18, జనవరి 2012, బుధవారం

దేవాలయ నిర్వహణా సమస్యలు - 2

వంద గుళ్లు కడతారు. ఒక అర్చకుని పెడతారు. నిజంగా పూజ చేసుకోవాలనుకునే అర్చకునికి ఒక గుళ్లో చెయ్యడానికి తక్కువలో తక్కువ ఉదయం తొమ్మిదింటి వరకు అర్చన, జపతపాలు సరిపోతాయి. మరి ఇతర దేవాలయాలలో ఎప్పుడు చేయాలి? ఈలోపు వచ్చే భక్తులను ఎవరు చూసుకోవాలి?  వచ్చే భక్తులు ఎక్కువగా ఉద్యోగాలకు వెళతారు కనుక ఉదయం తొమ్మిదిలోపే వస్తారు. మరి పూజకు సంకల్పం చేసుకున్న తరువాత ఎవరో భక్తుడు వస్తే వారికి హారతులు, తీర్థప్రసాదాలు ఇచ్చేది ఎవరు? సంకల్పించిన పూజ మధ్యలో ఆపి లేవాలా? అలా లేవకపోతే మేము వస్తే అర్చకస్వామి మమ్మల్ని అసలు పలకరించనుకూడా పలకరించలేదని ధర్మకర్తలకు కంప్లైంట్.

అర్చకునికి దక్షిణగా ఓ రెండు వేలు ఇస్తారు. అదే ఎక్కువ అనుకుంటారు. నిజానికి ఓ జీతగాడిని నియమించుకున్న భావనలో ఎక్కువమంది ధర్మకర్తలు ఉంటారు. జీతం ఇంత ఇస్తాం అంటారు గానీ, అయ్యా మీకు జీవన భృతిగా ఇంతమాత్రమే దక్షిణ ఇవ్వగలం అనే సంస్కారం ధర్మకర్తలలో కొరవడుతున్నది.  అటువంటి ధర్మకర్తలకు ఇక అర్చకుడు ఎటువంటి సూచనలు ఇవ్వగలడు? ఏమి పూజలు చెయ్యగలడు. పేరుకుమాత్రం గురువు, కార్య రూపంలో జీతగాడు గా అర్చకులు మిగిలి పోతున్నారు.


 ఒక ఇల్లు కూడా ఇవ్వరు, ఎక్కడో కర్మకాలి ఓ స్టోర్ రూమ్ వంటి గది ఇవ్వగలిగే వసతి ఉంటే ఇంకేంటి మీకు మహోపకారం చేసేస్తున్నామన్న భావన లో ఎక్కువమంది ఉంటున్నారు. ఒక్క గదిలో అసలు ఎలా ఉండగలరు? ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బంది రోజులలో ఎక్కడ ఉండాలి? ఒకవేళ అర్చకుడు వాళ్లిచ్చే గదిలో ఉండడానికి సిద్ధపడితే..., అర్చకుడు, అతని కుటుంబము దేవాలయానికి కాపలా దారులుగా ఉండవలసి వస్తుంది. దేవాలయ పాత్రల శుభ్రతకు ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రసాదాలు అవీ అర్చకుని భార్య వండి పెట్టాలి. అదేమంటే ధనంలేదు అంటారు. కానీ కొత్తగుడి ప్రారంభిస్తారు.  రెండు మూడు వేలలో ఇలా అన్ని సదుపాయాలు కలిసొచ్చే అర్చకుడు కావాలి చాలా మందికి. భోజనానికి ఎలా గడుస్తున్నది అనికాని, కుటుంబ పోషణ జరుగుతున్నదా అని కానీ అడుగరు. అంత తెలివి తక్కువ ప్రశ్న మరొకటి లేదని వారికి తెలిసు.

ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక దేవాలయానికి ఇద్దరు అర్చకులు కావాలి. ఒక ప్రధానా ర్చకులు, ఒక సహాయకులు.   అర్చకునికి మడి ఆచారానికి సరిపోయే ఇల్లు ఇవ్వాలనే అవగాహన ధర్మకర్తలకు ఉండాలి. జీతం కనీసం కుంటుంబ పోషణకు సరిపడా ఉండాలి. అర్చకుని కుటుంబం కాక, వాచ్ మెన్ కుటుంబం కూడా ఆ దేవాలయానికి దగ్గరలో ఉండాలి. దేవాలయ కాపలా, శుభ్రత మొదలైన వి వారు నిర్వహించాలి. ఎక్కువ ప్రసాదాలు వండ వలసి ఉంటే వంటవారిని పెట్టడం మంచిది.

5 కామెంట్‌లు:

  1. మీ బాధ అర్ధమవుతున్నది.
    సమంజసమైన ప్రశ్నలు వేసారు మంచి సలహాలు యిచ్చారు.
    కానీ మీరే అన్నట్లు గుడి అనేది ఒక పెద్ద వ్యాపారంలాగా మారిందేమో

    రిప్లయితొలగించండి
  2. ప్రభుత్వం గుడిపెరుతో చేస్తున్నది వ్యాపారంలాగే కనిపిస్తుంది నాకు. ప్రభుత్వాన్ని చూసి మిగతావారు కొబ్బరికాయ కొట్టడానికి టిక్కెట్టు, అర్చనకు టిక్కెట్టు అంటూ అనుసరిస్తున్నారు. కానీ దేవాదాయ శాఖ వారు చేసినంత వసతులు మాత్రం చేయలేక పోతున్నారు. దేవాలయ నిర్వహణలో నేను తరించాలి అనే భావన కాక, పేరు సంపాదించాలి అనే ఆశ బాగా ఉన్నట్లు కనపడుతుంది అనేక మంది ధర్మ కర్తలలో. మరి దేవాలయ ధనాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం అనేది నేను అంతగా గమనించ లేదు కానీ దానికీ దిగజారు తున్నారు కొందరు.

    రిప్లయితొలగించండి
  3. మంచి చర్చ
    చాలామంది (ప్రధానంగా సాయిబాబా) మందిర నిర్వాహకులు(నా అవగాహనలో)
    నేర ప్రవృత్తి ఉన్నవారట,చాలా దేవాలయాల్లో పాలక మండళ్ళు ,నేరస్తులతో నిండి పోవటం
    చూస్తే ప్రశ్న వేసే ధైర్యం ఎవరికుంది.ఇల్లాంటి సందర్భంలో మీ లాంటి వారు
    ప్రశ్నలు మాని పరశురామావతారం ఎత్తాలేమో,,
    అయ్యో,,పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యేట్లుందే.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.