26, సెప్టెంబర్ 2010, ఆదివారం

పిల్ల గణపతులు

అందరూ గణేష్ ఉత్సవాలు జరుపుకుని ఉంటారు. ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులూ గణపతిని మన శక్తి కొలదీ పూజిస్తాం. నవరాత్రులు వచ్చాయంటే పెద్దల హడావిడి కంటే పిల్లల అల్లరే ఎక్కువగా ఉంటుంది. ఆ నవరాత్రి పందిరిలో పిల్లలు లేకపోతే అసలు తోచనే తోచదు. వాళ్లు ఏదో కోతి పని చేస్తూ, కాసేపు "ఓం గం గణపతయే నమః " " జై గణపతి మహరాజ్ కీ జై " అంటూ, కాసేపు చేసే పూజలు శ్రద్ధగా చూస్తూ ఉంటే అదో అందం. నేనైతే పెద్దలతో పాటు పిల్లలనూ తప్పనిసరిగా పూజకు కూర్చోపెట్ట మని చెప్తాను. దానివల్ల పూజలు అంటే వారికీ కొంత అవగాహన కలిగించినట్లు అవుతుంది.

 పిల్లలు పూజలలో పాల్గోవడమే కాదు. నేడు వాళ్లే సొంతగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు అక్కడక్కడా. ఓ చిన్న పందిరి వేసి, దానికి వారికి తోచిన రీతిలో అలంకారం చేసి, చిన్నదో పెద్దదో ఓ గణపతిని పెట్టి తొమ్మిది రోజులూ పూజలు చేసేస్తున్నారు. ఇంతవరకూ సంతోషదాయకమే కానీ కాస్త పరికించి చూస్తే చాలా పెద్ద ముప్పు కనిపిస్తోంది నాకు.

పిల్లలు ఓ నోట్ బుక్ పట్టుకుని చందాల కోసం ఇల్లిల్లూ తిరుగుతున్నారు. వచ్చిన చందాలను ఎలా ఖర్చుపెట్టాలో నేర్పే పెద్దలు ప్రక్కన లేరు. పట్టిచ్చుకునే వారు కూడా ఉండరు. అరే పిల్లలైనా ఎంత చక్కగా చేస్తున్నారనే ఆనందం వ్యక్తం చేస్తారు. అలా మండపాలు వేసి గణపతిని పెట్టి పూజించే పిల్లల తలిదండ్రులు కూడా తమ పిల్లలగురించి గొప్పలు చెప్పుకోవడమే కానీ కాస్త దూరం ఆలోచించరు. అందువల్ల పిల్లల్లో ఉన్న భక్తి కాస్తా, పరధన భుక్తిగా మారే అవకాశమే ఎక్కువగా ఉంది. నెడు చాలమంది పెద్దలు భగవంతుడి పేరుతో చేస్తున్న పనే ఇది. పెద్దలకే దైవ ధనాన్ని జాగ్రత్తగా, స్వలాభాపేక్ష లేకుండా ఖర్చుపెట్టడం కత్తిమీద సాములాంటి పని. దానికి భగవంతుని యందు భక్తి, ప్రేమ లతో పాటు కాస్త భయం కూడా ఉండాలి.

 
పిల్ల గణపతులు


మరి పిల్లలు పోగేసిన చందాలు భగవంతుని కార్యానికి సక్రమంగా వినియోగిస్తున్నారా అని ఎంతమంది పరిశీలిస్తున్నారు. అసలు చందాలు వసూలు చెసి పందిరిలో నవరాత్రులు నడపడమే సక్రమైన పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా భక్తి కల పిల్లవాడు అమ్మా నేను కూడా నవరాత్రి పూజలు చేస్తాను అంటే ఆ తల్లిదండ్రులు చక్కగా ఇంట్లో గణపతిని పెట్టుకుని దగ్గరుండి పిల్లవాడిచేత పూజలు చేయించి, ప్రసాదాన్ని పిల్లల చేతులమీదుగా నలుగురికీ పంచిపెట్టడం నేర్పాలి. తద్వారా పూజయొక్క ఆవశ్యకత తెలిచేయడమే కాకుండా, మనకు కలిగినది స్నేహితులు నలుగురితో కలిసి పంచుకోవాలి అనేటటువంటి మంచి విషయాలు అలవాటు చేసినట్లవుతుంది.

 లేదా పిల్లలు ఇంకా గోలపెడితే ఇంటి ముందే ఓ చిన్న పందిరివేసి అందులో గణపతిని పెట్టి పూజించాలి. ఇక్కడ కూడా అన్ని పనులూ పెద్దల పర్యవేక్షణలో పిల్లల చేత జరుపబడాలి. అలా పందిరిలో పెట్టిన పక్షంలో ఆ గణపతిని వర్షం, ఎండ తగలకుండా-కుక్కలు పిల్లులు పూజా సామాగ్రిని పాడుచేయకుండా చూసుకునే బాధ్యతను పిల్లలకు అప్పజెప్పి ఎలా రక్షిస్తున్నారో గమనించాలి. అవసరాన్ని బట్టి తగిన సూచనలిస్తుండాలి.

ఈ ఉత్సవాలు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో చేసే అలవాటు నేర్పాలి. ఆర్భాటాలు పనికిరాదన్న సంగతి ఖచ్చితంగా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. గొప్పలు చాటుకోవలనే ప్రయత్నంలో మన పెద్దలు నేటికీ నీరు కలుషితమౌతోందని ప్రభుత్వం మొత్తుకుంటున్నా వినకుండా పెద్ద పెద్ద విగ్రహాలు, రకరకాల రంగులద్ది మరీ తయారు చేస్తున్నారు. అది తీసుకు వెళ్లి నీటిలో కలుపుతున్నారు. మన శాస్త్రాలు పూజవల్ల మనకు శుభం జరగాలంటే, ఆ పూజల వల్ల చిన్న ప్రాణికి కూడా అపకారం జరగకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాయి. ( మనం తద్దినం పెట్టినప్పుడు పిండాలతో ఉన్న దర్భలు తిని నోరు చీరుకుని చేపలు చనిపోతాయేమోనని దర్భలు నీటిలో కడిగి ఒడ్డున పడవేసి అప్పుడు పిండాలను నీటిలో కలపని పెద్దలు చెప్తారు. ) ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి మన పూజా విధానాలను రూపొందించారు పెద్దలు. అలాంటిది నేడు మన గొప్పలు వికృత రూపాలు దాల్చి పర్యావరణాన్ని ఎన్నోవిధాల నాశనం చేస్తున్నాయి. కనీసం దేముని విషయంలోనైనా అలా జరగకుండా జాగ్రత్త తీసుకోవడం మొదలుపెడితే అది క్రమంగా మన ప్రతి పనిలోనూ అలవాటవుతుంది. అందుకని పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వివరించి చెప్పాలి. పందిరి లో గణపతిని పెట్టడం ఎలాగైనా కాస్త ఖర్చుతో కూడినది కనుక ఒక్కరే దాని ఖర్చులు భరించడం కష్టమైతే చూట్టూ ఉన్న నలుగురు పిల్లల తలిదండ్రులనూ అందులో భాగస్వామ్యం చెయ్యాలి. ఇది కేవలం పెద్దలమధ్య అవగాహనగా ఉండాలి. పిల్లల జోక్యం ఇందులో ఉండకూడదు.

ఇలాకూడా కాదని పిల్లలకి పుస్తకాలిచ్చి ఊరిమీదికి పంపడం చాలా ఘోరమైన పని. దీని ప్రభావం పిల్ల వ్యక్తిత్వం మీద పడుతుంది. "మన పనైతే మనమే చేసుకోవాలి. అదే దేముని పనైతే నలుగురూ చేయివేస్తారు. అలా మన పని నలుగురి సాయంతో చేయడం ఓ కళ. పందిరి నిర్వహించిన పేరు ఒకరిది. డబ్బు ఊరందరిదీ...." ఇలా సాగాయనుకోండి వారి ఆలోచనలు ఇక వారిని భగవంతుడు కూడా రక్షించలేడు. మనకు ఉత్సవాలు చేయాలని కోరిక కలిగితే మనమే చేయాలి కానీ ఊరిమీద పడడమెందుకు? ఈ మధ్య కొన్ని చోట్ల యువజన సంఘాలు బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయట! ఇది మరీ దారుణం.  మనం ఉత్సవాలు చేస్తుంటే మా ధనం కూడా కొంత వినియోగించండి అని ఎవరినా స్వచ్ఛందంగా తీసుకోమని కోరితే తప్పులేదు. కానీ చందాలు అడగడం అంత పొరపాటు పని మరొకటి ఉండదు.

చందాలు అడగడం ఒక ఎత్తైతే ఆ వచ్చిన ధనాన్ని ఖర్చు చేయడం మరో ఎత్తు. దానికీ పెద్దల సహకారం పిల్లలకి కావాలి. ఎటువంటి వాటికి ధనం ఖర్చుచేయాలి? ఎటువంటి వాటికి ఖర్చు చేయకూడదూ అనేది వారికేం తెలుస్తుంది. మనసు కోరిందల్లా చేస్తారు. ఈ క్రమంలో వారూ గొప్పలకు పోవడం లేదా స్వలాభం చూడడం వంటివి జరుగుతాయి. దేముడి ధనం మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారం మనకి లేదు అనే విషయం వారికి స్పష్టంగా చెప్పక పోతే పెద్ద అనర్ధమే జరుగుతుంది. ధనం విలువ వారికి తెలియక పోగా, భగవంతుడి పేరుతో స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకునే పరమ స్వార్థ స్వభావులుగా తయారవుతారు. పైకి భక్తులుగా ఉంటూనే లోలోపల భగవద్రవ్యాన్ని ఏ విధంగా ఖర్చుచెయ్యాలా అన్న భావనలు వారిలో పెంపొందుతాయి.

చందాలే కాకుండా నేడు లడ్డూల వేలంపాటకూడా పెచ్చుమీరి పోతున్నది.

ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.

7 కామెంట్‌లు:

  1. >>>మరి పిల్లలు పోగేసిన చందాలు భగవంతుని కార్యానికి సక్రమంగా వినియోగిస్తున్నారా
    శర్మ గారు, పిల్లలదాకా ఎందుకండి? పెద్దలు పోగేసిన చందాలు సక్రమంగా భగవంతుని కార్యానికి ఉపయోగపడుతున్నాయా? మీరు చెప్పినట్టు బెదిరింపు చందాలు ఎక్కువయిపోయాయి. పిల్లలు పెద్దలని చూసే కదండి నేర్చుకునేది. పెద్దలు ఆచరణలో చూపిస్తే పిల్లలు అనుసరిస్తారు. పెద్దలలోనే ఆ విలువలులేవిప్పుడు.
    మీ టపా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. చాలా రోజుల తరువాత కనపడ్డారు, టపా బాగున్నది.
    ఎక్కడ చూసిన హంగు, ఆర్భాటం, గొడవలు, తాగుడు అయిపోతున్నాయి నిజంగానే వినాయక ఉత్సవాలు అనగానే ప్రస్తుతం.

    రిప్లయితొలగించండి
  3. viMtapOkaDalu tayAravutunnAyi lOkaMlO. pillala pillagaNapatulaki pilla caMdAlu kUDAnA? I laDDUla vElaM saMgati monna TIvIlO cUsi nirghAMtapOyAnu

    రిప్లయితొలగించండి
  4. నిజమేనండీ, బాగా చెప్పారు. బెదిరించే వాళ్ళనెవరూ ఏమీ చేయలేరు. కనీసం పిల్లలకైనా మార్గదర్శనం సరిగ్గా చేయగలగాలి మనం.

    రిప్లయితొలగించండి
  5. పిల్ల గణపతులెప్పుడూ తప్పు చెయ్యరు. వాళ్ల వెనకాల సరైన పెద్దలు లేకపోతేనే గొడవ.

    నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు (అప్పటికి నాకు యేడేళ్లు) మా ఇంటివెనకాల కొద్ది దూరం లో వుండే కాపులబ్బాయి, నా క్లాస్ మేట్, ఆకుల నరసిం హారావు ఓ రోజు డ్రిల్లు పీరియడ్ లో, నాదగ్గర రెండుపైసలున్నాయి, నీ దగ్గరెంతుంది? అనడిగితే, ఒక పైసా వుందని చెప్పాను. అయితే, మనింటి దగ్గర శ్రీరామనవమి వుత్సవాలు చేద్దాం అని ప్రతిపాదించి, మందిరం డెకరేషన్ కి రంగుకాగితాలు కొనుక్కొద్దాం.....అంటే, స్కూలు నించి అటే మాదిరెడ్డి వెంకటరావు కొట్టుకి వెళ్లి, రంగుకాగితం ఇవ్వమంటే, వాళ్లు ఒక్కో ఠావూ ఒక అణా అని చెప్పారు. మా దగ్గర అర్థణాయే వుంది, అర ఠావు ఇమ్మంటే, అలా ఇవ్వరు అని తెగేసి చెప్పారు!

    కాళ్లీడ్చుకొంటూ ఇంటికి వచ్చేసరికి చీకటిపడింది.....మా అమ్మ తిట్లు! విషయం చెపితే, ఆవిడ ఓ అతి చిన్న బోర్న్ విటా డబ్బాని డిబ్బీ కింద చేసిచ్చి, రేపటినించీ చందాలు వసూలు చేసుకోండి అని మాకు చెప్పవలసిన నీతులన్నీ చెప్పింది.

    అయినా, మేము దారిన పోయేవాళ్లందరినీ, సైకిళ్లయినా నిలబెట్టేసి, డిబ్బీలో చందా వెయ్యమని కదలనిచ్చేవాళ్ళం కాదు.

    హైలైట్ యేమిటంటే, నేను స్వయం గా తయారు చేసిన రథం లో రథోత్సవం నిర్వహించిన రోజు, పోలీసు వెంకట్రావు గారు ఓ కొత్త ఒక రూపాయి నోటు హారతి పళ్లెం లో వెయ్యడం!

    ఆ తరవాత ప్రతీ సంవత్సరం శ్రీరామనవమి చెయ్యడం, శ్రీకృష్ణ రాయబారం, అంగద రాయబారం వంటి చిన్న చిన్న నాటకాలు వెయ్యడం, నేను యేడో తరగతిలోకి వచ్చాక స్వయం గా రచించిన "ప్రతీకారం" అనే నాటిక ని ప్రదర్శించడం, అందరూ మెచ్చుకోవడం.......ఇవన్నీ పాత స్మృతులు.

    చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలని అలా వదిలేస్తే అన్నీ బాగానే వుంటాయి--మన అభిప్రాయాలనీ, విలువలనీ వాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నించనంతకాలం.

    ఇక, కొత్త సెల్ ఫోన్ కీ, బండికీ, కారుకీ, టీవీకీ, ఇలా పూజలు చెయ్యకపోవడం, మీలాంటివాళ్ల చేతుల్లోనే వుంది!

    మంచి టపా వ్రాశారు. సంతోషం.

    రిప్లయితొలగించండి
  6. వింతపోకడలు తయారవుతున్నాయి లోకంలో. పిల్లల పిల్లగణపతులకి పిల్ల చందాలు కూడానా? ఈ లడ్డూల వేలం సంగతి మొన్న టీవీలో చూసి నిర్ఘాంతపోయాను
    (క్షమించాలి, ఇందాకటి వ్యాఖ్య తెలుగు లిపిలోకి మార్చకుండా ప్రచురించేశాను.)

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.