18, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీరామ నవమీ వ్రత విధానం




చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్త  కర్కాటక ( అభిజత్ ) లగ్నమందు - మేషమునందు సూర్యుడు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములందు ఉండగా శ్రీరామ జననం జరిగిందని చెప్పబడినది .
కనుక మధ్యాహ్న వ్యాప్తమైన నవమి నాడు శ్రీరామ నవమి చేసుకోవాలి.  రొండురోజులలోనూ నవమి మధ్యాహ్నానికి ఉంటే రెండవరోజునే గ్రహించాలి. అష్టమీ విద్ధ ( అష్టమి తో కూడిన ) కలిగిన నవమి పనికిరాదు  అని శాస్త్ర వచనం.
ఈసారి 19 వతేదీనే శ్రీరామ నవమి జరుపుకోవాలి.  



శ్రీరామ నవమీ వ్రత విధానం : 

శ్రీరామ ప్రతిమాదానం కరిష్యేహం ద్విజోత్తమ|
తత్ర ఆచార్యోభవ ప్రీత శ్శ్రీరామోసి త్వమేవమే||

శ్రీరామ మూర్తిని ఉద్దేశించి నేను ప్రతిమాదానం చేస్తాను. దానికి ఆచార్యులుగా మీరు ఉండవలెను. మీరే శ్రీరామ మూర్తిగా భావించుచున్నాను.

అని శ్రీరామ నవమి పూజను చేయించుటకు, శ్రీరామ ప్రతిమను దానము చేయుటకు అష్టమి నాడే ఒక బ్రహ్మగారిని వరించాలి.

నవమ్యాం అంగ భూతేన ఏక భుక్తేన రాఘవ|
ఇక్ష్వాకు వంశతిలక ప్రీతో భవ భవప్రియ||

అనగా శ్రీరామనవమీ వ్రతములో భాగంగా  ఏకభుక్తమును చేస్తాను. ఇక్ష్వాకు వంశతిలకా, శంకర ప్రియుడా నాయందు ప్రీతిచెందవలసినది అని ప్రార్థన చేసి ఈరోజు( అష్టమి నాడు ) ఏకభుక్తము చేస్తానని సంకల్పించుకోవాలి. ( మధ్యాహ్న సమయములో ఆచార్యులతో కలిసి హవిస్సు ను మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. రాత్రికి భుజించరాదు. ) 

శ్రీరామ నవమి నాడు ఉదయాన్నే లేచి స్నానసంధ్యావందనాదులు ముగించుకుని, ముందుగా ఎర్పరచుకున్న వేదికపై  పూజా మండపమును ఏర్పరచి

ఉపోషచాం నవమీ త్వద్య యామేష్వష్టసు రాఘవ|
తేన ప్రీతోభవత్వం మే సంసారా త్త్రాహి మాం హరే||

ఈ నవమీ తిథినాడు ఎనిమిది జాములు ఉపవాసము చేసెదను, నీవు ప్రీతిచెంది నన్ను సంసారమునుండి రక్షించవలెను అని ప్రార్థించాలి. సర్వతో భద్రమండలమును ఏర్పరచి ఆయా దేవతలను ఆవాహనచేయాలి.

ఇమాం స్వర్ణమయీం రామప్రతిమాం ప్రయత్నతః|
శ్రీరామ ప్రీతయే దాస్యే రామభక్తాయ ధీమతే ||

శ్రీరామ చంద్రప్రభూ రామ ప్రతిమారూపుడవైన నిన్ను నీప్రీతికొఱకు నీభక్తునికి దానము చేసెదను అని సంకల్పించుకోవాలి. 





శ్రీరామ నమమీ వ్రతాంగ భూత షోడశోపచార పూజం కరిష్యే

శ్రీరామ నవమీ వ్రతంలో భాగమైన శ్రీరామ పూజను చేస్తున్నాను.  అని సంకల్పించి  సర్వతోభద్ర మండలము నందు కలశమును స్థాపించి, వస్త్రముతో కూడిన పూర్ణపాత్రమందు  స్వర్ణ ప్రతిమ యందు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠచేసి పురుషసూక్త విధానముగా షోడశోపచారపూజలు చేయాలి. పూజానంతరము

రామస్య జననీ చాసి రామాత్మక మిదం జగత్|
అతస్త్వాం పూజ ఇష్యామి లోకమాతర్నమోస్తుతే||

జగత్తంతా రామస్వరూపము. అట్టి రామునకు తల్లివైతివికనుక ( ఓకౌసల్యా! ) లోకమాతవైన నిన్ను పూజించెదను అని కౌసల్యను పూజించాలి. ఓం నమో దశరథాయఅని దశరథుని పూజించాలి.

దశానన వథార్థాయ ధర్మ సంస్థాపనాయచ|
దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయచ||
పరిత్రాణాయ సాధూనాం జాతోరామస్స్వయం హరిః|
గృహాణార్ఘ్యం మయాదత్తం భ్రాతృభిస్సహితోనఘ||
రావణుని యొక్క, దైత్యదానవులయొక్క నాశనము కొఱకు, సాధువులను రక్షించి ధర్మమును స్థాపించుటకు సాక్షాత్తుగా శ్రీహరివైన నీవే రాముడివైతివి.  తమ్ములతో గూడి ఈ అర్ఘ్యమును స్వీకరింపుము అని మధ్యాహ్న సమయములో ఫలపుష్ప జలములతో కూడిన పూర్ణ శంఖముతో అర్ఘ్యమును ఇవ్వవలెను.

 రాత్రి భజనాదులచే జాగరణము చేసి  ఉదయాన్నే మోల్కాంచి నిత్యపూజచేసి శ్రీరామ మూలమంత్రముచే నూట యెనిమిది సార్లు హోమము చేయవలెను.  తదనంతరం

ఇమాం స్వర్ణమయీం రామ ప్రతిమాం సమలం కృతాం|
శుచి వస్త్రయుగచ్ఛన్నాం రామోహం రాఘవాయతే|
శ్రీరామ ప్రీతయే దాస్యే తుష్టో భవతు రాఘవః||


స్వర్ణమయమై అలంకరించ బడిన రామ ప్రతిమను శుభ్రమైన వస్త్రయుగముతో గూర్చి శ్రీరామ ప్రీతికోఱకు శ్రీరాముని స్వరూపమైన మీకు దానమిచ్చుచున్నాను. దీనిచే మీరు ( రాముడు) సంతుష్టులగుదురుగాక.

అని పలుకుతూ స్వర్ణప్రతిమను దానం చేయవలెను.

తవప్రసాదం స్వీకృత్య క్రియతే పారణామయా|
వ్రతేనానేన సంతుష్టుః స్వామిన్ భక్తిం ప్రయచ్ఛమే||

నీప్రసాదమును స్వీకరించ పారణ ( ఉపవాస విరమణ) చేయుచున్నాను. నాచే ఆచరింపబడిన ఈ శ్రీరామనవమీ వ్రతముచే నీవు సంతుష్టుడవై మమ్మనుగ్రహించి సదా ( నీయందు నిశ్చల) భక్తిని ప్రసాదించవలసినది అని ప్రార్థన చేస్తు శ్రీరామ ప్రసాదమును స్వీకరించవలెను.


శ్రీరామ నవమి నాడు శ్రీరామ కళ్యాణం  మనకు లోకకళ్యాణార్థం వేడుకగా వస్తున్నది కానీ కళ్యాణం చేయడంతో శ్రీరామ నవమీ వ్రతం పరిపూర్ణమవదు. శ్రీరామనవమి నాడు ఏకభుక్తము, శ్రీరామ పూజ, సువర్ణ (శ్రీరామ) ప్రతిమాదానముచేయాలని శాస్త్రగ్రంధాలలో చెప్పారు. వీటితో పాటు కళ్యాణం చేసుకుంటే ఇంకావిశేషం. 

 వ్రతంగా చేయాలంటే ఏమిటి నియమము అని తెలుసుకోవాలనుకునే వారికో సం ఈ వివరం అంత ఇచ్చాను.   శ్రీరామ పూజ, కళ్యాణము విశేషంగానేడు అనేకులు చేస్తూనే ఉన్నారు. కాని శ్రీరామ నవమినాడు ఏమీచేయడానికి శక్తిలేనివారు ఫలం,పత్రం,పుష్పం,తోయం... అన్నట్లు కేవలం రామనామం చేస్తూ కూర్చున్నా అనంత ఫలాన్ని పొందుతారు. 

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.