20, జనవరి 2011, గురువారం

ఓ పురోహితుని పరిచయం - నాకు వచ్చిన ఈ లేఖ

 నేను మొన్న రాసిన "మీరూ పురోహితులుగా మారండి" అనే వ్యాసానికి స్పందనగా నాకు ఒక మెయిల్ వచ్చింది. నేనాశించిన పురోహితం అటువంటిదే అని చెప్పడానికి బ్లాగు మిత్రులతో అది పంచుకుంటున్నాను.


రాజశేఖరుని విజయ్ శర్మ గారు
నమస్కారములు.

మీరు రాసిన "మీరూ పురోహితులుగా మారండి" అనే వ్యాసం చదివాను. చాలా చక్కగా రాసారు. మీ వ్యాసం చదివాక మేము కూడా ఇదే మార్గంలో 40 సంవత్సరాలుగా జీవిస్తున్నాము అని చెప్పడానికి సంతోషిస్తన్నాను.
ఆర్తితో చేరవచ్చిన వారిని ఆర్తిహరులుగా, రోగులై ఆశయ్రించిన వారిని యోగులుగా తీర్చిదిద్ది, సనాతన ధర్మాన్ని శాస్త్రంతో సమన్వయించటంలో అపరపారాశర్యునిగా, ఆచరించి చూపటంలో జగదాచార్యునిగా వాసికెక్కిన కులపతి శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి దర్శకత్వంలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ, పరోపకారమే పరమాశయంగా, స్వధర్మాచరణమే తపస్సుగా, జీవించటమే యోగసాధనగా, ఇల్లే ఈశ్వరాలయంగా భావించే  రామనాథం( పేరు మార్చాను) గారు మా తండ్రిగారని చెప్పుకోవవడానికి నేను ఎంతో గర్వపడుతాను. ఆయన అడుగుజాడలలోనే మాతల్లిగారు కూడా పయనించిన మహోన్నతమూర్తి. మేమందరం ఇలా ఉన్నమంటే వారి ఆశీఃఫలమే తప్ప మరొకటి కాదు.


మా తండ్రిగారికి ఎంఏ తెలుగు చదివేరోజులలో కులపతి శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి శిష్యరికం లభించింది. ఆయన వలన హోమియోవైద్యం మరియు ఆధ్యాత్మిక జీవన విధానము అవడ్డాయి. మా తండ్రిగారు అధ్యాపకవృత్తిలో ఉంటూనే ఉచిత హోమివైద్యసేవ చేసేవారు. ఆర్తితో వచ్చినవారి సాంత్వన వచనాలు చెప్పి వారి ఆర్తిని తీర్చేవారు. అలాగే రామాయణం, భారతం వంటి వాటిలోని పాత్రల ద్వారా నిత్యజీవితంలో మన నడవడిని ఎలా తీర్చదిద్దుకోవాలో ప్రవచనాల రూపంలో చెప్పేవారు.

అలాగే ఆయన అధ్యాపకవృత్తిలో ఆయన దగ్గర చదుకోవడానికి వచ్చే విద్యార్థులకు లౌకికమైన విద్యతో పాటు జీవితానికి కావలసిన ఆధ్యాత్మిక సమన్వయం, ఆధ్యాతికత వేరు, జీవితం వేరు కాదని, జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపుకుంటూనే ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించాలో ఆచరణాత్మకంగా బోధించేవారు. మాతల్లిగారు కూడా పంతోమంది విద్యార్ధులకు మార్గదర్శకత్వం చేసేవారు.. ఎంతోమంది మాకు అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్ళుగా కలిసిపోయినవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తికాదు. దానితోపాటు తల్లి కడుపు చూస్తుంది, తండ్రి ....... చూస్తాడు అన్నట్టుగానే మాతల్లిగారు ఇంటికి ఎవరు వచ్చినా వారు చెప్పకపోయినా తెలుసుకుని వారికి ఏదికావాలో అది కడుపునిండా పెట్టేవారు.

మాయింటిని ఒక దేవాలయంగా, అడుగుపెడితే దేవాలయంలోకి అడుగుపెట్టినట్టుగా భావించేవారు. అంతేకాకుండా మాయింటికి మాస్టర్ కుటీర్ అని నామకరణం చెయ్యడమే కాకుండా మాఇంటి ముందుభాగానికి సాంత్వన అని, వైదద్యసేవ చేసే చోట స్వస్థత అని, మేము పూజ, ధ్యానం చేసుకునేచోట సాధన అని, మాయింటి మేడమీద ఉన్న రెండువాటాలకు కలాప, శంబళ అని నామకరణం చేసారు. దీనికి ఆయన స్వస్థత అనే చోటుకు వస్తే భౌతికమైన ఆరోగ్యం చేకూరుతుందని, సాంత్వన అనే చోటుకు వస్తే జీవితంలోని ఒడిదుడుకులకు చక్కని పరిష్కారం లభించి, ఆధ్యాత్మిక సాధనకు మార్గం సుగమం అవుతుందని, అక్కడినుడి సాధన అనే చోటుకు వస్తే చేస్తున్న, చేసిన, మరియు మొదలుపెట్టిన సాధన ఫలించి పరమగురువుల స్థానములైన కలాప, శంబళ గుహలను చేరి వారి ప్రణాళికలో జీవితాలను నడుపుకుని, పుట్టినందుకు మానవజన్మను సారథకం చసుకుంటారు అని తరచు చెప్పేవారు. అలాగే అలా తీర్చదిద్దబడిన వారిలో తగివారు ఎవరైనా ఉంటే వారికి కళ్యాణం కుదిర్చేవారు. ఇలా చెయ్యడంవల్ల సమాజానికి మంచి క్రమశిక్షణ గల తరాన్ని అందించినట్లు అవుతుంది అని చెప్పేవారు. ఎంతో కళ్యానం కానివారికి కూడా మార్గదర్శనం చేసి సంబంధాలు కుదిర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఒకటి రెండు ఉదంతాలు ప్రప్తావించి ముగిస్తాను.

మాచిన్నతనంలో ఒక విద్యార్థి కళాశాలో చేరి మాతండ్రిగారితో సాన్నిహిత్యం పెరిగాక ఆయన మాయింటికి సాయంత్రంపూట ధ్యానానికి వస్తుండేవాడు. అతనిది మాఊరికీ దగ్గరలోని చిన్నపట్టణం. అక్కడ కళాశాల సౌకర్యం అప్పట్టో సరిగా లేనందువలన మరియు మాతండ్రగారు పనిచేసే కళాశాల మాకోనసీమలో ప్రముఖమైనది కావడం వల్ల అతను అందులో చదువుకున్నాడు. మాకు ప్రతిరోజూ ఉదయం ధ్యానం, పూజ, సాయంత్రం ధ్యానం అనంతరం మంచి పుస్తకం మాతల్లిగారు చదువుతుంటే వినడం మాకు అలవాటు. ఎవరైనా వచ్చినా వీటిలో తప్పకుండా పాల్గొనేవారు. ఎవరికయినా ఏదైనా, ఏవిషయం మీద అయినా సందేహం వస్తే మాతండ్రిగారు తీర్చేవారు. అలాగే మాతల్లిగారు సహాయపడేవారు. వచ్చినవారిలో ఎవరయినా అర్థాకలితో ఉన్నా గమనించి వారికి తినడానికి ఏమయినా పెట్టేవారు. ఇలా వారు చూపించే ప్పేమ, ఆప్యాయతలకు కరగిపోయి వారి సమస్యలను కూడా చెప్పుకునేవారు. మాతల్లి దండ్రులిద్దరూ వారిని తమ కన్నబిడ్డలలాగ ఆదరించి, వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఆవిధంగా వారు మంచిమార్గంలో మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా, పదిమందిని తామే నడిపించగల ధీరులుగా తయారయ్యేవారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న విద్యార్థి మాయింటికి ధ్యానానికి వచ్చినప్పుడు మా యొక్క ఈవిధమైన జీవనవిధానానికి ఆకర్షితుడైనాడు. అలా ఒకసంవత్సరం గడిచాక ఒకనాడు మాతండ్రిగారితో మాస్టారూ నాకు రూములో ఉండి చదువుకోవడం ఇబ్బందిగా ఉంది. మీ ఇంటిదగ్గర అయితే నాకు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలవుంది. రావచ్చా? అని అడిగాడు. దానికి ఆయన దాన్దేముంది. తప్పకుండా రావోయ్ అన్నారు. అప్పటినుండి రోజువారి ధ్యానంతో పాటు మిగిలిన సమయంలో మాయిటిదగ్గరే చదువుకుంటూ ఉండేవాడు. అతనికి వాళ్ళ ప్రక్క పల్లెటూరిలోని బంధువుల ఇంటినుండి భోజనం వచ్చేది. శలవువులు వస్తే మాత్రం వాళ్ళ ఊరు వెళ్ళేవాడు. ఏరోజైనా భోజనం రాకపోతే మాతల్లిగారే గమనించి సమయానికి అతనికి భోజనం పెట్టేవారు. అలా మాయింట్లో చదువు, అప్పుడప్పుడు మాతల్లిగారి చేతి భోజనం, మాతండ్రడిగారు చెప్పే మంచిమాటలతో అతను మాకుంటుంబ సభ్యుడిగా కలిసిపోయాడు. అప్పటికి మేము చాలా చిన్నవాళ్ళం. మేము అతనితో ఆడుతూపాడుతూ, అతను చెప్పే కథలువింటూ అతనితో కలిసిపోయాం. అలా అతను పూర్తికాలం మాయింట్లోనే ఉండిపోయి, అక్కడినుండే కళాళాలకు వెళ్ళే స్థితికి వచ్చాడు. అతని చదువు కొద్దికాలంలో అయిపోతుందనగా ఒకనాడు అతను మాతండ్రిగారితో మాస్టారూ మాపెద్దచెల్లెలు ఉంది. ఆమె విప్లవంగా మగళ్ళందరినీ ద్వేషిస్తోంది. మగవాళ్ళందరూ వెధవలు. వాళ్ళందరినీ కాల్చిపారెయ్యాలి. పెళ్ళాం మగాడి బానిస..... ఇలా మాట్లాడుతూ, వేదికలమీద ఉన్యాసాలు ఇస్తూ పెళ్ళి వద్దనే స్థితికి వచ్చింది. మాకు ఏమిచెయ్యాలో తెలియడంలేదు అన్నాడు. అప్పుడు మాతండ్రడిగారు అయితే మీచెల్లెలిని కొంతకాలం మాయింట్లో ఉండటానికి తీసుకురా. మేము ఆమె ప్రవర్తన, ధోరణి, నడవడి గమనించి మంచిమార్గంలోకి వచ్చేలా చూస్తాం. కానీ ఈవిషయాలేమీ ఆమెకు చెప్పకు. అన్నారు. ాతను తక్షణమే తన చెల్లెల్ని తీసుకువచ్చి మాయింట్లో దింపేసి వెళ్ళిపోయాడు. మాతల్లిదండ్రులు ఆమెను తమ సోంతకూతురులాగా ఆదరించారు. వారు మోదట ఆమె చేసిన వాదనకు ఎదురు చెప్పకుండా ఆమె దారిలోనే సమాధానపరుస్తూ, నెమ్మదిగా ఆమెలో మార్పు తీసుకువచ్చారు. ఒకనాడు మాతల్లిగారు ఆమెతో నువ్వు మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటున్నావు కదా. మీతండ్రగారు, మాస్టారు(మాతండ్రిగారు) కూడా చెడ్డవాళ్ళేనా అని అడిగారు. అప్పుడు ఆమె వాళ్ళిద్దరూ మాత్రమే మంచివాళ్ళు తక్కినాళ్ళు కాదంది. సరే అయితే అలాంటి ఇంకొకళ్ళు ఉంటే పెళ్ళి చేసుకుంటావా అని లడిగా మాతల్లిగారు. దొరికితే తప్పకుండా చేసుకుంటాను అంది. ఇది జరిగి కొన్నాళ్ళకు వాళ్ళ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న వాళ్ళ అన్నయ్య స్నేహితుడిని చూసింది. అతనిని బాగా గమనించి, పరీక్షించి ఒకరోజు మాయింటికి తీసుకువచ్చి ఇతనినే చేసుకుంటాను అంది. మాతల్లిదండ్రులు మనఃస్ఫూర్తిగా ఆశ్వీరదించారు. అతను మాతండ్రీగారిలాగే చాలామంచివాడు. ఆరకంగా ఆఅమ్మాయి జీవితం మాతల్లిదండ్రుల వలన చక్కబడింది, ఇప్పుడు ఇద్దరమ్మాయిలతో చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటూ పదిమంది మంచిచేసే స్థితిలో ఉంది.

ఇలాంటిదే మరొకటి

మాతండ్రిగారు ప్రతిరోజూ ఉచితంగా హోమియోవైద్యం చేసేవారు. ఎవరు ఎప్పుడు వచ్చినాకూడా విసుగు కనిపించనీయకుండా ఆప్యాయంగా మందు ఇచ్చి వారికి కావలసిన సహాయం చేసేవారు. ఒక్కోసారి అర్థరాత్రిపూట కూడా తేలు వంటి విషకీటకాలు కరిచాయని మందుకోసం పరుగున వచ్చేవారు. అలాంటి సందర్భాలలో ఏమాత్రం కంగారు పడకుండా మందువేసి బాధ నివారణ అయ్యేవరకు రోగి ప్రక్కనే ఉండి సాంత్వన వచనాలు చెబుతుండేవారు. వారు కొద్దిసేపటిలోనే బాధ నివారణ అయి సంతోషంగా దండాలు పెడుతూ వెళ్ళిపోయేవారు. ఒకనాడు రాత్రి పదిగంటల ప్రాంతంలో ఒకవ్యక్తి వచ్చి తలుపుతట్టారు. మాతండ్రిగారు తలుపు తీసి ఏమిటండీ వచ్చినపని? అని అడిగితే దానికి ఆయన మేము ఈఊరికి కొత్తగా వచ్చాము. మాఅబ్బాయికి ఆస్త్మావ్యాధి ఉంది. సమయం సందర్భం లేకుండా ఊపిరి తీసుకోలేనంతగా ఆయసంతో బాధపడతాడు. ఇప్పుడు కూడా అలాగే వచ్చి గిలగిలలాడిపోతున్నాడు. మేము ఈఊరికి క్రొత్త కాబట్టి ఏమిచెయ్యాలో తెలియక మాప్రక్కవాళ్ళని అడిగితే మీదగ్గరకు వెళ్ళమన్నారు అని చెప్పారు. వెంటనే మాతండ్రిగారు గురువుగారికి దండం పెట్టుకుని (ఏపని చేసినా మొదట గురువుగారికి దండం పెట్టుకోవడం ఆలవాటు. అదే మేమందరం పాటిస్తున్నాము) ఒక మోతాదు మందు ఇచ్చి ఇది వెంటనే అబ్బాయికి వేసెయ్యండి. రేపు సావకాశంగా అతనిని తీసుకువస్తే లక్షణాలు, మూలకారణం, చరిత్ర అన్నీ చూసి వ్యాధి నివారణ చేస్తాను అన్నారు. వచ్చినాయన మందు తీసుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఎంతో సంతోషంగా వారి అబ్బాయిని తీసుకుని మాయింటికి వచ్చి మాస్టారూ మీరిచ్చిన మందు ఇంటికి వెళ్ళిన వెంటనే అబ్బాయికి వేసేసాను. మందు వేసిన అరగంటలో ఆయసం తగ్గి సుఖంగా నిద్రపోయాడు. వ్యాధి వచ్చిన తరువాత ఇంతసుఖంగా రాత్రిపూట నిద్రపోవటం ఇదే మొదటిసారి అన్నారు. అప్పుడు మాతండ్రిగారు మనదేముందండీ అంతా గురువుగారి దయ అనిచెప్పి, అబ్బాయి వ్యాధికి కారణాలు, ఎన్నాళ్ళనుంచి వస్తోంది వంటి వివరాలు కనుక్కుని వైద్యం ప్రారంభించారు. అప్పటినండి అతను తరచు మాయింటికి వచ్చి మందు తీసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మాతండ్రిగారు అతను ఏమి చేస్తుంటాడు ,అతని మానసిక స్థితి, కుటుంబ వివరాలు వంటివి కనుక్కున్నారు. అతను ఇంజనీరింగ్ రెండోసంవత్సరం మాకు దగ్గరలోని కళాశాలోనే చదువుతున్నాడు. అతని తండ్రిగారికి వ్యాపారంలో భాగస్వాములు మోసం చెయ్యటం వల్ల నష్టం వచ్చందిట. పూలు అమ్మిన చోట కట్టెలు, కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మలేనివిధంగా వ్యాపారం చేసే ఉరు వదిలి మాఊరు రావటం జరిగింది. ఈఅబ్బాయి బాగా మెరిట్ విద్యార్థి. అతను ఇంటర్మీడియెట్ చదువుతుండగా ఐఐటికి కూడా చాలా కష్టపడి చదివాడు. కానీ కొద్దిలో ర్యాంకు తప్పిపోయి డిప్రెషన్ లోకి వచ్చేసాడు. అప్పటి నుండి తనమీద తనకే నమ్మకం తగ్గిపోయి, మానసికంగా కృంగిపోయి శారీరక అనారోగ్యం పాలైపోయాడు. ఇదంతా విన్న మాతండ్రిగారు అతనిని నువ్వు నాదగ్గర మందు తీసుకోవడంతో పాటు, నువ్వు కళాశాలనుండి ఇంటికి వచ్చాక సాయంత్రం పూట మాయింటికి ధ్యానానికి రా. అంతా గురువుగారే చూసుకుంటారు అని చెప్పారు. అలాగే అతను మాయింటికి రోజూ ధ్యానానికి వచ్చేవాడు. ధ్యానం అయిన తరువాత అతనికి ఉండే సందేహాలను మాతల్లిదండ్రులు తీర్చి సాంత్వన కలిగించేవారు. అతను  నెమ్మదిగా గురువుగారి దయవల్ల అతని శారీక, మానసిక ఆరోగ్యాలు దారిలో పడసాగాయి. ఒకరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బాగా వర్షం కురుస్తున్నవేళ అతను ఏడుస్తూ బాగా డిప్రెషన్ కి లోనయి మాయింటికి వచ్చి మాతల్లిగారితో ఆంటీ నేను బాగా డిప్రెస్ అయిపోయాను. నేను ఎందుకు పనికివస్తానో తెలియదు. అందుకని చచ్చిపోవడానికి వెడుతున్నాను. ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకయినా మంచిదని మీకు చెప్పడానికి వచ్చాను. వస్తాను అని చెప్పి వెళ్ళిపోబోయాడు. అసమయంలో మాతండ్రిగారు కళాశాలకు వెళ్ళారు. ఇలాంటి సందర్భాలలో మాతల్లిగారు కంగారు పడరు. నిదానంగా ఆలోచిస్తారు. వెంటనే ఆవిడ అదేమిటి అలా అంటున్నావు. ముందు నువ్వసలు లోపలికి వచ్చి కూర్చో అని అతనిని పట్టుకుని లోపలకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి అతతని బాధ కనుక్కుని తప్పు నాన్నా ఇలాంటి పిచ్చిపనులు చెయ్యకూడదు. గురువుగారి దయ ఉండబట్టి నీకు కనీసం మాయింటికి వచ్చి చెప్పాలి అనిపించింది. లేకపోతే ఏమయ్యేది అంటూ ఓదార్చారు. తరువాత వేడిపాలు ఇచ్చి పడుకోబెట్టారు. ఈలోగా మాతండ్రిగారు వచ్చి పరిస్థితి చూసి అతనికి ధైర్యం చెబుతూ నువ్వు ఇలా అధైర్యపడితే మీతల్లిదండ్రులు ఏమైపోతారు. జీవితంలో ఎన్నో ఓటములు వస్తుంటాయి. ప్రతి ఓటమిని ఒక విజయానికి పునాదిరాళ్ళుగా తీసుకోవాలి. చూస్తూ ఉండు తొందరలోనే గురువుగారి దయవల్ల మీ కుటుంబపరిస్థితి చక్కబడుతుంది. అలాగే నీ ఆరోగ్యం బాగుపడి, నువ్వు ఇంజనీరింగ్ మంచిమార్కులతో ప్యాసవుతావు. ఆపైన అమెరికా కూడా వెడతావు అంటూ ధైర్యం చెప్పారు. అతను తన ఆలోచనని విరమించుకుని, స్థిమితపడి ప్రశాంతమైన మనస్సుతో ఇంటికి వెళ్ళాడు. అతనికి అప్పుడు అమెరికా వెళ్ళడమనే ఊహ కలలో కూడా లేదు. కానీ గురువుగారి అనుగ్రహం వల్ల మాతండ్రిగారు చెప్పినట్లుగానే కొంతకాలానికి అతని తండ్రికి ఆయన భాగస్వాములతో ఉన్న సమస్యలు పరిష్కారమయి నష్టం కొంత భర్తీకావడం జరిగింది. ఆతరువాత ఆయన క్రొత్త వ్యాపారం ప్రారంభించి నిలదొక్కుకుని మంచిస్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ మంచిమార్కులతో ప్యాసయి, పైచదువులకు అమెరికా వెళ్ళడం, తదుపరి అక్కడే ఉద్యోగం తెచ్చుకోవడం జరిగాయి.

ఇలాంటి ఎన్నో విషయాలు మాయిట్లో మాతల్లిదండ్రుల ద్వారా జరగడం మేమెరుగుదుము. ఇలాంటివన్నీ చూస్తే మీరు రాసిన "మీరూ పురోహితులుగా మారండి"  అనేదానికి మాయిల్లె ఒక ఉదాహరణ అనిపిస్తుంది.

నమస్కారాలతో....

1 కామెంట్‌:

  1. నిజం . ఇలాంటి గురుకులాలు ఇవాళ అత్యవసరం.ఋషితుల్యులైన ఈ వ్యాసకర్త తల్లీదండ్రులకు నమోవాకములు

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.