31, అక్టోబర్ 2009, శనివారం

నేటి సినిమాలు - నా దృష్టిలో

నాకున్న చిన్ని చిన్ని అలవాట్లలో సినిమా ఒకటి. కాకపోతే ఇది కాస్త పెద్ద అలవాటు. అలా అని వ్యసనం కాదండోయ్! :)

కానీ సినిమా అంటే చిరాకేస్తోంది ఈమధ్య.అస్సలు నచ్చడం లేదు. సైకో సినిమాలు ఎక్కువయ్యాయి. మామూలువి కూడా... ఏ సినిమా చూసినా హీరో ఓ రొడ్డు ప్రక్క కుర్రాడు. వాడొ జులాయి. వాడికె లక్ష్యాలూ ఉండవు. ఎవ్వరినీ లెక్క చెయ్యడు. అమ్మాయిలు వాడంటే పడి చస్తారు.

" ఇవేమీ సినిమాలయ్యా! " అని ఎవరైనా ఏదైనా అంటే " నేటివిటీ " అంటారు దర్శక, నిర్మాతలు. సమాజాన్ని ప్రతిబింబించాలని నడుం కట్టుకున్న పెద్ద మనుషులకి మంచి కనపనడదేమో....!? " నీ దృష్టి ఎలా ఉంటుందో ప్రపంచం నీకలా కనపడుతుంది " మనుషులు కనిపించడం లేదేమో నేటి మన దర్శకులకి...!?

అందరినీ అనట్లేదు.. కానీ చాలా మంది తీరు అలానే ఉంది. ఇది దర్శకుల తప్పు అని పూర్తిగా చెప్పలేము. చేతకాని తనం అని చెప్పొచ్చు. నిర్మాతలకు సమాజ హితం అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటె వారికంత ఙ్ఞానం ఉండదు. కానీ ఒక రచయతకీ, దర్శకుడికీ సమాజంగురించి చక్కని అవగాహన ఉంటుంది. మనసనేది ఒకింత చనిపోకుండానే ఉంటుంది. కానీ నిర్మాతలను తమ మంచి కథలతో ఒప్పించలేక, సమాజాన్ని చెడగొట్టే చవకబారు కథలతో నిర్మాతల్నీ, ప్రేక్షకులనీ ఆకట్టుకుని దర్శకులై పోతున్నారు. పూర్తిగా మనసు చంపుకుని డబ్బే లోకంగా బ్రతుకుతున్న నిర్మాతలను కూడా మంచి కథను చెప్పి ఒప్పించ గలిగే తెలివి ఉండాలి దర్శకులకి. ఒక మంచి కథను నిర్మాతకు చెప్పగానే ఒప్పుకుంటే సినిమా ఇంత చవకబారుగా ఎందుకు తయారవుతుంది..? మంచి కథలే రాయాలి, ఆ కథను తెరకెక్కించే చాకచక్యాన్ని అలవరుచుకోవాలి. ఓ మంచిపని చెయలంటే ఆటంకాలు అనేకం వస్తుంటాయి. వాటిని ఎదుర్కో గలిగే దమ్ము దర్శకులకు ఉంటే సమాజానికి హితం చేకూరుతుంది.

" కావ్యం కాంతా సమ్మితం " అని పెద్దలన్నారు. భార్య చెప్తే ఏ పనైనా ఎంత అందంగా కనిపిస్తుందో, సినిమాలో చూపించేవి కూడా అంత అందంగా కనిపిస్తాయి. ప్రేక్షకుడు ఆ కథలోని పాత్రలతో ఏకత్వం పొందుతాడు. ఆ కథ లోని పాత్రల లక్షణాలను తనలో ఉన్న లక్షణాలతో పోల్చి చూసుకుంటాడు. పోలిన కొన్నింటికి, ఆ పాత్రలకు ఉన్న మరికొన్ని లక్షణాలను ఆపాదించుకుని తానే ఆ పాత్రగా తన్మయత్వం చెందుతాడు. రసానందాన్ని పొందుతాడు. అందువల్లే సినిమా / కథ అంత బాగా నచ్చుతుంది మనకు.

ఇక్కడే ఉంది చిక్కంతా. పోలిక చేసుకుని ఆపాదించుకునే లక్షణాలు మంచి వైతే ఫర్వాలేదు. కానీ చెడు వైతే కష్టం ఇంతింత కాదు. ఇప్పటి సినిమాలలో ప్రేక్షకుల పోలికకు చెడే ఎక్కువ అందుతోంది. మొన్న ఆమధ్య ఒక అబ్బాయిని చూశాను. వాడు విచిత్రంగా పరిగెడుతున్నాడు. అదేమిటిరా అలా పరిగెడుతున్నావేమిటిరా? అని అడిగితే, తెగ సిగ్గు పడి పోతూ " సైనికుడులో హీరో మహేష్ బాబు బ్రిడ్జ్ కూలిపోతుంటే అలాగే పరిగెడాతాడు. అది నాకు బాగా నచ్చింది. అందుకే అప్పటి నూడీ నేను అలా పరిగెట్టడం మొదలుపెట్టాను " అని చెప్పాడు. కనుక ఇంతగా తన్మయ పరిచే సినిమాను రూపొందించడంలో రచయతా, దర్శకుడూ ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది.

మరిన్ని సంగతులు మరో టపాలో..

25, అక్టోబర్ 2009, ఆదివారం

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా
కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా
- వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.

23, అక్టోబర్ 2009, శుక్రవారం

ఆస్తిక - నాస్తిక వాదన

ఈ టపా కాస్త ఆలస్యంగా రాద్దామనుకున్నాను. కానీ ఇక్కడ ఇంతకు ముందు రాసిన టపా లోని ప్రశ్నలు అప్పటి దాకా ఆగనిచ్చే విధంగా లేవు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేక వారం తరువాత రాద్దామనుకున్న ఈ టపా ఇప్పుడే మీముందుంచుతున్నాను.


దేముడిని నమ్మి రోజూ పూజలూ, ప్రార్థనలూ చేస్తూ ఉండే వారు ఆస్తికులు. దేముడు లేడని నమ్మి ఎటువంటి పూజలూ, ప్రార్థనలూ చేయని వారు నాస్తికులు. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ఇరు వర్గాల వారూ భగవంతుని కృపకు పాతృలవుతున్నారని.

అయితే ఆస్తికుల దృష్టిలో నాస్తికుల గురించి ఇంకా చాలా అభిప్రాయాలున్నాయి. ఏమనంటే నాస్తికులు భగవంతుని కృపకు పాతృలు కాలేరని, అందుకు కారణం వారికి ఒక నీతి నియమము లేకపోవడమేనని, ఇటువంటి వారు జాతికే భ్రష్టత తెస్తారనీ ఇలా చాలా రకాల అభిప్రాయాలు నాకు ఆస్తికులలో కనిపించాయి. ఇది నేను సమ్మతించలేను. ఎందువలనంటే భగవంతుని నమ్మే చాలా మందిలో కూడా అనేక దురలవాట్లు, వ్యసనాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసిన ఓ భక్తుడు ఖూనీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. కానీ అతను ప్రతిరోజూ శివ పూజచేస్తాడు. రోజూ దేవతార్చన చేస్తూ కన్న తల్లిని తిట్టే, స్త్రీని మితిమీరిన కామంతో చూసే ఎంతో మందిని నేను చూశాను.

మరి అటువంటప్పుడు ఆస్తికులు కూడా భగవంతుని కృపను పొందలేరు అని అనడం సముచితమేగా...? కాదు. ఎందువల్లనంటే ఎవరో ఒక్కరు తప్పు చేశారని ఒక వర్గం మొత్తాన్నీ తప్పు పట్టలేము కనుక. ఇదే కారణంచేత నేను నాస్తికులను కూడా తప్పు పట్ట వద్దు అంటున్నాను. నాస్తికులైనా, ఆస్తికులైనా తప్పుదారి పట్టక, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్న వారైతే వారికి తప్పక సత్యం బోధ పడుతుంది.

మనం నేడు తినే తిండీ, త్రాగే నీరు, పీల్చే గాలీ ప్రతీదీ కలుషితమైనట్లే మన భావ సంపదకూడా కలుషిత మయంగానే ఉంది. అదే విధంగా నేటి మన ఆస్తిక, నాస్తిక జనులు కూడా కలుషితమైన భావాలతో ఉన్నారు.


అసలు భగవంతుడు ఎవరు? అతనికృపకు పాతృలము ఎలా అవుతాము?

అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు నాకు మన మతము, ఇందు పొందు పరచబడిన క్రమబద్ధమైన విధానాలూ ఒక మార్గంలా మాత్రమే అనిపిస్తాయి. అలాగే ఇతర మతాల మార్గాలు కూడా.

శ్లో.. దేహో దేవాలయహ్ ప్రోక్తో జీవో దేవస్సనాతనహ్
త్యజేదఙాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్

మనదేహమే దేవాలయము. అందు ఉండు జీవుడు సనాతనమైనటువంటి భగవంతుడే. నాలో ఉండు అఙానమును తొలగించి నీవే నేనను భావనతో నిన్ను పూజించెదను. అంటూ మహన్యాస పారాయణంలో భక్తుడు స్తుతిస్తాడు. అలాగే " నారుద్రో రుద్రమర్చయేత్ " అనికూడా న్యాసంలో చెప్పబడి ఉంది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుని పూజించలేడు.

ఇటువంటి ఉదాహరణలు అనేకం వేదంలో ఉన్నాయి. వీటి వల్ల మనలోని జీవుడు, ఆ దేముడు వేరు వేరు కాదనీ ఇద్దరూ ఒకటే ననీ తెలుస్తున్నది. అంతెందుకు మనం చేసే వృత్తిలో, పీల్చే గాలీలో, నీరులో , ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలోని ప్రతి వస్తువూలోనూ ఆభగవంతుడున్నాడు అని ఆస్తికులందరూ అంగీకరిస్తారు. మరి వీటి యందు భగవంతుడున్నాడని నమ్మి ఆస్తికులు సేవించినా, భగవంతుడి సేవ అనే భావనతో కాక వాటి యందు ఇష్టంతో మాత్రమే నాస్తికులు వాటిని సక్రమంగా ఉపయోగించినా ( అంటే వృత్తిని చిత్త శుద్ధితో చేయడం, చెట్లను పెంచుతూ వాటితో మాట్లాడుతూ గడపడం మొ..వి ) ఇద్దరికీ సమానమైన ఆనందమే కలుగుతున్నది కదా!? ఇది ఆస్తికులు ఒప్పుకునే ఉదాహరణ. ఇది ఇక్కడ ఆపి మరో ఉదాహఋరణ చూడండి.


నాకు ఇద్దరు స్నేహితులున్నారు అనుకుందాము. ఒకరు ఆస్తికులు, ఒకరు నాస్తికులు. ఇద్దరూ ఒకసారి మనసు కలత చెందింది అంటూ నావద్దకు వచ్చారు. అప్పుడు స్నేహితుడిగా నాకర్తవ్యం వారికి ఏ కారణం వలననో కలత చెంది చలించిన మనసును శాంత పరచడం. అప్పుడు నేనేమి చేస్తానో తెలుసా?

ఆస్తిక మిత్రునిచేత కొంతసేపు ధ్యానము చేయించడమో, మంత్రాలు చదువుకోవడమో చేయిస్తాను.

మరి నాస్తిక స్నేహితునికి అలా చేయడం ఇష్టముండదు. ఎందుకంటే అతడు భగవంతుని నమ్మడు కనుక. ఒకవేళ అతడు నామీద ప్రేమావల్ల నేను చెప్పినవి పాఠించినా అవి అతనికి శాంతిని ఇవ్వలేవు. ఎందుకోతెలుసా అతనికి వాటియందు నమ్మకం లేదు. నమ్మకంలేని చోట భగవంతుడు ఉండడు. అతడు లేకుండా ఎన్నిమంత్రాలు చదివి ఏమిలాభం? కనుక నేను అతనిని కొంతసేపు పాటలు పాడమనో, బొమ్మలు వేయమనో, ఏవైనా ఆహ్లాద కరమైన రచనలు చేయమనో, నాట్యం చేయమనో, ప్రశాంతమైన ప్రకృతిని సరదాగా పలుకరించమనో... ఇలా అతనికి ఇష్టమైనవి ఏమిటో గ్రహించి వాటిలో అప్పటికి ఉపయేగపడే పనిఏదో అది చేయమని చెప్తాను.

ఇక్కడ ఇద్దరి చేతా వేరు వేరు పనులు చేయించాను. కానీ కలిగే ఫలితం మాత్రం ఒకటే. ఒక ప్రశాంతమైన చెరువులో రాయిపడి నప్పుడు నీరు చెదిరినట్లు, ఏదో విషయం వలన కలతపడిన వారు పదే పదే ఆవిషయమును స్మరిస్తూ మరింత చలించిన మనసుతో నావద్దకు వచ్చారు. నేను చేసిందల్లా పూర్వపు సంఘటనను పదే పదే స్మరించకుండా ఉండుటకు వేరొక విషయముపై వారి మనసును ఏకాగ్రపరచుటమాత్రమే. అలా వేరొక విషయం పై మనసు నిలుపుట వల్ల చలించిన వారి మనసు మరల నిశ్చలమైంది. నిశ్చలతలో మనకు తెలియకుండానే ఆనందం లభిస్తుంది.

తిరిగి వారి మనసు కలత చెందదని నమ్మకమేమిటీ అని మీరడగవచ్చు. అవును అది నిజమే మరల కలత చెందే అవకాశం లేకపోలేదు. కనుకనే నేను వారిచేత రోజుకు కొంతసేపు మనసును ఏకాగ్రపరచు ఇటువంటి పనులను చేయిస్తాను. అందువల్ల ఈ పూర్వపు విషయముచేతనే కాక, భవిష్యత్తులో మరే కలతపెట్టు విషయము వల్లనైననూ అంతత్వరగా మనసు చెదురదు. పైగా ఎంతో ఉల్లాసంగా జీవనం సాగుతూ ఉంటుంది. ఆనందం అణువణువున తాండవిస్తుంది.

ఇప్పుడు చెప్పండి నాస్తికులకు, ఆస్తికులకు ఆనందాన్ని పొందేఅవకాశం ఉన్నదా? లేదా? ఉంది కదా!? ఈ ఉదాహరణవల్ల మరో విషయం స్పష్టమవుతున్నది. ఆనందాన్ని పొందుటకు పుజలూ ప్రార్థనలే కాక ఇంకా అనేక మార్గాలు ఉన్నవి అని. ఈ ఉదాహరణ ఇరువర్గాల వారికీ సమ్మతమవ్వ వచ్చు. కానీ ఆస్తికులు మరో ప్రశ్న వేసే అవకాశం ఉంది. ఆనందం పొందటమేనా జీవిత పరమావధీ అని.

అబ్బో ఇది చాలా పెద్ద చర్చ అవ్వవచ్చునేమో!? కనుక మరో టపాలో ప్రయత్నిద్దాము. ఒక్కమాటలో చెప్పాలంటే అవును ఆనందమే జీవిత పరమావధి అని నేను నమ్ముతాను. బ్రహ్మ ఙానం కలిగినప్పుడు ( సత్యం బోధ పడినప్పుడు ) నిశ్చల ఆనందం కలుగుతుంది. నిశ్చల ఆనందం కలిగినప్పుడు జన్మ రాహిత్యం కలుగు తుంది.

ఇటువంటి అనేక భావాల వల్ల " నిజాయితీతో కూడిన " నాస్తిక, ఆస్తిక జనులిద్దరిది సరీయిన పద్ధతే అనినేను నమ్ముతాను. కానీ నేను మాత్రం ఆస్తికతనే పాటిస్తాను. ఎందువల్లనంటే ఇది నా స్వధర్మం. అంతేకాక ఇందు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ముందే ఋషులు నిర్ణయించి ఉంచారు. కనుక ఇక్కడ కొత్తగా కనిపెట్టవలసినది ఏమీ లేదు. వారు చూపిన మార్గంలో నడవడం తప్ప. కానీ నాస్తిక మార్గం అంత సులువుగా పట్టుబడునది కాదు. దానికి ఇవి నియమములని ఎవరూ నిర్ణయించి ఉండక పోవుట వల్ల జనులు తప్పు మార్గము పట్టు అవకాశములెక్కువ. కనుక మార్గ సౌలభ్యము కొరకూ మాత్రమే నేను ఈ ఆస్తిక మార్గమును అనుసరించుచున్నాను.

21, అక్టోబర్ 2009, బుధవారం

మీరు నాస్తికులా? ఆస్తికులా?

మీరు నాస్తికులా? ఆస్తికులా? అసలు నాస్తికత అంటే యేమిటీ? ఆస్తికత అంటే ఏమిటీ? భగవంతుడు ఉన్నాడు (అస్తి) అనేవారు ఆస్తికులా? లేడు( అస్తి ) అనే వారు నాస్తికులా? అసలు ఏది తప్పు? ఎది ఒప్పు? ఇలా ఎపుడైనా ఆలోచించారా?


"భగవంతుడు ఏడి?" అంటూ అతని ఉనికిని ప్రశ్నించడమే నాస్తికత అయితే నేను పరమ నాస్తికుడినే. పూజలు ఎందుకు చేయాలి? భగవంతుడు ఉన్నాడా? ఉంటే పూజలు స్వీకరిస్తున్నాడా? ఇలా అనేక రకాల ప్రశ్నలు నాకు వచ్చేవి.

అది ఎలా అంటే... నేను పురోహితుల కుటుంబంలో పుట్టాను. నేను పూజలు చేసినంతకాలం ఇది తప్పా, ఒప్పా అని ఆలోచించలేదు. పెద్ద వాళ్లు చెప్పారు కాబట్టి చేసే వాడిని. కానీ పురోహితుడిగా పూజలు చేయించ వలసిన సమయం వచ్చిన తరువాత నుండీ నాలో యుద్ధం మొదలైంది. నేను ఒకరికి ఇది చేయండీ మంచి జరుగుతుందీ అని చెప్పాలంటే నాకు దానిగురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి.

ఎందుకంటే నేటి కాలంలో పూజలు, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం మొదలయినవి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వేదమునకు అంత గడ్డు స్థితి ప్రస్థుతానికి లేదుకానీ, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం చాలా వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ నేడో రేపో ఆటు, పోటులు పూజా విధానానికీ, వేదాలకూ కూడా రాకపోదు. ఇప్పటికే పురోహితులు పొట్ట నింపుకోవడానికే అనేక రకాల పూజలు చేయిస్తున్నారు అనే మాటలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినిపిస్తూనే ఉన్నాయి. అలా డబ్బులకోసం చేయాలంటె పురోహితమే చేయనవసరం లేదు అని నా భావన.

ఒకప్పుడు అగ్ర తాంబూలం అందుకొన్న వేదపండితులూ, పురోహితులూ నేడు ఏదో అవసరం కాబట్టి, పెళ్లికీ పేరంటానికీ పిలవక పోతే నలుగురూ నవ్వుతారు కాబట్టి ఆదరించ బడుతున్నారు. నేటి యజమానులే కాదు బ్రాహ్మలూ అలాగే ఉన్నారు. "పూజ చేయించుకునే వాళ్లకు శ్రద్ధ లేనప్పుడు మనకెందుకు కంఠ శోష" అని భావించే పురోహితులే నేటి కాలంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

కాని నాకు అది కష్టం. నేను వృత్తి చేసినా అందులో నాకు తృప్తి ఉండాలి.
అందుకే నేను పురోహితుడిగా పూజచేస్తున్న ప్రతీసారీ నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండే వాడిని.

పూజలు చాలామంది చేస్తున్నారు. కానీ ఎందుకోసం చేస్తున్నారు?
వారాశించిన ఫలితాలు వారికి లభిస్తున్నాయా?
మరి భక్తులు( యజమానులు ) ఆశించిన ఫలితాలు రానప్పుడు, వారికి శుభం చేకూర్చలేనప్పుడూ పుజలూ, పురోహితులూ వ్యర్ధమే కదా!?
ఒక వేళ లోపాలేమైనా ఉన్నాయా?
ఉంటే లోపం ఎవరి దగ్గర ఉందీ...?
చేసే భక్తుల వద్దా...?
చేయించే బ్రాహ్మల వద్దా...?
లేదా భగవంతుడి వద్దా...?

... " మంత్రాలకు చింతకాయలు రాలేనా పెట్టేనా..?" "ఎప్పుడో పూర్వ కాలంలో ఏవో అద్భుతాలు జరిగాయని అదే పద్ధతి ఇప్పుడూ పని చేస్తుంది అనుకోవడం తప్పు" అంటూ కొంతమంది పలికే మాటల్లో ఎంతవరకూ నిజం ఉంది?
ఆలోచించగా ఆలోచించగా నాకు కొన్ని విషయాలు అర్థమవుతూ వచ్చాయి.

దేముడు తమ కోరికలు తీరుస్తూ వచ్చినందు వల్ల అతడిని నమ్మే వారు చాలా మంది కనిపిస్తున్నారు.

అలాగే తమ కోరిక తీర్చ లేదని దేముడిని నమ్మడం మానేసిన వారూ ఉన్నారు.

దేముడిని నమ్మని వారిలో ఇంకో రకమూ ఉన్నారు. వాళ్ళకు పొద్దున్నే లేవటమన్నా, నోరు కట్టుకుని ఉపవాసాలూ మొదలైనవి పాఠించడ మన్నా, నియమముగా ఉండడమన్నా చాలా కష్ట మైన విషయము. అందువల్ల వారు దేముడిపై నాకు నమ్మకము లేదంటూ వాదిస్తూ కాలం గడిపేస్తుంటారు.

పై 3 రకాలవారూ తమని తాము మోసం చేసుకుంటూ ఇతరులనూ మోసంచేస్తున్నారు.
అలాగే ఇతరులు నొచ్చుకునేటట్లు మాట్లాడటం, ప్రవర్తించడం...., వారిని మభ్య పెట్టో, భయ పెట్టో తమ నమ్మకాలను వారిచే పాటింప చేయడం..., అతి స్వార్థం... మొదలగు అనేక గుణాలు కలిగినవారు ఏ పద్ధతి అవలంబించే వారైనా వ్యర్థమే.

ఆస్తికులైనా, నాస్తికులైనా తమ పద్ధతుల వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా , తమ భావాలు రుద్దకుండా ఉన్నంత వరకూ మాత్రమే సన్మార్గంలో ఉన్నవారవుతారు.

అసలు మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు? భోజనం చేయడం, నిద్రపోవడం, ఆటలాడడం, పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం మొదలైన వన్నీ అతనికి ఏమి ఇస్తున్నాయి? సుఖం కోసమా? అయితే ఇది చెప్పండి

కోతమంది తమకు ఎంతమంది పని మనుషులున్నా తమ పిల్లలను తామే స్కూలులో దించి వస్తారు. మరికొందరు తమకు ఎంత ఆస్థి ఉన్నా తాము స్వయంగా సంపాదించడానికే ఇష్టపడతారు.నేటికీ చాలామందికి ముసలి వారైన తమ తల్లి తండ్రులని తమ వద్ద ఉంచుకోవడానికే ఇష్టపడతారు. తమకు తగిన స్థోమత ఉన్నా వృద్ధాశ్రమాలలో చేర్చడానికి చాలా మధన పడతారు. ఎందుకని?

( " మిరింకా ఎక్కడున్నారు? ఇప్పటికే చాలామంది తమ తల్లి తండ్రులని ఆశ్రమాలలో చేర్చేశారు " అని అనుకుంటున్నారు కదూ మనసులో.... :)

అలా చేర్చే వారుకూడ తాము ఆఫీసుకు వెళ్లినప్పుడు ముసలి వారైన తల్లి తండ్రులను చూసే వారు లేరనో, తమ ఇంట్లో కంటే ఆశ్రమం వారి వద్దే సదుపాయాలు ఎక్కువ ఉన్నాయనో మొదలైన అనేక కారణాల వల్ల ఎంతో భాదపడుతూ అలా చేస్తున్నారని నాభావన. )

హాయిగా తిని కూర్చోవడం సుఖంగా ఉంటుంది కదా? మరి అవన్నీ ఎందుకు చేస్తారు?
ఎందుకో తెలుసా ఆనందం కోసం. అంటే సుఖం వేరు, ఆనందం వేరు. సుఖంగా ఉన్న ప్రతీ వారూ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉన్నవారు సుఖపడుతున్నట్టు కాదు.

ఉద్యోగం చేయవలసిన వయసులో చేయకుండా ఇంట్లో కూర్చుని తినడం సుఖంగా ఉంటుంది. కానీ అలా కొంతకాలం మాత్రమే ఉండగలరు. తరువాతినుండీ యేదో బాధ మొదలవుతుంది.( యేళ్లు గడుస్తున్నా ఇంట్లో వారిపై ఆధారపడుతూ తిని కూర్చునే వారూ నాకు తెలుసు. అలాంటి వారికి వేవేల వందనాలు. ) ఇంట్లో ఉండాలంటే చిరాకు. ఉద్యోగంలో చేరేవరకూ మీ మనసు నిదురకూడా పోనివ్వదు. ఎందుకో తెలుసా అక్కడ సుఖముందేమో కానీ, ఆనందం లేదు.సరిగ్గా అటువంటి ఆనందం కోసమే మనం దేముడిని నమ్మడమైనా, నమ్మక పోవడమైనా. మనం ఆనందంగా ఉన్నంత కాలం, మన వల్ల ఇతరుల ఆనందఆనికి భంగం కలగ నంత కాలం మనం ఏ పద్ధతి పాఠించినా అది సరైనదే.

ఆస్తికత అయినా, నాస్తికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే. రెండు మన శక్తిని పెంచేవే.నిజమైన నాస్తికత్వం ఆస్తికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుకు ఒప్పు? అని ప్రశ్నించుకుంటూ, తనలోని తప్పులను గర్వంలేకుండా ఒప్పుకుని, వాటిని సవరించుకుంటూ చేసే తర్కం సరైనది. అటువంటి తర్కం వల్లనే అనుకుంటా నేను ఆస్తికుడిగా మారాను.
ఇక పూజల వచ్చే లాభనష్టాలు ఏమిటో నేను తెలుసుకున్నది మరో టపాలో వివరంగా చర్చిస్తాను.