23, జనవరి 2013, బుధవారం

పూజల పేరుతో ద్రవ్యాన్ని వృథా చేస్తున్నామా?

పూజల పేరుతో పాలు పెరుగు అనవసరంగా నేల పాలు చేసే బదులు ఆకలిగొన్న వారికి ఇస్తే కనీసం ఒకరి కడుపైనా నిండు తుందికదా? అని ఒక మిత్రుల ప్రశ్న.  ఈ మధ్య ఒక హిందీ సినిమాలో కూడా ఈ విషయం చర్చకు వచ్చినట్లుంది. ఈ చిత్రాలు ఎలా ఉంటాయంటే అవునిజమే ఈ పూజల పేరుతో తప్పుచేస్తున్నామేమో అనిపిస్తుంది.భగవంతుడు లేడు అని నమ్మేవాళ్లకు ఇది సమంజసంగా తోచవచ్చు. కానీ సర్వప్రాణికోటికీ ఈశ్వరుడైనవాడు ఉన్నాడు, దేనిని చేయటానికైనా అతడే సమర్థుడు అని నమ్మే వాళ్లు కూడా ఈ ప్రశ్నలు కలగడం నేడు చూస్తున్నాము.ఇది కలిమాయ కాక మరొకటికాదు. నిజంగా మానవ సేవ చేయడం మాథవునికి సేవచేయడంతో సమానమే! కానీ ప్రత్యామ్నాయం మాత్రం కాదు. అంటే మానవ సేవ చేస్తే మాధవ చేస్తే వచ్చే ఫలితం తప్పక వస్తుంది. కానీ భగవదారాథనను ఆపి మరీ ఆ మానవ సేవ చేయమని చెప్పలేదు. భగవదారాథన చేయవలసినదే!

పరమేశ్వరుని సేవకు ఉపయోగించే ద్రవ్యం వృథా అవుతున్నదేమో అనుకోవడం ఆయన పై మనకు గల నమ్మకాన్ని ప్రశ్నించుకోవడమే అవుతుంది.  ఆయనకంటే ఉన్నతుడు కానీ, సమానుడు కానీ మరొకరు లేరు. అటువంటి సర్వేశ్వరుని సేవకు వినియోగించే ఏ ఒక్క నీటి బిందువు కూడా వృథాకాదు. అది సమస్తలోకాలనూ పరిపుష్ఠం చేస్తుంది.


అందుకే 

"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తునిత్యం లోకా సమస్తా స్సుఖినో భవంతు"


ప్రజలందరికీ సుఖము కలుగునట్లు న్యాయమార్గములో ప్రభువులు పరిపాలించాలి, గోవులు బ్రాహ్మణులు శుభములను పొందాలి తద్వారా లోకాలన్నీసుఖముగా ఉండాలి  స్వామీ!  అని మన ప్రతిపూజానంతరమూ ఆయనకు నివేదించుకుంటాము. 

నేను ఇవ్వాలనుకుంటే ఓ పదిమందికి మాత్రమే తృప్తి కలిగించ గలను. అదే ఆయన దయతలిస్తే జీవకోటి మొత్తం సుఖాన్ని పొందుతుంది.  అలాగని పరోపకారం చెయ్యవద్దనికాదు. మానవ సేవా ముఖ్యమే! మాధవ సేవా ముఖ్యమే! కానీ మాధవ సేవకు వినియోగించే ద్రవ్యము తగ్గించి అది కూడా మానవాళి ఉదర పోషణకు వినియోగిస్తాము అనడం కలిమాయ తప్పమరొకటి కాదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా వైదిక మైన క్రతువులు అన్నీ ( అది వ్యక్తిగతమైన క్రతువు అయినా  కూడా ) సర్వమానవ శ్రేయస్సును కలిగిస్తాయి.


ఒక చిన్న కథ : దేశంలో కరువు వచ్చినప్పుడు ఒక మోతుబరి రైతు తన గాదెలలోని ధాన్యాన్ని రోజూ వండించి అన్నదానం చేసేవాడుట. చివరికి అతని ఇంట్లో ధాన్యం కుడా నిండుకునే పరిస్థితి వచ్చిందిట. ఒక రెండు బస్తాల వడ్లను వండక దాచి, "ఇక నా దగ్గర కూడా ధాన్యం లేదు, ఇక ఎవరైనా నా కుటుంబానికీ భోజనం పెట్టాలి" అన్నాడట.  అది చూసి అతని చిన్న కొడుకు, "అదేమిటి నాన్న గారూ, గాదెలో రెండు బస్తాల వడ్లు ఉన్నాయి కదా అవి కుడా అయిపోయాక కూడా కరువు తీరకపోతే కదా మనం ఇలా అన్నదానం ఆపాల్సింది, మనమూ దేహీ అని వెళ్ళాల్సింది?" అని అడిగాడట. దానికి ఆ రైతు, "ఆ వడ్లు భగవంతుడు వర్షం కురిపించాక మళ్ళీ ఇంతకంటే ఎక్కువ ధాన్యం పండించటానికి విత్తనాలు" అని చెప్పాడట.
ఆ రెండు బస్తాలు లోభం ఎలా కాదో, భగవంతునికి అర్పించిన అభిషేక ద్రవ్యాలూ వృథాకాదు. అవి అపార పుణ్యప్రదాలు. అవి పారిన ప్రదేశాన్ని దివ్య సుక్షేత్రంగా చేసే పరమౌషధాలు.

దీని తరువాయి భాగం ఇక్కడ చూడండి. 

21 వ్యాఖ్యలు:

 1. భగవంతునికి అర్పించిన అభిషేక ద్రవ్యాలు వృధాకాకపోవచ్చు...కానీ ఒక్కోపూజకు యిన్ని కొబ్బరికాయలు కొట్టాలి, యిన్ని రకాల పిండివంటలు పెట్టాలి, వగైరా వగైరా పూజావిధానాలు తయారుచేశారు కదా....ఎవరు చేశారో, ఎవరు చూశారో నాకు తెలియదు కానీ చా...లా.. మంది పాటించడం మాత్రం చూస్తున్నా.
  ఒకవేళ నేను యిటువంటివేవీ లేకుండా భక్తిపూర్వకంగా, మనసా వాచా కర్మణా భగవంతుని పూజిస్తే నాకు దక్కవలసిన పుణ్యమో, ఫలమో దక్కదంటారా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు  1. కొన్ని వ్రతకల్పాలలో పదమూడు, ఇరవై ఒక్క రకాలు ఇలా సంఖ్యను నిర్ణయించారు. కల్పంలో ( పురాణంలో ) ఎలా నిర్ణయింప బడి ఉందో అలానే చేయడం తప్పని సరి. కానీ శక్తిలేని వారు తమ శక్తి కొలది మాత్రమే పూజను చేయాలి. అనవసర భారం వేసుకుని హడావిడి చేసి అప్పులపాలై చేసే పూజలవల్ల ప్రయోజనం ప్రశ్నార్థకమే! ఆర్తీ, శ్రద్ధ కలిగిన పూజలో అన్నీ సాధ్యమే! భగవంతుడు ఏమి సమర్పించావన్నది కాక ఎలా సమర్పించావన్నది మాత్రమే చూస్తాడు :)

   తొలగించు
 2. Sri Krishna paramatma geetalo "phalamo pushpamo toyamo" bhaktito samarpinchedi tanaki preetikaram annaru. Neti pujalalo aadambarame tappa bhaktiki tavuledu. Pujaki viniyoginche dravyam saphalame kadananu. Kanee mokkula peruto vela ltrs palu, nune, neyilu, vandallo pandlu, tenkayalu... Idi verriga leda! Sati manishilo unna bhagavantuni gouraviste chalu. Ee tantulu ipudu kevalam velam verriga chestunnaru tappa bhaktito kadu.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పాలు వృధా గా పోయటం నిజంగా తప్పే. శుక్రాచార్యుడు ఎన్నో రకాలుగా శివుడిని అభిషేకిన్చినా శివుడు ప్రత్యక్షమవలేదు. చివరికి స్వచ్చమయిన గంగతో అభిచేకిన్చాగానే తనకు ప్రత్యక్షమయినాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భగంతునికి అభిషేకించడం జరుగుతున్నదికదా!? అది వృథా ఎలా అవుతుంది? మీరు నాస్తికులైతే, భగవంతుడే లేడనినమ్మితే మీకు అలా కనిపించ వచ్చు. నాకు అలాంటి వారికి సమాధానం చెప్పే తీరిక లేదు. ఆస్తికులైతే ఈ క్రింది కథకూడా ఒకసారి చదవండి.

   http://rajasekharunivijay.blogspot.in/2013/01/blog-post_26.html

   తొలగించు
 4. ఇంకా మీరు ఒక లీటరు పాలు దేవుడికి ఇచ్చారు. అంబానీలు ఒక కోటి లీటర్లు ఇస్తే వాళ్లకు ఎక్కువ ముక్తి ఇస్తాడా దేవుడు? వస్తువులతో దేవుని పొందగలం అనుకోవటం తప్పు. స్వచ్చమయిన భక్తీ తో ఒక చుక్క నీరు సమర్పించినా అది కోటి లీటర్ల పాలతో సమానం. ఇంకా చెప్పాలంటే, భగవంతుడి దెగ్గర ఎలాంటి వస్తువయినా ఎంత ఖరిదయినా ఒక్కటే. అణువణువు లో ఉన్న భగవంతుడు. చిన్న పదార్ధంలో తక్కువగా పెద్ద దాంట్లో ఎక్కువగా ఉండదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భక్తితో చేసే పూజమాత్రమే సత్ఫలితాన్నిస్తుంది. ఆడంబరంకోసం చేసే దయితే ఒక లీటరైనా, వెయ్యి లీటర్లైనా అది వినాశనాన్నే కలుగ జేస్తుంది. ఒక వేళ మీపూజలో శ్రద్ధకనుక ఉండి భగవంతుని ప్రీతికొరకు, నామనసారా స్వామిని సేవిస్తాను అని తలచి పూజిస్తే వెయ్యిలీటర్లతో చేసినా( నిజానికి ఒక వ్యక్తి అంత ద్రవ్యం వాడడం సరికాదు. తాను పెంచే లేదా తన అధీనంలో పెంచే ఆవు తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను అభిషేకిస్తే చాలు. ఒకవేళ అతనికి ఓ వంద ఆవులు ఉండి వచ్చిన పాలన్నీ అభిషేకానికి వినియోగిద్దాము అనుకుంటే ) అది తప్పుకాదు. అది స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

   తొలగించు
  2. "అంబానీలు ఒక కోటి లీటర్లు ఇస్తే వాళ్లకు ఎక్కువ ముక్తి ఇస్తాడా దేవుడు? "

   మూర్ఖుడా. ముక్తి అన్నది ఎక్కువ తక్కువ అని వుండవు. రావడం, రాకపోవడం మాత్రమే వుంటుంది. వాటిని లీటర్ల లెక్కన కొలవరు.

   తొలగించు
 5. రాజ శేఖరుల వారు చాలా మంచి విషయం ప్రస్తావించారు..గంగాణాల కొద్దీ పాలు అభిషేకం పేరిట వృధా చేస్తున్నారు అని కొందరు అని కాదు మనకే ఒకోసారి ఆ భావన వస్తుంది ఎందుకంటే ఆ సమయంలో మన కళ్ళ ముందు తినడానికి నోచుకోని పిల్లలు కనబడతారు .. కానీ ఆ పాలలో మనం తీసుకు వెళ్ళిన పాలు కూడా కలిసి వుంటాయి అన్నసంగతి మరచిపోతాము ...ఈ మధ్య నేను గమనించినది ఒకటి, రెండు గుళ్ళలో అభిషేకం చేసిన పాలు సేకరించి ఎవరికో పంపడం ..బహుశా అవసరం వున వున్నవారికి కావచ్చు. ఇలా పుణ్యమూ పురుషార్ధము రెండూ ప్రాప్తిస్తున్నాయి.. ఒక్క విషయం మాత్రం మరచిపోకూడదు --- అభిషేకం జరిగే సమయం లో అయినా మన ఏకాగ్రత పూర్తిగా ఆ భగవంతుని మీద లగ్నం ఐ వుంటుంది అనడం లో ఎ మాత్రం సందేహం లేదు...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అభిషేకానంతరం ఆప్రసాదం పేదవారికి పంచడం చాలా మంచి పద్ధతి. కానీ అలాకాక తీర్థం నేలమీద పారడం వలన ఆతీర్థం వృథా అయినట్లుభావించడం సబబుకాదు. అదికూడా సద్వినియోగ పడినట్లే!

   తొలగించు
 6. * చక్కటి విషయాలను తెలియజేసారండి.

  * ఈ రోజుల్లో, వివాహాలలో ఎంతో ఆహారాన్ని వృధాగా పడేస్తున్నారు.
  * వెజిటబుల్ కార్వింగ్ పేరుతో ఎన్నో కూరగాయలను వేస్ట్ చేస్తున్నారు.
  * ఇంధన అవసరాలకు కూడా ఆహారపంటలను వాడుతున్నారండి.
  * కొందరు ధనవంతులు తమ విలాసాల కోసం ఎంతో డబ్బును వృధాగా ఖర్చుపెడుతున్నారు.
  * వీటన్నింటితో పోల్చుకుంటే భగవంతునికి సమర్పించే పదార్ధాలు చాలా తక్కువ.
  * మనకు జీవించటానికి అవసరమైన గాలిని, నీటిని, సమస్తాన్ని ఏర్పరిచిన భగవంతునికి సమర్పించినది , వృధా ఖర్చు కాదు.
  * అయితే, భగవంతుని దయను పొందాలంటే , పూజలలో ఆడంబరత్వం కన్నా, భక్తి , సత్ప్రవర్తన వంటివి ముఖ్యం . అని చెప్పారు కాబట్టి , భక్తులు ఈ విధంగా ప్రయత్నించటం మంచిది అనిపిస్తోందండి.
  * యజ్ఞయాగాదులు చేసేటప్పుడు సమర్పించే వస్తువుల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి ,పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవును. ఆడంబరం చేసే పూజలు ఫలించవు. భక్తి శ్రద్ధలు కలిగి చేసే పూజలు మాత్రమే ఫలితాన్నిస్తాయి.

   మనం ఏమితిన్నా ఆకలితీరుతుంది కదా. అలాంటప్పుడు ఈరోజు పప్పు, రేపు కూర, మరో రోజు వేపుడు ఎందుకు? ఉత్తి అన్నం ఉడికించుకు తింటే చాలదా? మనకడుపు చల్లబడడానికే ఇన్ని రకాలు కావల్సి ఉంటి లోకాలన్నీ చల్లబడాలని చేసే క్రతువులుక ఎన్ని ఇస్తే మాత్రం సరిపోతుంది చెప్పండి? అంతెందుకు... మనం బస్టాండ్ లో నుంచుని ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలేస్తోంది సారి ఏమైనాఇవ్వండి అంటాడు.మనకు డబ్బులు ఇవ్వడం కన్నా తినేది ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది అనుకోండి. ప్రక్కనే ఉన్న హొటలు కు తీసుకు వెళతాం. అక్కడ ఇడ్లి, వడ, దోశ, ఉప్మా, భోజనం ఏదైనా ఇరవై రూపాయలే అనుకోండి అప్పుడు మనకిష్టమొచ్చింది ఇప్పిస్తామా? లేక అతని ఇష్టమేంటో కనుక్కుంటామా? ఏది పెట్టినా అతని ఆకలి తీరుతుంది. కానీ నీకేంకావాలొ తీసుకోవోయ్ అంటాం. మరి ఒక బిచ్చగాడికి అన్నం పెడితేనే అంత ఉదారంగా వ్యవహరించే మనం, సర్వేశ్వరుని సేవచేసే అవకాశం వస్తే పాలుపొయ్యాలా? నీళ్లుపొయ్యాలా? అని ఆలోచిస్తామా!? ఎలా చేస్తే అతనికి ప్రీతికలుగుతుందని చెప్తారో అలానే చేస్తాం? అలానే కొందరు తమ కష్టాలు తీర్చుకోవాలని పూజలుచేస్తుంటారు. ఇలా కోరికలు కల వారు కొన్ని ప్రత్యేక వస్తువులతో స్వామిని సేవించవలసి ఉంటుంది

   తొలగించు
 7. మీరు అన్న సినిమా ఇదేనా
  https://www.youtube.com/watch?v=oq3Dg3GhIXM

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.