24, ఫిబ్రవరి 2011, గురువారం

ఈ అభినవ తాటకను వధిస్తే మీరు సిద్ధులౌతారు


   "మూర్తీ భవించిన ధర్మ మూర్తి, ఆదర్శ పురుషుడు అని ఆస్తికులందరూ కొనియాడే ఆరాముడు తన రాక్షససంహారంలో మొదటగా తాటక అనే రాక్షసిని చంపాడు కదా! మరి అదేమి ధర్మం?అబలను చంపుట అదేమి న్యాయం? అతడేమి దేముడయా?" అని అనేకులు ప్రశ్నిస్తుంటారు. ఇది అందరికీ అర్థం కాని ధర్మ సూక్ష్మం కనుక ఈప్రశ్న వేయడానికి ఆస్తిక - నాస్తిక బేధం అవసరం లేదు. ఎవరైనా వేయవచ్చు. అది సమంజసమైనదే కూడా! అటువంటి సందేహం వచ్చింది అంటే రామాయణం గురించి కొంత యోచన చేస్తున్నట్లే.  ఈ ప్రశ్నకు వాల్మీకి రామాయణం ద్వారా నాకు తెలిసినంత వరకు నా సమాధానాన్ని( నా అభిప్రాయాన్ని ) తెలిపే ప్రయత్నం చేస్తాను.వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణము. మిగతా వన్నీ దానినుండి ఉద్భవించినవే. వీటిలో అనేక స్వీయ కల్పనలు ఉన్నాయి. కనుక వాల్మీక మహర్షి ప్రణీత రామాయణమును తెలుసుకోనిదే నిజం తేట తెల్లమవదు.కనుక నేను ఇతః పూర్వం టపా ( ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం? - 1 ) లో తెలిపిన తాటక వధ ఘట్టాన్ని ఓ సారి చదివి ఈ చర్చను కొనసాగించగలరు.


  ఇప్పుడు మనం పై ప్రశ్నపై ఆలోచిద్దాము. రాముడు తాటకను ఎందుకు చంపాడు? ౧. తండ్రి ఆదేశం ( విశ్వామిత్రుని ఆదేశాలను శిరసావహించమని ), ౨. గురువు సూచన, ౩. గోవులకు, బ్రాహ్మణులకు హితము చేయడం కోసం, ౪. ఆదేశ ప్రజల సౌఖ్యము కొరకు( లోకకళ్యాణార్థము ) నేను తాటకను చంపుతాను అని రాముడు చెప్పాడు.

దశరథుడు విశ్వామిత్రునితో రాముని పంపుతూ  అతడు ఏమి చెపితే అది శిరసావహించి నిర్వహించ మని చెప్పి పంపాడు. అలాగే గురువైన విశ్వామిత్రుడు ధర్మాధర్మాలు వివరంగా తెలిపి తాటకను చంపడం రాజుగా నీధర్మం అనితెలిపాడు. కనుక రాముడు నేను తాటకను చంపుతాను అన్నాడు. అన్నాడు కానీ వెంటనే చంపక కొంత అవకాశమిచ్చాడు. ఆమె అబల అగుట చేత నాకు ఆమెను చంపుటకు మనస్కరించడం లేదు. కనుక ఆమె కాళ్లు, చేతులు నరికి వేసినచో ఆమె గమనశక్తి తగ్గి వెనుతిరుగుతుంది అని లక్ష్మణునితో చెప్పి ఆవిధంగా చేస్తాడు. కానీ ఆమె మాయావి అగుటచే కంటికి కనిపించకుండా అనేక రూపాలలో వీరిపై రాళ్ల వర్షం కురిపిస్తుంది. సంధ్యవేళ వస్తె ఆమె శక్తి పెరిగుతుంది, ఆమెను చంపటం మరింత కష్టమౌతుంది అని గురువైన వశ్వామిత్రుడు సూచించడంతో ఇక తప్పక ఆమెను వధిస్తాడు. ఇన్ని కారణాల వలన కూడా మనకు అది అధర్మంగా తోస్తే మరో కోణంలో చూద్దాం. అది కూడా రామాయణము ( చరిత్రగా కాక )  కేవలము ఒక ‘కావ్యముగా’  మాత్రమే పోల్చుకుంటూ చూద్దాం.


తాటక ఎవరు? ఒక స్త్రీ.
స్త్రీని ఎందుకు చంపకూడదు? స్త్రీ సహజంగా శారీరక రీత్యా పురుషుని కంటే శక్తి తక్కువ కలిగినది కనుక.   ( అలాగే బ్రాహ్మణులు పురుషులైనప్పటికీ ఆధ్యాత్మిక విద్యలలో నిమగ్నులై మరొకరిని బాధపెట్టడానికి, యుద్ధము చేయడానికి విముఖులై ఉంటారు కనుక - గోవులు సహజముగా సాధు ప్రవర్తన కలిగినవి కనుక వీరిద్దరినీ చంపుటకూడా మహా పాపములుగా మన ఋషులు తెలిపారు. ) అదే అర్థంలో "అబల" అంటారు. బలము లేనిది కనుక ఆమెను చంపుట తగదు.


మరి తాటక అబలా? ఇక్కడే విచిత్రంగా చెప్పారు వాల్మీకి. "తాటక జన్మరీత్యా అబల, కానీ పుట్టుకతోనే వేయి ఏనుగుల బలము కలిగినది" అన్నారు. అంటే ఆమె అబల మరియు సబల అన్న మాట. అది ఎలా కుదురుతుంది? బలము లేనిది, అదే సమయములో బలము కలిగినదీ కూడా ఎలా అవుతుంది? ( ఇక్కడే వాల్మీకి మహర్షి రచనా వైచిత్రి అబ్బురపరుస్తుంది. మహర్షులకు మన పై ఎంత ప్రేమ ఉందో ఋజువు అవుతుంది. ఈ మర్మం తెలిసిన కొద్దీ మన కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారుతుంది. పూర్వమే (పూర్వపు టపాలో- చూడండి ) నేను తెలిపినట్లు మహర్షులు పురాణాలలో చాలా సందర్భాలను పూర్తిగా వివరింపక కొంత చూచాయగా చెప్పడం జరుగుతుంది. అది మన మీద కల అవ్యాజమైన ప్రేమ వలన తప్ప మరొకటి కాదు. వారి సూచనను గమనించి ఆవాక్యాలను తవ్వుకుంటూ వెళ్తె మనకు కొన్ని సత్యాలు తెలుస్తాయి. అవి మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పయనింప చేస్తాయి. )
అలా బలము ఉన్నది అయితే ఆమె అబల కాదు సబల అనవలసినదే కదా! ఆవిధంగా చూస్తె రాముడు అబలను చంపాడు అన్నది సరికాదు. అతడు బలహీను రాలిని చంపలేదు. వేయి ఏనుగుల బలము కలిగిన రాక్షసిని చంపాడు. కనుక ఈ అపవాదు సరికాదు.

సరే అదీ వదిలేద్దాం కాసేపు తాటక అబల అనికూడా అనుకుందాము. కానీ బలవంతు రాలు కూడా. మామూలు బలం కాదు వేయి ఏనుగుల బలం ఆమెది. పుట్టినప్పుడే ఆమెకు అంత బలం ఉంది. పైగా తాటక మాయావి. అనేక రూపాలను పొందగలదు. అనేక వస్తువులను సృష్టించ గలదు. ఇవన్నీ మహర్షి ఎందుకు చెప్పినట్టు? ఏదో సూచనగా మనకు తెలుపుతున్నట్లు ఉంది. అది ఏమై ఉంటుంది? ఈశ్వరుని సృష్టిలో ఇటువంటి తత్వం గలిగినది మరొకటి ఉన్నదా? మీకు తోచిందా అదేమిటో? తెలిసినట్లైతే చిక్కుముడి వీడినట్లే!

సరే నేనే చెప్తాను. తాటకవలెనే ఒకే సమయమున బలము లేనిది మరియు బలము కలిగినది అయిన ఒక విచిత్ర సృష్టి భగవంతుని లీలలలో కలదు. దానిపేరే "మనస్సు". ఈ మనస్సు కు కల బలము ఇంతా అంతా అని చెప్పుటకు వీలు కాదు.  అలాగే దీనికి బలము లేని స్థితి కూడా కలదు. మనలోని చాలామందికి ఈ రెండు స్థితులు అనుభవమే. ఏ స్థితి ఎప్పుడు కలుగుతుందో చెప్పుటకు ఎంతో తపస్సు అవసరం. ఆ తపస్సు చేసిన వారే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతున్నారు. మనసు మాయావి. అది ఎప్పుడు ఏ వికృత రూపం దాలుస్తుందో, ఎప్పుడు ప్రసన్నమై ఆనందాన్ని చిందిస్తుందో కేవలం సాధన వలన మాత్రమే తెలుసుకొన గలం. ఈ మర్మం తెలిసిన నాడు మీరు మాంత్రికులౌతారు.

మనసు విచ్చలవిడిగా సంచరింప చేసిననాడు, అది ఆశ్రయించ రాని వాటిని ఆశ్రయించిన నాడు వికృత రూపం దాలుస్తుంది. మీరు వ్యతిరేకించ నంత కాలం దాని వికృత రూపం తెలియదు. ఒక్కసారి మీకు బాగా అలవాటైన ( సిగరెట్ - మందు - స్త్రీ - టీవీ - జూదం )  మీకు నిజంగా చెరుపు చేస్తున్నాయనిపించిన దేనినైనా ఆపడానికి ప్రయత్నించండి. మనసు మొండికేస్తే గదమాయించి చూడండి. అప్పుడు తెలుస్తుంది దాని రాక్షసత్వం ఎంత కర్కశమైనదో. అగస్త్య మహాముని అలా తనను అదుపు చేశాడనే తాటక ( అతడిని ఏమీ చేయలేక ) అతడు సంచరించిన అరణ్యమును ఆక్రమించి అందు నివసించే ప్రజలను నానా బాధలను పెట్టింది. చివరకు ఎవ్వరినీ ఆ అరణ్యమున అడుగుపెట్టకుండా చేసింది. అలాగే మనసు కూడా మనం సంచరించిన భావాలను, అనుభూతులను ఆక్రమిస్తుంది. క్రమక్రమంగా మనకు ఆనంద కరమైన అనుభవం అంటూ ఏదీ మిగలకుండా చేస్తుంది. మొత్తం తానే అయి వికృత రూపం దాల్చి మనల్ని పిచ్చి వారిగా చేస్తుంది. ఇటువంటి వారు మనకు ఈ ఆధునిక జీవనంలో అనేకులు ఎదురవుతారు. రేపు మనమే ఆ మనసు దాడికి గురికామనేమిటి నమ్మకం?

క్షమించండి మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కేవలం ఒక ఆలోచన కల్పించి, మంచి మార్గమేదో నిర్ణయించుకోమనడమే నా ఉద్దేశం.

  మరి తిరగ బడిన ఆ మనసును ఏమి చేయాలి? ఎలా నిగ్రహించాలి? దీనికి కూడా వాల్మీకి మహర్షి అక్కడే సమాధానం చెప్పారు. మాయావియై కంటికి కనిపించక, తమమీద రాళ్ల వర్షం కురిపిస్తున్న తాటకను రాముడు ఎలా నిగ్రహించాడో అలానే నిగ్రహించాలి. మాయావియై కంటికి కనిపించక పోవడం అంటే ఈ మనసు ఎక్కడ ఉందో, దీని రూపమేమిటో మనకు కనిపించక పోవడం. రాళ్ల వర్షం మనపై మనసు చేసే దాడి ( ఏదో తెలియని బలహీనతకు గురిచేయడం, డిప్రెషన్ ). తాటకను రాముడు " శబ్ద వేధి విద్య " ద్వారా బాణములు ప్రయోగించి నిగ్రహించాడు.కంటికి కనిపించని వాటినికూడా కేవలము శబ్దము వచ్చు దిశను, తీవ్రతను బట్టి అస్త్రములను ప్రయోగించడం "శబ్దవేది విద్య" అంటారు. అలానే మన కంటికి కనిపించని ఈ మనసును తెలుసుకొనవలెనంటే అసలు ఆ మనసునుండి కలుగు ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయో, దానికి మూలమేమిటో వెతుకుతూ వెళ్లడమే శబ్దవేది అవుతుంది. అలా చేసినట్లైతే మీ మనసుని నిగ్రహించగలరు. జీవితంలో ఉన్నత స్థితిని పొందదలచినవాడు మొదటగా నిగ్రహించ వలసినది ఈ మనసునే అని తెలుపుటకు విశ్వామిత్రుడు రాముని చేత తాటక ను వధింపచేశారు.తాటకను సంహరించుట ధర్మ బద్ధమైనదని నిరూపించినాడు. మనసు కూడా తాటక వలే స్త్రీ తత్వం కలిగి, సున్నితమైనదై ఉంటుంది. అయ్యో ఈ మనసును కష్ట పెట్టడం ఎందుకు? అది కోరినది ఇవ్వవచ్చుకదా అని భ్రమించి దానిని వదిలేశామా! ఇక అంతే! మనసుకు అడ్డూ ఆపూ ఉండదు. జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. అనేక దుర్గతుల పాలు చేస్తుంది. కనుక మనసుకు మహా బలం కలదని, సక్రమంగా వాడితే అది అద్వితీయమైన శక్తిని మనకు కలిగిస్తుందని గుర్తించి, స్వేఛ్ఛావిహరిణి అయిన తాటక వలే కాక, నియబద్ధమైన దానిగా మలచుకోవాలి. మన మనసులోని కామమనే తాటకను వధించిన నాడు మీరు సిద్ధపురుషులౌతారు. కోరినది సిద్ధింప చేసుకునే మహాశక్తి వంతులౌతారు.

కానీ మనసును ఒక వైపుకు మరల్చుటకు, ఏకాగ్ర పరచుటకు గురువుల అనుగ్రహం చాలా అవసరం. రాముడు కూడా విశ్వామిత్రుని సూచన మెరకు, అతని సమక్షమున మాత్రమే ఈ తాటకను వధించినాడు. మనం కూడా ఒక గురువు సమక్షముననే ఈ సాధన చేయాలి. స్వయంగా చేయడం చాలా ప్రమాదకరం. భగవన్నామ స్మరణం సర్వదా చేసే వారికి తెలియకనే ఇవి అన్నీ జరుగుతూ ఉండును. మిగతా వారికి ఎంతో సాధన మీదనే ఈ మనోవిద్య పట్టు బడుతుంది.


రాముడేమి తపస్సు చేసెను? ( రాముడు జీవితంలో ఎక్కడా తపస్సు చేసినట్లే కనపడడు. మరి మహా మాయావులైన రాక్షసులను సంహరించాడు. గొప్పతపశ్శాలి అయిన రావణుని సునాయాసముగా సంహరించాడు. అతనికి అంతటి శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ) త్వరలో...

సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.

4 కామెంట్‌లు:

  1. గురువుగారూ!
    అద్భుతమైన విశ్లేషణ.
    మాయావీ, అబల, అతిబల ఇన్ని లక్షణాలూ మనసుని సూచిస్తూ ఉండడం అనేది సరియైన నిరూపణ.
    ఇందులో మీరు భయపెట్టిందేమీ లేదు. దమ గుణం ఎందుకు అలవరచుకోవాలో చక్కగా వివరించారు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.