18, జనవరి 2012, బుధవారం

దేవాలయ నిర్వహణా సమస్యలు

నేను చేస్తున్నాను అనే భావన తగ్గాలి : దేవాలయంలో దేవునికి రోజూ ఒక పూలమాల కూడా వేయలేని స్థితిలో ఉంటారు ధర్మ కర్తలు, కానీ గుడి మీద గుడి కడతారు. ఆలయ నిర్వహణకు ధనం ఉండదు. రోజూ దేవుడికి దేవాలయం తరపు న ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితి. అఖడం అంటే నూనె చాలా ఖర్చవుతుందని దీపం పెట్టి వదిలి వేయమంటారు. పోనీ ఎవరైనా దాతలను వారు అడుగరు. దానికి అహం అడ్డు వస్తుంది. వారు ఎవరినీ అడగకుండానే ఎవరో రావాలి. ధనం కురిపించాలి. పోనీ ఎవరో వచ్చి ఇచ్చినా అది మరో దేవాలయ నిర్మాణానికి ఖర్చు పెడతారు. దర్శనానికి వచ్చేవారే రోజూ ఎవరూ ఉండరు. కానీ అర్చనకు, అభిషేకానికీ, హోమానికి చివరికి కొబ్బరకాయ కొట్టుకోడానికి కూడా టికెట్ పెడతారు.

    దేవాలయ నిర్వహకులకు ఉండవలసిన ప్రధాన అర్హత ధనం కలిగి ఉండడమా? ధర్మాచరణ కలిగి ఉండడమా? అని ప్రశ్నించుకుంటే ధర్మాచరణ కలిగి ఉండడమే అని చెప్పవచ్చు. వేద మార్గాన్ని నమ్మి ఆ ధర్మాన్ని ఆచరణలో చూపగలిగే శ్రద్ధ, భగవద్భక్తి ఉన్న ధర్మకర్త నిర్వహణలో ఉన్న దేవాలయాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. కేవలం ధనం ఉండి, పేరుకోసం, డాబుకోసం దేవాలయాలను నిర్మించడం అనర్థదాయకమే అవుతుంది. రెండూ కలిగిన ధర్మకర్త అయితే ఇక ఆదేవాలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లుతుంది అనడంలో సందేహంలేదు. భక్తి కలిగిన ధర్మకర్త తన శక్తి వంచనలేకుండా దేవాలయానికి తన వంతు ఆర్థిక సహయం చేయాలి. కానీ దేవాలయాలు నేటి రోజులలో ఒక్క వ్యక్తి సహాయంతో నడపలేము కనుక తన వద్ద ధనం చాలని పక్షంలో నలుగురి సహాయం అర్థించడానికి మొహమాట పడకూడదు. "నేను చేస్తున్నాను, నాకొసం చేస్తున్నాను అనుకున్నప్పుడు అహం అడ్డువస్తుంది. అదే భగవంతుడు నడిపిస్తున్నాడు, భగవత్కార్యం చేస్తున్నాను అనుకున్నప్పుడు అలా అడిగి మరీ కార్యం పూర్తిచెయ్యడంలో ఒక తృప్తిఉంటుంది." ఇది గుర్తెరిగి భగవత్కార్యానికి నలుగురి సహాయాన్ని తీసుకుని మరీ ముందుకు వెళ్లినప్పుడు దేవాలయ నిర్వహణ అనేది సుగమం అవుతుంది.



2 కామెంట్‌లు:

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.