29, సెప్టెంబర్ 2010, బుధవారం

గోవులను కష్టపెట్టే పూజలు ఆపండి మహాప్రభో!

పూర్వం ఏ పూజ చేసినా ముందుగా గోపూజ చేసిగానీ మొదలు పెట్టేవారు కాదు. నేడు ప్రతీ పూజలో కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన పూజలలో మనం  కూడా గోపూజ చేస్తున్నాం. కానీ నాటికీ నేటికీ గోపూజలో హస్తిమశకాంతరం ఉంది. పూర్వం గోవులను బట్టే వారి సంపదను లెక్కించేవారు. ప్రతీ వారికీ గోవులు ఉండేవి. ఉదయాన్నే లేచి వాటిని పూజించి మిగతా కృత్యాలు చేసుకోవడం ఆచారంగా ఉండేది.నేడు మనలో నూటికి తొంభైతొమ్మిది మందికి గోవులు లేవు. మనకు ఆ పూజ ఆచారమూ పోయింది. సరే అంతవరకూ బాగానే ఉంది.





 గృహప్రవేశాలప్పుడు ఇంటిలోనికి ముందుగా తాముపెంచుకునే గోవుని పంపి తాము ప్రవేశించడం ఆచారంగాఉండేది. నేటికీ ఆ ఆచారం ఉంది. కాకపోతే నేడు ఆ గోవులు మనవి కావు. ఎక్కడో ఎవరో పెంచుకునే ఆవులను మనం తెప్పించుకుంటాం. ఇక ఆ ఆవు చేత సర్కస్ చేయిస్తాం. పూర్వం ఇళ్లన్నీ మట్టి నేలలతో ఉండేవి. ఇప్పుడు మరి మనవి పాలరాతి నేలలు. చక్కగా నున్నగా పాలిషింగ్ పట్టించి నీళ్లు పడితే జారిపడే విధంగా ఉంటాయి. ఆ నేలమీద మనమే అప్రమత్తంగా ఉంటే జారిపడతాం. అలాంటిది అలవాటు లేని ఆవూ,దూడలను మెట్లు ఎక్కించి, ఆ ఇంట్లో కాళ్లు జారుతూన్నా ఇల్లంతా తిప్పించి, భజంత్రీలు, బంధుగణాలతో నానా గోలా చేసి దానిని భయపెట్టి ఆ భయంతో అది పేడ వేస్తే ఆహా ఇల్లు పవిత్రమైందని భావించి మనం గృహప్రవేశం చేసుకోవడం అవసరమా!?

 దానికంటే చక్కగా ఓ వెండి గోవును పళ్లెంలో పెట్టుకుని లోపలికి ప్రవేశించండి. గోవు చాలా పవిత్రమైనది. దానిని పూజ అనే పేరుతో నేడు మనం నానా హింసలూ పెడుతున్నాం. ఇదంతా తెలిసి చేస్తున్నాం అనికాదు. ఎవరూ ఆలోచించడం లేదు అంటున్నాను. గోవు బాధ పడకుండా ఇంట్లోకి ప్రవేశించాలి అంటే అక్కడివాతావరణం సహజంగా ఉండాలి. కొత్త వాతావరణంలో కొత్తవారిని చూస్తే అవి బెదురుతాయి. పైగా భజంత్రీలు, బంధువులు ఉంటారు. ఇంత మందిని ఒకేసారి చూసి కూడా అవి చాలా భయపడతాయి. ఇక ఆ గ్రానైట్ నేలమీద నడవడం కూడా వాటికి చాలా కష్టంగా ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి ఈ ఆచారం నేటికి సరికాదని తెలుసుకోండి. కొంతమంది అపార్ట్ మెంట్లు కూడా ఎక్కించేస్తున్నారు. దయచేసి ఆపని చేయకండి. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవలసి వస్తుంది. ఒక వేళ పెద్దలు, పురోహితులు ఎవరైనా అదేంటి గోవులేకుండా ఎలా ? అని ప్రశ్నిస్తే ఈ కారణాలన్నీ చెప్పి సున్నితంగా తిరస్కరించండి. నాకు తెలిసి పురోహితులు చాలా మందికి ఈ స్పృహ ఇప్పటికే కలిగింది. యజమానులు కూడా అర్థం చేసుకో గలిగితే గోవును బాధపెట్టిన పాపం తగలకుండా ఉంటుంది.

 ఇక గోపూజను పూర్తిగా వదిలిపెట్టనవసరం లేదు. గృహప్రవేశమప్పుడు దగ్గరలో ఉన్న గోవును పిలిపించండి. కానీ ఇల్లంతా తిప్పే పని మాత్రం మానండి. చక్కగా గోవును పూజించండి. ఈ పూజా క్రమంలో కూడా ఆ గోవు ఒళ్లంతా పసుపు,కుంకుమ చల్లకుండా పాదాలకు, నుదుటివద్ద, తోకకు మాత్రమే కాస్త పసుపు రాసి పూజించండి. మనం కూడా పసుపు మంచిదని ఒళ్లంతా చల్లుకోం కదా!? పాదాలకు రాసుకుంటారు. అలాగే ఆవుకు కూడా.





ఇక ఆవుకు బిడ్డపుట్టేటప్పుడు ప్రదక్షణాలు కూడా దానిని భయపెట్టేవిధంగా ఉంటున్నాయి. కాస్త ఆవిషయంలో కూడా ఆలోచించండి. ఈ మధ్య మరీ మూర్ఖంగా ఆవుకు ఆరుపాదాలు ఉన్నాయి అంటూ వాటిని ఇల్లిల్లూ తిప్పి దానిపేరుతో డబ్బులు దండుకునే వారు తయారయ్యారు. అటువంటి వారిని ప్రోత్సహించకండి. చేతనైతే నాలుగు చివాట్లు పెట్టండి. ఆ ఆవులను పూజ పెరుతో ఒక చిన్న లారీ లాంటి దానిలో పెట్టుకుని తిప్పడం ఎక్కడో చూశాను. రెండు చేతులున్న మనకే లారీలో నుంచుని ప్రయాణించడం కష్టమైన పని. ఆ లారీ దూకుడుకు నుంచోలేక క్రింద కూర్చుంటాం. అలాంటిది చేతులు లేని ఆవులకు ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. దాని ప్రాణం ఎంత హడలిపోయి ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి. అలా వాహనాలలొ తిప్పి డబ్బులడిగే వారిని తప్పకుండా ఖండించాలి. కావాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇస్తామని బెదిరించాలి.

ఆవుకు ఆరు కాళ్లు ఉంటే చాలా మంచిదని, దానికి పూజించడం చాలా విషేషమని మన నమ్మకం. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానివెనుక కారణాలు ఆలోచించాలి మనం. నోరులేని, మనకంటే నిమ్న స్థాయిలోని ప్రతీ జీవినీ మనం దాదాపుగా పూజిస్తాం. ఆఖరికి కుక్కను కూడా కాల భైరవుడంటూ పూజిస్తాం. అలా ఎందుకంటే వాటికి రక్షణ కల్పించాలని. వాటికి కూడా జీవించే హక్కును కల్పించాలని. మనం భక్తి పేరుతో నైనా వాటిని రక్షిస్తామని. గోవు ఎవరికీ హాని చెయ్యని సాధుజంతువు. పైగా అది తినేది గడ్డి, ఇచ్చేది తియ్యటి పాలు. అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు మూత్రం, పేడ కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ ఈ ఐదింటిని గో పంచకము అంటారు. విషేష పూజలలో వీటిని పూజించి సేవించడం నేటికీ ఉంది. అటువంటి ఆవును రక్షించాలని దానికి పూజలలో ప్రథమ స్థానం ఇచ్చారు. ఏదైనా ప్రయోజనం ఉన్నంత సేపే మనం దానిని రక్షిస్తాం. మన స్వార్థ గుణంతో ఏ ఉపయోగం లేదని, అంగవైకల్యంతో జన్మించిన ఆవులను సంరక్షించడం కష్టమని వాటిని ఎక్కడ వదిలేస్తామో అన్న చింతనతో అటువంటి వాటిని విషేషంగా పూజించాలన్న నియమం పెట్టి ఉండవచ్చు. అలాంటిది వాటిని పూజపేరుతో ఊరూరూ తిప్పుతూ మరింత బాధ పెట్టడం చాలావిచారకరం. అందరూ ఈ విధానాలను ఖండించాలి.

 గోవులను బాధపెట్టకుండా పూజించే వీలులేకపోతే ఆ పూజలు మానండి. నష్టమేమీ లేదు. వాటిని తెలిసికానీ తెలియక కానీ ఏవిధంగానూ బాధ పెట్టడం మంచిదికాదు.

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

పిల్ల గణపతులు

అందరూ గణేష్ ఉత్సవాలు జరుపుకుని ఉంటారు. ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులూ గణపతిని మన శక్తి కొలదీ పూజిస్తాం. నవరాత్రులు వచ్చాయంటే పెద్దల హడావిడి కంటే పిల్లల అల్లరే ఎక్కువగా ఉంటుంది. ఆ నవరాత్రి పందిరిలో పిల్లలు లేకపోతే అసలు తోచనే తోచదు. వాళ్లు ఏదో కోతి పని చేస్తూ, కాసేపు "ఓం గం గణపతయే నమః " " జై గణపతి మహరాజ్ కీ జై " అంటూ, కాసేపు చేసే పూజలు శ్రద్ధగా చూస్తూ ఉంటే అదో అందం. నేనైతే పెద్దలతో పాటు పిల్లలనూ తప్పనిసరిగా పూజకు కూర్చోపెట్ట మని చెప్తాను. దానివల్ల పూజలు అంటే వారికీ కొంత అవగాహన కలిగించినట్లు అవుతుంది.

 పిల్లలు పూజలలో పాల్గోవడమే కాదు. నేడు వాళ్లే సొంతగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు అక్కడక్కడా. ఓ చిన్న పందిరి వేసి, దానికి వారికి తోచిన రీతిలో అలంకారం చేసి, చిన్నదో పెద్దదో ఓ గణపతిని పెట్టి తొమ్మిది రోజులూ పూజలు చేసేస్తున్నారు. ఇంతవరకూ సంతోషదాయకమే కానీ కాస్త పరికించి చూస్తే చాలా పెద్ద ముప్పు కనిపిస్తోంది నాకు.

పిల్లలు ఓ నోట్ బుక్ పట్టుకుని చందాల కోసం ఇల్లిల్లూ తిరుగుతున్నారు. వచ్చిన చందాలను ఎలా ఖర్చుపెట్టాలో నేర్పే పెద్దలు ప్రక్కన లేరు. పట్టిచ్చుకునే వారు కూడా ఉండరు. అరే పిల్లలైనా ఎంత చక్కగా చేస్తున్నారనే ఆనందం వ్యక్తం చేస్తారు. అలా మండపాలు వేసి గణపతిని పెట్టి పూజించే పిల్లల తలిదండ్రులు కూడా తమ పిల్లలగురించి గొప్పలు చెప్పుకోవడమే కానీ కాస్త దూరం ఆలోచించరు. అందువల్ల పిల్లల్లో ఉన్న భక్తి కాస్తా, పరధన భుక్తిగా మారే అవకాశమే ఎక్కువగా ఉంది. నెడు చాలమంది పెద్దలు భగవంతుడి పేరుతో చేస్తున్న పనే ఇది. పెద్దలకే దైవ ధనాన్ని జాగ్రత్తగా, స్వలాభాపేక్ష లేకుండా ఖర్చుపెట్టడం కత్తిమీద సాములాంటి పని. దానికి భగవంతుని యందు భక్తి, ప్రేమ లతో పాటు కాస్త భయం కూడా ఉండాలి.

 
పిల్ల గణపతులు


మరి పిల్లలు పోగేసిన చందాలు భగవంతుని కార్యానికి సక్రమంగా వినియోగిస్తున్నారా అని ఎంతమంది పరిశీలిస్తున్నారు. అసలు చందాలు వసూలు చెసి పందిరిలో నవరాత్రులు నడపడమే సక్రమైన పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా భక్తి కల పిల్లవాడు అమ్మా నేను కూడా నవరాత్రి పూజలు చేస్తాను అంటే ఆ తల్లిదండ్రులు చక్కగా ఇంట్లో గణపతిని పెట్టుకుని దగ్గరుండి పిల్లవాడిచేత పూజలు చేయించి, ప్రసాదాన్ని పిల్లల చేతులమీదుగా నలుగురికీ పంచిపెట్టడం నేర్పాలి. తద్వారా పూజయొక్క ఆవశ్యకత తెలిచేయడమే కాకుండా, మనకు కలిగినది స్నేహితులు నలుగురితో కలిసి పంచుకోవాలి అనేటటువంటి మంచి విషయాలు అలవాటు చేసినట్లవుతుంది.

 లేదా పిల్లలు ఇంకా గోలపెడితే ఇంటి ముందే ఓ చిన్న పందిరివేసి అందులో గణపతిని పెట్టి పూజించాలి. ఇక్కడ కూడా అన్ని పనులూ పెద్దల పర్యవేక్షణలో పిల్లల చేత జరుపబడాలి. అలా పందిరిలో పెట్టిన పక్షంలో ఆ గణపతిని వర్షం, ఎండ తగలకుండా-కుక్కలు పిల్లులు పూజా సామాగ్రిని పాడుచేయకుండా చూసుకునే బాధ్యతను పిల్లలకు అప్పజెప్పి ఎలా రక్షిస్తున్నారో గమనించాలి. అవసరాన్ని బట్టి తగిన సూచనలిస్తుండాలి.

ఈ ఉత్సవాలు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో చేసే అలవాటు నేర్పాలి. ఆర్భాటాలు పనికిరాదన్న సంగతి ఖచ్చితంగా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. గొప్పలు చాటుకోవలనే ప్రయత్నంలో మన పెద్దలు నేటికీ నీరు కలుషితమౌతోందని ప్రభుత్వం మొత్తుకుంటున్నా వినకుండా పెద్ద పెద్ద విగ్రహాలు, రకరకాల రంగులద్ది మరీ తయారు చేస్తున్నారు. అది తీసుకు వెళ్లి నీటిలో కలుపుతున్నారు. మన శాస్త్రాలు పూజవల్ల మనకు శుభం జరగాలంటే, ఆ పూజల వల్ల చిన్న ప్రాణికి కూడా అపకారం జరగకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాయి. ( మనం తద్దినం పెట్టినప్పుడు పిండాలతో ఉన్న దర్భలు తిని నోరు చీరుకుని చేపలు చనిపోతాయేమోనని దర్భలు నీటిలో కడిగి ఒడ్డున పడవేసి అప్పుడు పిండాలను నీటిలో కలపని పెద్దలు చెప్తారు. ) ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో ఆలోచించి మన పూజా విధానాలను రూపొందించారు పెద్దలు. అలాంటిది నేడు మన గొప్పలు వికృత రూపాలు దాల్చి పర్యావరణాన్ని ఎన్నోవిధాల నాశనం చేస్తున్నాయి. కనీసం దేముని విషయంలోనైనా అలా జరగకుండా జాగ్రత్త తీసుకోవడం మొదలుపెడితే అది క్రమంగా మన ప్రతి పనిలోనూ అలవాటవుతుంది. అందుకని పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వివరించి చెప్పాలి. పందిరి లో గణపతిని పెట్టడం ఎలాగైనా కాస్త ఖర్చుతో కూడినది కనుక ఒక్కరే దాని ఖర్చులు భరించడం కష్టమైతే చూట్టూ ఉన్న నలుగురు పిల్లల తలిదండ్రులనూ అందులో భాగస్వామ్యం చెయ్యాలి. ఇది కేవలం పెద్దలమధ్య అవగాహనగా ఉండాలి. పిల్లల జోక్యం ఇందులో ఉండకూడదు.

ఇలాకూడా కాదని పిల్లలకి పుస్తకాలిచ్చి ఊరిమీదికి పంపడం చాలా ఘోరమైన పని. దీని ప్రభావం పిల్ల వ్యక్తిత్వం మీద పడుతుంది. "మన పనైతే మనమే చేసుకోవాలి. అదే దేముని పనైతే నలుగురూ చేయివేస్తారు. అలా మన పని నలుగురి సాయంతో చేయడం ఓ కళ. పందిరి నిర్వహించిన పేరు ఒకరిది. డబ్బు ఊరందరిదీ...." ఇలా సాగాయనుకోండి వారి ఆలోచనలు ఇక వారిని భగవంతుడు కూడా రక్షించలేడు. మనకు ఉత్సవాలు చేయాలని కోరిక కలిగితే మనమే చేయాలి కానీ ఊరిమీద పడడమెందుకు? ఈ మధ్య కొన్ని చోట్ల యువజన సంఘాలు బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయట! ఇది మరీ దారుణం.  మనం ఉత్సవాలు చేస్తుంటే మా ధనం కూడా కొంత వినియోగించండి అని ఎవరినా స్వచ్ఛందంగా తీసుకోమని కోరితే తప్పులేదు. కానీ చందాలు అడగడం అంత పొరపాటు పని మరొకటి ఉండదు.

చందాలు అడగడం ఒక ఎత్తైతే ఆ వచ్చిన ధనాన్ని ఖర్చు చేయడం మరో ఎత్తు. దానికీ పెద్దల సహకారం పిల్లలకి కావాలి. ఎటువంటి వాటికి ధనం ఖర్చుచేయాలి? ఎటువంటి వాటికి ఖర్చు చేయకూడదూ అనేది వారికేం తెలుస్తుంది. మనసు కోరిందల్లా చేస్తారు. ఈ క్రమంలో వారూ గొప్పలకు పోవడం లేదా స్వలాభం చూడడం వంటివి జరుగుతాయి. దేముడి ధనం మన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే అధికారం మనకి లేదు అనే విషయం వారికి స్పష్టంగా చెప్పక పోతే పెద్ద అనర్ధమే జరుగుతుంది. ధనం విలువ వారికి తెలియక పోగా, భగవంతుడి పేరుతో స్వార్ధ ప్రయోజనాలను నెరవేర్చుకునే పరమ స్వార్థ స్వభావులుగా తయారవుతారు. పైకి భక్తులుగా ఉంటూనే లోలోపల భగవద్రవ్యాన్ని ఏ విధంగా ఖర్చుచెయ్యాలా అన్న భావనలు వారిలో పెంపొందుతాయి.

చందాలే కాకుండా నేడు లడ్డూల వేలంపాటకూడా పెచ్చుమీరి పోతున్నది.

ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

దీక్షలు స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.

 దీక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత భవానీ దీక్ష కూడా చాలా మందికి పరిచయం. ప్రతీ ఒక్క భక్తుడూ ఏదో ఒకసందర్భంలో దీక్ష తీసుకోవాలని అనుకుంటాడు. దీక్షలు చాలా మంది పడుతూ ఉంటారు. కానీ దీక్షా ఫలాన్ని ఏకొందరో మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఎందువల్ల?

నెలరోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మానేయగలరా? ఈ నెల రోజులూ జీతం ఇవ్వం, ఉచితంగా మీ సేవలు అందించండి అంటే ఎంత బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది మన జీవన ఉపాధి కనుక. మనమీద కుటుంబ బాధ్యతలు ఉంటాయి కనుక. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అందుకే కంపెనీ ఎంత లాసులో ఉన్నా కనీసం సగం జీతమైనా పొందే వరకూ పోరాడతాం. అలాగే ఈ దీక్షను రోజుల తరబడి చేస్తాము. మరి ఫలితం పొందకుండా ఎలా? పొందితీరాలి. అటువంటి దీక్ష ఎలా స్వీకరించాలి? ఏమి నియమాలు పాఠించాలి? అసలు ఏదీక్ష ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది?

మీరు అయ్యప్ప దీక్ష విని ఉంటారు. దుర్గా దీక్ష విని ఉంటారు. శివ దీక్ష విని ఉంటారు. హనుమత్ దీక్షలు తెలుసు. బ్రహ్మచర్య దీక్ష గురించి కొందరు విని ఉంటారు. విద్యా దీక్ష ఎప్పుడైనా విన్నారా? ఉద్యోగ దీక్ష తెలుసా? మరి మౌన దీక్ష? ఇలా అనేక రకాల దీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు తెలిసి, కావాలనుకుని స్వీకరిస్తాం. మరికొన్ని ఇది దీక్ష అని తెలియకుండానే స్వీకరిస్తాం.

ఉదాహరణకు : బ్రహ్మచర్య దీక్ష. ఉపనయనము అయినప్పటి [ పిల్లవాడిని స్కూలులో చేర్చిన దగ్గర ]నుండీ, స్నాతక మహోత్సవం [ డిగ్రీనో, పీజీనో పూర్తి చేసి పట్టా పుచ్చుకునే ] వరకూ మనం బ్రహ్మచర్య దీక్ష అంటాము. ఇది తెలిసినా తెలియక పోయినా మనం దీక్షను పాటిస్తున్నట్టే.

అలాగే మనం ఒక్కో సారి ఓ నెలరోజులలో ఈ ఇంగ్లీషు గ్రామరు పై పట్టు సాధించాలి అని అనుకుని గంటల తరబడి సాధన చేసి ఇంగ్లీషుపై పట్టు సాధిస్తాం. అది కూడా దీక్షే! విద్యా దీక్ష అనవచ్చు.

ఇక ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేవి దైవ దీక్షలు. ఏదో ఒక దైవం మీద నమ్మకంతో ౪౦ రోజులు దీక్షపూని, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. వీటివలన ఆధ్యాత్మిక ఉన్నతి తద్వారా విద్యా ఉద్యోగ ఉన్నతులు కూడా కలగుతాయి. ఇంకా అనేక కోరికలు తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు.

అటువంటి ఉన్నతి మనకు కలగాలంటే ఎలా?

 మనం ఎంతో ఎదిగాము అనుకుంటాం. చాలా నాగరికులం అనుకుంటాము. కానీ ఒక్కోసారి సంతలో గొర్రెలలా ప్రవర్తిస్తాం. పక్కింటి వాళ్ల అబ్బాయి ఇంజనీరుంగు చేస్తున్నాడని మన వాడూ ఇంజనీరైపోవాలి అని పెద్దలు, మన స్నేహితులు అందరూ ఇంజనీరింగే కనుక మనమూ ఇంజనీరై పోవాలి అని పిల్లలు. ఎంసెట్ లో ఎంత రాంకు వచ్చినా ఫర్వాలేదు. ఏదో మారుమూల కాలేజీ లోనైనా ఫర్వాలేదు. మొదట ఓ గొప్ప బ్రాంచ్ అనుకుంటాం. మన రాంక్ చూసి ఇది చాలు లే అనుకుంటాం. తీరా కౌన్సిలింగ్ లో అది కూడా రాదని తెలిసి వాడు ఏదిస్తే దానికి ( మొక్కలకు పందిరెయ్యడం నేర్పే కోర్స్ ఒకటి పెట్టి, దానికి ‘పందిరి బ్రాంచ్’ అని పేరు పెట్టి అందులో సీట్లున్నాయి అంటే దానికి కూడా ) సిద్ధమే మనం. ఏ బ్రాంచ్ అయితే నేముంది. నాలుగుసార్లు తప్పినా ఫర్వాలేదు. చివరికి ఇంజనీరింగ్ అయింది అనిపించుకుంటే చాలు. తరువాత మళ్లీ ఏ కంప్యూటర్ కోర్సో చేసి ఎలాగోలా బి.పి.ఓ. జాబ్ సంపదించకపోతామా... ఇదే మన ఆలోచన, కాదు కాదు ధోరణి అనాలేమో.? ఎందుకంటే అసలు ఆలోచన అనేది ఉంటేగా..? చుట్టూ నలుగురూ చేస్తున్నారు. బాగా సంపాదించొచ్చు. నలుగురితో పాటు నరాయణా!

ఏమి చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదువుతాం. అదీ ఒక చదువేనా..?

 అంటే ఇంజనీరింగ్ ఎందుకూ పనికి రాని చదువని కాదు నా ఉద్దేశం. అది చాలా గొప్పది. అసలు నిరర్ధకమైన విద్య అనేది లేదు. మనం చదివే తీరే అలా ఉంది. ఇంజనీరింగ్ రాయాలంటే ఎవరో అన్నట్టు గట్స్ కావాలి. నేను ఫలానా కాలేజీలో, ఫలానా బ్రాంచ్ లో మాత్రమే చేరతాను. అని నిర్ణయించుకుని దానికి తగిన కృషి చేసి అక్కడే సీట్ సంపాదించి చదవాలంటే చాలా తెగువ, పట్టుదల ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చదివింది చదువు అని నలుగురి ముందూ ఒప్పుకోవచ్చు. అలా లేని నాడు అది చదువే కాదు. అలా భ్రమ పడుతున్నారంతే!


 సరిగ్గా దీక్షలు స్వీకరించే విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలామంది స్వీకరించి ఉంటారు. కానీ ఎంతమంది నియమాలు సరిగ్గా పాటించారు? ఇక్కడా మనం గొర్రెల్లా మరొకరిని అనుసరిస్తున్నామే తప్ప కాస్త ఆలోచించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాం. తిరుగుతాం. కొందరు ధూమపానం కూడా చేస్తారు. మరి తాగే వారు నాకు ఇంకా కనపడలేదు భగవంతుడి దయవలన. తోటి స్వామి పడి పూజ వెయ్యిమందిని పిలిచి చేస్తే , మనం రెండువేలమందిని పిలుస్తాము. రేపటి నుండి దీక్ష కనుక ఈ రోజు ఫుల్లుగా పట్టించేసి రేపు ఆ మందు దిగకుండానే మాలను ధరించాలి. (ఇది నా స్నేహితులైన స్వాములకు స్వీయ అనుభవం. తోటి స్వాములు కొందరు అలా ఉండే వారుట.) సాయంత్రం అల్పాహారం పేరుతో అరవై రకాలు ఆరగించాలి. చుట్టూ ఉన్న స్వాములు అలా చేస్తే మనమూ అలా ఎందుకు చేయాలి? కాస్తైనా ఆలోచన ఉండదా? "మాలధారణం నియమాల తోరణం" అంటూ రోజూ పాడుకుంటాం కానీ, నియమాలు పాటించడం అబ్బో అన్ని నియమాలు పాటించడం కొంచెం కష్టమే. అందుకే మన వీలును బట్టి కుదిరినవి పాటిస్తాం. ఇంకెందుకండీ దీక్ష? దీనివలన వచ్చే పుణ్యమేమో కానీ, పాపం మూట కట్టుకుంటున్నాం. నలుగురికోసం కాదు మనకోసం మనం దీక్షపూనుతున్నాం. నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి. మనలో అహం కారాన్ని పెంచే దీక్షలు వేలసార్లు పూనినా ఏమిటి లాభం? జీవితాన్ని తరింప చేయగల దీక్ష జన్మానికి ఒక్క సారి స్వీకరించినా చాలు.

నేడు మనం స్వీకరిస్తున్న భగవత్ దీక్షల నియమాలు బ్రహ్మచర్య దీక్షనుండి స్వీకరించినవి అయి ఉండవచ్చు. ఉపనయనమయిన బ్రహ్మచారి ఎటువంటి నియమాలు పాఠించాలో మన పెద్దలు చెప్పారు. దాదాపు అటువంటి నియమాలే నేడు స్వామి దీక్షలకూ విధించుకున్నాము.

దీక్ష - నియమాలు

౧.సూర్యోదయాత్ పూర్వం లేవాలి.
౨.సూర్యోదయానికల్లా పూజను ప్రారంభించాలి.
౩.రోజుకు కనీసం ౧౦౦౦ సార్లు నామాన్ని స్మరించాలి. ఏ పని చేస్తున్నా మన నాలుకపై భగవన్నామం ఆడుతూ ఉండాలి.
౪.వార్తా పత్రికలు, టీవీ, ఇంటర్ నెట్ వంటివి ముట్టుకో కూడదు. ఉద్యోగ విషయమై అవసరమైతే తప్ప.
౫.ధూమ పానం, మద్య పానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
౬.శాఖాహరం ,సాత్వికాహారం తీసుకోవాలి.
౭.కోపం పూర్తిగా వీడాలి. వివేకం పని చేయాలి.
౮.సత్యం మాట్లాడడం చాలా అవసరం.
౯. ఈ దీక్ష మానసిక, వాచిక, కాయికములను మూడింటి ద్వారా జరగాలి.
౧౦.మూడు కాలాలూ భగవంతుని ఉపాసన చేయాలి. ఉద్యోగస్తులు కనీసం ౨ కాలాలు(ఉదయం,సాయంత్రం) అయినా పూజించాలి.
౧౧.నోటితో అసభ్య పదాలు పలకూడదు.
౧౨.చేతితో చెడు చేయకూడదు.
౧౩.మనసుతో చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది చాలా కష్టమైనది. కానీ అమ్మమీద భారం వేసి మొదలు పెడితే అంతా శుభం జరుగుతుంది.
౧౪. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ఉండకూడదు.ఎల్లప్పుడూ విబూధి ధరించి, ఎర్రని తిలకాన్ని ధరించాలి. ఉదయం పూజానంతరం గంధాన్ని ధరించాలి. తెల్లని స్ఫటిక పూసలు దీక్షా మాలగా ధరించాలి. శిఖను ధరించాలి. మొలత్రాడు తప్పక ఉండాలి. పూజా సమయంలో పంచె, కండువాలు మాత్రమే ధరించాలి. చేతికి దీక్షా కంకణమును రక్షగా కట్టుకోవాలి.

౧౫. నేలమీద శయనించాలి. నేలమీద కూర్చుని భుజించాలి. నీటిని కూడా కూర్చుని స్వీకరించాలి. ఏక భుక్తము చేయాలి. భోజనము కొరకు కాక, శక్తి కొరకు మాత్రమే అన్నట్లు భుజించాలి.

౧౬. భగవంతుని చిత్రపటమును, కలశమును పెట్టి ఈ దీక్షాసమయంలో పూజించాలి. పూజా ప్రదేశము నిత్యము శుభ్రముగా ఉంచాలి. దీపం వెలుగుతూ ఉండాలి. భజనలు వంటివి జరుపుట శ్రేష్ఠము. నిత్యము ధ్యానము కనీసం ౧౫ నిమిషాలు చేయాలి. ఏపని చేస్తున్నా ఆంతరింగిక పరిశీలన చేయాలి. లోపలి వ్యక్తిని గమనించాలి.

౧౭. మనం మన జీవితంలో ఎటువంటి పురొగతి కోరుకుంటున్నామో, ఆ పనిని ఈ నలభై రొజులలో సాధన చేయడం మొదలు పెట్టాలి. మన ఆశయ సాధనకు మొదటి అడుగును వేయాలి. తరువాతి అడుగులు భగవత్కృపచే వాటంతట అవే పడతాయి.

౧౮. పూజ, ధ్యానం, ఉద్యోగం, లక్ష్య సాధన వీటితో ప్రధానంగా నిండినదై మన దిన చర్య ఉండాలి. మిగిలిన వ్యసనాలు సమయాన్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం వంటివి చేయాలి. రోజంతా భగవత్ చింతనలో గడపాలి.

 మీరు స్వీకరించే దీక్ష ఎటువంటి దైనా నియమాలు లేకుండా ఫలించదు. సరదాగా ఆడే క్రికెట్ ఆడాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాట్ విసురుతాను నువ్వు బాలుతో తన్నాలి అంటే కుదరదు. బ్యాటుతో బాలుని మాత్రమే తన్నాలి. మరి అలాంటిది మన జీవితానికి ఎన్ని నియమాలు ఉండాలి? నియమాలు లేని జీవితం అందగా ఉండదు. అర్థరహితంగా ఉంటుంది. ఆ నియమాల విలువను తెలిపేందుకే ఇటువంటి దీక్షలు అవసరమౌతాయి.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ||
ఇన్ద్రియాణి హయనాహు ర్విషయాస్తేషు గోచరాన్|  - కఠోపనిషత్తు.

ఆత్మ రథికుడు, శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. ఇంద్రియాలు గుర్రాలు, అవి నడిచే దారులు విషయ వస్తువులు.

నేర్పరి అయిన సారథి అనేక వైపులకు పరుగులు తీసే గుర్రాలను కళ్లెంతో అదుపు చేసి, ఒకే గమ్యం దిశగా పయనింప చేస్తాడు. అలాగే బుద్ధి శాలి అయిన వాడు అనేక విషయ వాసనలతో పరి పరి విధాల ఆకర్షింప బడు ఇంద్రియాలను, మనసు అనే కళ్లెంతో అదిలించి, అంతర్ముఖం చేసి, ఒకే దారికి మళ్లించి గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే మనకు మనమే కొన్ని నియమాలను విధించుకుని మంచి మార్గం వైపుకు ఇంద్రియాలను మళ్లించుకున్న నాడు మన గమ్యాన్ని చేరగలుగుతాము.