10, ఏప్రిల్ 2010, శనివారం

నౌకరు-యజమాని-చేపలు ---కథ


ఓ ధనవంతుడైన యజమాని విదేశాలలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళ్తూ, తను ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటిని తనకు నమ్మకస్తుడైన నౌకరుని పిలిచి అప్పగించాడు. " నేను ఎంతో మక్కువతో కట్టించుకున్న ఇల్లు ఇది. నేను నాకొడుకు దగ్గరకు వెళ్తున్నాను. ఆరునెలల వరకు రాను. నువ్వు దీనిని జాగ్రత్తగా చూసుకో. ఇల్లంతా కూడా నీ ఇల్లులా వాడుకో. ఆ వంట గదిలో నీకు నచ్చిన వంటలు చేసుకో. ఈ హాలులో నీ స్నేహితులతో కూర్చుని హాయిగా కాలక్షేపం చెయ్యి. ఆ హంసతూలికా తల్పం వంటి పరుపుపై కంటినిండా నిదురించు. అయితే... నాకోసం ఎవరైనా వస్తే నా యజమాని విదేశాలకు వెళ్లారు. త్వరలో వస్తారు. అప్పటి వరకు నన్ను ఈ ఇంటిని వాడుకో మన్నారు అని చెప్పు. అలాగే మన స్థలంలో ఉన్న చెరువులోని చేపలను జాగ్రత్తగా పోషించు. అవి నాకెంతో ప్రీతి పాత్రమైనవి. వాటికెవ్వరూ హాని కలిగించకుండా సంరక్షించు" అని జాగ్రత్తలు చెప్పి విదేశాలకు వెళ్లిపోయాడు.

ఈ నౌకరు తన యజమాని యొక్క ఉదారబుద్ధికి ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. తాను కలలో కూడా ఊహించని ఈ సంపదను అనుభవించే అవకాశాన్ని ఇచ్చినందుకు వేవేల వందనాలు చేశాడు. కానీ కొంతకాలం గడిచేటప్పటికి అతనిలో కొంత అహం ప్రవేశించింది. తన ఇంటికి వచ్చిన స్నేహితుల వద్ద డాబు కోసం ఆ ఇల్లు తనదేనని, తన యజమాని శాశ్వతంగా తనకు రాసిచ్చి విదేశాలకు వెళ్లిపోయాడని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం క్రమ క్రమంగా ఊరంతా తెలిసిపోయింది. ఆ నౌకరు అదృష్టాన్ని చూసి అందరూ అసూయ పడుతుండే వారు. తన అదృష్టానికి తన స్నేహితులు అసూయ పడుతున్నారని తెలిసి మరింత ఆనందించేవాడు. తన స్నేహితులందరినీ ఇంటికి పిలిచి మెత్తని పరుపులమీద కూర్చోపెట్టి ఆ ఇంటి సోయగాన్ని గురించి వివరిస్తూ విందు భోజనాలు పెట్టేవాడు.

ఓ రోజు నౌకరు రోడ్డుమీద వెళ్తుండగా అతని స్నేహితుడు ఒకడు కనిపించాడు. మాటలమధ్యలో ఏరా మీచెరువులో పెద్ద పెద్ద చేపలుంటాయట కదా!? అని అడిగాడు. అందుకు నౌకరు `అవును. ఒక్కొక్కటీ బారెడు పొడుగుంటాయి. ఒక్కచేప ఒండితే 10 మందికి భోజనం పెట్టచ్చు. ఎంతరుచిగా ఉంటాయో తెలుసా!? అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి ' అని చెప్పాడు. మరి నువ్వొక్కడివీ తినకపోతే మమ్మల్నీ పిలిచి పెట్టొచ్చుకదరా? అని స్నేహితుడు అడిగే సరికి అయ్యో దానిదేముంది.రేపు మన మిత్రులందర్నీ తీసుకుని మా ఇంటికి భోజనానికి వచ్చెయ్యి. నేను చెరువులోని చేపలు తెప్పించి వండిస్తాను. అని చెప్పి వెళ్లిపోయాడు.

స్నేహితుడి దగ్గర కోతలు కోశాడు గానీ అతనికి ఇప్పటివరకూ ఆ ఆలోచనే రాలేదు. అసలు ఆ చెరువు సంగతే మర్చిపోయాడతను. రోజూ ఎన్ని చేపలు పుడుతున్నాయో, ఎన్ని చస్తున్నాయో ఎవరు చూడొచ్చారు. అందులో కొన్ని చేపలు రేపు స్నేహితులకి వండిపెడితే విదేశాలలో ఉన్న యజమానికి ఏంతెలుస్తుంది? అనుకుని మరునాడు చెరువులో వలవిసిరి కొన్ని చేపలను బయటకు తీశాడు. సరిగ్గా ఆ సమయంలో అనుకోని విధంగా యజమాని అక్కడకు వచ్చాడు. ఈ దృశ్యం చూస్తూనే కోపంతో నౌకరును చితకబాది "నేను నమ్మకంతో నీకు నా ఇల్లు అప్ప గిస్తే నువ్వు అది దుర్వినియోగ పరుచుకున్నావు. ఇల్లు నీదే నని ఊరివారితో చెప్పుకున్నావు, నేను సంరక్షించమని అప్ప గించిన చేపలను అసలు పట్టించు కోలేదు. ఇప్పుడు స్వయంగా నీవే వాటికి హానితలపెట్టావు. ఇది క్షమించరాని నేరం" అని నౌకరును మెడపట్టి బయటకు గెంటించాడు.

రామకృష్ణపరమహంస ఈ కథ ద్వారా మనకు ఓ చక్కని నీతిని బోధించారు. కథలోని యజమాని నౌకరుకు విలాసవంతమైన భవంతిని ఇచ్చినట్లుగా భగవంతుడు మనకు శరీరాన్ని ప్రసాదించాడు. ఆ శరీరంతో నువ్వు ధనము, భార్య, పుతృలు మొదలైన సమస్త భోగాలూ అనుభవించు. కానీ ఏది అనుభవిస్తున్నా ఆ పరమేశ్వరుని నిర్హేతుకమైన దయవలన నాకు ఇటువంటి సంపద లభించింది. అందు కొరకు నేను భగవంతునకు సర్వదా కౄతఙ్ఞతుడను అని ఒక్క సారి నన్ను స్మరించు. అలాగే సాధు పురుషులు, అమాయకులైన భగవత్ భక్తులు, వేద వేత్తలైన బ్రాహ్మణులు మొదలైన వారిని వినయముతో సంరక్షించు. అంతకంటే నీవు నాకు చేయగలిగిన పూజ మరొకటి లేదు. అని పై రెండు నియమాలను విధించాడు.

కానీ మాయా ప్రభావితుడైన మానవుడు ఈ సంపదలన్నీ తనయొక్క ప్రతిభా పాఠవాల వలన సంపాదించినవేనని గర్విస్తూ నలుగురికీ తన గొప్పతనాన్ని చూపించి గర్విస్తున్నాడు. అయినప్పటికీ భగవంతుడు తన బిడ్డడి తప్పటడుగులు చిరునవ్వుతో తిలకిస్తున్నాడు. కానీ ఆ అహంకారంలో పడి ఎప్పుడైతే భగవంతుడిని విమర్శిస్తూ, భగవత్భక్తులయెడ పరుషంగా ప్రవర్తిస్తున్నాడో తత్ క్షణమే అతని అహంకారాన్ని అణదొక్కుతున్నాడు. పూర్వం రావణుడు, కంసుడు మెదలైన ఎంతోమంది విషయంలో ఇది నిరూపణమయినది. నేటికీ నిరూపించ బడుతున్నది.

కనుక మనము నిరంతరమూ అనుభవించే సకల సంపదలనూ ఆ భగవంతుని నిర్హేతుకమైన కృపగా భావిస్తూ, మన వేదమునూ, భగవద్భక్తులనూ, సాధు పురుషులనూ సంరక్షిస్తూ జీవనం సాగిద్దాము.

10 వ్యాఖ్యలు:

 1. మానవుడు పుట్టినప్పుడు ఏ జీవించే స్కిల్ల్స్ లేకుండా పుడతాడు. కనీసం తను ఎవరికీ పుట్టాడో కూడా తెలియదు. ఎవరో చెబితే తప్ప. మనం పెరగటం చదువుకోవటం జీవించటం అంతా ఇంకొకళ్ళు మనకు ప్రసాదించినవే. అది మర్చిపోయి అహం ఎక్కువయ్యి దిగజారి పోతారు. మంచి కథ పోస్ట్ చేసినందుకు థాంక్స్.
  రామకృష్ణ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా చక్కని విషయం తెలియజేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చిరకాల దర్శనం!
  మంచి ఉదాహరణ తో గొప్ప విషయం చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారం. మీ బ్లాగును ఇదే మొదటిసారి చూడడం. మంచి విషయాలు చెప్తున్నారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏమైపోయారండి ఇన్ని రొజులు, మేమెంత తపన్ పడ్డామో మీ గురించి, ఎలా ఉన్నారు జగన్మాత కృపవల్ల అంత సౌఖ్యమెకదా, మంచి కధతో మళ్ళి వచ్చినందుకు సంతొషం

  -రేణూకుమార్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అందరికీ నమస్కారములు.

  @ రేణూ కుమార్ గారు : కొన్ని సార్లు నాకు నేనే నియమము పెట్టుకుని కంప్యూటరుకు దూరముగా ఉంటూ ఉంటాను. అందువలననే ఈ ఆలస్యం. మీ కలతకు కారణ మైనందుకు మన్నించగలరు. అమ్మ దయవల్ల అంతా సౌఖ్యమే. మీ అభిమానానికి ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.