25, నవంబర్ 2011, శుక్రవారం

గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు


   గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు  ప్రస్తావిస్తాను.

   గ్రహణ స్పర్శ సమయమున స్నానమును, మధ్యకాలమున హోమము-దేవతార్చనము-శ్రాద్ధములను, విడుపు సమయమున దానము, పూర్తిగా విడిచిన తరువాత మరల స్నానమును చేయాలి.

     " సర్వేషా మేతవర్ణానాం సూతకం రాహుదర్శనే" అనుటచేత  ఈ గ్రహణ సమయంలో అన్ని వర్ణముల వారికీ జాతాశౌచముండును. కనుక అప్పుడు ముట్టిన వస్త్రములన్నిటినీ తడుపవలెను.  కనుక ఈ సమయంలో ఏమీ ముట్టుకోకుండా స్నానమాచరించి జపాదికాలు చేసుకోవాలి. గ్రహణమునకు ముందు మూడు రోజుల నుండి గానీ, ఒక రోజు నుండి గానీ ఉపవాసముండి ఈ గ్రహణ స్నానాదులు చేసినచో మహాఫలము.  పుత్రపుత్రికలు కలవారు గ్రహణ సంక్రాంతులందు ఉపవాసము ఉండనవసరం లేదని కొందరి మతము.

      గ్రహణ సమయంలో అందరూ పట్టు స్నానం చేసి , వారి వారి ఉపదేశ మంత్రాలను జపించాలి.  మధ్యలో మరోసారి స్నానంచేసి, మళ్లీ గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేస్తారు.  ఈ సమయంలో స్నానానికి : ఉష్ణోదకము కంటే సీతోదకము, వేరేవారు సంపాదించిన ( తోడి పెట్టిన ) దానికంటే స్వయముగా సంపాదించినది, బావులలో జలముకంటే కొండలు మొదలైనవాటిలో పుట్టి స్రవించి పారునది, అంతకంటే సరోవరము లోనిది, దానికంటే నదీ జలము, దానికంటే గంగా జలము, దానికంటే సముద్రోదకము క్రమముగా ఉత్తమములు. ఈ గ్రహణ సమయానికి జాతాశౌచ, మృతాశౌచములున్నప్పటికీ గ్రహణ సంబంధమైన స్నానదానాదికాలు చేయాలి.  స్త్రీలు  ఆ సమయంలో రజస్వలై ఉన్నప్పటికీ  కూడా వేరేగా ఒక పాత్రలో ఉన్న జలముతొ స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించ వలెను.  గ్రహణస్నానము కట్టిన బట్టలతోనే చేయవలెను. తడిసిన బట్ట పిండకూడదు. వేరొక వస్త్రమును ధరించ రాదు.

" సర్వం గాంగా సమం తోయం సర్వేవ్యాస సమాద్విజాః
సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర సూర్యయోః " 


సూర్యచంద్ర గ్రహణ సమయంలో దొరికె జలమంతయూ గంగా సమానము, ద్విజులందరూ వ్యాససమానులు, చేసే ప్రతి దానమూ భూదాన సమానము. 

  శ్లో: " చంద్ర సూర్య గ్రహే తీర్థే మహాపర్వాదికే తథా
మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాసనక్షత్రాదీన్నశోధయేత్"


      చంద్ర సూర్యగ్రహణ సమయములలోను, తీర్థ ప్రదేశమందును, మహాపర్వదినములలోను మంత్ర పురశ్చరణ దీక్షకు కానీ, ఉపలక్షణముచే మంత్రోపదేశమును చేయుటాకు కానీ  మాసనక్షత్రాది శోధన అవసరములేదు

అనుట చేత కొత్తగా మంత్రోపదేశం తీసుకోవాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో సద్గురువుల వద్ద జపదీక్ష తీసుకుని జపిస్తారు. మంత్రోపదేశమునకు సూర్యగ్రహణమే ఉత్తమమని, చంద్రగ్రహణము దారిద్ర్యాది దోషకారి అని కొందరి మతము.


"చంద్ర సూర్యో పరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః
జపాద్దశాంశతో హోమ స్తథా హోమాచ్చతర్పణం
హోమా2శక్తౌ జపంకుర్యాద్ధోమసంఖ్యా చతుర్గుణం"


చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి, స్పర్శ కాక మునుపే స్నానము చేసి, అది మొదలుకొని శుద్ధమోక్షము వరకు మంత్రము ఏకాగ్రతతో జపించ వలెను. జప సంఖ్యకు పదవవంతు హోమము, దానికి పదవ వంతు తర్పణము చేయవలెను. హోమము గానీ, తర్పణము గానీ చేయలేని పక్షమున ఆ సంఖ్యకు నాలుగు వంతులు జపమే చేయవలెను. ( ఉదాహరణకు గ్రహణ సమయంలో మొత్తము 1,000 సార్లు జపం చేయగలిగితే అందులో పదవ వంతు 100 సార్లు హోమము, అందులో పదవ వంతు 10 సార్లు తర్పణము చేయవలెను. హోమము చేయలేని పక్షమున 100 కు నాలుగురెట్లు ఎక్కువగా అనగా 400 సార్లు మరల జపమే చేయాలి. అదే విధంగా తర్పణము చేయలేనిచో 40 సార్లు జపం చేయాలి. ) ఈ పురశ్చరణాంగమైన ఉపవాసమును పుత్రవంతులైన గృహస్థులును చేయవచ్చును. గ్రహణ సమయంలో పురశ్చరణ చేయదలచినవారికి మిగతా స్నాన దానాది నైమిత్తికములు చేయుటకు వీలవదు, కనుక అవి భార్యా పుత్రులు మొదలైన వారితో చేయించ వలెను.  పురశ్చరణ దీక్షపూనని వారు కూడా తమ తమ ఇష్టదేవతా మంత్ర జపమును, గాయత్రీ మంత్ర జపమును తప్పక చేయవలెను. లేనిచో ఆయా మంత్రములకు మాలిన్యమగును.

గ్రహణ సమయంలో శయనించినచో రోగము, మూత్రము విడచినచో దారిద్ర్యము, పురీషము విడచినచో క్రిమిజన్మము, మైధునము చేసినచో ఊరపంది జన్మము, అభ్యంగనము( తలంటి స్నానము ) చేసినచో కుష్టు రోగము, భోజనము చేసినచో నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము - గ్రహణానంతరము భుజింపరాదు. నిలువ ఉంచిన జలమునూ వర్జనీయము. కానీ మీగడ, మజ్జిగ, తైలపక్వము ( నువ్వుల నూనెతో వండినది ), క్షీరము  మొదలైనవి గ్రహణ పూర్వమందువి ఐనను గ్రహించ వచ్చును. కానీ వాటియందు దర్భ లు ఉంచ వలెను.

ఈ గ్రహణ సమయంలో చేసే గోదానము, భూదానము, సువర్ణ దానము మహా ఫలవంతములు.


గ్రహణ సమయంలో చేయుశ్రాద్ధము ఆమ ద్రవ్యము చేతగానీ, హిరణ్యము చేతగానీ చేయవచ్చును. సంపన్నులైన ఎడల వండిన అన్నము చేత కూడా చేయవచ్చును. తీర్థయాత్రల యందు ఏవధముగా శ్రాద్ధము చేయుదురో అదే విధముగా ఘృత ( నెయ్యి ) ప్రధానముగా చెయ్యవలయును. ఈసమయంలో భోక్తకు మహా దోషము.  

సర్వంశ్రీగురు చరణారవిందార్పణమస్తు

2 కామెంట్‌లు:

  1. చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యః శుభంభవతు వాశిష్ట మైత్రావరుణ
    కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత, కౌండిన్యస గోత్రః, ఆపస్తంబ సూత్రః, శ్రీకృష్ణ
    యజుశ్శాఖాధ్యాయి శ్రీ తటవర్తి కృష్ణమోహన్ శర్మ ఆహంభో అభివాదయే.

    గ్రహణస్నానము కట్టిన బట్టలతోనే చేయవలెను. తడిసిన బట్ట పిండకూడదు. వేరొక వస్త్రమును ధరించ రాదు.

    దయచేసి మీరు పైన చెప్పిన దానికి వివరణ ఇవ్వగలరు. కట్టుకొన్న బట్టలతో గ్రహణం మొదలు, మధ్యలో, చివరన మూడు సార్లు స్నానం చేసి వేరొక బట్టలు ధరించావచ్చా?

    రిప్లయితొలగించండి
  2. గ్రహణానంతరం నిరభ్యంతరంగా ధరించ వచ్చు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.