23, జనవరి 2012, సోమవారం

అరుణాచల శివా!


పూర్వం బ్రహ్మా - విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అన్న వివాదం వచ్చినప్పుడు, పరమశివుడు మహా అగ్నిలింగంగా ఉద్భవించి వారిని పరీక్షించిన దివ్యస్థలం అరుణాచలం. అటువంటి అరుణాచలంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి.
 " స్వామీ! మేము అఙ్ఞానంలో పడిపోతున్నాం! మాయా మోహితులమై పుణ్యగతులు పొందలేకున్నాము. మోక్షమార్గమెరుగకున్నాము. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కలియుగంలో మానవులకు తగిన మార్గమేటి? సులభంగా మోక్షం పొందే విధము తెలుప వలసినది. "  అని ఋషులు ఒకానొక సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేశారట. అందుకు ఈశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చారు.

దర్శనాత్ అభ్ర సదశీ జననాత్ కమలాలయే
కాశ్యాంతు మరణాన్ముక్తిః  స్మరణాత్ అరుణాచలే!

  
చిదంబరంలో ( ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా ) దర్శన మాత్రము చేత,  కమలాలయం ( తిరువాయూరు ) లో పుట్టుక చేత, కాశీలో మరణము చేత, అరుణాచల  స్మరణ మాత్రము చేత ముక్తి లభిస్తుంది.
                  
చిదంబరములో దర్శనము చేత : చిదంబరములో అసలు విగ్రహమే లేదు కదా మరి దర్శనమెలాగ!? అదే చిదంబర రహస్యం అన్నారు. అక్కడ ఉన్నది ఆకాశ లింగం. ఆకాశము అంతటానిండిఉన్నవాడు ఎవరున్నారో అతడే అక్కడ కొలువై ఉన్నాడు. అటువంటి ఈశ్వరుని దర్శనం అంటే మాటలు కాదు. ఎందరో మహపురుషులకు సైతం ఇది కష్టతరమైనది. కనుక ఇంకాసులువైన మార్గం చెప్పవలసింది అనివేడుకున్నారు.

కమలాలయంలో పుట్టుక చేత : పుట్టుక మన చేతులలో ఉండదు కదా! అది పూర్వకర్మ వలన మాత్రమే లభిస్తుంది. కనుక ఇది కూడా బహు కష్టమైనది. ఇంకా సులువైనది తెలుపవలసినది.

కాశీలో మరణము చేత : మరణము నకు కాశీ వెళ్లడానికి కూడా ఇల్లు, పిల్లలు అంటూ అనేక బంధాలు అడ్డుపడతాయి. ఇంతకంటే సులభమార్గమును సెలవివ్వవలసినది మహాదేవా!

అరుణాచల స్మరణ మాత్రము చేత : అయితే అరుణాచల స్మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదిస్తాను అన్నారు.


బిడ్డలమీద ఎంతటి ప్రేమ!? బోళాశంకరునడం అందుచేతకదూ! 


అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచల శివా!

  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసముల ఆధారంగా http://te.srichaganti.net/Pravachanams.aspx  మీరుకూడా వినండి.

6 వ్యాఖ్యలు:

 1. శర్మగారూ, పుట్టుక మనచేతిలో లేనట్లే మరణం కూడా మనచేతిలో లేదు!
  కాశీకి పోవటానికి ఒకప్పుడు యెంతో కష్టంగా ఉండేది. ఒకవేళ కాశీవాసం చేయగలిగినా అక్కడ మరణం వ్రాసి పెట్టి ఉండకపోతే యేదో కార్యాంతరం మీద బయటికి రప్పిస్తుంది విధి సమయానికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవున చావు కూడా మనచేతిలో లేనిదే కదా! అందుకే అన్నిటికంటే సులువైన మార్గం వీలైనన్ని ఎక్కువసార్లు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివా! అనడమే. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శర్మగారూ అందుకే విజ్ఞులు చెప్పారు గద "నామ స్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణే" అని.
  అన్నట్లు వీలుంటే నా నవకవనవనం బ్లాగులో ఈమధ్య నేను వ్రాయటం మొదలు పెట్టిన శ్రీమద్భాగవత మాహాత్మ్యం పద్యకావ్యం పర్యావలోకనం చేయండి. ప్రథమాశ్వాసము ఈ మధ్యనే పూర్తయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నవకవనవనం బ్లాగు చిరునామా: http://syamalatadigadapa.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శ్రీమద్భాగవత మాహాత్మ్యం మచ్చుకు ఒక పద్యం:
  ఉ. ఈ యుగమందు మానవు లనేకములై చను మోక్షసాధనో
  పాయము లాశ్రయుంచి బహుభంగుల కష్టములోర్చి గాక నా
  శ్రీయుతమూర్తి నామమును చింతన జేసినచాలు చెచ్చెరన్
  మాయ దొలంగి మోక్షపద మందుట తథ్యము కౌరవేశ్వరా.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.