22, జనవరి 2010, శుక్రవారం

పూజలలో కొబ్బరికాయ విశిష్టత ఏమిటి? మరికొన్ని ప్రశ్నలు.


మన హిందు సాంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావలసినది కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు. అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయింది. అటువంటి కొబ్బరికాయకు సంబంధించిన సందేహాలు ఇక్కడ చర్చించుకుందాము.

1.కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

కొబ్బరికాయకు మనకు పోలిక ఉంది. కొబ్బరికాయ పైన ఉన్న దళసరి పెంకు మన అహంకారానికి, లోపలి కొబ్బరి మన మనస్సుకూ ప్రతీకలు. కొబ్బరికాయ కొట్టడమంటే మన అహంకారాన్ని విడనాడి, ఆతెల్లని కొబ్బరి లాంటి మన మనస్సును స్వామి ముందు పరచామనీ ఆ మనస్సును ( కొబ్బరిని ) స్వీకరించి నిర్మలమైన కొబ్బరి నీరు లాంటి జీవితమును ప్రసాదించమనీ అర్థం అందులో ఉంది. అందుకే కొబ్బరికాయ మన పూజలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
2. పీచు తీసిన కొబ్బరికాయను కొట్ట కూడదా?

మన శరీరానికి చర్మం ఎంత అవసరమో, కొబ్బరికాయకు పీచూ అంతే అవసరము. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు. కొట్టినతరువాత తీయాలి. కొబ్బరికాయ మొదలులో ఉన్న 3 కన్నాల దగ్గరా చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది. ముందరే పీచుతీయడం వలన ఆ కన్నాల ద్వారా బాక్టీరియా కాయలోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడయిపోయే అవకాశం ఉంది. ( మీరు గమనించే ఉంటారు కొబ్బరి కాయ కుళ్లడం అంటూ జరిగితే అది మొదలు నుండే జరుగుతుంది. లేదా కొబ్బరికాయకు పగులు వస్తే ఆ పగులు వద్ద కుళ్లుతుంది. ) కనుక ముందు పీచుతీయకూడదు అంటారు.

3. మరి కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీయాలి?

కొబ్బరికాయను దేమునికి ప్రసాదంగా పెడుతున్నాము. ఆ ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయ బాగుందో లేదో చూచుకుని పెట్టాలి కదా!? కానీ వాసన చూడకూడదు, రుచి చూడకూడదు ( దేముని ప్రసాదం కనుక ) . మరి వాసన చూడకుండా, రుచి చూడకుండా కొబ్బరికాయ బాగుందో పాడైపోయిందో ఎలా తెలుసుకోవడం? కొన్ని సార్లు కంటికి బానే ఉన్నట్టు కనబడినా రుచి చూసిన తరువాత పాడయి పోయిందని తెలుస్తుంది. అలా పాడయి పోయిన కాయను తెలుసుకోవడం ఎలా? దానికోసమే కొబ్బరికాయ వెనకాల పీచుతీసి మూడు కన్నాల వద్ద నొక్కి చూడాలి. ఎక్కడైనా మెత్తగా నొక్కు బడితే అది పాడయి పోయిందని అర్థం. అలా నొక్కు బడక మామూలుగా ఉంటే బాగుందని. ఆవిధంగా కంటికి కనబడని కొబ్బరికాయలోని లోపాన్ని కూడా తెలుసుకోవడానికే కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు తీయాలి.


4. కొబ్బరి కాయకు పసుపు కుంకుమ రాయడం సబబేనా?

పసుపు, దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒకవిధంగా సబబే. అందువలన ఆ కాయచుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి. కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఎంత మాత్రమూ సరిఅయినది కాదు. మనం భగవంతుడు వచ్చాడు అని నమ్మి అతనకి పూజ చేస్తాము. ఆ విధంగా మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యముగా ఈ కొబ్బరిని సమర్పిస్తున్నాము. అంటే మన ఇంటికి ఒక అథిధిని పిలిచి ఫలహారం పెట్టడం లాంటిది. మనం కొబ్బరి తింటే, లేదా వచ్చిన అథిధికి పెడితే కుంకుమా పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా!? కుంకుమ ఉంటే కడుక్కుని మరీ తింటాము. మరి అలాంటాప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమా పసుపూ చల్లి పెట్టడం తప్పేకదా!? :) ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనదీ తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి.


నాకు సహజంగా పూజలలో ఎదురయ్యే సందేహాలను ఈ "పూజలు-కొన్ని సందేహాలు" అనే లేబుల్ లో రాస్తున్నాను. పూజ్యులైన పెద్దలు తమకు తెలిసిన సమాధానాలను కూడా ఇక్కడ వ్యాఖ్యలలో తెలుప వలసిందిగా మనవి. అలాగే పూజలు చేసే ప్రతీ ఒక్కరూ మీకు సహజంగా పూజలు చేసే టప్పుడు వచ్చే సందేహాలు ఏమైనా ఉంటే నన్ను ఈ బ్లాగు ముఖంగా అడిగితే నాకు తెలిసినంత వరకూ చెప్తాను. తెలియనివి తెలుసుకోవడనికి కూడా ప్రయత్నిస్తాను.

ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:

  1. బాగుందండి మీ వివరణ. మీ అమ్మ వారు కూడా పైన ఫొటో లో చాలా అందం గా వున్నారు.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పిన వివరణ తో పాటు నాకు తెలిసిన ఇంకొక విషయం - పూజ లో కొబ్బరి కాయ పోక (వక్క) కాయ పూర్న ఫలాలు గా ఆదరించ బడినవి ఎందుకంటె, కొబ్బరి కాయ, పోక మాత్రమె పగల గొట్టకుండా నాటితే మాత్రమే మొలకెత్తుతాయి. అంటే ఎంగిలి చెయ్యబడని ఫలమన్న మాట. ఒక సారి పగిలితే అవి విత్తనం గా మొలవవు, విత్తనంగా ఉపయోగపడవు. కొబ్బరి కాయలోని నీరు కలుషితం, మలినం కానివి. పవిత్రమైనవి.

    ఇది ఒక పండితుని ద్వారా తెలుసుకున్నది, మీతో పంచుకుందామని ప్రస్తావించాను.

    రిప్లయితొలగించండి
  3. మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. మంచి విషయాన్ని చాలా బాగా వివరించారు. అంతర్యాగం వివరణ కూడా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. ఈ బ్లాగులో " భోజనము చేయునపుడు ఆచరించవలసినవి " అనే పేరుతో రాసిన టపాలో మీరడిగినది రాశాను చూడండి. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. kobbarikaaya nu devudi vadda harathi mundu kottalaa ? harathi anatharam kottalo teliyacheyagalaru

    రిప్లయితొలగించండి
  7. నైవేద్యానంతరమే నీరాజనం ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.