26, జనవరి 2013, శనివారం

చండీశ్వరుడు

ఒక శివభక్తుడు తన తండ్రి దగ్గరే వేదం చదువుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గోవుని గోపాలకుడు కొట్టడంచూసి "ఎందుకు కొడుతున్నావు?" అని అడిగితే ఐతే నువ్వే వీటిని సాకు అని చెప్తే అలాగే చేస్తాను అని అతడే ఆగోవులను సాకసాగాడు. ఆ పిల్లవాని ఆధీనంలో ఉన్న గోపాలకుల గోవులు అత్యధిక పాలు ఇవ్వడంవల్ల గ్రామంలో అందరికీ పాలు సమృద్ధిగా దొరికేవి. కారణం ఆ పిల్లవాడు గో క్షీరంతో సైకత లింగానికి రుద్రం చెప్తూ అభిషేకం చేసేవాడు. అది చూసిన ఇతరులు ఆ పిల్లవాడు పాలు పాడు చేస్తున్నాడనీ, అవి కూడా ఉంటే ఇంకా సమృద్ధి కలుగుతుందనీ ఆ పిల్లవాని తండ్రికి చెప్పారు. అది నిర్ధారించుకుందామని ఆ పిల్లవాని తండ్రి ఒక చోట దాగి తన కొడుకేంచేస్తున్నాడో వేచి చూస్తున్నాడు. ఇది తెలియని పిల్లవాడు తన మానాన తాను ఒక సైకత లింగాన్ని నిర్మించి రుద్రం చెప్తూ గోవులని పిలచి గో క్షీరం తీసుకొని అభిషేకం చేయడం, ఒక గోవు తరవాత ఒక గోవు ఇలా కడవలకి కడవలు అభిషేకం జరగడం అతని తండ్రి చూసి ఆగ్రహోదగ్రుడై ఆవు పాలు నేల పాలు చేస్తున్నావా అని ఆ పిల్లవాడిని వెనకనుంచి కొడితే అంతర్ముఖత్వంతో అభిషేకం చేస్తున్న అతను కదలలేదు..... కాదు కాదుఆయనకి కొట్టిన దెబ్బ తెలియలేదు. కొట్టినా లేవకుండా ఆ పాలు మట్టిలో పోస్తున్నావా అని గదమాయించి కాలితో సైకత శివలింగాన్ని భగ్నం చేసాడు. వేద విదుడైనా ఆయన దృష్టిలో అది నేలమీద పోస్తున్న పాలు మాత్రమే, మనసు లగ్నం చేసి శివునికే అభిషేకం చేస్తున్నాని తలుస్తూ మనసులో శివునికే అభిషేకం చేస్తూ ఉన్న ఆ పిల్లవాడు శివలింగం భగ్నమవడంతో కళ్ళు తెరచి కోపాన్ని పొంది, ఎదురుగా కోపంతో ఊగుతున్న తన తండ్రిని చూసి, శివలింగం భగ్నానికి కారణమైన కాలుండరాదని పక్కన గోవులు కాయడంకోసం రక్షణగా తెచ్చుకున్న గొడ్డలి కనపడితే దాన్ని తన తండ్రి కాలిమీదకు విసిరాడు. అంత ఆ కాలు నరకబడి అందులోంచి రక్తం ఏరులా ప్రవహించి ఆ పిల్లవాని తండ్రి మరణించాడు. దానికి చలించిపోయిన శివుడు, ఏమిరా తండ్రీ నాకోసం కన్న తండ్రినే శిక్షించినవాడివని మెచ్చుకొని, నీకు తండ్రిలేడనే బాధలేదు నేనే నీకు తండ్రిని అని తన కుటుంబంలో ఒకడిగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామితో సమానంగా తన కొడుకుగా తన కుటుంబంలో స్థానమిచ్చాడు. అప్పట్నుంచి నలుగురుగా ఉన్న శివ కుటుంబం ఐదుగురైంది. ఆ పిల్లవాణ్ణి తన కుటుబ సభ్యునిగా స్థానమిచ్చి తన నిర్మాల్యానికి అధికారిగా నియమించాడు. ఇంకోవిధంగా చెప్పాలంటే దానికి అధికారిణి ఐన అమ్మవారు భార్యగా తనకున్న అదృష్టాన్నీ, అధికారాన్నీ తన మూడవ కొడుకైన ఆ పిల్లవానికి ఇచ్చింది. ఆయనే చండీశ్వరుడు. ఎప్పుడూ శివుని పక్కన ఉత్తర దిక్కు గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రకటంగా ఆ మూర్తి శివాలయాలలో ఉన్నా లేకున్నా శివలింగం ఉంది అంటే ఆయన అక్కడే ఉంటారు. శివ నిర్మాల్యం ప్రసాదంలాగా కానీ , అభిషేక తీర్థం కానీ తీసుకోవాలంటే చండీశ్వరులవారి అనుమతిలేనిదే కుదరదు. ఆయన అనుమతి అపేక్షించకుండా తీసుకుంటే శివాజ్ఞకి వ్యతిరిక్తంగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఇది శివపురాణం, శైవాగమం ప్రకారం కూడా ఆలయంలో చండీశ్వర స్థానం ఉంటుంది. మన ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నా, లేదా నిత్యార్చన చేస్తున్నా నిర్మాల్యాన్ని ఉత్తర చండీశ్వరునికి చూపిస్తున్నట్లు ఉత్తరానికి చూపించి నిర్మాల్యాన్ని కళ్ళకద్దుకుని తీయడం పద్ధతిగా వస్తున్నది. 


  కేవలం మన పొట్టకూటికోసమో, మరోదానికో వినియోగించిన ద్రవ్యం మాత్రమే సద్వినియోగమైనట్లు భావిచడం సరికాదు. భగవంతునికి అర్పించే ఏ ద్రవ్యమూ వృథాకాదు. భగవన్నిర్మాల్యం ప్రకృతిలో కలవడం ద్వారా అందరికీ అన్ని పూటలా కావాల్సిన ఆహారం దొరుకుతోంది. భగీరథుని కోరిక మేరకు శివుని శరీరాన్ని అభిషేకించిన గంగమ్మ త్రిపథగగా మారి సగరులకు తర్పణాలివ్వడానికి పనికి వచ్చినప్పటికీ పెద్ద నదిగా మారి ఇప్పటికీ ఎందుకు భూమి మీద పారుతున్నది? ఆకాశంలో ఉండవలసిన గంగ, దేవతల అవసరాలకు వాడవలసి వచ్చే గంగా జలం భూమిమీద ఉండడం వ్యర్థం ఎలాకాదో ఇదీ అంతే. అభిషేక జలం నేల మీద పడి చుట్టూ ఉండే భూమిని పవిత్రంచేస్తుంది. ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ ఆధ్యాత్మిక తరంగాలతో ప్రభావితం చేస్తుంది.  

శ్రీ నాగేంద్రగారి సహకారంతో....

2 కామెంట్‌లు:

  1. chaalaa baagundi.. chandeeswaruni katha theliya chesinanduku meeku kRtajnatalu.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు,
    చాలా చక్కగా తెలియచేసారు చండీశ్వరుని గురించి.శివాలయాలలో సోమసూత్రం దగ్గర ఈ చండీశ్వరుడు ప్రతిష్టింపబడి ఉంటారు కదా.ఇక్కడ ఈ మూర్తి కి దీప,ధూప,పుష్ప,నైవెద్య సమర్పణ చేయవచ్చునా తెలియచేయగలరు... ఎవరూ కూడ ఈ మూర్తిని పట్టించుకోరు ఆలయాలలో అందుకే అడుగుతున్నాను.మీ బ్లాగు చాలా బాగున్నది.మీలాంటి శాస్త్ర ఙానం కలిగిన అర్చకులంతా ఇలా బ్లాగులను నిర్వహించి సాధారణ ప్రజలలో మన ఆచార వ్యవహారాలు,మన శాస్త్రాలు,విధి విధానాల పట్ల జాగృతి కలించాలని,మా సందేహాలను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.