22, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం? - 1

 ఈ విషయం పై చర్చించే ముందు వాల్మీకి రామాయణంలోని ఈ ‘తాటక వధ’ ఘట్టాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకని ఈ టపాలో కథ రాస్తున్నాను.

{బాలకాండము 24-25-26 సర్గల నుండి కొంత సంక్షేపించి గ్రహిస్తున్నది. }

      తండ్రి ఆదేశం మేరకు యాగ సంరక్షణార్థం విశ్వామిత్రుని వెంట వెళ్లిన రామడు "బల- అతిబల" అనే విద్యలను నేర్చుకుంటారు. గురువైన విశ్వామిత్రుని తో రామలక్ష్మణులు పవిత్ర గంగా సరయూ సంగమ ప్రదేశమును దర్శించి, "అచ్చటనే పరమశివుడు తపస్సు చేసెననీ - మన్మధుని దహించి వేసెనని - అందువలన అతనికి ‘అనంగుడను’ నామము కలిగెనని - ఆ ప్రదేశమునకు ‘అంగదేశము’ అన్న పేరు కలిగెనని" తెలుసుకొంటారు. అక్కడి నుండి నావపై గంగా సరయూ సంగమ ప్రదేశాన్ని దాటి కీకారణ్యమున ప్రవేశిస్తారు. రాముడు ఆసక్తిగా అడిగిన ప్రశ్నకు విశ్వామిత్ర మహర్షి ఆ అరణ్య చరిత్రను వివరించడం మొదలు పెడతారు.

       ఆప్రదేశము పూర్వము " మలదము - కరూశము " అనే జన పదములుగా ఉండెడిది. ఇంద్ర వర ప్రసాదితములైన ఆ జనపదములు అనేక సంపదలతో తులతూగెడివి. కానీ కొంతకాలము తరువాత-  పుట్టినప్పుడే వేయి ఏనుగుల బలము కలదియు, కామ రూపిణియు ఐన "తాటక" యను యక్షిణి ఇచట నివశించెను. ఆమె తన కుమారుని తో కలసి ఈ నగర ప్రజలను బాధింప సాగెను. జనపదములను ధ్వంసము చేసెను. తత్ఫలితముగా "మలదము - కరూశము" అను ఈ జన పదములు నిర్జనములుగా మారెను. తాటక ఈ ప్రాంతములను ఆక్రమించి నేటికీ జీవనము సాగించుచుండెను. శత్రుసంహారకా! రామా! నీవు నీ బాహు బలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము - అని పలికెను.

అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు:

అల్ప వీర్యా యదా యక్షాః శ్రూయంతే మునిపుంగవ |
కథం నాగ సహస్రస్య ధారయత్యబలా బలమ్ | |

ఓ మునీశ్వరా! యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. అబల అయిన తాటక ( యక్షిణి) వేయి ఏనుగుల బలమును కలిగియుండుట ఎట్లు సంభవము?

అందుకు సంతోషించిన విశ్వామిత్రుడు శత్రు భయంకరుడైన రాఘవునితో ఇట్లు పలికెను: "సుకేతుడను" మహాయక్షునికి బ్రహ్మ వరప్రభావమున వేయిఏనుగుల బలము కలిగినదిగా "తాటక" అను పుత్రిక కలిగెను. అట్లు జన్మించిన తాటక పెరిగి యుక్తవయస్కురాలాయెను. చక్కని రూప శోభలతో విలసిల్లెడి ఆమెను ’జంభాసురుని’ కుమారుడైన "సుందునకు" ఇచ్చి వివాహము చేసెను. తాటకకు "మారీచుడు" అను కుమారుడుకలిగెను. అతడు ఇంద్రుని యంతటి పరాక్రమ శాలి. అగస్త్యుని వలన సుందుడు మరణించగా, తన కుమారుడైన మారీచునితో కూడి ఆ తాటక అగస్త్యుని చంపుటకు పూనుకొనెను. ఆయనను తినివేయుటకు గర్జించుచూ ముందుకురికెను. అది చూసిన అగస్త్యుడు "రాక్షసత్వము పొందుము" అని మారీచుని శపించెను.

రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః
అగస్త్యః పరమ క్రుద్ధః తాటకామపి శప్తవాన్

పురుషాదీ మహా యక్షీ విరూపా వికృతాననా
ఇదం రూపం విహాయాథ దారుణం రూప మస్తుతే

"ఓ తాటకా! నీకు ఈ రూపము పోయి, భయంకర రూపము ప్రాప్తించును. వికారమైన రూపముతో, వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివగుము"  అను అగస్తుడు తాటకను గూడా శపించెను.

అట్లు అగస్త్యుని శాపమును పొందిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను. ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమునంతయును ధ్వంసమొనర్చుచున్నది.


ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణమ్
గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్ట పరాక్రమామ్

కనుక ఓ రాఘవా! దుష్ప్రవర్తన గలదియు, మిక్కిలి భయంకరమైనదియు, తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవములను కలిగించుచున్నదియు ఐన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము, బ్రాహ్మణులకు హితమును గూర్చుము.

ఓ రఘునందనా! శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవుతప్ప ఈ ముల్లోకములయందెవ్వడును సమర్థుడు కాడు.

న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ
చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనునా

ఓ నరోత్తమా! ’స్త్రీని చంపుట యెట్లు?’ అని ఆమెయెడ కనికరము చూపవద్దు. నాలుగు వర్ణముల వారికిని ( ప్రజలందరికి ) మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యాము.

నృశంసమనృశంసం వా ప్రజారక్షణా కారణాత్
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా

ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజలహితమునకై చేయుకార్యము అది క్రూరమైనదా, తద్భిన్నమైనదా? అని చూడరాదు. అది పాపకృత్యమైనను, దోషయుక్తమే ఐనను దానిని అవశ్యము ఆచరింపవలసినదే.

రాజ్య భార నియుక్తానామ్ ఏష ధర్మః సనాతనః
అధర్మ్యాం జహి కాకుత్ స్థ ధర్మో హ్యస్యా నవిద్యతే

రాజ్యభారమును మోయు వారికి ఇది విద్యుక్త ( నిత్య ) ధర్మము. కనుక ఓ కాకుత్ స్థా! అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఈమెకృత్యములలో ‘ధర్మము’ అనుమాటకు చోటే లేకున్నది కదా!


శ్రూయతే హి పుర శక్రో విరోచనసుతాం నృప
పృథివీం హంతు మిచ్ఛంతీం మంథరామభ్యసూదయత్

ఓ రామా! పూర్వము విరోచనుని సుతయైన ‘మంథర’ అను నామె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను - అని విందుము.

విష్ణునాపి పురా రామ భృగుపత్నీ దృఢ వ్రతా
అనింద్రం లోకమిచ్ఛంతీ కావ్యమాతా నిషూదితా

భృగు పత్ని, శుక్రాచార్యుని తల్లియు ఐన ‘ఉశన’ అనునామె ఇంద్రాది దేవతలను చంపుటకు దృఢ వ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపెను.

ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్త్ర మహాత్మభిః
అధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమైః
తస్మాదేనాం ఘృణాం త్యక్త్వా జహి మచ్ఛాసనాన్నృప

ఓ రాజకుమారా! ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు, సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. కావున ఓ రామా! కనికరము చూపక నా మాటను పాటించి, దుర్మార్గురాలైన తాటకను వధింపుము.

అంది అంతయు వినిన రామడు ఈ విధముగా పలికెను:

పితుర్వచననిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్
వచనం కౌశికస్యేతి కర్తవ్యమ్ అవిశంకయా

గురువర్యా! ‘ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము’ అనునది మా తండ్రిగారి ఆదేశము, వారి ఆఙ్ఞలను అవశ్యము గౌరవింతును.

అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా
పిత్రా దశరథేనాహం నావఙ్ఞేయం హి తద్వచః

 మహాత్ముడును, మా తండ్రియును ఐన దశరథుడు అయోధ్యలో వసిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆఙ్ఞాపించియుండెను. ఆమాట నాకు ఉల్లంఘింపరానిది.

సోహం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః
కరిష్యామి న సందేహః తాటకావధముత్తమమ్

 మాతండ్రిగారి ఆఙ్ఞప్రకారము, బ్రహ్మవాదులైన మీశాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించితీరెదను.

గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ
తవచైవా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః

గోరక్షణమునకును, బ్రాహ్మణులహితము కొఱకును, ఈ దేశముయొక్క సౌఖ్యము కొఱకును మహామహిమాన్వితులైన మీవచనము పాఠించుటకు పూనుకొనుచున్నాను.

అని పలికిన రాముడు తన ధనుష్టంకారము చేస్తాడు. అది విని వారిపైకి ఉరికిన తాటకను చూసి సోదరునితో " ఓ లక్ష్మణా! ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును. చూడుము. ఈమెను చూచినంతటనే పిఱికివారి గుండెలు బ్రద్ధలగును. మాయలమారియు, ఎదిరింపరాని శక్తికలదియు అయిన ఈమెను ముక్కు,చెవులు ఖండించి వెనుదిరిగి పారిపోవునట్లు చేసెదను. స్త్రీ అగుటవలన చంపుటకు నేను ఇష్టపడుటలేదు.( నహ్యేనాముత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షితామ్ )"  అనుచు ఆమెను చంపుటకు ఇష్టపడడు. ముందుగా కాళ్లు చేతులు ఖండించిన ఆమె గమన శక్తిని, శక్తి సామర్థ్యములను నశింపచేయుట యుక్తమని భావించి ఆవిధంగా చేస్తాడు. కానీ మాయావి అయిన  తాటక అనేక రూపములను పొంది వారిని భ్రమ పెట్టుటకై యత్నించెను. అది చూసిన విశ్వామిత్రుడు "ఓ రామా! నీవు ఇంత వరకు ఆమెపై చూపిన కనికరము చాలును. ఇంక ఉపేక్షింప తగదు. సంధ్యాసమయము కావొస్తున్నది. ఆ సమయములో వారి శక్తి మరింత పెరుగును కనుక వెంటనే ఆమెను వధింపుము" అని సూచించుటతో రాముడు తమపై అదృశ్య రూపములో రాళ్ల వాన కురిపించు చున్న తాటకపై "శబ్దవేధి" విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. తనను అడ్డగించు చున్న రామలక్ష్మణులపైకి మరింత వేగముగా పిడుగువలే ఉరికి వచ్చుచున్న తాటకను రాముడు వక్షస్థలముపై బాణముతో కొట్టి, ఆ తాటకకు ముక్తిని ప్రసాదించెను.

ఇది అంతయు చూసి ఇంద్రాది దేవతలు సంతసించిరి. విశ్వామిత్రునితో " ఓ బ్రహ్మర్షీ! శ్రీరాముడు దేవతలకొఱకై ఒక మహా కార్యము నిర్వహింప వలసి ఉన్నది. కావున ప్రజాపతి అయిన "భృశాశ్వుని" కుమరులైన దివ్యాస్త్రములను అన్నింటిని రాఘవునకు ఉపదేశించ వలసినది" అని పలికిరి. వారి వాక్యముల మేఱకు విశ్వామిత్రుడు రామునకు అనేక దివ్యాస్త్రములను ప్రీతితో ఉపదేశిస్తాడు. ఇవి తరువాతి కాలములో రావణునితో యుద్దము చేయుటకు ఎంతయో ఉపయోగపడినవి.

తరువాతి టపాలో ( ఈ అభినవ తాటకను వధిస్తే మీరు సిద్ధులౌతారు  లో ) ఈ కథపై చర్చ వస్తుంది.

సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.

1 కామెంట్‌:

  1. నా రాముడు శతృసంహారకుడా! కాదు కాదు, ఎంత నీచమైన పనికి ఒడిగట్టిన రావణుడ్ని కూడా శరణాగతి కోరితే వదిలేస్తానన్నాడు. తను వధించిన ప్రతి రాక్షసునికి మూడు పర్యాయములు అవకాశమిచ్చి అధిగమిస్తేనే చంపాడు.
    అతను రాక్షససణారానికై ఉద్భవించిన శ్రీమహావిష్ణువు అవతారం.
    ఆయన సాత్వికుడు, ఇంత నింద నా స్వామికి తగునా?
    తాటకకు కూడా మూడు పర్యాయములు చంపుదామని విల్లు ఎక్కుబెట్టి,ఆమెకు అవకాశం ఇస్తాడు. అది స్త్రీ జాతి పట్ల ఆయనకు గల గౌరవం. అంతటి ఆ రాముడినే నేడు మనం నానా విధాలా దూషిస్తాం, ఆయన చరితమైన రామాయణాన్ని శంకించి అవమానిస్తాం. ఇదంతా అవసరమా?

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.