19, జనవరి 2010, మంగళవారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి



ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి జాబితాను jpg రూపంలో పొందుపరచాను. ఆ చిత్రం పై క్లిక్ చేస్తే పెద్ద చిత్రం కనిపిస్తుంది. లేదా save చేసుకొని చూడండి.




సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )


ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )


పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

చివరగా: మీరు భాగ్యనగరంలో ఉండి శ్రద్ధతో వ్రతం చేసుకోవాలనుకుంటుంటే ఒక్కసారి నన్ను పిలవండి. నేను తప్పక రాడానికి ప్రయత్నిస్తాను. చక్కగా వ్రతంచేసుకుందాం. మిగతా పూజలన్నిటికన్నా ఈ వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో వ్రతం అనగానే ఖాళీ చేసుకుని మరీ వెళ్తుంటాను. :)

8 కామెంట్‌లు:

  1. దాన్యవాదాలు, చాలా మంచి పోస్ట్.

    వ్రతం చేసేటప్పుడు ఆకులు, వక్కలు , కర్జురకాయలు,పసుపుకొమ్ములు మరియు అరటిపండు కలశం ముందు నవగ్రహాలు పద్దతిలో పెట్టాలి. ఆ పద్దతి నాకు ఏప్పుడు తప్పుగా వస్తుంది. దయచేసి ఎక్కడ నుంచి పెట్టాలి ఏ ఏ వరుసలో పెట్టాలి అనేది కొంచెం తెలుప గలరా ? ముక్యంగా దిక్కుల విసయామ్లో తప్పుగా పెట్టేస్తూ వుంటా.

    రిప్లయితొలగించండి
  2. ముందు గణపతి పూజ చెయ్యాలి. తరువాత నవగ్రహారాధన చేయాలి.

    ఒక్కొ దెవతను స్మరించి తమలపాకు,వక్క,ఎండుఖర్జూరము,పసుపుకొమ్ము,పుష్పము పెడుతూ ఉండాలి.

    ముందు పంచలోకపాలకులు
    గణపతి,బ్రహ్మ,విష్ణు,రుద్ర,గౌరీ దేవతలను మండపములొ ఉత్తరాంతము అయ్యే విధంగా పెట్టాలి.

    తరువాత నవగ్రహాలు

    సూర్యుడు-మధ్యలో
    చంద్రుడు-ఆగ్నేయం
    కుజుడు-దక్షిణం
    బుధుడు-ఈశాన్యం
    గురుడు-ఉత్తరం
    శుక్రుడు-తూర్పు
    శని-పశ్చిమం
    రాహువు-వాయవ్యం
    కేతువు-నైఋతి

    తరువాత అష్ట దిక్పాలకులు

    ఇంద్ర-తూర్పు
    అగ్ని-ఆగ్నేయం
    యమ-దక్షిణం
    నిఋరుతి-నిఋరుతి
    వరుణ-పశ్చిమం
    వాయు-వాయువ్యం
    కుబేర-ఉత్తరం
    ఈశానుడు-ఈశాన్యం

    తరువాత కలశంలో స్వామిని ఆవాహన చేసి పూజించ వలెను.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా, వ్రతం చేయించడానికి మీరు ఎంత మొత్తం తీసుకుంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వ్రతం చేయించుకోవాలన్న ఆర్తికన్నా, బ్రహ్మగారి దక్షిణ గురించి బెంగ ఎక్కువగా ఉన్నది మీకు.
      అఙ్ఞాతల వద్ద వ్రతం చేయించలేను, దక్షిణ పుచ్చుకోలేను. ముందు వెలుగులోకి రండి.

      తొలగించండి
    2. :) అజ్ఞాతలకు 'వుచితం ' అని చెప్పండి, శర్మగారు. ముఖారవిందం పైనుంచి గోనెగుడ్డ మేలి ముసుగు తీసి బయటికి వస్తారేమో చూద్దాం. :D

      అజ్ఞాతల పూజ దక్షిణ నేను స్పాన్సర్ చేస్తా. కాని, పూజ ఫలం, ఆశీర్వచనం నాకే చెందాలి. ;) :)

      తొలగించండి
  4. హలో శర్మ గారు,

    మీరు వివరించిన సత్య నారాయణ వ్రతం పోస్ట్ చాల బావుంది. ఈ వ్రతం సాయంత్రం చేస్తే శ్రేష్టం అని ఎందుకు అన్నారో సవివరం గా చెప్పగలరు. అలాగే ఏ తిధి, వారాలు చెయ్యడం విశేషమో తెలుపగలరు. వైభవ లక్ష్మి వ్రతం గురించి కూడా వీలితే వివరిస్తారని ఆశిస్తున్నాను.

    మీ అభిమాని ,

    వైధర్భి

    రిప్లయితొలగించండి
  5. Namaskarm sharma garu meeru manchi vishayalu post chesthunnaru and sandeha nivruthi chesthunnaru vahana puja eae vidhamga cheyavaleno dhaya chesi thelupagalaru

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.