10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

దీక్షలు స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.

 దీక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత భవానీ దీక్ష కూడా చాలా మందికి పరిచయం. ప్రతీ ఒక్క భక్తుడూ ఏదో ఒకసందర్భంలో దీక్ష తీసుకోవాలని అనుకుంటాడు. దీక్షలు చాలా మంది పడుతూ ఉంటారు. కానీ దీక్షా ఫలాన్ని ఏకొందరో మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఎందువల్ల?

నెలరోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మానేయగలరా? ఈ నెల రోజులూ జీతం ఇవ్వం, ఉచితంగా మీ సేవలు అందించండి అంటే ఎంత బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది మన జీవన ఉపాధి కనుక. మనమీద కుటుంబ బాధ్యతలు ఉంటాయి కనుక. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అందుకే కంపెనీ ఎంత లాసులో ఉన్నా కనీసం సగం జీతమైనా పొందే వరకూ పోరాడతాం. అలాగే ఈ దీక్షను రోజుల తరబడి చేస్తాము. మరి ఫలితం పొందకుండా ఎలా? పొందితీరాలి. అటువంటి దీక్ష ఎలా స్వీకరించాలి? ఏమి నియమాలు పాఠించాలి? అసలు ఏదీక్ష ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది?

మీరు అయ్యప్ప దీక్ష విని ఉంటారు. దుర్గా దీక్ష విని ఉంటారు. శివ దీక్ష విని ఉంటారు. హనుమత్ దీక్షలు తెలుసు. బ్రహ్మచర్య దీక్ష గురించి కొందరు విని ఉంటారు. విద్యా దీక్ష ఎప్పుడైనా విన్నారా? ఉద్యోగ దీక్ష తెలుసా? మరి మౌన దీక్ష? ఇలా అనేక రకాల దీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు తెలిసి, కావాలనుకుని స్వీకరిస్తాం. మరికొన్ని ఇది దీక్ష అని తెలియకుండానే స్వీకరిస్తాం.

ఉదాహరణకు : బ్రహ్మచర్య దీక్ష. ఉపనయనము అయినప్పటి [ పిల్లవాడిని స్కూలులో చేర్చిన దగ్గర ]నుండీ, స్నాతక మహోత్సవం [ డిగ్రీనో, పీజీనో పూర్తి చేసి పట్టా పుచ్చుకునే ] వరకూ మనం బ్రహ్మచర్య దీక్ష అంటాము. ఇది తెలిసినా తెలియక పోయినా మనం దీక్షను పాటిస్తున్నట్టే.

అలాగే మనం ఒక్కో సారి ఓ నెలరోజులలో ఈ ఇంగ్లీషు గ్రామరు పై పట్టు సాధించాలి అని అనుకుని గంటల తరబడి సాధన చేసి ఇంగ్లీషుపై పట్టు సాధిస్తాం. అది కూడా దీక్షే! విద్యా దీక్ష అనవచ్చు.

ఇక ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేవి దైవ దీక్షలు. ఏదో ఒక దైవం మీద నమ్మకంతో ౪౦ రోజులు దీక్షపూని, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. వీటివలన ఆధ్యాత్మిక ఉన్నతి తద్వారా విద్యా ఉద్యోగ ఉన్నతులు కూడా కలగుతాయి. ఇంకా అనేక కోరికలు తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు.

అటువంటి ఉన్నతి మనకు కలగాలంటే ఎలా?

 మనం ఎంతో ఎదిగాము అనుకుంటాం. చాలా నాగరికులం అనుకుంటాము. కానీ ఒక్కోసారి సంతలో గొర్రెలలా ప్రవర్తిస్తాం. పక్కింటి వాళ్ల అబ్బాయి ఇంజనీరుంగు చేస్తున్నాడని మన వాడూ ఇంజనీరైపోవాలి అని పెద్దలు, మన స్నేహితులు అందరూ ఇంజనీరింగే కనుక మనమూ ఇంజనీరై పోవాలి అని పిల్లలు. ఎంసెట్ లో ఎంత రాంకు వచ్చినా ఫర్వాలేదు. ఏదో మారుమూల కాలేజీ లోనైనా ఫర్వాలేదు. మొదట ఓ గొప్ప బ్రాంచ్ అనుకుంటాం. మన రాంక్ చూసి ఇది చాలు లే అనుకుంటాం. తీరా కౌన్సిలింగ్ లో అది కూడా రాదని తెలిసి వాడు ఏదిస్తే దానికి ( మొక్కలకు పందిరెయ్యడం నేర్పే కోర్స్ ఒకటి పెట్టి, దానికి ‘పందిరి బ్రాంచ్’ అని పేరు పెట్టి అందులో సీట్లున్నాయి అంటే దానికి కూడా ) సిద్ధమే మనం. ఏ బ్రాంచ్ అయితే నేముంది. నాలుగుసార్లు తప్పినా ఫర్వాలేదు. చివరికి ఇంజనీరింగ్ అయింది అనిపించుకుంటే చాలు. తరువాత మళ్లీ ఏ కంప్యూటర్ కోర్సో చేసి ఎలాగోలా బి.పి.ఓ. జాబ్ సంపదించకపోతామా... ఇదే మన ఆలోచన, కాదు కాదు ధోరణి అనాలేమో.? ఎందుకంటే అసలు ఆలోచన అనేది ఉంటేగా..? చుట్టూ నలుగురూ చేస్తున్నారు. బాగా సంపాదించొచ్చు. నలుగురితో పాటు నరాయణా!

ఏమి చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదువుతాం. అదీ ఒక చదువేనా..?

 అంటే ఇంజనీరింగ్ ఎందుకూ పనికి రాని చదువని కాదు నా ఉద్దేశం. అది చాలా గొప్పది. అసలు నిరర్ధకమైన విద్య అనేది లేదు. మనం చదివే తీరే అలా ఉంది. ఇంజనీరింగ్ రాయాలంటే ఎవరో అన్నట్టు గట్స్ కావాలి. నేను ఫలానా కాలేజీలో, ఫలానా బ్రాంచ్ లో మాత్రమే చేరతాను. అని నిర్ణయించుకుని దానికి తగిన కృషి చేసి అక్కడే సీట్ సంపాదించి చదవాలంటే చాలా తెగువ, పట్టుదల ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చదివింది చదువు అని నలుగురి ముందూ ఒప్పుకోవచ్చు. అలా లేని నాడు అది చదువే కాదు. అలా భ్రమ పడుతున్నారంతే!


 సరిగ్గా దీక్షలు స్వీకరించే విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలామంది స్వీకరించి ఉంటారు. కానీ ఎంతమంది నియమాలు సరిగ్గా పాటించారు? ఇక్కడా మనం గొర్రెల్లా మరొకరిని అనుసరిస్తున్నామే తప్ప కాస్త ఆలోచించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాం. తిరుగుతాం. కొందరు ధూమపానం కూడా చేస్తారు. మరి తాగే వారు నాకు ఇంకా కనపడలేదు భగవంతుడి దయవలన. తోటి స్వామి పడి పూజ వెయ్యిమందిని పిలిచి చేస్తే , మనం రెండువేలమందిని పిలుస్తాము. రేపటి నుండి దీక్ష కనుక ఈ రోజు ఫుల్లుగా పట్టించేసి రేపు ఆ మందు దిగకుండానే మాలను ధరించాలి. (ఇది నా స్నేహితులైన స్వాములకు స్వీయ అనుభవం. తోటి స్వాములు కొందరు అలా ఉండే వారుట.) సాయంత్రం అల్పాహారం పేరుతో అరవై రకాలు ఆరగించాలి. చుట్టూ ఉన్న స్వాములు అలా చేస్తే మనమూ అలా ఎందుకు చేయాలి? కాస్తైనా ఆలోచన ఉండదా? "మాలధారణం నియమాల తోరణం" అంటూ రోజూ పాడుకుంటాం కానీ, నియమాలు పాటించడం అబ్బో అన్ని నియమాలు పాటించడం కొంచెం కష్టమే. అందుకే మన వీలును బట్టి కుదిరినవి పాటిస్తాం. ఇంకెందుకండీ దీక్ష? దీనివలన వచ్చే పుణ్యమేమో కానీ, పాపం మూట కట్టుకుంటున్నాం. నలుగురికోసం కాదు మనకోసం మనం దీక్షపూనుతున్నాం. నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి. మనలో అహం కారాన్ని పెంచే దీక్షలు వేలసార్లు పూనినా ఏమిటి లాభం? జీవితాన్ని తరింప చేయగల దీక్ష జన్మానికి ఒక్క సారి స్వీకరించినా చాలు.

నేడు మనం స్వీకరిస్తున్న భగవత్ దీక్షల నియమాలు బ్రహ్మచర్య దీక్షనుండి స్వీకరించినవి అయి ఉండవచ్చు. ఉపనయనమయిన బ్రహ్మచారి ఎటువంటి నియమాలు పాఠించాలో మన పెద్దలు చెప్పారు. దాదాపు అటువంటి నియమాలే నేడు స్వామి దీక్షలకూ విధించుకున్నాము.

దీక్ష - నియమాలు

౧.సూర్యోదయాత్ పూర్వం లేవాలి.
౨.సూర్యోదయానికల్లా పూజను ప్రారంభించాలి.
౩.రోజుకు కనీసం ౧౦౦౦ సార్లు నామాన్ని స్మరించాలి. ఏ పని చేస్తున్నా మన నాలుకపై భగవన్నామం ఆడుతూ ఉండాలి.
౪.వార్తా పత్రికలు, టీవీ, ఇంటర్ నెట్ వంటివి ముట్టుకో కూడదు. ఉద్యోగ విషయమై అవసరమైతే తప్ప.
౫.ధూమ పానం, మద్య పానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
౬.శాఖాహరం ,సాత్వికాహారం తీసుకోవాలి.
౭.కోపం పూర్తిగా వీడాలి. వివేకం పని చేయాలి.
౮.సత్యం మాట్లాడడం చాలా అవసరం.
౯. ఈ దీక్ష మానసిక, వాచిక, కాయికములను మూడింటి ద్వారా జరగాలి.
౧౦.మూడు కాలాలూ భగవంతుని ఉపాసన చేయాలి. ఉద్యోగస్తులు కనీసం ౨ కాలాలు(ఉదయం,సాయంత్రం) అయినా పూజించాలి.
౧౧.నోటితో అసభ్య పదాలు పలకూడదు.
౧౨.చేతితో చెడు చేయకూడదు.
౧౩.మనసుతో చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది చాలా కష్టమైనది. కానీ అమ్మమీద భారం వేసి మొదలు పెడితే అంతా శుభం జరుగుతుంది.
౧౪. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ఉండకూడదు.ఎల్లప్పుడూ విబూధి ధరించి, ఎర్రని తిలకాన్ని ధరించాలి. ఉదయం పూజానంతరం గంధాన్ని ధరించాలి. తెల్లని స్ఫటిక పూసలు దీక్షా మాలగా ధరించాలి. శిఖను ధరించాలి. మొలత్రాడు తప్పక ఉండాలి. పూజా సమయంలో పంచె, కండువాలు మాత్రమే ధరించాలి. చేతికి దీక్షా కంకణమును రక్షగా కట్టుకోవాలి.

౧౫. నేలమీద శయనించాలి. నేలమీద కూర్చుని భుజించాలి. నీటిని కూడా కూర్చుని స్వీకరించాలి. ఏక భుక్తము చేయాలి. భోజనము కొరకు కాక, శక్తి కొరకు మాత్రమే అన్నట్లు భుజించాలి.

౧౬. భగవంతుని చిత్రపటమును, కలశమును పెట్టి ఈ దీక్షాసమయంలో పూజించాలి. పూజా ప్రదేశము నిత్యము శుభ్రముగా ఉంచాలి. దీపం వెలుగుతూ ఉండాలి. భజనలు వంటివి జరుపుట శ్రేష్ఠము. నిత్యము ధ్యానము కనీసం ౧౫ నిమిషాలు చేయాలి. ఏపని చేస్తున్నా ఆంతరింగిక పరిశీలన చేయాలి. లోపలి వ్యక్తిని గమనించాలి.

౧౭. మనం మన జీవితంలో ఎటువంటి పురొగతి కోరుకుంటున్నామో, ఆ పనిని ఈ నలభై రొజులలో సాధన చేయడం మొదలు పెట్టాలి. మన ఆశయ సాధనకు మొదటి అడుగును వేయాలి. తరువాతి అడుగులు భగవత్కృపచే వాటంతట అవే పడతాయి.

౧౮. పూజ, ధ్యానం, ఉద్యోగం, లక్ష్య సాధన వీటితో ప్రధానంగా నిండినదై మన దిన చర్య ఉండాలి. మిగిలిన వ్యసనాలు సమయాన్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం వంటివి చేయాలి. రోజంతా భగవత్ చింతనలో గడపాలి.

 మీరు స్వీకరించే దీక్ష ఎటువంటి దైనా నియమాలు లేకుండా ఫలించదు. సరదాగా ఆడే క్రికెట్ ఆడాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాట్ విసురుతాను నువ్వు బాలుతో తన్నాలి అంటే కుదరదు. బ్యాటుతో బాలుని మాత్రమే తన్నాలి. మరి అలాంటిది మన జీవితానికి ఎన్ని నియమాలు ఉండాలి? నియమాలు లేని జీవితం అందగా ఉండదు. అర్థరహితంగా ఉంటుంది. ఆ నియమాల విలువను తెలిపేందుకే ఇటువంటి దీక్షలు అవసరమౌతాయి.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ||
ఇన్ద్రియాణి హయనాహు ర్విషయాస్తేషు గోచరాన్|  - కఠోపనిషత్తు.

ఆత్మ రథికుడు, శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. ఇంద్రియాలు గుర్రాలు, అవి నడిచే దారులు విషయ వస్తువులు.

నేర్పరి అయిన సారథి అనేక వైపులకు పరుగులు తీసే గుర్రాలను కళ్లెంతో అదుపు చేసి, ఒకే గమ్యం దిశగా పయనింప చేస్తాడు. అలాగే బుద్ధి శాలి అయిన వాడు అనేక విషయ వాసనలతో పరి పరి విధాల ఆకర్షింప బడు ఇంద్రియాలను, మనసు అనే కళ్లెంతో అదిలించి, అంతర్ముఖం చేసి, ఒకే దారికి మళ్లించి గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే మనకు మనమే కొన్ని నియమాలను విధించుకుని మంచి మార్గం వైపుకు ఇంద్రియాలను మళ్లించుకున్న నాడు మన గమ్యాన్ని చేరగలుగుతాము.

11 వ్యాఖ్యలు:

 1. కొండొకచో నిరాశ, కొండొకచో అహంభావం బుద్ధి దారి మళ్ళే సందర్భాలు కల్పించి సంకల్ప బలాన్ని దెబ్బ తీస్తుంటాయి.
  వీటికీ పరిష్కారాలున్నాయనుకోండి. అమలు చేయటం లేదంతే.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆసక్తికరమైన విషయాలు.

  "నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి."
  - ఇది బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంచి ఉపయుక్తమైన విషయాలు వ్రాసారు. బాగుంది.

  శ్రీవాసుకి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాజశేఖరుని విజయ్ శర్మ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

  హారం

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మనిషి నియమ నిష్టలు రెంటిని ఒకేసారి పాటించాలని ఉపక్రమించి చివరికి సంకల్ప భ్రష్టుడు అవుతున్నాడు , కాని భక్తీ సూత్రములలో నారదులవారు చెప్పినది ఏమిటంటే ముందుగా నియమ పాలన చేస్తే నిష్ట అదే సిద్దిస్తుంది ప్రయత్నంలో,
  ఈకాలపు దీక్షలు ఒక వ్యాపార సరళిలో వారివారి దర్పాలను తేట తెల్లం చేయటానికే తప్ప ఆత్మోన్నతికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. మీరు చెప్పిన వాటిలో కనీసం ౩ ధర్మాలు ఆచరించినా ఆ దీక్ష ఫలం లభిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అరటి పండు వలచినట్లు
  స్పష్టంగా,ప్రశాంతంగా,శుబ్రంగా,విపులంగా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. yagnopaveetham mariyu prathitho chesina yagnoaveetham ante emito theliyacheyagalaru

  ప్రత్యుత్తరంతొలగించు
 8. యఙ్ఞాది క్రతువులు చేయుటకు అర్హతగా కొంతమంది ఒక సూత్రం ధరిస్తారు. దానినే యఙ్ఞోపవీతము, యఙ్ఞ సూత్రము లేదా దంజెము అని అంటూ ఉంటారు.

  పూర్వం స్త్రీలకు కూడా ఇది ఉండేది. దేవతా పూజలలో ఇది ఒక ఉపచారం. ఆ ఉపచారంలొ దేవతలకు ప్రత్తితో తాడువలే ఓ సూత్రమును చేసి సమర్పిస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. స్వామి, నేను అయ్యప్పమాల ధరించాలనుకుంటున్నాను. ఈ నిర్ణయానికంటే ముందే నవంబర్ 24న తిరువన్నామలై(అరుణాచలం), చిదంబరం, జంబుకేశ్వరం, కంచి, శ్రీకాళహస్తి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని ఉన్నాను. నేను డిసెంబర్ 1న మాల ధరించవచ్చా? 41 రోజుల మండల దీక్షకు అర్హుడినేనా?

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.