11, ఆగస్టు 2010, బుధవారం

ఆత్మలతో మాట్లాడవచ్చు.



కొన్ని కంటితో చూసి నోటితో చదివినంత మాత్రాన అర్థం కావు. మనసుతో అనుభవించి చూడవలసినదే వాటి లోతు. కొన్ని సాధారణ విషయాలలోనే అసాధారణమైన రహస్యాలు దాగుంటాయి.

నాకు చిన్నప్పటి నుండీ ఓ విచిత్రమైన కోరిక ఉంది. గాలిలో ఎగరాలని. " రావణ బ్రహ్మ రోజూ తెల్లవారుతూనే ఆకాశమార్గాన వెళ్లి కోటి శివలింగాలకు అర్చన చేసి వచ్చే వాడని " ఓసారి ఎవరో నాకు చెప్పారు. అప్పటి నుండీ అనుకుంటా గాలిలో ఎగరాలని బలమైన కోరిక. ఎంత బలమైనది అంటే నిజంగా ఈ దేహంతో ఎగరడం సాధ్యం కాదు కనుక కనీసం కలలో నైనా ఎగరాలని నా సంకల్పమో ఏమో.. సరిగా గుర్తులేదు కానీ నాకు వచ్చే కలలో చాలా వరకూ నేను ఎగురుతున్న ఎరుక నాకు తెలిసేది. ఓ సారి అర్జునుడు పాశుపతాన్ని పొందే సందర్భంలో శివుడితో యుద్ధం చేసే కథను విన్నాను. కొన్నాళ్లకు నాకు ఓ కల వచ్చింది. ఎదురుగా ఎవరో ధనుర్బాణాలతో ఉన్నారు. నేను అవే ఆయుధాలతో ఉన్నాను. ఇద్దరం గాలిలో నేలకు మూడు మీటర్ల ఎత్తులో ఉండి పెద్ధ యుద్ధం చేసుకున్నాం. అద్భుతమైన దివ్యాస్త్రాలు.

నాకోరికలు అలా కలలలో తీరుతున్నాయని అనుకునే వాడిని. ఒక్కటి మాత్రం నాకర్థమైంది. మనం బలంగా ఏవైనా కోరుకుంటే అవి కలలుగా వస్తాయని. అలా నాకొచ్చే విచిత్రమైన కలలు మిగిల్చిన అనుభవాలు ఎప్పుడు తలుచుకున్నా చాలా బలం వచ్చి నట్లు అనిపించేది. కలలు అందరికీ వస్తాయి కానీ చాలా మందికి గుర్తుండవు.

కలలు గుర్తుంచుకో గలిగితే అందరూ ఆత్మలతో మాట్లాడవచ్చు. ఆ కలలను గుర్తుంచుకోవడం ఎలాగ అని అడుగుతారేమో!? మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. రాత్రి పడుకునే ముందు నాకు వచ్చిన కలలను నేను గుర్తుంచుకోవాలి అని స్థిరంగా 4,5 సార్లు సంకల్పించుకుని పడుకోండి. క్రమ క్రమంగా మీ కలలు మెలకువ తరువాత కూడా గుర్తుకు వస్తుండడం మీరే గమనిస్తారు. అలా మీ సంకల్ప బలం, కోరిక, నమ్మకం వీటిని బట్టి మీకు గుర్తుండే శాతం ఉంటుంది.

ఇంతకీ కలలను గుర్తుంచుంకుంటే ఆత్మలతో ఎలా మాట్లాడవచ్చూ..!? అని అనుకుంటున్నారా? అదిగో అక్కడికే వస్తున్నాను.

మీకెప్పుడైనా అద్భుతమైన,వింత ఐన కలలు వస్తాయా? మీకలలలో మీరు అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్నట్టు, మీతో దేవతలు- చనిపోయిన వారు - యోగులు మాట్లాడినట్లు, మీరు గాలిలో ఎగిరినట్లు, కొత్త కొత్త ప్రదేశాలు చూసినట్టు, లేదా లోకాలన్నీ తిరిగినట్టు కనిపించిందా.!?

అయితే మీకు కలల ద్వారా ఏవో సందేశాలు వస్తున్నట్టు తెలుసుకోండి. అవును కలల ద్వారానే. కలల ద్వారా మీకు సాధ్యమవ్వని దంటూ ఏమీ లేదు. మీరు కలవలానుకున్న వారిని కలవ వచ్చు. ఎంత దూరంలో ఉన్నా, అసలు భూమిమీదే లేకున్నా,ఏడేడు పధ్నాలుగు లోకాలలో ఎక్కడ ఉన్నా. మీరు కలిసి వారితో పంచుకున్న అనుభవాలను నిద్రనుండి మేల్కొన్న తరువాత కూడా గుర్తుకు ఉంచుకోవచ్చు. కాక పోతే కొంత సాధన ద్వారా.

ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ రచయిత "శ్రీ శార్వరి" చెప్తున్న మాటలు ఇవి. ఈయన మాష్టర్ సి.వి.వి. ధ్యాన ప్రక్రియకు ఆకర్షితులై, తద్వారా ధ్యానం,యోగం,ఆత్మ యాత్రలు ( astral travel ) మొదలైన అనేక విషయాలగురించి అనేక భాషలలో పలువురు రాసిన రచనలను చదువుతూ,సాధన చేయడం మొదలు పెట్టారు. అలాగే వీటి గురించి తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో నేను ఈ మధ్య అనుకోకుండా " పరావిద్య " అనే పుస్తకం కొనిచదివాను. నేను ఇంతకు పూర్వం వీరి రచనలు ఎప్పుడూ చదవలేదు. నాకు వారి గురించి పెద్దగా తెలియదు. కానీ పుస్తకం కొద్దిగా చదివితే ఏదో ఆసక్తిగా అనిపించి కొన్నాను. ఇంటికి వచ్చి తెరచి చదివితే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. నా ఆసక్తికి సరిగ్గా తగిన పుస్తకం అనిపించింది. నాకు తెలిసిన కొన్ని విషయాలకు కొన్ని కొత్త పార్శ్వాలు కనిపించాయి. నా ఆధ్యాత్మిక సాధనకు కొన్ని కొత్త దారులు కూడా గోచరించాయి. పుస్తకం తెరచిన దగ్గరనుండీ పూర్తయ్యే వరకు ఆపకుండా దాదాపు ఏకబిగిన చదివాను.


మనకు కనిపించే శరీరం కాకుండా ఇంకా అనేక శరీరాలున్నాయి. ఈధర్ శరీరం, ఆస్ట్రల్ శరీరం, భావశరీరం,ప్రాణ శరీరం, ఆత్మ శరీరం ఇలా కంటికి కనిపించని అనేక శరీరాలు మనకున్నాయి. వాటిని కంటితో చూడడం కుదరదు. మనసుతోదర్శించాలి.

" కనిపించడం అన్నది కంటికి పరిమితం. కనిపించని దానిని దర్శించడం మనస్సు పరిధి లోనిది. అలా దర్శింప చేసే సామర్ధ్యం ఉన్నది ఆత్మకు మాత్రమే."

" ఇవ్వాళ మనం టన్నుల కొద్దీ విఙ్ఞానం,నాగరికత ఉందని సంబరపడి పోతున్నాంగానీ, ఇంతకు వేయిరెట్లు 'వివిఙ్ఞానం' ఆ (పూర్వం)రోజుల్లోనే ఉండేది. అది సంస్కారం. అప్పుడు మనవాళ్లు హాయిగా పరలోకాలకు విహార యాత్రలకు వెళుతూ వస్తూ ఉండేవారు. దేవతలతో, యక్షులతో, కిన్నెరలతో, కింపురుషులతో, గంధర్వులతో చెలిమి చేసేవారు. "

" ఈజిప్టు, రోమ్ దేశాల నాగరికతల్ని అధ్యయనం చేస్తే అక్కడి చారిత్రక అవశేషాల్ని గమనిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి. ఈజిప్టులోని పిరమిడ్లు,ప్పింక్ రహస్యాలు ఇప్పటికీ తెలియడం లేదు. వారి ఖగోళ విఙ్ఞానం, ఆత్మల అవగాహన నేటికీ ఊహాతీతంగానే ఉంది. భూమి కొలతలు, భూమికి ఇతర గ్రహాలకు మధ్యదూరాలు ఎలా కొలవగలిగారు. ఎవరూ భౌతిక శరీరాలతో వెళ్లి టేపులు పెట్టి కొలిచి ఉండరు కదా! వారికి లింకులు తెలుసు. మానవ మేధస్సును విశ్వ మేధస్సుతో లింక్ చేయడం వారికి తెలుసు. భౌతిక శరీరాన్ని ఇక్కడ భద్రపరచి, అశరీరులుగా విశ్వసంచారం చేయడం వారికి తెలుసు."

" ఏదేశ చరిత్ర పుటలు వెనక్కి తిప్పినా, ఏజాతి చరిత్రలోకి తొంగిచూసినా ఆకాలం వారికి 'అశరీర పరిఙ్ఞానం' పూర్తిగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మన పౌరాణిక కధలు, ఇతిహాసాలు, లోతుగా పరిశీలించండి. ఎన్ని అద్భుతాలు బయటపడతాయో గమనించవచ్చు. రాజులు,ఋషులు యధేచ్ఛగా అలా అలా స్వర్గానికి హనీమూన్ ట్రిప్స్ వేస్తుండే వారు. అక్కడిదేవకన్యలతో, అప్సరసలతో సరదాగా షికార్లు చేసి, సరదాలు తీర్చుకునేవారు. అలా విమానాల్లో ఆకాశమార్గాన హిమాలయాల పైకి వెళ్లేవారు. నదులు,సముద్రాలు అలవోకగా దాటి వెళ్లే వారు. ఇంద్రసభకు వెళ్లడం,నందనాల్లో విహరించడం, త్రిమూర్తుల్ని కలవడం, ముక్కోటి దేవతలతో ముచ్చట్లాడడం,ముచ్చటతీర్చుకోవడం బొత్తిగా కష్టం కాదని తెలుస్తుంది. " అంటారు మాష్టర్ శ్రీశార్వరి.

అయితే ఈపుస్తకం చదవక మునుపు కూడా నాకు ఇవన్నీ ఉన్నాయని, ఇంకా నేటికీ అనేకులు ఈ సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేస్తున్నారనీ తెలుసు. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదనే అభిప్రాయం ఉండేది. ఎంతో యోగ సాధన చేస్తే గానీ ఈ సూక్ష్మశరీర ప్రయాణం అనేది అనుభవంలోకి రాదని అనిపించేది. రోజూ ఉద్యోగాలు చేసుకునే వారికీ, సంసార బంధంలో ఉన్న వారికీ కొంత కష్ట తరమైన సాధన అనుకునేవాడిని. కానీ ఇది చదివిన తరువాత నా అభిప్రాయం పూర్తిగా తప్పని తేలింది. మనసుంటే మార్గముంటుందని మరోసారి ఋజువైంది. మాష్టర్ శ్రీశార్వరి గారు ఎంతో కష్ట తరమైన అనుభవాన్ని చాలా తేలికగా తన రచన ద్వారా మనకు అందించారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా ఇది ఇంత సులువైన సాధనా అనిపిస్తుంది.

వారు చెప్పిన సాధన ఏమిటంటే రోజూ ప్రశాంతంగా నిద్ర పోవడమె.. చక్కటి కలలు కనడమే.. ఆ కలలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసుకుని భద్రపరచుకోవడమే... ఇంతే మీరు చేయవలసింది. దీని వలన మీరు పొందేది ఏమిటో తెలుసా..!? మీరు ఎవరిని కావాలనుకుంటే వారిని కలవగలరు. భవిష్యత్తులో జరిగే వాటిని తెలుసుకో గలరు. ఎంత దూరమైనా సూక్ష్మశరీరంతో సునాయాసంగా ప్రయాణించగలరు.

రోజూ రాత్రిపూట కలలు వస్తాయి కదా. కలలకు తలా తోకా లేదు అనుకుంటాం మనం. అప్పటిదాకా చెట్టుక్రింద ఉన్న మనం ఉన్నట్టుండి ఏ ఇంట్లోనో టీవీ చూస్తున్నట్టు, ఓ కోతిగానో, దేముడిగానో, రాక్షసుడిగానో మారినట్టు అర్థం పర్థం లేని కలలు వస్తున్నాయి అని అందరూ అనుకోవడం సహజం. కానీ వీటికి అర్థం ఉంది అని మరోసారి నిరూపిస్తుంది "పరావిద్య" పుస్తకం.

" మనకు మంచి కలలు వస్తే అవి ఇంకాఇంకా సాగాలని కోరుకుంటాం. అయ్యో అనవసరంగా మెలకువ వచ్చిందే ఇంకొంత సేపు మెలకువ రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం. అలాగే చెడు కలవస్తే భయంతో ఒణికి పోతాం. కానీ రెండూ మనకు సంకేతాలే. అవి చెరుపు చెయ్యవు. ఓ దెయ్యమో,ఆత్మో మిమ్మల్ని వెంటాడినట్టో, ఓ గొప్ప సౌందర్యవతి కనిపించి కవ్వింనట్టో వస్తే అవి రెండూ మీ మనసులోని కోపతాపాలను, వ్యామోహాన్నీ తెలుపుతున్నట్టు గుర్తు. ఏ స్త్రీ వ్యామోహమూ మీకు లేదనుకోండీ.. ఏ అప్సరసా మీ కలల్లోకి రాదు, అలాగే మీ మనసులో కోపతాపాలు, ఏ మలినమూ లేకపోతే రాక్షసులు రారు. మనలో దాగిన వికృత భావాలకూ, అణచుకున్న ఉద్రేకాలకూ ఆ కలలు రూపాంతరాలు. మన గుణాలకు రూప కల్పనలే స్వప్నంలో కనిపిస్తాయి. ఏ కలా ఊరికే రాదు. వాటికో అర్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ఓ సంకేతం ఉంటుంది. అందించ వలసిన సందేశం ఉంటుంది. ఎటువంటి కలలైనా సరే అవి మనకు చెడుపు చేయవు. ఇలలో మనకు సహాయపడేవే అయి ఉంటాయి. మన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినవి కావచ్చు, కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు. స్వప్నాలను విశ్లేషించడం ఒక కళ. కలలే గొప్ప పరిశోధనలకు ఆలంబనాలు. మహాజటిలమైన సమస్యలకు పరిష్కారాలు కలల్లోనే లభించాయి. మహర్షులు కలల ద్వారానే గొప్ప సత్యాలను ఆవిష్కరించారు. ఈ స్వప్న సందేశాలను ఆధారం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఒక్కో కల మీజీవితాన్నే మార్చేయ గలదు. ప్రఙ్ఞతో అశరీర సంచారం చేయగల యోగి విశ్వరహస్యాలు సత్యాలు ఆవిష్కరిస్తాడు. "

ఎంత చెప్పినా ఇది తరిగేది కాదు కానీ, నేను అసలు ఏమి చేయాలో చెప్తాను. అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది. రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ఓ ఐదునిమిషాలు మనసును ప్రశాంత పరచాలి. ముందుగా గురువులను ప్రార్థించాలి. మన చుట్టూ మనకంటికి కనిపించని గురువుల ఆత్మలు ఎన్నో ఉంటాయి. మన సూక్ష్మ శరీర ప్రయాణంలో వారి సహాయాన్ని అర్థించాలి. మనసులో మీరు చూడాలనుకున్న ప్రదేశమో, కలవాలనుకున్న వ్యక్తినో సంకల్పించుకోవాలి. ( ఫలానా ప్రదేశానికి నేను వెళ్లాలి. అక్కడ నాకు ఎదురైన అనుభూతులను పదిలంగా భద్రపరచుకోవాలి. మెలకువ తరువాతకూడా అవి నాకు గుర్తుండాలి. ఇలా మనసులో గట్టి విశ్వాసంతో సంకల్పించు కోవాలి. ) మీకు ఈ ప్రక్రియమీద ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు కలిగే అనుభూతుల లోతు ఉంటుంది. మొదట్లో కొన్ని రోజులు కలల గుర్తుండక పోయినా త్వరలోనే అవి స్ఫురణకు రావడం, వాటి తాలూకా అనుభవాలు నిజ జీవితంలో ఎదురవడం మీరు చూచాయగా గమనించడం మొదలు పెడతారు.

అలా సంకల్పించుకుని మూసుకున్న కను గుడ్లను గుండ్రంగా త్రిప్పుతూ ఉండాలి. అందువలన త్వరగా నిద్ర వస్తుంది. మీ మనస్సును సూక్ష్మ శరీర ప్రయాణానికి సన్నద్ధం చేసుకోవాలి. మీరు క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. మీరు నిద్ర పోయారు అంటే మీ సూక్ష్మ శరీరం మీ భౌతిక శరీరం నుండి విడి వడింది అని అర్థం. అలా భౌతిక శరీరం నుండి విడి వడినా భౌతిక శరీరానికీ - సూక్ష్మ శరీరానికీ ఒక దారం వంటి లింక్ ఉంటుంది. చనిపోయినప్పుడు ఆబంధం తెగిపోతుంది. నిద్రించి నప్పుడు ఎంత దూరం వెళ్లినా అది ఉంటుంది. కొందరు గొప్పగొప్ప వారికి ఆ దారం వంటి బంధం కలలలో దర్శించిన అనుభవాలు ఎదురయ్యాయి. అలా ప్రయాణానికి సిద్ధమైన సూక్ష్మ శరీరానికి ఒక స్నేహ హస్తం అందుతుంది. వారి మార్గదర్శకంలో మీరు కోరుకున్న చోటికి వెళ్తారు. వారే మీ ఆధ్యాత్మిక గురువులు.

కొన్ని సూచనలు : నేలమీద చాప వేసుకుని నిద్రించడం మంచిది. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. నిద్రించే గదిలో ఎక్కువ వెలుతురు ఉండకూడదు. కొద్దిగా తగుమాత్రంగా వెలుతురు ఉండవచ్చు. గుండెల మీద చేతులు వేయకూడదు. అలా వేస్తే మన సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలి బయటకు వెళ్లడం కష్టం అవుతుంది. చేతులను కూడా వెల్లకిలా చాపి ఉంచాలి. శరీరం నుండి ఆత్మ విడివడడమేమిటి? మన ఆత్మ ప్రయాణం చేయడమేమిటి? అని కొందరికి వింత గొలపవచ్చు. మరికొందరికి కాస్త భయం కూడా వేయ వచ్చు. కానీ కంగారు పడనవసరం లేదు. ఈ విషయం మీకు తెలిసి నిద్రించినా, తెలియక నిద్రించినా ఆత్మ సూక్ష్మ శరీరంతో బయటకు రావడం అనేది ఖాయం. అలా ప్రయాణించినపుడు కలిగే అనుభవాలే కలలుగా మనకు కొంత గుర్తులో ఉంటాయి. వాటిని మరింత గుర్తుంచుకోవడానికీ, అలాగే మనకు అర్థం పర్థం లేకుండా వచ్చే కలలను ఒక క్రమ బద్ధంగా మన కోరిక ప్రకారం వచ్చేటట్లు మలచుకోవడానికీ మనమీ సాధన చేస్తున్నాము. అలాగే మనకు గురువులైన ఆత్మలు ఆ సూక్ష్మ లోకాలలో ఎదురు చూస్తూ ఉంటాయి. వారే స్వయంగా మనల్ని శిష్యులుగా ఎంచుకుంటారు. మన పుట్టుక తోనే ఆ ఎన్నిక అయిపోతుంది. కానీ ఆ విషయాలు మనకు తెలియవు. వారు అడుగడుగునా ఈ ప్రయాణంలో మనకు తోడ్పడుతూ ఉంటారు. కొన్ని సార్లు మీరు నిద్రలో మీకాలో చెయ్యో అసంకల్పితంగా అంతెత్తున లేపి దబ్బున క్రిందపడేస్తారు. ఉలిక్కి పడి, శరీరం ఎగిరి పడుతుంది. ఈ సాధన చేసే వారికైనా, చేయని వారికైనా ఇది సహజంగా అప్పుడప్పుడూ జరిగే విషయమే. అంటే మీ సూక్ష్మ శరీరం బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఏదో ఇబ్బంది రావడం వలన అలా జరుగుతోంది. మీరు సరిగ్గా వెల్లకిలా పడుకుంటే సరిపోతుంది. అలాగే ఒక్కో సారి మీరు నిద్రలో ఉండగానే మీ చెయ్యో కాలో కదపాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఎంత కదిపినా అవి కదలవు. అలా ఎందుకవుతుందంటే బయట తిరిగే ఆత్మలేవో మిమ్మల్ని అల్లరి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఆత్మలకు అలా చేయడం సరదా. అందుకు మీరు భయపడనవసరం లేదు. అవి అంతకన్నా ఏమీ చేయలేవు. మీకు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ (సూక్ష్మ శరీర ప్రయాణం) లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా మీ సూక్ష్మ శరీరం వెంటనే వచ్చి భౌతిక శరీరంలో చేరిపోతుంది. మీకు వెంటనే మెలకువ వస్తుంది. కనుక భయం అవసరంలేదు. ఎటువంటి భయాలు లేకుండా ఈ ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీ సాధన సక్రమంగా సాగుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు గురువులు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే ఈ ప్రయాణంలో 99.99...% ఏటువంటి ఇబ్బందులూ ఎదురవ్వవు. ఇది సహజమైన ప్రక్రియే. కాకపోతే కాస్త ఎరుకతో చేయలనుకునే ప్రయత్నం. మీకు గల నమ్మకం, ఉత్సాహం ఈ ప్రయాణంలో అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. మీరు మీ వంశీకులను, దేవతలను, మీ ఇష్టులను కలవవచ్చు - స్వర్గం, హిమాలయాలు, పవిత్ర ప్రదేశాలు, ఏడేడు పధ్నాలుగు లోకాలు, బ్రహ్మాండాలు వేటినైనా దర్శించ వచ్చు. ముఖ్యంగా ఎటువంటి వారికైనా చావు అంటే భయం పోతుంది. రోజూ వెళ్లి వచ్చే ప్రయాణమే, కాకపోతే కాస్త దీర్ఘ ప్రయాణం అన్న ధీమాతో ఉంటారు. మన కంటికి కనిపించేది కాక వేరే లోకాలు ఉన్నాయని, అవి ఈ లోకాల కంటే అందమైనవి, సుఖవంతమైనవి, అమిత ఆనందాన్నిచ్చేవి అని తెలియడం వల్ల - నసించేది నేను కాదు, నా శరీరం, ఇది లేక పోయినా నేను మరింత ఆనందంగా ఉండగలను అని అర్థమవ్వడం వల్ల సులభంగా మరణాన్ని సమ్మతించ గలుగుతారు.

నాకు చిన్నప్పటి నుండీ ఓ సందేహం ఉండేది. "యోగము ద్వారా చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోవడం అనేది అందరికీ సాధ్యమేనా? " అని. దానికి చిన్నప్పటి నుండీ యోగ సాధన బాగా చేస్తే అది సాధ్యమే అని తెలుసు. కానీ దానికి ఇంత సులువైన ప్రారంభముంటుందని మాత్రం ఈ పుస్తకం చదివిన తరువాత తెలిసింది. విద్వత్తు ఎవరి వద్దనైనా ఉంటుంది. దానిని నలుగురి మంచి కోసం వినియోగించగల ప్రఙ్ఞ కొందరికి మాత్రమే ఉంటుంది. అటువంటి ప్రఙ్ఞతో రాసిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ చదవవలసినది. శ్రీ శార్వరి గారు నేటికీ మాష్టర్ గా అనేకులకి ఈ యోగ విద్యను నేర్పుతున్నారు. పూజాదికాలు అవసరం లేదని వీరి అభిమతం. మాష్టర్ సి.వి.వి. గారికి మరో అనుయాయులు ఎక్కిరాల క్రిష్ణమాచార్య గారు. వీరు సాంప్రదాయాలను, పూజాదికాలను ప్రోత్సహిస్తూనే తద్వారా యోగ జీవితానికి బాటను చూపారు. ఎవరి మార్గం వారిది అయినా చేరే గమ్యం ఒక్కటే.

నిద్రపోవడం ఎవరికి మాత్రం కష్టం చెప్పండి. అందుకే ఇది సులవైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు. పైగా కలిగే ఫలితం అమేఘం, అద్భుతం. సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా అణిమాది అష్టసిద్ధులు, పరకాయ ప్రవేశం, కంటికి కనిపించని దివ్యలోక సందర్శనం మొదలైన వాటిగురించి తెలుస్తుంది. మనం సాధించవలసినది ఏమిటో ఎఱుకలోకి వస్తుంది. వీటితోనే ఆనందపడిపోయి ఇదే సర్వమనుకుని అక్కడే నిలచే వారూ ఉన్నారు. కలిగిన ఎఱుక ద్వారా మరింత ముందుకు వెళ్లవలసి ఉన్నదని గుర్తెరిగి మరింత సాధన చేసే వారున్నారు. ఇదే పరమావధి కాదు అని స్ఫురణలో ఉంచుకోవాలి మనం. సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలి ఆత్మ స్వయంగా ప్రకాశించ గలగడం మన లక్ష్యం. అది అందరికీ సాధ్యపడదు. సత్యలోక దర్శనం కోసం ఎంతో యోగ సాధన చేయాలి. మనం నిద్రపోయి ఏమీ తెలియని స్థితిలో దర్శించే ఈ లోకాలన్నీ ధ్యానముద్వారా ఎప్పుడనుకుంటే అప్పుడు అంతర్ముఖులమై శరీరాన్ని విడచి ప్రయాణించ గల శక్తిని సముపార్జించడానికి ఈ అనుభవం ఎంతో ప్రేరణనిస్తుంది.

సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు| సర్వేజనాసుఖినో భవంతు| సత్యాస్సంతు యజమానస్యకామాః||

47 కామెంట్‌లు:

  1. బాగున్నది అబ్బాయా..

    ఈ మధ్య మాంఛి హారర్ సీరియల్స్ రావటం లేదు, ఈ స్టోరి బాగా పనికొచ్చేటట్టున్నదే...

    మరీ పెద్దది ఐపోయింది, దిన్నే ౨-౩ భాగాలు చెస్తే, కాస్త ఓపిక, గుండెను రాయి చేసుకోని చదివేటోళ్ళం..

    రిప్లయితొలగించండి
  2. అలానే అనుకున్నాను పిన్నమ్మా... కానీ అలా భాగాలుగా రాస్తే అర్థమవదని ఇలా రాశానంతే..

    రిప్లయితొలగించండి
  3. నాకు అవుట్ ఆఫ్ బాడి యక్స్ పిరియన్స్ ఒక సారి కలిగింది. అప్పుడు దానిని ఎమంటారో ఎందుకు అలాజరిగిందీ తెలియక ఎన్నొ పుస్తకాలు చదివాను. దాని వలన ఎమీ లాభం? అంతకాక పోతె కొంచెం అధ్యాత్మిక విషయాలు లోతుగా అర్థమౌతాయి అంతే. లేక పోతే భగవద్గీత, ఉపనిషత్తులు,రమణ మహర్హి పుస్తకాలు ఎన్ని సార్లు చదివినా తలక్కెకవు. అంతకు మించి ఈ అనుభూతులతో పెద్ద ఉపయొగం లేదు.

    SRI

    రిప్లయితొలగించండి
  4. పిన్నమ్మ,... పిలుపు బాగున్నది, నచ్చినది, మెచ్చితిని..(పిలుపునే సుమా)

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. తార గారు : అబ్బాయ్ అన్నారు కదా.. మీరు నాకంటే పెద్దవారన్న ఉద్దేశంతో అలా రాశాను.

    " ఈ మధ్య మాంఛి హారర్ సీరియల్స్ రావటం లేదు, ఈ స్టోరి బాగా పనికొచ్చేటట్టున్నదే... "

    ఈ టపానుండి మీక్కావలసింది మీరు ఎంచుకున్నారు. పోనీ లేండి అందుకైనా ఇది పనికొస్తోంది అందుకు సంతోషం. :)

    శ్రీ గారు : మీరే చెప్తున్నారు కదా భగవద్గీత, ఉపనిషత్తులు,రమణ మహర్హి పుస్తకాలు అర్థమవ్వడానికి ఉపయోగిస్తుందని. అవి సరిగా అర్థం చేసుకుంటే చాలు మన జీవన నౌకను చేరవలసిన తీరం చేర్చడానికి. ఏమంటారు? :)

    రెండవ అఙ్ఞాత గారు : సరదాగా ఇంకొకరిని కించ పరుస్తూ రాయడానికి ఇది సరిఅయిన స్థలము, టపాను కాదు. అందుకే మీ కామెంటు డిలీటు చేశాను.

    రిప్లయితొలగించండి
  7. విజయ శర్మ,

    అర్ధమయ్యింది, అందుకేగా ఇంకో కామెంట్ పెట్టాను.
    కానీ ఇలాంటి మూఢనమ్మకాలనుంచి బయటకి వస్తేనే మతం మనగలుగుతుంది..

    రిప్లయితొలగించండి
  8. లోకంలో సహజంగా మనం నమ్మని దానిని మూఢనమ్మకం అనడం జరుగుతుంది. మీరు నమ్మరు కనక అలా అన్నారు. మరి నమ్మేవారూ ఉన్నారు. సరే ఆ విషయం తరువాత చూద్దాము.

    ఈ నమ్మకం మనలో మంచిని పెంచేదిగా ఉందా చెడుని పెంచేదిగా ఉందా? దీనిని నమ్మడం, లేదా సాధన చేయడం వలన మనకి జరిగే కీడేమైనా ఉందా? నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే కనక నేను నా నమ్మకాన్ని మూఢనమ్మకం అని నిర్మొహమాటంగా ఒప్పుకుంటాను. ఒక వేళ వెంటనే ఒప్పుకోక పోయినా క్రమ క్రమంగా నాలొ తప్పక మార్పు వస్తుంది. లేదా మీలో అయినా మార్పు వస్తుంది. నేను రాసిన దానిలో నిజం ఉంటే కనుక. :)

    రిప్లయితొలగించండి
  9. తప్పక హాని జరుగుతుంది, కమ్యూనిష్టుల్లగా వితండవాదం చేయటం లేదు కాబట్టి చెప్తున్నాను, మతం అనే దాన్ని పూర్తిగా వేర్లతో సహా పెకిలించవేయమని నేను చెప్పను, కానీ, ఇలాంటి బ్రమలు మాత్రం వద్దనే చెప్పగలను.
    అసలు ఆత్మలు ఉంటాయి అనే దానిమీద శాస్త్రీయ పరిశోధన చెయ్యండి, ఇవి వదిలేసి, అప్పుడు ఇవి నమ్మవచ్చు..
    ఇంక చెడు అంటే, అది వివరంగా చెప్పగలను, కానీ చాలా సమయం కావాలి..

    రిప్లయితొలగించండి
  10. స్వర్గలోకం , అప్సరసలు ఏమో కాని, హైద్రాబాద్ సైనికిపురి నుంచి చార్మినార్, గోల్కొండ, టాంక్బండ్ లను అక్కడికి వెళ్ళకుండా దర్శించుకోగలిగితే ఎంతబాగుంటుందో అనిపిస్తుంది. ట్రాఫిక్, కాలుష్యం అవి సూక్ష్మశరీరాలకు వర్తించవు అనుకుంటా.
    మూఢనమ్మకాలు అంటారు కాని, మన మనసుకు తృప్తికలిగి, ఎదుటివాడికి పెద్దగా ఇబ్బందిలేకపోతే( కొంచెం ఇబ్బందైతే పెద్దగా చింతించాల్సిన పనిలేదనుకుంటా) సర్దుకుంటాడు, మనిషన్నాక ఆమాత్రం మూఢనమ్మకాలు మంచివే అనిపిస్తుంది, మనుషులకే అలాంటి నమ్మకాలుంటాయి, గాడిదలకి , బర్రెలకి వుండవు అనేదానికి ఆధారాలున్నాయని జర్మనీ శాస్త్ర వేత్తలు ఓ సర్వేలో తేల్చారట!
    అలా కళ్ళు మూసుకునో ఓ బాగా భోంచేసి కానుగ చెట్టు కింద ఓ కునుకేసో అప్సరసలను , కానీ ఖర్చులేకుండా స్వర్గం చూసిరావడం ఎవరికి మాత్రం చేదుగావుంటుంది, తింగర హేతువాదువులకు తప్ప? :) వీళ్ళకు అర్థమయ్యేలోపు పుణ్యకాలం దాటి బకెట్ తన్నేస్తారు, అక్కడ నరకంలో రియాలిటే షో మాతరం తప్పదు.:D
    కొత్త విషయాలు చెప్పారు, ఆసక్తిగా వున్నాయి. మనం అనుకోకున్నా కొన్ని కలలు వస్తాయండోయ్!

    రిప్లయితొలగించండి
  11. శర్మగారు

    మంచి విషయం వ్రాసారు. ఇలాంటి అనుభవాలు నాకు ఎదురయ్యాయి. కాని వాటినెప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. మీరన్నట్టుగా ఎరుకలో ఉండి చేస్తే జ్ఞాపకం ఉంటాయి. కాని ఉద్యోగాల గోలలో కుదరటలేదు. ఆ పరావిద్య పుస్తకం వివరాలు, వెల చెబుతారా.

    శ్రీవాసుకి

    రిప్లయితొలగించండి
  12. బాబూ!

    మీ టపాల్లో ఫోటోలూ అవీ బాగానే వున్నాయి.

    ఈ "మాస్టర్స్" గొడవెందుకు గానీ, (యోగాలో కుండలినీ శక్తిని నిద్రలేపి, సహస్రారం దాకా తీసుకెళ్లిన అనుభవం తో చెపుతున్నా) మీరు చదివే సంస్కృత మంత్రాలని (ఓం భూర్ భువహ్ స్సువహ్ నించీ, మహా సంకల్పం లాంటివి) అందరికీ అర్థమయ్యేలా తెలుగులో వ్రాయండి చాలు!

    తెలుగు దేశానికి (పార్టీకి కాదండోయ్) సేవ చేసినట్టే!

    రిప్లయితొలగించండి
  13. క్షమించాలి. మీ ఆర్టికల్ మూడువంతులు మట్టుకే చదివాను.ఇంక చదవబుద్ది కాలేదు.కాని ఇక్కడ రాయాలనిపించింది. Sir S.Radhakrishnan వారి RECOVERY OF FAITH అనే పుస్తకంలో వ్రాసినది గుర్తుకొచ్చింది. "The great danger with the mass is not the right thought or wrong thought but the utter absence of thought. ...The collective wisdom of the masses is a misnomer for surrender to emotionalism" ఈ కాలంలో మత ప్రబోధకులు ఈ ఎమోషనాలిజం ను రెచ్చగొడుతు న్నారేమోనని అనిపిస్తూంటుంది నాకు. మూఢ నమ్మకాలను ప్రచారం చేసేదిగా కాకుండా మతం లోని మంచిని చెప్పండి.అది చాలానే ఉందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  14. తార గారు :

    " శాస్త్రీయ పరిశోధన చెయ్యండి "

    మీరు చెప్పే శాస్త్రీయతకు ఏది గీటు రాయి? నేను ఎవరిని ఒప్పించ వలసి ఉంటుంది? ఎవరు ఒప్పుకుంటే అది శాస్త్రమవుతుంది? నాకు నిజంగా తెలియకనే అడుగుతున్నాను. మన ప్రాచీన శాస్త్రాలను నేడు శాస్త్రాలు గా అంగీకరించే వారెందరు. ఒకప్పుడు మన పూర్వీకులందరూ వాటిని అంగీకరించినవారే కదా!? కానీ నేడు అవి శాస్త్రాలు కాదాయె.

    ఒకప్పుడు మంత్రోపాసనతో ఏది కావాలంటే అది ప్రత్యక్షమయ్యేవట. మరి నేడు మనకది అసాధ్యం. నేడు బ్రాహ్మలు గ్రహ జపాలవంటివి చేసి కొన్ని కోరికలు సిధ్ధించేటట్లు చెయగలుగుతున్నారు. ఇంకా పెద్ద ఉదాహరణలు ఇవ్వ వచ్చు. కానీ అవి ఎవరూ నమ్మరు. వీటికైతే నేనే ప్రత్యక్ష సాక్షి. నేను చేసిన గ్రహజపాలు చాలా మంచి ఫలితాలనిచ్చాయి. ఆ ఫలితాలే నన్ను ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షించాయి. నేడు ఇది కొందరు నమ్ముతారు. కొంతకాలం పోతే ఇదికూడా ఎవరూ నమ్మరు. ఎందుకంటే అంటువంటి సాధకులు ఉండరు కనుక.

    అలాగే ఇప్పటి దాక మనం సత్యం అని నమ్మినదానిని రేపు మరొకరు ఖండిచవచ్చు.

    ఆత్మ పరమాత్మలగురించి మన భారతీయ విద్యలన్నీ ఎంతో లోతుగా చర్చించాయి. అవి నమ్మలేకపోతే మరి నేనేమీ చెప్పలేను.

    రిప్లయితొలగించండి
  15. snkr గారు : " మనం అనుకోకున్నా కొన్ని కలలు వస్తాయండోయ్! "
    అవును చాలా సార్లు నాకు అలాంటి కలలు వచ్చాయి. అసలు నిజ జీవితానికి సంబంధం లేనట్టుగా అనిపించినా, అవి మనకు కొన్ని సూచనలిస్తాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

    శ్రీ వాసుకి గారు: ఆ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలోనూ దొరకవచ్చు. MASTER YOGA ASHRAM వారి ప్రచురణ ఇది. వెల 60 రూ||లు .

    క్రిష్ణ శ్రీ గారు : నాకు అన్నిటి అర్థాలు తెలియవండీ. నాకు తెలిసిన వాటి గురించి తప్పక రాస్తాను. ఇదేదో సేవ అనే భావన కాదు కానీండి నాకు కావాలనుకున్నవన్నీ ఇక్కడ బ్లాగులో రాస్తాను.

    రిప్లయితొలగించండి
  16. సుబ్రహ్మణ్యం గారికి : మీరు పూర్తిగా చదివి వ్యాఖ్యరాస్తే మరింత సంతోషించే వాడిని.

    నేను ఇక్కడే ఈ నిద్ర ద్వారా చేసే సాధనే గొప్పదని చెప్పడం లేదు. ఇది ప్రారంభకులకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి శక్తివంతంగా ఉపయోగపడుతుంది అని చెప్పాను. దీని ద్వారా యోగ మార్గంలోకి వెళ్లాలన్న ఆసక్తి కలుగుతుంది. ఆత్మ గురించిన అవగాహన కలుగుతుంది. అది నేను గట్టిగా నమ్ముతున్నాను.

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. >>నేను ఎవరిని ఒప్పించ వలసి ఉంటుంది? ఎవరు ఒప్పుకుంటే అది శాస్త్రమవుతుంది?

    ఎవరూ ఒప్పుకోనవసరం లేదు, ఎవరినీ ఒప్పించనవసరం లేదు.

    >>ఏది గీటు రాయి?
    ఇది కాస్త పెద్దది,
    ఎవో కొన్ని (Axioms) మీద డెవలప్ చేసుకుంటావు, అవి అన్నీ నిజాలే అనుకుంటాము, ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాగా, అది నిజమే తప్పు అవ్వదు అని మనం అనుకోవటమే.
    తరువాత, ఆ Axioms మీద నువ్వు థీరీ కట్టుకుంటావు, ఆ థీరీ ఏ మొదట అనుకున్న సత్యాలకి విరుద్దంగా ఉండకూడదు, ఉంటే ఆ థీరీ మొత్తం తప్పే, మళ్ళీ మొదటి నుంచీ రావాల్సిందే. ఇలా ఒక్కో మేట్టు కూర్చి కట్టుకోవాలి, అది ఎప్పటికీ ఏ ఒక్క Axiom కీ విరుద్దంగా ఉండకూడదు, ఉంటే మొత్తం సున్నాకే.

    మళ్ళీ ఇప్పుడు మిగతా రంగాలకి విరుద్దంగా ఉండకూడదు, అవి అన్నీ ఇప్పటికే తప్పులు ఎంచలేని విధంగా ఉన్నాయి కదా. (పోనీ నీకు వచ్చిన/ కనిపేట్టిన విరుద్దం నిజం ఐతే, మిగతావి ఎలా తప్పో నువ్వు నిరూపించగలగాలి, వారి Axioms ఉపయోగించే, లేదా అసలు వారి Axioms తప్పు అని నిరూపించగలగాలి.

    ఇప్పుడు జ్యోతిష్యం తీసుకుందాం, ఒక గ్రహం ఒకరిపై ఒక విధంగా పని చేస్తుంది, ఇంకో విధంగా ఇంకొకరి మీద పని చేస్తుంది అని చెప్పుకుంటాం, అది మరి వైధ్య శాస్త్రం ఒప్పుకోదు, కొన్ని మందులు కొందరికే ఎలర్జీ తెప్పిస్తాయి, అందరికీ రావుగా ఇదీ అలానే అంటే కుదరదు, మందులు మనం మింగుతాం కదా, మరి గ్రహాలని మింగుతామా?

    >>చేసిన గ్రహజపాలు చాలా మంచి ఫలితాలనిచ్చాయి.

    నువ్వు చేసిన జపాలే ఇచ్చాయి అనే దానికి సపోర్ట్ కావాలి, వారి వారి కృషి ఎమో, ఇతర కారణాలు ఏవీ లేవు అని చూపించాలి కధా.

    >>ఒకప్పుడు మంత్రోపాసనతో ఏది కావాలంటే అది ప్రత్యక్షమయ్యేవట.
    మరి ఇప్పుడు ఎందుకు అవటంలేదు, అప్పటిది నిజం అనుకుంటే?
    భక్తి తగ్గిపోయిందా? ఎలా చెప్తావు? దానికి కొలమానం, అది చెప్పే ముందు భక్తిని కొలిచే పద్దతిని కనుగొనాలి..

    ఇంత చెస్తేనే మరి ఇంత సైన్సు వచ్చింది, అదీ సరైన దిశలో ఉంటేనే సుమా..(సరైన దిశ ఎలా వస్తుంది, ఇది తప్పు అని ఎవరైన అనగానే వాడ్ని తన్ని తరిమేయకుండా అది తప్పు కాదు అని నిరూపించగలగాలి , వాదనతో కాదు సుమా, లేకపొతే మనలోనే తప్పు వున్నదెమో నిరూపించగగాలి, అది తప్పు కాదు అని నిరూపించలేకపొతే మనది ఒప్పు ఐపొదు, మనం దానిలో ఒప్పు ఉన్నది అని నిరూపించాలి సుమా).

    ఇది అంతా భ్రమ, బ్రాంతి, నీ బుఱ్ఱ భూస్వామ్య నీతితీ నిండిపోయింది అని తిట్టమాకే, చానా కష్టపడి అడిగావు అని టైప్ చేసినా

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగుందండీ.. మీ వివరణ.

    "ఎవరూ ఎవరికీ నేర్పేస్థితిలో లేరు. ఎవరూ నేర్చుకునే స్థితిలోనూ లేరు. కేవలం ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం ప్రస్థావన చేస్తాం. దానిమీద కొంత చర్చ జరుగుతుంది. అదంతా చదివి కొందరు కొన్ని అభిప్రాయాలకు రావచ్చు. అదికూడా కొంత వరకే. ఈ చర్చలు ఎవరినీ మార్చలేవు. కానీ కొంత ఆలోచించుకోవడానికి ఉపయోగిస్తాయి. " అని భావిస్తాను నేను.

    కనుక ఇది ఈ టపాతోనో లేక ఒక్కసారిగానో తేలే విషయం కాదు. క్రమంగా జరిగే ప్రక్రియ. నెను మీ వ్యాఖ్యకు సమాధాన మివ్వ ప్రయత్నిస్తే అది ఓ వ్యాసమై కూర్చుంది. దానిని మరికొంత విస్తృత పరచి తరువాతి టపాలో ప్రచురిస్తాను.

    మిరెవరో తెలియకుండా, మీతో పరిచయమే లేకుండా నువ్వు అని ఏకవచన ప్రయోగం చేసేంత స్కంస్కారమింకా అబ్బలేదు.

    మీ ప్రొఫైల్ చూశాను. ఎక్కడో మిమ్మల్ని పురుషులుగా సంబోధించడం నాకు గుర్తు. అందుకే ఎవరా అని చూశాను. అప్పుడే మీ మెయిల్ ID మార్చేశారే.. :)

    రిప్లయితొలగించండి
  19. >>మిరెవరో తెలియకుండా, మీతో పరిచయమే లేకుండా నువ్వు అని ఏకవచన ప్రయోగం చేసేంత స్కంస్కారమింకా అబ్బలేదు.

    హహ్హహ, కానీ నన్ను పిన్నమా అని పిలిచాక, మీరు అని సంభోదించలేకపోతున్నాను..

    >>ఎవరూ ఎవరికీ నేర్పేస్థితిలో లేరు.
    ఎందుకులేరు, అసలు దీనికి ఎవరో ఆద్యులు ఎందుకవ్వాలి? దేవుడు వున్నడో లేడో, కానీ మీ భక్తి వున్నదిగా, మీ నమ్మకం నిజమేగా.. మరి దాని గురించి లోతైన పరిశోధన, ఏ మార్గం మానవులకి మంచిదో అది కొన్న నమ్మకాల మీద కాకుండా గట్టి పునాధుల మీద ఎందుకు నిలపకూడదు?

    >>దానిని మరికొంత విస్తృత పరచి తరువాతి టపాలో ప్రచురిస్తాను.

    అవును, మంచి ప్రయత్నమే, కానీ విన్నవి అన్నీ నిజాలు అని కాకుండా, సరిగ్గా నిజంగా చూసి, ఆ గొప్పతం అందరికీ పంచమని నా మనవి.

    >>చర్చలు ఎవరినీ మార్చలేవు.

    నేను మారతాను..మరి..

    రిప్లయితొలగించండి
  20. >>ఎక్కడో మిమ్మల్ని పురుషులుగా సంబోధించడం నాకు గుర్తు.

    చాలా మంది స్త్రీగా సంభోధిస్తారు కుడా,

    >>అప్పుడే మీ మెయిల్ ID మార్చేశారే.. :)

    పేరు అమ్మాయిది అంతమాత్రాన అమ్మాయిని ఐపొతానా, మెయిల్ ID అబ్బాయిది అబ్బాయిలే పెట్టుకుంటారా??

    నేను ఏమి రాసానో అది ముఖ్యం మిగతావి కాదు అని నేను వాటికి వివరణ ఇవ్వను..

    రిప్లయితొలగించండి
  21. శర్మగారు,
    నా చిన్ననాటి కల మీతో పంచుకోవాలని అనిపించింది. నాకు 15ఏళ్ళు వచ్చేవరకూ ఒకే కల, నాకు తీవ్రంగా జ్వరం వచ్చినపుడు మాత్రమే తప్పకుండా వచ్చేది. నాకింకా గుర్తుంది. అదేమంటే నేను వెళుతూ వుంటే అకస్మాత్తుగా ఓ పేద్ద కొండ రాయి దొర్లుతూ నన్ను తరుముకొస్తున్నట్టు, కాసేపయ్యాక ఆగిపోయేది. గట్టిగా అరుస్తూ లేచిపోయేవాడిని. మళ్ళీ అదే రిపీట్ అయ్యేది.
    ఆ తరువాత ఎంతలా కోరుకున్నా రావడం లేదు. ఎందుకొచ్చేదో , ఎలా ఆగిపోయేదో నాకో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. దాదాపుగా మర్చిపోయిన విషయం మీ టపా చూసిన మరుసటిరోజు అలా గుర్తుకొచ్చింది. :)

    రిప్లయితొలగించండి
  22. snkr గారికి : తీవ్రంగా జ్వరం వచ్చినప్పుడు తెలియని మగతలో ఉంటాము. శరీరం భరించలేని, ఇదని చెప్పలేని వ్యధకు గురి అవుతుంది. ఆ ప్రభావం మనసుమీద కూడా పడుతుంది. మనసుకు కలిగిన భయమే ఆ కొండరాయి.

    ఇలాంటి కలలు మనల్ని తరుముకు వచ్చే/ మనం ఎదుర్కుంటున్న కష్టాలకు సంకేతం. ప్రధానంగా మన మనసు ఉత్సాహంగా లేదని సంకేతం. ఇవి మళ్లీ మళ్లీ రావాలనుకో నవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  23. తార గారికి : మీరు ఎవరన్నది నాకు అనవసరం. కానీ నిజాయితీ ఎంత అన్నది అవసరం. అందుకే అనవసరమనిపించే పై ప్రశ్నలు. నర్మ గర్భంగా నైనా ఒప్పుకున్నారు. కొంత నిజాయితీ ఉంది. ఫర్వాలేదు. ఇక మీరెవరైనా తార అనే పేరు తో పరిచయమ్ అవ్వాలనుకున్నారు కనుక అలాగే కొనసాగిద్దాం. :)

    భగవంతుడు,ఆత్మ మొదలైన విషయాలు కంటికి కనపడనివి. మనసుకు తెలుసుకొవచ్చు. మీరుకనక అందుకు సిద్ధమైతే కొన్ని ప్రశ్నలు.

    నిద్రించిన తరువాత ఏమవుతుంది? నిద్ర ఎలా వస్తోంది? నిద్ర తరువాత ఏమవుతోంది? నిద్రించినప్పుడు వచ్చే కలలు ఏమిటి? వీటికి గల కారణ మేమిటి? నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? ఒక్కో సారి ధ్యానం చేద్దామని కూర్చున్నవారు వారికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు? అది ఎందుకు జరుగుతోంది? మనం నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్ర రాదు, వద్దనుకున్నప్పుడు వస్తుంది. నిద్ర తరువాత జీవితం ఏమిటి? మరణం తరువాత ఏమిటి? ఏది లేకపోతే మరణం అంటున్నారు? మరణించిన వారి శరీరాలలో ఏది లేదో, అది నిద్రించిన వారి శరీరంలో ఉందా? అసలు నిద్రకు, మరణానికీ తేడా ఏమిటి?

    ఇలాంటి ప్రశ్నలకు ఎవరో ఎప్పుడో చెప్పిన సమాధానాలు, కని పెట్టిన జవాబులు కాకుండా మీకు మీరుగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. నిద్ర పోతున్న సమయంలో మీ లోపలికి ఓ లుక్కేసి ఉంచండి. ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నించండి. ఇది ఒక్కరోజుతో తేలి పోయే విషయం కాదు. నిదానంగానే చెప్పండి.

    అవును మీరన్న చెడు ఏమిటో కూడా కొంత వివరించే ప్రయత్నం చేయండి. మీరు చెప్పడానికి చాలా ఉంది అని ఊరుకుంటే మరి మాకు లాంటి వారు ఎలా తెలుసుకుంటారు? కొద్దిగా దానికి సమయం కేటాయిస్తారు కదూ..

    ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి
  24. >>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

    ఇదేమి ప్రశ్న, పనిచెయ్యకపొతే అది చావు అవుతుంది..

    >>ఒక్కో సారి ధ్యానం చేద్దామని కూర్చున్నవారు వారికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు? అది ఎందుకు జరుగుతోంది?

    నిద్రొచ్చి.. ఊరికే అన్నాను.
    ధ్యానం గురించి నాకు తెల్వద్, మరదే నేను చెప్పేది, ఆత్మ, దేవుడు అని కాకుండా అసలేమి జరుగుతుందో ధ్యానంలో అని తెలుసుకొనమని..
    మొన్నటి వరకూ ధ్యానం ఒట్టి ఫేక్ అనుకునేవారు (పరదేశ శాస్త్రజ్ఞులు, ఇప్పుడు కానీ దాని గొప్పతనం తెలిసింది).

    చెడుఆ, తప్పు దిశలో వెళ్తే ఏమవుతుంది? సరే కుదిరినప్పుడు ఒక టపా వేస్తాను..

    నేను తెలుసుకొని చెప్పాలా, నాయనా నేను నిద్ర మీద పరిశోధన ఎమైనా చేస్తున్నానా? చేసేవాళ్ళు చెప్తే తెలిసుకుంటున్నాను...

    రిప్లయితొలగించండి
  25. నిద్ర అనే ప్రక్రియ అయిదు భాగాలు గా జరుగుతుంది. నిద్ర లో ఈ భాగాలు వరుసగా వచ్చి పోతూ ఉంటాయి. దీనిలో చివరి భాగం REM Sleep (Rapid Eye Movement). నిద్ర లో ఈ భాగం ప్రతీ 90 నిమిషాలకూ జరుగుతుంది. గుండె శ్వాసా పని చేస్తాయి కానీ శరీరము బిగుసుకు (paralyzed)పోయి ఉంటుంది. ఈ స్థితిలో నే కలలు వస్తాయి.
    నేను నిద్ర గురించి విపులంగా వ్రాద్దమను కుంటున్నాను కాబట్టి ఇంతకన్నా చెప్పటల్లేదు.

    రిప్లయితొలగించండి
  26. తారగారికి :

    >>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

    ఇదేమి ప్రశ్న, పనిచెయ్యకపొతే అది చావు అవుతుంది..

    ఇదేమిటండీ మీరుకూడా న్యూస్ ఛానల్ వాళ్లాలాగ మీకు కావలసినది ఎడిట్ చేసి తీసుకుంటున్నారు. ఆ తరువాత ప్రశ్నకూడా దీనికి సంబంధించినదే కదా?

    "నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? "
    అది తెలిస్తే ఏమైనా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను.

    రావు గారికి : మీటపా కోసం ఎదురు చూస్తుంటాను. వీలైతే ఇక్కడో కామెంటు పడేయండి టపా రాసినతరువాత. నలుగురికీ పనికొస్తుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. నమస్కారమండి విజయ్ శర్మ గారు..కలల అంతరార్ధాల కోసం ఏమైన పుస్తకాలు దొరుకుతాయేమోనని చూస్తున్నాను. నాకు ఈ మధ్య తరచుగా పాము కాటు వేసినట్లు కలలు వస్తున్నాయి. అంతలోనే ఎవరో మహనీయుడు కాపాడినట్లు ..ఆ కల అంతారార్ధమేమిటో తెలుసుకుందామని ..అసలు ఇలాంటి కలలు ఎందుకు వస్తాయో .. అనుకుంటూ ఉండగా మీ ఈ టపా చూడటం తటస్థించింది.

    రావు గారు ..నిద్ర , కలల పై మీరు వ్రాయబోయే టపా కోసం ఎదురు చూస్తాను.

    రిప్లయితొలగించండి
  28. >>నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా?

    చెప్దామనే అనుకున్నాను, కానీ కిందో కండిషన్ కనపడి ఆగిపోయాను, అవి అన్నీ అనుభవించే చెప్పాలి అని. చూసి..(మీకు మీరుగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి).. నావళ్ళ కాని పని అది అందుకే సమాధానం దాటవేశాను..

    అది తెలియక అడిగినట్టుకన్నా నాకు ఎదో తెలియజెయ్యాలి అనే ప్రయత్నం కనిపించింది, కాబట్టి నేను వేరే వాళ్ళు చెప్పింది చెప్పే ప్రయత్నం చెస్తే అది నెరవేరదని, నాకు అంత ఇష్టం కుడా లేదు తెలుసుకోవాలి అని (నేను సాధన చేసి).

    రిప్లయితొలగించండి
  29. రాజశేఖరుని విజయ్ శర్మ గారూ ఇదిగో మీరడిగినవి.
    నిద్ర పోవటం లో 5 భాగాలు ఉండునని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అవి ఒకటి తరువాత ఒకటి వచ్చి నిద్ర మొత్తము లో తిరుగుతూ ఉంటాయి.

    1. మత్తు (Drowsiness)
    బయట ప్రపంచం తోటి విడిపోవటానికి ప్రయత్నం. కండరాలు relax అవుతాయి.ఉలికిపడి లేస్తూ ఉంటారు.

    2. తేలిక నిద్ర (Light Sleep)
    మన దేహం temperature తగ్గుతుంది. గుండె కొట్టు కోవటం నెమ్మది అవుతుంది. బయటి ప్రపంచం తోటి తెంపు కోటానికి ప్రయత్నం.

    3. నిద్ర (Deep Sleep)
    విశ్రాంతి నిద్ర. డెల్టా స్లీప్ అంటారు బ్రెయిన్ తరంగాలు నెమ్మదిగా వస్తూ ఉంటాయి.

    4. గాఢ నిద్ర (Deepest Sleep)
    కష్టబడి పని చేసిన తరువాత మనకు కావలసినది ఇది. మనము మేలుకున్నప్పుడు జరిగిన విషయాలన్నీ పునరాలోచించి మనస్సు లో దాచిపెట్టుకునే సమయమని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. ఈ సమయములో లేస్తే కొద్దిగా తూలవచ్చు.

    5. Rapid Eye Movement స్లీప్ (REM Sleep)
    ప్రతీ 90 నిమిషాలకీ నిద్రలో ఈ పరిస్థితి ఉంటుంది. బ్లడ్ ప్రెజరు పెరుగుతుంది, శ్వాస ఎక్కువ తక్కువలుగా పీల్చటం జరుగు తుంది. మనస్సు చాలా ఆక్టివ్ గ ఉంటుంది. మన పరిస్థితి మెలుకువగా ఉన్నట్లు ఉంటుంది కానీ కండరాలు (గుండె,శ్వాస వి తప్ప) పెరలిజేడ్ (peralyzed)గ ఉంటాయి. మానను కలల ప్రపంచము లో మునిగి తేలేది ఇక్కడే. మనకు వచ్చే కలలు అవి నిజంగా జరుగుతున్నట్లే ఉంటాయి.

    రిప్లయితొలగించండి
  30. "నిద్ర పోయిన తరువాత కూడా మన శరీరం పని చేస్తుందా? అయితే ఏమేమి పనిచేస్తున్నాయి? "
    __________________________________________________

    గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఉదరం/ప్రేగులు, బహుశ: చిన్న మెదడు గానీ మెడుల్లా గానీ

    రిప్లయితొలగించండి
  31. sharmagaaru,

    ee "paraavidya" pustakam dvaaraa kalala visleshana pondavachchaa? naaku konni kalalu chaalaa vichitramgaa vastoo untaayi. assalu ardham kaani vidhamgaa... alaanti vaati ardhaalu telusukodaaniki upayogapade pustakaalu emainaa untaayaa..

    రిప్లయితొలగించండి
  32. శర్మ గారికి ,
    తారగారి సంభాషణ ఆధారంగా వ్రాస్తున్నా, యత్భావం తత్ భవతి అన్న ఆర్యోక్తి ని మనం పాటించాలి.
    విమర్శించే ప్రతీవారి లక్షనములనే వారు చూపించారు తప్ప విమర్శకి తను ఇవ్వగలిగిన ఆధారాలను ఇవ్వటానికి తెలివిగా తప్పుకున్నారు, దానిపైన మీరు ఎంతవివరణ ఇచ్చినా అది నిరర్ధకం.

    రిప్లయితొలగించండి
  33. స్వర్ణ మల్లిక గారికి : పరావిద్య పుస్తకం చదవడం ద్వారా కలలకు సంబంధించిన కొన్ని సందేహాలు తప్పకుండా తీరుతాయి. అయితే కలల విశ్లేషణకు ‘స్వప్న శాస్త్రము’ వంటి మన పుస్తకాలతో పాటు కొన్ని సైంటిఫిక్ పుస్తకాలు చదివితే మరింత అవగాహన కలగ వచ్చు.

    వాజసనేయ గారికి : నేను ఇక్కడ కేవలం తార గారి ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తున్నాను అని అనుకోనవసరం లేదు. అవి వారికి ఉపయోగ పడక పోయినా, ఆసక్తి ఉన్న మరికొందరికి ఉపయోగపడ వచ్చు కదా.. అందుకే నాకు తెలిసిన/తోచిన సమాధానాలు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది అనుకుంటాను ప్రతీసారీ. అలాగే మరికొందరి వ్యాఖ్యలు నాకూ పనికి వస్తాయి. ధన్యవాదాలు .

    రావు గారూ మీ వ్యాఖ్య నాకు చాలా ఉపయోగ పడింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. Hi,
    Visit my Blog : http://gsystime.blogspot.com/

    This is having spiritual and general society information.
    The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
    I written from 2009 December onwards.
    I wtitten in Telugu and English languages (In English few things are wrote).
    Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
    the title as symbol of '*').
    Main Topics are : (Read in order to better understand)
    Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
    Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
    Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
    Eng - (Jan, 2010) ' * How Brain Works'
    Eng - (Jan, 2010) ' * Where Dream World?'
    Eng - (Jan, 2010) ' * Why the Food?'
    Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
    Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
    Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
    Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
    Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
    Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
    Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
    Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
    Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
    Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
    Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
    Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
    chendavaa shwaasa neelone kadaa!" '
    Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
    "Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
    These two caption's so many written along with these.
    * * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
    letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
    lines : for Record).

    As soon as possible please give reply to my mail, about my Blog.

    Regards,
    Nagaraju G

    రిప్లయితొలగించండి
  35. ఈ పోస్టు చాలా బాగున్నది. విమర్శలు ఎంత ఘాటుగా ఉంటే మన పోస్ట్ అంత బాగా వారికి నచ్చిందన్న మాట. any way keep it up.

    రిప్లయితొలగించండి
  36. naayanaa! raasina vishayam atu unchite..... meeru cheppadalachukunna aatma padaarthannni gurnchi cheppi raasi unTe baaagunDemo ....mee post valana aatmala satvaanni(astitvaanni) gurinchi cheppadalachukunnara lede vere emaina cheppadalachukunnnaro teliya jeyagalaru......aatmala satvaanni(astitvaanni) gurinchi cheppadalachukunTe ila chepakuuDademoo..... vaarevarooo komment chesinattu horror serial lagane undi......... logic avasaram.....

    రిప్లయితొలగించండి
  37. To All who are interested in the analysis of the Dreams.When the Sigmund Freud (Father of Psychology) himself came forward for the first time to analyse the soul and explain in the terms of ID,EGO,SUPER EGO, then why can't you people get to know his WORLD FAMOUS FIRST PUBLISHED 'THE INTERPRETATION OF DREAMS' or in Telugu Annapareddy Venkateshwara rao's Translation of Frued's Book 'SWAPNA SANDESAM'. ebook link http://www.e-text.org/text/Freud%20-%20The%20Interpretation%20of%20Dreams.pdf

    రిప్లయితొలగించండి
  38. గ్రహ శాంతులగురించి మహబాగా చెప్పారు నేను కూడా బాగా చేస్తాను

    రిప్లయితొలగించండి
  39. ధన్యవాదములు, వీలైతే ఆ టపా లోనే కామెంట్ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  40. తారాశర్మల సంవాదము చాలా బాగుంది. శర్మ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది కలల గురించి.
    మీ
    భాస్కరానంద నాధ

    రిప్లయితొలగించండి
  41. mee post chaala bavundhi..naaku kalalu vastoo vuntaayi andulo chaala matuku guide chesevi, konni future gurinchi cheppevi inkonni raka rakala anubhavalni panchutaayi..paschima desallo eckankar(eckankar.org) anae samstha..ee yoga vidya ni chaala pracharam loki testunnayi..meeru mee anubhavalni marinni tapallo rayalani aasistoo..

    yderbhi

    రిప్లయితొలగించండి
  42. కలల మీద కొంత పరిశోధన చేసి , అనేక పుస్తకాలు చదివి , కలల విశ్లేషణ మీద ఒక చిన్న పుస్తకము రాశాను . ఇక్కడ డౌన్ లోడ్ చేశుకోవచ్చు .

    http://www.mediafire.com/view/?ecwkwa8ieaa891n

    రిప్లయితొలగించండి
  43. నమస్కారం!
    మీ కలల గురించిన ఆర్టికల్ చూసాక ఇది రాయాలనిపించింది.
    మీకు తెలిస్తే సమాధానం ఇవ్వగలరు.
    1 ఒకే కల ఒకే విధంగా వుహ తెలిసినప్పటి నుంచి వస్తోంది.
    ఎత్తైన కొండ చుట్టూ కొండలు
    కొండ ఎక్కుతుంటే ధనమని కింద పడిపోయినట్లు ...
    నేను ఎంత పైకి ఎక్కుదామని ప్రయత్నించిన ఎక్కలేక పోవటం
    కింద పడినప్పుడు బాడీ మొత్తం బాగా షేక్ అయి ఉలికి పడి నిద్ర లేస్తాను.
    ఎందుకొస్తుందో ఏమో...
    2 కొన్ని కలలు ఒకే ప్లేస్, ఒకే మనుషులు, ఒకే సంఘటన రేపెఅట్ అవుతుంటాయి.
    3 మరి కొన్ని ఇది ఇదివరకే జరిగింది కదా అనుకుని జరగబోయిది కూడా తెలుస్తున్నట్లు వుంటుంది.
    చెప్పే daialogues కూడా విన్నట్లే వుంటుంది...
    ఈ కళల ఉద్దేసమేమిటో ...

    రిప్లయితొలగించండి
  44. I ԁon't even understand how I stopped up here, however I believed this publish used to be good. I don't rеcognise ωho
    yοu are but certаіnly you are going to
    a famous bloggeг in thе eѵent yοu arе
    nоt alгeady. Chеers!
    My site > Is dreams

    రిప్లయితొలగించండి
  45. ఈ పోస్టు చాలా బాగున్నది

    Dhyanamradio's online>>>>>>>Telugu, Hindi, Kannada, Tamil
    http://dhyanamradio.blogspot.com/

    రిప్లయితొలగించండి
  46. chala baga chepparu hindu sampradyam gurinhi ardhamavani varu danini mudha nammakamani kotti parestaru ika pi aadhyatmika books gurinchi kuda teleya cheyandi. naaku eppudu pallu udi poyinattu kala vastundi oka sari ayite mottam pallu udi poyinatlu vachindi deeni ardham vivarinchagalara

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.