15, మే 2011, ఆదివారం

దేవాలయాలు - నిర్వహణ - కొన్ని విశేషాలు

      పూర్వం రాజులు ఆయా ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడ తమకు ఎదురైన దేవతా మూర్తుల అద్భుత శక్తులకు ముగ్ధులై దేవాలయములను నిర్మించే వారు. అలాగే దేశమున కరువు కాటకములు, మానసిక పైత్యములు ప్రబలినపుడు  పండితుల సూచన మేరకు కొందరు  రాజులు దేవాలయములను నిర్మించే వారు.  ఇది ఉత్తమమైన పద్దతి.

   కొందరు పేరు ప్రతిష్ఠలు లేదా అధికారము చిరకాలము నిలుపుకొనుటకు నిర్మించేడివారు. నేడు కూడా పేరు కోసమో, పరపతి తెలుపుకొనుటకో/ పెంచుకొనుటకో, మరికొంచెం నీచ స్థాయికి దిగి దేవాలయాల పేరుతో ధనమును చేకూర్చుకొనుటకో దేవాలయములు నిర్మిస్తున్నారు.

                                               

ఇవేవీ కాక మరో కారణం వలన కూడా దేవాలయములను నేడు నిర్మించు వారు కనిపిస్తున్నారు.

   మనలో చాలా మందికి ఎంతోకొంత సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉంటుంది. కొందరికి అది సంకల్పంగానే ఉంటుంది. కొందరి విషయంలో అది కార్య రూపం దాలుస్తుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం, అనాథలకు - వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, అన్నార్తులకు అన్నదానం చేయడం, ఉచిత వైద్య సేవలు అందజేయడం ఇలా అనేక  రూపాలలో తమ సేవను సమాజానికి పంచుతుంటారు. వీటన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి అని అందులో కొందరు కొంచం ముందడుగు వేసి ఆలోచిస్తారు. మన జీవిత గమ్యం సర్వవ్యాపి అయిన ఆపరమేశ్వరునిలో లీనమవడమే అని నమ్మిన కొందరు సాధ్యమైనంత ఎక్కువ మందికి అటువంటి పురోగతిని సాధించుటలో సహాయపడడమే నిజమైన సేవ అని తెలుసుకుంటారు. కొందరికి ఆకలి బాధ ఉండవచ్చు. కొందరికి ఆరోగ్య బాధ ఉండ వచ్చు. కాని నేటి రోజులలో ఎందరికో మానసిక బాధలు. అన్నీ ఉన్న వానికీ, ఏమీలేనివానికీ కూడా ఈ మనోవ్యధలు తప్పడం లేదు. ఈ మానసిక అస్థిరతను సరిచేయుటకు వేద సాంప్రదాయమున అనేక ఉపాయములు ఉన్నవి. అందు ‘భక్తి మార్గము’ ఒకటి. అటువంటి భక్తి మార్గమును అవలంబిచుట వలన ఇహమున కల అనేక సమస్యలను సరిదిద్దుకొన గలుగుటయే కాక, ఏదైతే జీవన పరమ గమ్యమని ఆధ్యాత్మికులు నమ్ముదురో ఆ గమ్యమును చేరుటకూడా సులభతరమౌను. కనుక ఈ విషయముల యందు అత్యంత నమ్మిక ఉన్న కొందరు ఒక దేవాలయమును  నిర్మించెదరు. సద్గురువులైన పండితులను అర్చకులుగా నియమించి, వారి ఆదేశానుసారం నడుస్తూ తాము తరించడమే కాక అనేక మందికి ఒక ఆధారామును ఇచ్చి తరింపచేసిన వారవుతున్నారు.   వీరు ఉత్తమమైన ధర్మకర్తలు అని చెప్పవచ్చు.


    ఒక విగ్రహము పెట్టి, అందంగా  నాలుగు గోడలు నిర్మించినంత మాత్రమున అది దేవాలయము అయిపోదు. ఒక వేళ అలా పిలువబడినా  అది ప్రాణం లేని దేహముతో సమానము. సర్వఙ్ఞుడైన ఆచార్యుడు( అర్చకుడు), అతని ఆదేశానుసారము నడుచుకొను ధర్మకర్త , ఆచార్యుని ఉపాసనచే కలుగు మంత్ర శక్తి, ధర్మనిష్ఠ, నియమ పాలన  అనునవి ఐదు పంచప్రాణముల వంటివి. నిర్మాణము కేవలము దేహము మాత్రమే.  దేవాలయము అనునది ఒక అద్భుత శక్తి కేంద్రము. దేవాలయము నుండి ఆశక్తి తరంగములు అక్కడి ఉపాసనా శక్తిని బట్టి దేశ దేశాంతరములు ప్రసరిస్తాయి. కేవలము మనము మాత్రమే పూజలు జరిపితే అక్కడ కొంత శక్తిమాత్రమే కేద్రీకృతమౌతుంది. అనేక మంది, అనేక పర్యాయములు నిరంతరాయంగా జరుపుతూ ఉంటే అక్కడ అఖండ శక్తి ప్రసారం జరుగుతుంది. ఆ అవకాశం దేవాలయములలో మాత్రమే ఉంది. తత్కారణం గా ఎన్నో అలజడులతో దేవాలయమునకు వచ్చిన వారికి కూడా దేవాలయములో అడుగు పెట్టగానే ఒక చక్కటి ప్రశాంతత కలగడం, అసలు పరిష్కారమే లెదు అనుకున్న సమస్యలకు కూడా భగవంతుని సన్నిధిలో ఒక పరిష్కారం లభించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పేద, ధనిక భేదంలేదు. ఎవరు ఎలా వచ్చినా ఆర్తితో ప్రార్థన చేసినంత మాత్రముననే ఒక సద్భావన మనసును ఆక్రమిస్తుంది. అటువంటి ఉత్తమ ఫలితాలు కలగాలంటే ధర్మకర్తలు, అర్చకులు ఉత్తములై ఉండాలి. మొదట వీరిద్దరు భక్తులైన నాడు మిగిలిన వారికి మార్గము చూపగలరు. కేవలము చూపులకు భక్తి నడవడిక కలిగిన ధర్మకర్తలు, అర్చకులు దేవాలయమును  ఉత్తమముగా తీర్చిదిద్దలేరు. ఒకరికొకరు పరస్పర సహకారము వలన మాత్రమే శక్తి కేంద్రమైన దేవాలయము తయారవగలదు. 

సేవలన్నిటిలోకీ ఉత్తమమైన సేవ ఈ దేవాలయ నిర్వహణ. దీని ద్వారా ఎందరో ఆర్తులకు పరమేశ్వరుని అనుగ్రహము కల్పించ వచ్చు.  భక్తి తత్పరులైన ధర్మకర్తలు  పరమ భక్తులైన, ఉపాసకులైన అర్చకులను నియమించి వారి సలహా ప్రకారము దేవాలయమును నిర్వహించవలెను. అప్పుడు అది ఆనంద నిలయము అవుతుంది. లేనిచో కేవలము పేరుకు మాత్రమే దేవాలయముగా నిలచి చేతలకు అది ఒక వ్యాపార కేంద్రము అవుతుంది.

"దేవాలయాలు" అనే లేబుల్ తో ఉన్న మరిన్ని టపాలను ఇక్కడ చూడండి.  

4 వ్యాఖ్యలు:

 1. మా వైజాగ్ లో ఏ గుడికి వెళ్ళినా మొదట కనిపించేది "CMR" అని పెద్ద పెద్ద హోర్డింగులు, ఇంకా వీలైతే "చందన...." అంటూ పూర్తి పేరుతో ఆలయం ముందు వాళ్ళపేర్లు..ఆ గుడి పేరు ఓ మారుమూల వుంటే వుంటుంది లేకపోతే లేదు.. అది మనకి కనిపించదు.. దాతలు విరాళాల్ని పూర్వం ఓ బోర్డు మీద రాసే వారు..మా శంకరమఠం మీద కూడా "శ్రీ సుబ్బిరామిరెడ్డి కళాపీఠం" అనో ఇంకోటో వుంది. వీటిపై ఓ టపా రాద్దామనుకున్నాను(ఫోటొలతో సహా)..ఇంతలోనే మీ టపా చూసాను

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుంది. మంచి విషయాలు చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. As long as Hindu Temples are in the hands of corrupt Government, you can not expect any improvements.

  People must take over and manage Temples. Then they can run social institutions that can benefit old, children and needy women in the fields of Education, Health, Cultural and Social services.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.