11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఒక దేవాలయం
ఒక దేవాలయం కట్టడానికి సంకల్పం చేసిన దగ్గరనుండీ.., విగ్రహం తేవడం, దేవాలయ నిర్మాణానికి, నిర్మాణ అనంతరం నిత్య పూజలకు అర్చకుని జీతభత్యాలకు తగిన ఆదాయం కావాలి కనుక తోచిన చందాఇచ్చి, నలుగురినీ ఇమ్మని భక్తులను ప్రోత్సహించడం, గుడి పూర్తయిన తరువాత ఓ అర్చకుని చేర్చడం మొదలైన ప్రతి పనిలోనూ నావంతు తోడ్పాటును ఆలయ కమిటీ వారికి అందించాను. వారు నన్ను చాలా గౌరవించారు, గౌరవిస్తున్నారు కూడా. “ మీ సహకారం వల్లనే ఓ సంవత్సరం తిరగకుండానే మేము దేవాలయం కట్ట గలిగాము. మీ వక్చాతుర్యం గొప్పది. మీకు ఏ విషయం ఎలాచెప్పాలో చక్కగా తెలుసు.” అంటూ తెగ పొగిడేస్తారు. నాకు తెలుసు వాళ్లు కాస్త ఎక్కువ పొగుడుతున్నారని. కానీ నేను ఇవన్నీ వారి పొగడ్తల కోసమో, లేదా పేరుకోసమో చెయ్యలేదు.

వారు సంకల్పించినది కార్యం దైవకార్యం కాబట్టి, నాకు తెలిసింది అందరినీ దైవకార్యాలు చేసేటట్లు ప్రోత్సహించడమే కాబట్టి, నేను మంచిపని అని నమ్మాను కాబట్టి నేను ఆచరించి నలుగురినీ ఆచరించమని ప్రోత్సహించాను. అందులో కొంత ఆనందం పొందాను.

అయితే ఈ మధ్య నేను ఆ దేవాలయానికి వెళ్లిన ప్రతిసారీ వారు మీరు మళ్లీ ఏవో ఒక కొత్త కార్యక్రమాలు పెట్టి భక్తులు రోజూ దేవాలయానికి వచ్చేటట్లు చేయాలి. మీ వల్లనే ఇది సాధ్యం. ఆ పూజారి ( అర్చకులు ) ఉన్నారుగానీ వారికి మీరు చెప్పినట్లు భక్తులకి చెప్పడం రావటం లేదు. ...... ఇలా మళ్లీ భజనలు ప్రారంభించడం మొదలుపెట్టారు. నాకెందుకో కొంచం బాధనిపించింది.

రోజూ భక్తులు దేవాలయానికి రావడం మొదలు పెడితే దేవాలయ ఆదాయం పెరుగుతుంది. దానితో ఆలయ ఖర్చులు చూడవచ్చు అని వారి భావన. కానీ నాకు వారి భావం నచ్చలేదు. ఎవరో రావాలి , కానుకలు వేయాలి, ఆ కానుకలతో దేవాలయం నడవాలి. ప్రస్థుతం కానుకలు రావటం లెదట. అందువల్ల నిరంతరం వెలగవలసిన అఖండ దీపం ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే వెలుగుతోంది. నిత్య నైవేద్యం కోసం అర్చకునికి ఇస్తానన్న బియ్యం ఇవ్వటం లేదు. ఆలయం శుభ్రం చేయించడానికి పనిమనిషిని పెట్టటానికి కూడా డబ్బులు లేవట వారివద్ద. ఇలా అనేక పనులు ( ఖర్చుతో కూడినవి ) సరిగా చేయటం లేదు.

నేను ఇదంత చూచి ఒకటే చెప్పాను. నేను చెప్పే కబుర్లకు భక్తులు వస్తారనుకోవడం పొరపాటు పని. మీరు ఆచరించే పనిని బట్టే భక్తులు రావడం, రావక పోవడం ఉంటుంది. నేనేది చెప్తానో అది నేను కూడా ఆచరిస్తాను. అందుకే కోంత భక్తులు అనుసరించే అవకాశంఉంది. కానీ నేను ఏదైనా చెప్పాలంటే ముందు నేనది మంచిది అని నమ్మాలి. భక్తులు రావడానికి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. కానీ ముందు భక్తులు రావడానికి నా మాటల కన్నా, మీ చేతలే ముఖ్యమైనవి.
మీరు ప్రతినిత్యం పూజను సరిగా జరిపే మార్గం చూడండి. రోజూ అభిషేకానికి పాలు లేవు. దీపారాధనకు నూనె లేదు అని పూజను చేయడంలో అశ్రద్ధవహిస్తే , భక్తులు వచ్చేవారుకూడా రారు. ఎందుకంటే ఎక్కడ పూజలు సక్రమంగా జరుగుతాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ భక్తులు ఉంటారు. భక్తుల కోరికలు తీరాలంటే అక్కడి భగవంతుడికి మంత్రబలం ఎక్కువగా ఉండాలి. అంటే విశేషమైన పూజలు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆ మంత్ర బలం వల్ల దేవాలయంలో ప్రశాంతమైన స్థితి నెలకొంటుంది. ఎన్నో ఒత్తిళ్లలో దేవాలయానికి వచ్చిన వారికి కూడా అడుగిడిన వెంటనే ఓ అవ్యక్తమైన మానసిక శాంతి కలుగుతుంది. ఇంకా అక్కడే ఉండాలని పిస్తుంది.

ఇలా జరగాలంటే ఆలయ ధర్మకర్తలకు, అర్చకునికి భగవంతునిపై అచంచల విశ్వాసం ఉండాలి. స్వామికి జరుగవలసిన సేవ ఏదైనా జరగకపొతే తాము ఓ పూట భోజనం మానివేసి అయినా ఆ సేవ జరిపే చిత్తశుద్ధి ఉండాలి. అలాంటి వారికే భగవంతుడు వశుడవుతాడు. మీకు అలాంటి పట్టుదల ఉంటే చెప్పండి, నా సహకారాన్ని తప్పక అందిస్తాను. మనం అందరం కలిసి ఈ దేవాలయాన్ని ఓ ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దుదాము. మీకు కూడా ఇటువంటివి కొత్త కనుక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని నిజాయితీతో ఒప్పుకుని సరిదిద్దుకునే మనస్థత్వం మీకుండాలి. ఇంకొక విషయం మీరు దేవాలయంలో టికెట్ లు ఎప్పుడు పెడతారో అప్పటినుండీ నేను తప్పుకుంటాను. ఆ టికెట్ పద్ధతికి నేను వ్యతిరేకిని. అందుకు మీకు సమ్మతమైతే మనం ముందుకు సాగుదాము. అని చెప్పాను.

వారందరూ మీ సహకారముంటే మేము ఏమైనా చెయ్యగలము. మీరు చెప్పినవన్నీ తప్పక పాటిద్దాము. అని చెప్పారు. వారి స్పందన చూసి నేను కాస్త ఆనంద పడ్డాను. కొంత కాలం గడిచింది. ఒక నాడు దేవాలయానికి వెళ్లే టప్పటికి ఓ బోర్డు కనిపించింది. “ కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి ”. :)

5 వ్యాఖ్యలు:

 1. మీరు చెప్పిన అంకితభావం, శ్రద్ధ, చిత్తశుద్ధి ఒక దైవపూజలోనే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ దైవాన్ని చూస్తూ అంకితభావం, శ్రద్ధ, చిత్తశుద్ధితో ఆ పని చేయగలిగితే దైవం కరుణిస్తాడు.

  బాగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవును శ్రద్ధ, అంకిత భావం అందరికీ ఉండవలసిన గుణాలు. ముఖ్యంగా దైవ కార్యాలను చేసేటప్పుడైనా వాటిని ఆచరించడం మొదలుపెడితే క్రమంగా అవి జీవితంలోని ప్రతి అంశంలోనూ జొరబడతాయి.

  ధర్మకర్తలుగా ఉన్నవారికి మరింత భక్తి ఉండవలసిన నేటి రోజులలో, ధనం మీద యావ పెరుగుతోదే తప్ప భక్తి పెరగటం లెదు. రోజు రోజుకీ తరుగుతోంది. నేను పురోహితుడినవటం వల్ల నాకు పరిచయం ఉన్న దేవాలయాలు చాలా వాటిలో నేను గ్రహంచిన సత్యం ఇది.

  అటువంటి వారిని గురించి రాబోయే టపాలలో మరింత చర్చిస్తాను. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శర్మగారు,
  చాలా బాగు౦ది మీ పోస్ట్...
  ఎ౦తో బాగా చెప్పారు..ఆ గుడి వివరాలు చెప్పి ఉ౦టే బాగు౦డేది..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ధన్యవాదాలు సుభద్ర గారు. ఆ గుడి వివరాలు చెప్పడం అంత సమంజసం కాదండీ. అందుకె చెప్పలేదు. ఈ గుడే కాదు చాలా గుళ్లలో వ్యవహారాలు ఇలానే ఉంటాయి. దేవాలయాలు అనే లేబుల్తో ముందు ముందు మరిన్ని టపాలు రాస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మనం చర్చించే మహా గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి
  అన్నింటికి ఎన్నో పరిష్కార మార్గాలను తెలుసుకోగలము
  ఆచరించేవారు లేకనే ఆర్ధిక ఇబ్బందులతో సాగుతున్నాము
  ఆనాటి విధానాలపై అవగాహన లేకనే నేడు మానవుని ప్రవర్తనలలో ఎన్నో మార్పులు
  అధిక జన సంఖ్యతో ఆచారాలు మారిపోయి జీవితాలు మరో కోణంలో సాగిపోతున్నాయి
  మాటలతో సాగుతున్నామే గాని మనుషులలో పరిశుద్ధ విజ్ఞాన కార్య సామర్థ్యాలు లేవు
  జరిగే కార్యాలలోనే విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నారు గాని విశ్వ కార్యాలపై అవగాహన లేదు
  సాంకేతిక జీవన విధానమే గాని ఆధ్యాత్మ విశ్వ కార్య క్రమ ప్రణాళికలు అభివృద్ధిలో లేవు

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.