9, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.

         ఉగాదినాడు సూర్యోదయాత్ పూర్వమే తైలాభ్యంగన ( నువ్వుల నూనె రాసుకుని, సున్ని పిండితో ఒళ్ళురుద్దుకుని, తలంటు పోసుకోవాలి) స్నానం ఆచరించాలి. చక్కని సాంప్రదాయ వస్త్రధారణ చేయడం ప్రతీ ఒక్కరు మరువ వద్దు. అలాగే ఈ రోజు స్వయంగా భార్యా భర్త ఇద్దరు కూర్చుని పూజను చేసుకోవడం మరువకండి. అలా పండగ రోజైనా కాసేపు ఇద్దరు కలసి భగవత్కార్యంలో పాల్గొన్నట్లౌతుంది. ఇంటికి వచ్చిన బంధు,స్నేహితులతో కలిసి దేవాలయ దర్శనం- పంచాంగ శ్రవణం చేయవలసినది. 

 "ప్రపాదానం" అంటే దారిన పోయే వారికి దాహము తీర్చుకోడానికి జలము అందించడం ( చలివేంద్రాల ఏర్పాటు )  ఈరోజునుండి మొదలు పెట్టి నాలుగునెలలపాటు చెయ్యాలట.  ఈక్రింది శ్లోకాన్ని పఠిస్తూ జలమును అందిస్తే పితృదేవతలు, దేవతలు కూడా ప్రీతిచెందుతారు.

" ప్రపేయం సర్వసామన్య భూతేభ్యః ప్రతిపాదితా
 ప్రదానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః
అనివార్యం ఇతోదేయం జలం మాస చతుష్టయః "


అట్టి ప్రపాదానం చేయలేని వారు "ఉదకుంభ దానము" ( జలముతో ఉన్న కలశ ) ను దినమునకొకటి చొప్పున ద్విజులకు ఇవ్వవలెను.

" ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మవిష్ణు శివాత్మకః 
అస్య ప్రదానా త్సకలా మమసంతు మనోరథాః

బ్రహ్మాది దేవతా స్వరూపమైన ఈ ధర్మఘటమును ఇచ్చుచున్నాను. అందువలన నా మనోరథములన్నియు సమకూరవలెను అని అర్థము.
అని పఠిస్తూ ఉదకుంభ దానము చేయవలెను. ( కనీసం ఈ ఉగాదినాడైననూ ఈ ఉదకుంభదానము చేయుట శుభము. )

ఉగాది నాడు బ్రాహ్మణులకు పంచాంగము, విశన కఱ్ఱ, మామిడి పండు దానము చేయడం పరిపాటి.

ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు శుక్ల నవమి వరకు "వసంత నవరాత్రి వ్రతము"ను ఆచరించెదరు.  ఈ నవరాత్రులలో దేవీ ఉపాసన చేయవలెను.

ఈ చైత్రమాసము మొత్తము పెరుగు,పాలు,నెయ్యి, తేనెలను తినకుండా నియమము కలవారై - "గౌరీవ్రతమును" ఆచరించెదరు. దంపతీ స్వరూపమైన గౌరీపూజను నిత్యమును చేయుటయే ఇచటి గౌరీవ్రత విధానము.


ఈ నూతన సంవత్సరం అందరం  ధార్మిక ఆసక్తి కలిగిన వారమై, భగవద్భక్తితో, లక్ష్మీ అనుగ్రహాని కి పాత్రులమవ్వాలని ఆపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.  అందరకీ శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.  

ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

1 వ్యాఖ్య:

  1. పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.