24, డిసెంబర్ 2012, సోమవారం

మంత్రాలు తెలుగులో ఎందుకు చదవకూడదు?

 " మంత్రాలు తెలుగులో ఎందుకు చదవకూడదు? " ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరికి ఉదయిస్తుంది. ఎందుకు చదవకూడదు అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రథానమైనవి చర్చిస్తాను.




౧. మంత్రం యొక్క శక్తి మన మాటలకు ఉండదు :   అనుదాత్త ఉదాత్త స్వరితాలతో కూడిన మంత్రములు అపౌరుషేయములు. అవి ఆ పరమేశ్వురుని కృపచే ఋషులకు గోచరమైన ఆయా మంత్రాలకు ఉన్న శక్తి మనం తెలుగులోకి అనువదించుకుని చదవడం వలన రాదు. అంతెందుకు మన చాగంటి వారి మాటలలోని భావాన్ని మన సొంత మాటలలో చెప్పామనుకోండి అంతటి శక్తి ఉంటుందా!? ఉండదు.  భావం ఒకటే అయినప్పటికీ వాడిన పదాల అమరిక, ఉచ్ఛరించే విధానం, దానికి మన అభినయం వీటన్నిటిని బట్టీ ఆయా వాక్యాలు వినేవారిపై ప్రభావం చూపడంలో  చాలా వ్యత్యాసం ఉంటుంది. గురువుగారు, మనం ఇద్దరు చెప్పినదీ తెలుగే! కానీ ప్రభావం వేరు కదా!

 మరి తెలుగులో విన్నదానినే మనం అంతే ప్రభావాన్ని చూపేవిధంగా అనువదించలేకపోతే ఇక పరమేశ్వరని సృష్టి అయిన మంత్రములను ఎంత పెద్ద పండితుడు మాత్రం అనువదించ గలడు చెప్పండి? కనుక మంత్రములకు  ఉన్న శక్తి మనం తెలుగులో చెప్పుకునే భావానికి ఉండనేఉండదు.

౨. సొంతపైత్యం చేరితే అరిష్టమే ఎక్కువ : అనువదించుకోవడంలో మరొక అనర్థమేమంటే తెలుగులోకి మార్చుకోవడంలో  అనువాదకుని సొంత పైత్యం కొంత కలిసిందనుకోండి  ఇక అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఎందరో ఎన్నో సార్లు తమ బాణిలో రచించారు. తపశ్శక్తి సంపన్నుల రామాయణాల వలన అరిష్టం తక్కువగా ఉన్నప్పటికీ పాండిత్య ప్రకర్షకోసం రచించిన వారి రామాయణాల వలన అనేక అనర్థాలు వచ్చాయి అన్నది మనకు సుస్పష్టం.

౩. మూలం కోల్పోతాము : ఇక అనువాదాల వ్యాప్తి వస్తున్న కొద్దీ అసలైన మూలాన్ని కోల్పోతాము. నాబోటి వారు చక్కగా తెలుగులోనే మంత్రాలు ఉండగా అర్థంకాని ఆసంస్కృతమెందుకు అనుకుంటే ఇక మూలమైన వేదాన్ని పారాయణ చేసేవారెవరుంటారు? భవిష్యత్తులో ఈ అనువాదాలు పెరిగి, అందులో కలిప్రభావంతో ఉన్న వాక్యాలు పెరిగి  గందరగోళం శృష్టిస్తాయి. నిజమైన ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారికి మూలం తెలుసుకోవడం చాలా కష్టమౌతుంది.

కనుక మంత్రాలు సంస్కృతంలోనే చదవాలి. స్వరయుక్తంగానే చదవాలి. ఈశ్వరప్రోక్తమైన వేదమంత్రాలు అర్థంకాకపోయినా విననంత మాత్రము చేతనే మనకు అనేక సంపదలను కలుగజేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఇక స్తోత్రాలు కూడా అంతే! ఎంతో తపశ్శాలులైన వారు రచించినవి కనుక వాటికీ మంత్రములకున్నంత శక్తి ఉన్నది. వాటినికూడా ఆభాషలోనే చదవాలి. అంతెందుకు ఒక కథ చదువుతాము. ఎంతో ప్ర్రేరణ కలిగిస్తుంది. అదే కథని మన మాటలలో మరొకరికి చెప్పామనుకోండి అంతటి ప్రేరణ వారికి కలుగుతుందా! నిస్సంశయంగా కలగదు. ఎందుకంటే ఆకథ రాయడానికి  రచయిత పడినంత అంతర్మథనం మనం పడము కనుక. అతనికి ఉన్న పట్టు మనకు ఆ కథా విషయంపై ఉండదు కనుక. అలాగే మహఋషులు రచిచింన పురాణాలు, స్తోత్రాలు మనం అనువదిస్తే అంతటి శక్తి ప్రేరణ కలుగదు.

ఇక మిగిలింది సంకల్పం, పరిచయం ( ప్రవర ) వంటివి మాతమే! వాటిని ఎలాగైనా చెప్పుకోవచ్చు. కానీ సంస్కృతంలో చెప్పుకుని మనసులో అర్థాన్ని భావనచేయడమే శ్రేయస్కరం. సాధారణంగా బ్రహ్మగారు కూడా సమయాన్ని బట్టి వీలైనంత వివరణ ఇస్తూనే ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా మనకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు.



ధన్యవాదములు

12 కామెంట్‌లు:

  1. chala bagundandi vijay sarma garu andariki ardam inatlu chepparu dhanyavadamulu

    రిప్లయితొలగించండి
  2. బాషాదోషాలున్నా అమ్మకు బిడ్డ భావం అర్థమయినప్పుడు, అమ్మలగన్నయమ్మకు భక్తుని ఆరాటం అర్థమవ్వదా స్వామీ?
    http://www.youtube.com/watch?feature=player_detailpage&v=e32MPnCa4FY

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంత్రం చదివితే మాత్రమే ముక్తిలభిస్తుందని నేను చెప్పలేదు. ఆర్తి ఉన్న చోట అన్నీ సాధ్యమే :)

      కానీ మంత్రాన్ని మార్చుకుని చదవాల్సిన అవసరం లేదు. మనసుకు తోచిన ప్రార్థన,ధ్యానం చేస్తే చాలు. మంత్రాన్నే చదవాలి అనుకున్న సందర్భంలో అది ఎలా ఉందో అలాగే చదవాలి అనిమాత్రమే నాభావం.

      తొలగించండి
  3. వినేవారికి పెడ అర్థాన్ని ఇవ్వడం మంచిది కాదు. అందుకే అదేభాషలో వుచ్చారణ చేయాలన్న మీ అభిప్రాయం ఒప్పుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మనస్సులొ అనుకొనేది మంత్రం. శబ్ధార్ధం మారకుండా ఉండడానికి సంస్కృతం లొనే చదవాలి.
    లేకపొతే తమిళ డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంటుంది.

    చెల్లూరి సుబ్రహ్మణ్య శర్మ

    రిప్లయితొలగించండి
  5. అయ్యా శర్మ గారు మీ వివరణ చాలా బాగుంది,
    అసందర్బము, అయినా దయచేసి మీరు తెలియచెయగలరని కోరుకుంటున్నాను
    తీర్థ స్నానము చెసే ముందు 'సంకల్పం' (దేశ, కాల కీర్తనం) చెప్పాలి అని 'చాగంటీ గారి వెంకటేశ్వర వైభవం ప్రవచనం లొ విన్నాను
    అదేలా చెప్పాలో తెలియదు, తెలియచెగలరని మనవి
    స్వామి పుష్కరిణి మరియు రామక్రిష్ణ తీర్థము లలో స్నానం ముందు సంకల్పం ఎలా చెప్పాలొ దయచేసి తెలియచెయగలరు
    -
    rajeshnov06@gmail.com

    రిప్లయితొలగించండి
  6. ఆడవారు రుద్రం చమకం నమకం చదవవచ్చ?

    దయచేసి తెలియజేయండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేటి కాలంలో తమదగ్గర ఉన్నది వదిలి వేసి ప్రక్కనవారిదానికోసం ప్రాకులాడడం మొదలైనది. అలా నేడు అందరూ మంత్రాలు నేర్చుకుంటున్నారు. చదివేస్తున్నారు. కానీ అది అనర్థాలకు దారితీస్తుంది. ఉపనయనం చేసుకుని, గురుముఖతః నేర్చుకున్నవారు మాత్రమే రుద్రం చదివవలెను.

      తొలగించండి
    2. ఆ అజ్ఞాత ప్రశ్నకు మీ జవాబు అది కాదండి, ఆడవారు చదివే ఆచారం వుందా, లేదా? తెలిసుంటే చెప్పండి.

      తొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.