9, నవంబర్ 2010, మంగళవారం

గాయత్రీ జప దీక్ష పూర్తయింది


మొన్నటి ఆశ్వయుజ పౌర్ణమితో నలభైరోజుల గాయత్రీ జప దీక్ష పూర్తయింది. నేను పెట్టుకున్న నియమాలు నా జపం పూర్తి చేసుకోవడానికి శ్రీరామ రక్షగా నిలచాయి. జప సంఖ్య పెద్దది కావడం వల్ల సమయం సరిపోక చాలా కార్యక్రమాలు ( పూజలు ) వదులు కున్నాను. సంపాదన లేకుండా, ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా దాదాపు గృహ నిర్భంధం నాకు నేనే విధించుకున్న రోజులవి. బ్రాహ్మణులందరూ సంధ్యావందనాన్నే వదిలేస్తున్నారు నేడు. నేనేమో " అగ్ని కార్యం " ( ఇది బ్రహ్మచారులు విధిగా రోజూ చేయవలసిన హోమం. ) కూడా మొదలు పెట్టాను.

కొంత మంది అంటారు " మనం ఎంత సాప్రదాయాన్ని పాఠిస్తున్నాం అన్నది ముఖ్యంకాదు, ఎంత ఆంతరంగిక సాధన చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఈ పూజలు, మంత్రాలు యోగమార్గంలో మొదటి మెట్టు మాత్రమే అని. "  నేనూ అది ఒప్పుకుంటాను. కానీ మొదటి మెట్టు కంటే చివరి మెట్టు గొప్పది కదా అని దానినే ఒకే సారి ఎక్కడానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లా పడతాం. ఏదైనా క్రమంగా రావాలి. అది ఒక పరిణతితో కూడిన సాధన. కామ క్రోధాలు విజృభించి జనులను ధర్మ భ్రష్ఠులను చేసే కలి యుగం ఇది. ఈ యుగంలో మన విహిత కర్మలను మనం నిత్య అనుష్ఠించడానికి ప్రయత్నం చేస్తూనే భగవద్భక్తిని సాధన చేయాలి. భక్తి మార్గమే నేడు మనకు తరుణోపాయం. అటు మంత్రోపాసనలు, ఇటు యోగ మార్గం రెండూ నేడు స్వతంత్రంగా మనలేవు. అవి " భక్తి మార్గం " అనే చెట్టుకు పెనవేసుకుని మాత్రమే సఫలత చెందగలవు.  నా ఉద్దేశం ఏమిటంటే  మనం నిత్యం చేయవలసిన జపతపాలను వదిలివేసి, పండుగలను పర్వదినాలను వదిలివేసి బ్రతకడం కూడా కలి ప్రభావంలో ఓ భాగమే.  అందరికీ కొన్ని వైదికమైన ( సంధ్యావందన, దేవతార్చన వంటి ) బాధ్యతలు ఉన్నాయి.  వీటిని వదలి ధ్యానమార్గ సాధన చేయడమూ - ముసలి తనంలో ఉన్న తల్లిని వదిలి సంపాదనకోసం ఇతర దేశాలు వెళ్లడమూ నా దృష్టిలో రెండూ ఒకటే.  మన నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూనే యోగమార్గ సాధన చేయాలి.  ఎవరో కొందరికి మాత్రమే ఈ విధానంలో కొన్ని అనుమతులు ఉంటాయి. మిగతా వారు వారిని చూసి వాతలు పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు.   సరే దీని గురించి చర్చించుకుంటే ఓ గ్రంధమవుతుందేమో. మరో సారి విపులంగా చర్చించే ప్రయత్నం చేస్తాను.

ఇక నా జప సాధనలో చాలా ఆటంకాలు వచ్చాయి. కొన్ని సార్లు నేను సంకల్పించిన జపం పూర్తవుతుందా అవదా అనే దిగులు కూడా వచ్చింది. తలకు మించిన భారం పెట్టుకున్నానేమో అనిపించింది. కానీ ఆటంకాలు వచ్చిన కొద్దీ నాలో పట్టుదల పెరిగింది. ఏదిఏమైనా సంకల్పించిన జపం పూర్తి చేయాలనుకున్నాను. దానికోసం అన్ని పనులూ వాయిదా వేశాను. అన్నికంటే ముఖ్యమైనది ధనం. నాకు లాంటి పురోహితులు చాలామందికి పూజలు చేసినంతకాలమే అది చేతిలో ఉంటుంది. ఉన్న పనులు కూడా మానుకుంటే అది పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. నాకు అనేక ఖర్చులు వచ్చేశాయి. దీక్ష పూర్తవుతూనే  వేలలో ఖర్చు ఉంది.  అది కాక నాకు వెనకేసిన ధనమేమీ లేదు. ఎప్పటిదప్పుడే సంపాదించుకోవాలి. మడి కట్టుకుని ఇంట్లో పూజలంటూ కూర్చుంటే నన్ను పోషించే వారెవరూ లేరు. ఇవన్నీ తలపై భారాన్ని పెంచే కార్యక్రమాలు. అయినా నాలో విచిత్రం గా పట్టుదల పెరుగుతూ వచ్చింది. ఎంతమందికి ఇలాంటి ఇబ్బందులు లేవు. నేను సంకల్పించిన పని పూర్తి చేయాలి. ఆపై అమ్మ దయ. ఆవిడని కష్టాలు పెట్టవద్దమ్మా అని ప్రార్థించను. ఎందుకంటే కష్టసుఖాలు మానవజన్మకు సహజం. కానీ అవితట్టుకునే ధైర్యాన్ని, ఎన్ని కష్టాలు ఉన్నా ఆతల్లి సేవలో తరించే శ్రద్ధనూ ప్రసాదించమని మాత్రం ప్రార్థించాను. నాలో ని ఆర్తి వేయింతలైంది. గాయత్రీ జప ఫలితమో ఏమో చాగంటి వారి రామాయణ ప్రవచనం సీతాకళ్యాణం ఘట్టం వరకూ కొన్నిరోజులు వరుసగా విన్నాను.  మరి ఆప్రవచనంలోదో, వేరొక చోటిదో, నా సొంత కల్పనో నాకొక వాక్యం పదేపదే గుర్తుకు వచ్చేది. " మన దగ్గర భక్తి స్వల్పమాత్రంగా ఉంటే చాలు. ఒక దివ్యాయుధం మన ఒరలో ఉన్నట్టే. మన శత్రువును బట్టి దాని (భక్తి ) పరిమాణం పెరుగుతూ ఉంటుంది. శత్రువుని మట్టు పెట్టే మార్గాలు అదే చూపిస్తుంది. " ఈ వాక్యం నాకు ఎన్నో సార్లు స్వీయానుభవానికి వచ్చింది.


నేనేదో ప్రత్యేకమైన కోరికలతో నో, కష్టాలనుండి తేరుకోవడానికో ఈ జపం ప్రారంభించలేదు. నాకు చిన్నప్పటి నుండీ గాయత్రిని బ్రహ్మచారిగా ఉండగా కనీసం లక్ష పూర్తి చేయాలని కోరిక. అదీ కాక నా వృత్తి నలుగురికి మార్గ నిర్దేశం చేసి జీవితంలో ధైర్యాన్ని నింపే వృత్తి. " నేను నలుగురుని తరింప చేయాలంటే ముందు నేను తరించాలి. బ్రాహ్మణుడికి ఉన్న ది మంత్ర శక్తి మాత్రమే. అది ఉన్న నాడు ఎక్కడ ఉన్నా నలుగురిచే గౌరవింప బడతాడు. లేనినాడు హీనమౌతాడు. "  అనే మాట నాకు ఎల్లప్పుడూ స్ఫురణలో ఉంటుంది. అందువల్లే నాకు నేను తరించే మార్గాలు ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉంటాను. అందులో భాగంగానే ఈ సంకల్పం చేపట్టాను. ఎన్నో గ్రహజపాలు, దేవ-బ్రాహ్మణ పూజలు చేసిన తరువాత అమ్మవారు అనుగ్రహించి నాకు తనని సేవించే అవకాశం ఇచ్చారు.  అవకాశం ఇవ్వడమే కాక నాచేత సంకల్పింపచేసిన పని పూర్తిచేయించారు. ఈ క్రమంలో ఎన్నో అనుభూతులు నాకు ప్రసాదించారు. అనుక్షణం అమ్మ ఒడిలోనే గడిపిన అనుభూతిని కలిగించారు. నేనున్నాను నీకు తోడు అనే మాటను పదే పదే నిరూపించి మరీ చూపించారు.  నేను చేసిన జపం చాలా స్వల్పం. చేవలసినది, ఆచరించ వలసినది చాలా ఉంది. ధర్మం అనుష్ఠించాలంటే కూడా ఆర్థిక వెసులు బాటు ఉండాలనేది నాకు మొదటి  సారి అనుభవంలోకి వచ్చింది. పూర్వం రాజులు బ్రాహ్మణులని పోషించే వారు.  బ్రాహ్మణులు ఏ చింతాలేక ధర్మానుష్ఠాన తత్పరులై జీవించేవారు. నేడు అది పూర్తిగా నశించి పోయింది. అయినా అమ్మ దయ ఉంటే అన్నీ సక్రమంగా చేయగలము. అలాంటి అమ్మ కరుణ నా యజమానులకు, శ్రేయోభిలాషులకూ, మిత్రులకు, హిందూ సనాతన ధర్మ అనుష్ఠాన తత్పరులకు, నాకు మరల మరల కలుగాలని మౌనంగా అమ్మకు నివేదించగలిగాను.

1 కామెంట్‌:

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.