన చెప్పాలి మీరు.

    అలాగే
    మధు వాతా ఋతాయతే
    మధుక్షరన్తి సిన్ధవః
    ...

    (గాలులు మధువులు వీస్తున్నాయి, నదులు తేనెను ప్రవహింపజేస్తున్నాయి..)

    ఈ శ్లోకం (ఋక్కు?) గురించి కూడా చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  4. జీవని సంతోష్ గారు : త్వరలో నాకు తెలిసినవి తప్పకుండా రాస్తాను.

    రవి గారు : ఒక్క విషయం, నేను వేదానికి అర్థాలు తెలిసిన వాడిని కాదండీ! నాకు పురోహితంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకోవాలనే ఉద్దెశంతో అక్కడక్కడా అర్థాలను తెలుసుకుంటూ ఉంటాను. మీరడిగిన వాటిని గురించి తెలుసుకోవడానికి కూడా తప్పకుండా ప్రయత్నిస్తాను. మీకు నామీద ఉన్న నమ్మకానికి కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  5. రాజశేఖరుని విజయ్ శర్మ గారు మంచి విష్యాలు రాస్తున్నరు ...

    రిప్లయితొలగించండి
  6. ఒక చోట ముక్కు రాఘవ కిరణ్ గారు ఇచ్చిన సమాధానము బాగుంది. అది కూడా ఇక్కడ పెడుతున్నాను.


    మన సంప్రదాయంలో భోజనమూ యజ్ఞమే. యాగదేవతలు పంచప్రాణాలు. యాగాగ్ని కడుపులోని జఠరాగ్ని. యాగహవిస్సులు తొలిగా తినే పలుకులు. అందువలననే శుచిగా వండినది, శుచిగా తినాలన్న నియమం.

    1. ముందుగా ఈ యజ్ఞానికి సంబంధించిన హవిస్సులను అభిమంత్రించిన ఉదకములతో మంత్రప్రోక్షణం చేస్తారు (సత్యం త్వర్తేన పరిషించామి/ఋతం త్వా సత్యేన పరిషించామి). ప్రోక్షణానికి వాడే ఈ ఉదకములను అభిమంత్రించేది గాయత్రీమంత్రంతో.
    2. ఈ హవిస్సులు అమృతమే అని భావనచేస్తూ "అమృతమస్తు" అంటూ ఆ భోజన పదార్థములపై చేతిని ఉంచుతారు.
    3. తరువాత, ఈ అమృతహవిస్సులను ధరించే పాత్ర కావాలి కదా. అందుకోసం "అమృతోపస్తరణమసి" అని ఉదకములను పుచ్చుకుంటాము. అంటే ఈ నీరే ఈ అమృతమును ధరించే పాత్ర అగుగాక అని.
    4. ఇప్పుడు ఈ హవిస్సులను స్వాహాకారంతో దేవతలకు అర్పిస్తాము. ఈ దేవతలు మనలోని పంచప్రాణాలు-- ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఇలా స్వాహాకారంతో అర్పించే హవిస్సులను పంటికి తగలనీయకుండా నేరుగా మ్రింగాలి.
    5. తరువాత శేషాహారాన్ని (యజ్ఞం చేస్తున్నామన్న భావనతో) భుజించాలి.
    6. భుజించటం పూర్తయ్యాక... ఈ అమృతహవిస్సులను ధరించిన పాత్రకు మూత పెట్టాలి కదా. ఈ మూత కూడా ఉదకములే. "అమృతాపిధానమసి" అని చెప్పి నీటిని తీసుకుంటాము. తరువాత మళ్లీ కాళ్లూ చేతులూ కడిగికొనేవఱకూ ఏమీ త్రాగకూడదు, (తాంబూలం కూడా) తినకూడదు.
    7. ఇంతటితో ఈ యజ్ఞం పూర్తయ్యింది. కానీ ఇంతటితో వదిలేస్తే మన గొప్పతనం ఏముంది? ఈ యజ్ఞానికి సంబంధించిన ఒక ఆనుషంగికంగా ఆఖరున ఉచ్ఛిష్ఠజలములను (ఎంగిలి నీటిని) రౌరవాదినరకాలలో దాహార్తితో ఉన్నవారికి అక్షయమవ్వాలని ఆకాంక్షిస్తూ విడుస్తాము. "రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుదనివాసినామ్, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్థతు" అని.

    రిప్లయితొలగించండి
  7. శర్మగారికి నా నమస్కారాలు
    బ్లాగ్ ద్వార సనాతన ధర్మాన్ని,శాస్త్రీయతను వివరిస్తున్నందుకు ధన్యవదములు.
    నాదొక సందేహం...
    మంత్రం తో ఎలా అభిమంత్రించాలి...
    ఈ ప్రక్రియను ఎలా చేయాలి..
    దయచేసి తీర్చగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏదైనా అభిమంత్రిచ దలచినప్పుడు దానిని స్పృశించి, ఏమంత్రంతో అభిమంత్రించ దలచామో ఆ మంత్రాన్ని చదవాలి.

      తొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.