8, డిసెంబర్ 2010, బుధవారం

నా పౌరోహిత్యంలో....

  రహదారి వెంట వెళుతుంటే చిన్ని పాప ఎదురవుతుంది. కళ్లతోనే పలకరిస్తాను. ఆమె మొహమంతా వికసిస్తుంది. ఆనందాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తుంది. సిగ్గుతో కూడిన అమాయకత్వం ఆ పాపాయి మోములో చూసిన నాకు ఏదోతెలియని ఆనందం కమ్మేస్తుంది. పిల్లలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. నేనూ వెళ్లి ఓ బాల్ వేస్తాను. నాకు వాళ్లు క్రికెట్ గురువులు. పంతులుగారు మాతో ఆడుతున్నారన్న ఆనందం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. గురువుగా ఉండడం కాన్నా ఏమీతెలియని వాడిగా ఉండడం లోని ఆనందం అనుభవానికి వస్తుంది. బాల్ ఇలా పట్టు కోవాలి, అలా వేయాలి అని నాకు వారు నేర్పిస్తుంటే నేను పూజ ఇలా చేయాలి, అలా చేయాలి అని నలుగురికీ నేర్పిన ప్రతీ మాటా గుర్తుకు వస్తాయి.  చిన్న పిల్లలు అందరితోను తొందరగా కలవరు. వారి ప్రపంచం వేరు. ఆ ప్రంపంచంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో నేను కోల్పోయిన బాల్యాన్ని మళ్లీ పొందడాన్ని గమనిస్తుంటాను.

 గోల్కొండ గేటు సిగ్నల్ దగ్గర ఆగిన ప్రతీ సారీ ఆర్మీ వారికి మనసులోనే ఓ సెల్యూట్ పెడతాను. నాకూ-వారికీ మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపించదు. బ్రాహ్మణుడికి వైదిక పరమైన నియమాలు అనేకం ఉన్నట్లే, వారికి యుద్ధ పరమైన నియమాలు ఉన్నాయి. కాకపొతే బ్రాహ్మణుడిది మానసికమైన సిక్షణ, వారిది శారిరక పరమైన సిక్షణ. శిక్షణలో తేడాలు ఉన్నా ఇద్దరి ధర్మం ఒక్కటే "దేశ రక్షణ".  అలా ఆలోచిస్తు గోల్కొండ గేటుదాటి కోట పరిధిలోకి ప్రవేశించి కోటను చూసుకుంటూ మరోగేటు వైపుకు వెళ్తుంటాను. చాలాసార్లు అక్కడి ముస్లిం పిల్లలు ( అప్పుడప్పుడు పెద్ద వారు ) ఎవరైనా లిఫ్ట్  ఇస్తారేమో అని ఎదురు చూస్తుంటారు. నన్ను, నా వేషధారణను చూసి అడగాలా వద్దా అన్న సందేహంలో ఆగిపోతారు. నేను లిఫ్ట్ కావాలా అన్నట్టుగా కాస్త బండి వేగం తగ్గిస్తాను. ఆ పిల్లలు పరుగున వచ్చి బండి మీద కూర్చుంటారు. వెళ్తూ వెళ్తూ వారి చదువుల గురించి, అల్లరి గురించి, నాకు తెలియని హిందీ పదాల గురించి ఏవో మాటలు కలిపే ప్రయత్నం చేస్తాను. వాళ్ల మనసులో ఎక్కడో ఉన్న సందేహం అంత నిజం కాదన్న అవగాహన ఆ పసిహృదయాలకు చేరితే చాలన్నదే నా ఆలోచన. థాంక్యూ భయ్యా అంటూ బండిదిగిన వారిని చూసి నాలో నాకే చిన్ని పరవశం.

  అర్థరాత్రి వేళ ఏ రోజైనా పూజంటూ బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో రోజు బండిలెకుండానే వెళ్లాల్సిన స్థితి. బస్టాప్ లో నుంచుని, తోడెవరు లేరుకదా అనుకునేంతలో ఎవరో పలకరిస్తారు. " పంతులుగారు ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్లాలి?" అంటూ...  వారికి ఆ చనువు ఎక్కడి నుండి వచ్చింది? అదే వేరే వ్యక్తినైతే అంత త్వరగా పలకరించడానికి ఇష్టపడని వారు నన్ను చూస్తే పరిచయస్తుడిలా ఎలా పలకరిస్తారు?  అని నాలో నేనే ఏదోవెతకులాట మొదలెడతాను. నాకు ప్రతీసారీ తెలిసే నిజం ఒకటే. అటు పిల్లలు త్వరగా నాతో కలిసినా, పెద్దలు తెలిసిన వ్యక్తిని పలకరించినట్లు మాట్లాడినా అది నన్నుచూసికాదు నా లోని ఓ పురోహితుడిని చూసి. ఏదైనా ఆఫీసులో కానీ, మరోచోట కానీ నాకు కొత్త చోటుకు వెళ్లిన భావన కలగడం చాలా తక్కువ. అందుకు కారణం నేనో పురోహితుడిని. నేనుగా ఎవరికీ పరిచయస్తుడిని కాదు. కానీ నాలోని పురోహితుని పరిచయం  వారికి ఈనాటిది కాదు. అది అనాదిగా వారిజీవితాలతో పెనవేసుకున్న అనుబంధం. పురొహితుడంటే ఓ పరిచయస్తుడేకాదు, ఓ స్నేహితుడు, ఓ గురువు, ఓ నమ్మదగిన వ్యక్తి. అటువంటి పురోహితుడిగా నేనున్నందుకు ఒక్కో క్షణం నన్ను నేనే అభినందించుకుంటాను.


పురోహితుడు అనే పేరుకే కాక భావానికి తగిన అర్హతను పొందడానికి నాకు నేనే సూచనలు చేసుకుంటుంటాను. నన్ను నేనే సరిచేసుకుంటుంటాను. నా చుట్టూ ఉండే ప్రపంచం నాకెప్పుడూ అందమైన గులాబీ పూలు పూచిన మొక్కలా కనిపిస్తుంది. చెట్టుకున్న ముళ్లను చూస్తూ కూర్చుంటే పువ్వుల అందాన్ని ఆస్వాదించలేము. అలాగని ముళ్లులేకుండా కేవలం పూలు పూసే చెట్టే కావాలంటే అది అత్యాసే అవుతుంది. అయినా ముళ్లు ఉన్నాయికనుకనే ఆ పూలకు అంత అందం వచ్చిందేమో అనిపిస్తుంది. ఈ భావాన్నే నా పురోహితంలో వ్యక్తపరచే ప్రయత్నం చేస్తుంటాను.


నాకు కేవలం పూజ చేసి రావడం ఇష్టం ఉండదు. పూజతో పాటు (ఆ పూజ చేసే) వారి మనసు లోతులను పలకరించి వచ్చే ప్రయత్నం చేస్తుంటాను. లోలోపల దాచుకున్న ఆనందాలను, దుఃఖాలను వెలికి తీస్తాను. పొంగుకొచ్చే ఆవేశానికి నా మాటలతో మంత్రం వేస్తాను. అంసంపూర్తిగా మిగిలిన ఎన్నో ప్రశ్నలు వారి మదినిండా. ఏదో తెలియని భయం. చేయరానిదేదో చేస్తున్నామన్న ఆలోచన. అవన్నీ తవ్వుకుంటే సుఖాలను వదులుకోవాలేమో అన్న దిగులు. అందుకే అంతరాత్మను లోలోపలే గొయ్యి తవ్వి ఆ గోతిలో కప్పేస్తారు. నేను ఆ గోతిని మరల తిరిగి తవ్వే ప్రయత్నం చేస్తాను. మీ భయాలకు అర్థం లేదు. కావలసినంత సుఖపడవచ్చు. అందులో తప్పే లేదు. ఏ వైరాగ్యమూ అవసరం లేదు. మీ అంతరాత్మలను చంపుకుంటే మీకు కలిగేది సుఖం కాదు, దుఃఖం. వాటిని బ్రతికించి చూడండి. మీలో ఎంత శక్తి దాగి ఉన్నదో మీకే తెలుస్తుంది. అనంత విశ్వాన్ని అరచేత పట్ట గలరు. అద్దంలోని బింబంలాగ ప్రపంచాన్ని ఓ కొత్త దృష్టితో అనుభూతించ గలరు. అని నేను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓ చిన్ని ధైర్యం  వారి కళ్లలో కనిపిస్తుంది. ఏదీ ఒకేసారి జరిగి పోదు. క్రమ  క్రమంగా కొన్ని పరిచయాల తరువాత  వారిలో ఓ చిన్న మార్పు వస్తుంది. ఆ మార్పును చూసిన నాడు నాలో కలిగే ఆనందానికి నాలోని అణువణువు పులకిస్తుంది.

నన్ను ఓ పురోహితుడిగా మలచిన గురువులకు, ఆ పరమేశ్వరునికి వేవేల వందనాలు.

23 వ్యాఖ్యలు:

 1. మాకందరికీ తెలిసిన మాపురోహితుల గురించి చెప్పినట్టే ఉంది.
  బాగా చెప్పారు.
  ఈ పోస్ట్ రాసి, మళ్ళీ తీసేసినట్టు ఉండింది చాలారోజులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ వంటి వారి వల్లే ఆ వృత్తికి గౌరవం ఇంకా ఉన్నది.
  మీరు మీ వృత్తి పట్ల, జీవితం పట్ల ఇదే సానుకూల భావనలతో ఆనందంగా మార్గదర్శకంగా ఉండాలని, ఆ అవకాశం, శక్తి జగన్మాత మీకు ఇవ్వాలని అమ్మను ప్రార్ధిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అద్భుతంగా వ్రాసారండి శర్మగారు.
  One of the best posts that I have come across in our blogs.
  W/Regards - Saikiran

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగా వ్రాసారు శర్మగారూ. నిజమైన పురోహితుడి లాగ ఆలోచిస్తున్నారు. మిమ్మలని చూసి మరికొందరైనా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అబ్బ.. ఎంత బాగుందో టపా.. నాకైతే పురోహితుడికి ఒక కొత్త అర్థాన్ని చదువుతున్నట్లుగా ఉంది. అద్భుతంగా ఉంది టపా...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీకున్న నిర్మల హృదయం, లోకాన్ని అర్ధం చేసుకున్న తీరు వల్ల మీరు పురోహితులుగా కాకున్నా ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. నిష్కామ్యకర్మాన్ని ఆచరణలో చూపుతున్న మీరు అన్ని వృత్తుల వారికీ ఆదర్శప్రాయులు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. పౌరోహిత్యం ను పురోహితుడును సరిగ్గా నిర్వచించారు....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఈ అంకితభావమే అవమానాలను అర్ధాకలినీ సహించి ఇంకా ధర్మాన్ని కాపాడుతున్నది ఈ పుణ్యభూమిలో.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అధ్భుతం శర్మగారు. మీ వృత్తి పట్ల మీకున్న నిబద్ధత, గౌరవం, ఇష్టం అధ్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించడానికి యువతరం ఇష్టపడేవారు కాదు. ఈ మధ్య కేవలం సంపాదన బాగుంటుంది కనుక పురోహితులమవుతున్నాం అని చెప్పి పౌరోహిత్యం చేస్తున్నవాళ్ళు నాకు తెలుసు. కానీ ఇంత చిన్న వయసులోనే మీరు చేస్తున్న పని విలువేమిటో అర్థం చేసుకుని అందులోని గొప్పతనాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా మీ కర్తవ్యాన్ని నిర్వహించడం అధ్భుతం. మీలోని గురువుకు నా ప్రణామాలు. ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే తమ వృత్తిని ఇంతటి అవగాహనతో ఇష్టపడి చేస్తే అంతకన్నా ఆ మనిషికి ఆనందం ఎందులో దొరుకుతుంది చెప్పండి. చాలా చక్కని టపా. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. $రాజశేఖరుని విజయ్ శర్మ గారు
  చక్కగా వివరించారు. కానీ ఇది నాణానికి ఒక వైపు మాత్రమే, మరో వైపు చీదరింపులూ, అవమానాలు కూడా ఉన్నాయి అని నా భావన. ఎవరి అనుభవం వారిది మరి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "ఆ ప్రయత్నంలో నేను కోల్పోయిన బాల్యాన్ని మళ్లీ పొందడాన్ని గమనిస్తుంటాను."
  చాలా చాలా బావుందండీ. అన్నిటికంటే పురోహితుడు ఒక సైకాలజిస్టు కావాలి. తన "క్లయంట్ల" మనోవ్యధలను కనిపెట్టి తీర్చగలగాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. అద్భుతమైన రచన. కవితాత్మకంగా ఉంది. ఈ మధ్య ఇలాంటి రచన చదవలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. స్పందించిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.

  మందాకిని గారికి : అవును ఈ పోస్ట్ పూర్తిగా రాయకుండానే ఓ వారం క్రితం పొరపాటున ప్రచురించ బడింది. దానిని వెంటనే మళ్లీ డ్రాఫ్ట్ లాగా మార్చేసేను. అందుకే ముందుసారి ఎవరికీ కనపడలేదు.

  దుర్గేశ్వర్ గారికి : నిజం చెప్పారు. నా వృత్తిమీద నాకు కల అచంచలమైన ప్రేమే కనుక లేక పోతే ఈ వృత్తిలో నేను నేటికీ ఉండడం అనేది సాధ్యపడేది కాదేమో..? అనిపిస్తుంది నాకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. శిశిర గారికి : మీలోని వినయానికి కూడా నా ప్రణామములు. మీదీ( మీరు ఒక ఉపాధ్యాయిని అనుకుంటున్నాను), నాదీ ఒకటే వృత్తి. కాకపోతే మీ గురుత్వం మీ కళాశాల వరకే. నా బాధ్యత నాకు పరిచయమున్న ప్రతీ ఒక్కరితో. మీరూ కావాలనుకుంటే పురోహితులవ్వగలరు. మీ పరిధి పెంచుకుంటే.. :)

  రాజేష్ గారు : మీరన్నది కొంత వరకు నిజమే కానీ అందరికీ కాదు. అసలు బ్రాహ్మాడు తన ధర్మాన్ని గుర్తించి ఆచరిస్తే అతనిని నేటికీ నీరాజనాలర్పిస్తారు... కానీ తన పనిని (అనుష్ఠానాల వంటివి) తాను చేయకుండా ప్రపంచం నన్ను గౌరవించాలంటే అది వాస్తవదూరమే అవుతుంది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. $..అసలు బ్రాహ్మాడు తన ధర్మాన్ని గుర్తించి ఆచరిస్తే అతనిని నేటికీ నీరాజనాలర్పిస్తారు..
  మరక్కడే మండుద్ది, ఇక్కడ నీరాజనాలకోసం ఎవరూ పాకులాడటంలేదు. నలుగురితో నారయణ అన్న చందాన కాలానుగుణముగా వాస్తవ పరిస్తితులని అర్ఠం చేసుకుంటూ మారడములొ తప్పులేదు కదా. మడి కట్టుకు కూర్చుంటే ఇంట్లొ అన్నం మరుగుతుందా, అనీ నిండుకునే మరి? అలా అని తన ధర్మాన్ని మర్చిపొమ్మని కాదు, కానీ తనకుమాలిన ధర్మం వద్దని మాత్రమే!.

  నన్ను అడిగితే మీరు చెప్పింది సత్యదూరములొ ఉంది, నే చెప్పింది స్వానుభవం అయితే కానీ తెలీదు :). అయినా తన కళ్ళతొనే ప్రపంచాన్ని చూడాలి అనుకునేవాళ్ళమద్య(నన్ను కలుపుకొని) వాదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయిలెండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. శర్మ గారు మీరు చెప్పింది బాగానే ఉంది, మరి నిజంగా పౌరోహిత్యానికి లేదా బ్రాహ్మణులకు ఈ సమాజం లో గౌరవం దక్కుతోందా? ఒక్క సారి ఆలోచించండి, ఇంతకీ బ్రాహ్మణుడు ఏ ధర్మాన్ని ఆచరించాలంటారు? ఆ వేదాలు చెప్పిన ధర్మాలనా లేక నేటి యుగ ధర్మాలనా? ఇంతవరకు మనం మన సాంప్రదాయాలను పాటించినందువల్ల మనకు ఒరిగింది శూన్యం. అందుకే ఆ ధర్మాలను పక్కన పెట్టకుండానే విద్య ,వ్యాపార,ప్రభుత్వ, రాజకీయ రంగాలలో మనదైన స్థానాన్ని నిలుపుకోగలగాలి. లేకుంటే చేతికి చిప్పే దొరికేది. ఇప్పుడున్నది కూడా అదే కదా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. శర్మగారు,
  అద్భుతమైన పోస్టుకు ధన్యవాదాలు. మీ ఆలోచనలకి నమోవాకాలు.

  రాజేష్, రాఘవగార్ల వ్యాఖ్యలు కొన్ని ఆలోచనలు రేపాయి. బ్రాహ్మణ వంశంలో పుట్టినవారు సనాతనంగా వస్తున్న తమ ధర్మాలనీ ఆచారాలనీ పాటించాలా అక్కరలేదా అన్న విషయం ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే అనుకుంటాను. సామాజికంగా పౌరోహిత్యమే కాదు చాలా కులవృత్తులు మునుపటి ఆదరణని కోల్పోయాయి. ఇక్కడ మరో విషయం - కులవృత్తి వేరు, అనుష్ఠించాల్సిన సంప్రదాయాలు ధర్మాలు వేరు. కనీసం కొన్ని వందల సంవత్సరాలుగా బ్రాహ్మణులు కేవలం పౌరోహిత్యమే కాకుండా ఇతర వృత్తులు (అధ్యాపన, మంత్రాంగం మొదలైనవి) చేస్తూ వచ్చారన్నది స్పష్టం. తమ వృత్తి నిర్వహణకి సంబంధించిన పనులు కాక బ్రాహ్మణులుగా కొన్ని ధర్మాలు అందరికీ సమానంగా ఉన్నాయి. వాటిని అందరూ పాటించే వారు. ఇప్పుడది లేదు. ఏ వృత్తిలో ఉన్నా ఆ ధర్మాలని అనుసరించగలమా అని ప్రశ్నించుకోవాలి. ఎవరికి చేతనయినంత, చేతనైన రీతిలో వాళ్ళు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరదీ లేదు.
  మారుతున్న కాలంతో బ్రాహ్మణులు కూడా మారడం తప్పా ఒప్పా అన్న ప్రశ్న పక్కన పెడితే, అలా మారిన తర్వాత కూడా వాళ్ళకి "బ్రాహ్మణులు"గా ప్రత్యేక గౌరవం ఉండాలి అనుకోవడం సమంజసం కాదు కదా. అటు చేసే వృత్తి, ఇటు ధర్మమూ రెండూ లేనప్పుడు/లేదా మారినప్పుడు, ఇంక ఆ కులానికి కాని వర్ణానికి కాని అర్థం, ఉనికి ఏముంది?

  ప్రత్యుత్తరంతొలగించు
 18. మీ బ్లాగు నాకు ఆదర్శప్రాయంగా ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.