28, ఏప్రిల్ 2013, ఆదివారం

సమాజంలోని చెడుని చూస్తూ మిన్నకుంటే ఎలా?



నేడు సమాజంలో చాలా దురాచారములు జరుగుచున్నవి. అకృత్యములు ప్రబలుతున్నవి. కానీ వాటినివారణకై ఆలోచించి తగిన పథకరచన చేసి, సమాజాన్ని సన్మార్గంవైపు పయనింప చేసే మేథావి వర్గం మిన్నకుండి పోతున్నది. కొందరు " ఈ కుళ్లు సమాజం గురించి చర్చించడం వృధా! ఆ భగవంతుని శరణువేడడమే ఉత్తమమార్గం." అంటున్నారు.  నిజంగా ఎవరూ సమాజంగురించి పట్టించుకోకపోతే ఆకుళ్లులో మనం కూడా ఒక భాగమౌతాం. నిరంతరం భగవన్నామాన్ని జపించడం ఉత్తమమైనదే అయినప్పటికీ, విహిత కర్మలను ఆచరిస్తూ, "పరోపకారాయ పుణ్యాయ" అన్న ఆర్యోక్తిని స్ఫురణనందు ఉంచుకుని సమాజానికి తగినంత సాయపడుతూ, మనోఫలకమున నిరంతరం భగవంతుని సేవించడం మానవజన్మకు అత్యుత్తమ సార్థకతను కలిగిస్తుందన్న సత్యాన్ని మనం మరువకూడదు. పాము వచ్చి తల్లిని కరుస్తుంటే భగవన్నామం జపిస్తూ ఆయనే రక్షిస్తాడని చూస్తూ కూర్చునేవాడు మూర్ఖుడనబడతాడు. తపస్సమాధిలో ఉన్నా తల్లి ఆర్తితో వేసిన కెకలువినినంతనే తపస్సును వదిలి పరిగెత్తి వెళ్లి ఆపామును పారద్రోలడానికి తగిన ప్రయత్నం చేయబూనినవాడే విఙ్ఞుడనబడతాడు. ప్రయత్నం లేక భగవంతుడుకూడా సహాయపడడు. నేడు సమాజంలో అడుగడుగునా ధనదాహం, కామం పెచ్చు మీరుతున్నవి. వాటి నివారణకు ప్రతిఒక్కరూ తమవంతు కృషి సల్పి భరతమాతను రాహుకోరలనుండి విడిపించాలి. కేవలం భగవన్నామం రక్షిస్తుందని కూర్చొనుట తగదు. భగవంతుని సదాప్రార్థిస్తూనే తమవంతు ప్రయత్నం చేయాలి. నీగురించి నీవు చేసుకునే జపతపాదులకన్నా, నలుగురి శ్రేయస్సు కై వెచ్చించే సమయమే ఆధ్యాత్మికతకు ఆయువుపట్టు.

1 కామెంట్‌:

  1. నేడు సమాజంలోని దురాచారములు అకృత్యములు నివారణకై ఆలోచించి తగిన పథకరచన చేసి, సమాజాన్ని సన్మార్గంవైపు పయనింప చేసే మేథావి వర్గం మిన్నకుండి పోతున్నది.పైపెచ్చు అధికార ధన ఆధిక్యతకు గౌరవము పెరిగి,అవి పెంపొందించు కొనుటయే మేధావితనమను నెపమున ఆత్మవంచనతో అక్రమమార్గమున నడచుచుండుట మిక్కిలి బాదాకారము.గౌరవమునకు మూల కారణములుగా అధికార ధన ప్రబల్యములను గుర్తిస్తూ,వాటిసముపార్జనకు కారణమగు గౌరవమును పణముగాపెట్టి అగొవ్రవ మార్గమున వెంపర్లాడుతున్న సహోదరులకు కనువిప్పు కల్గిచవలసిన అవసరమున్నది.ఈ ప్రయత్నసపలము పట్ల నమ్మకమీయరా స్వామీ....ఆపదలపట్ల ...నిర్భాయమీయరా స్వామీ...మనిషిగా నాధర్మము పట్ల నిచ్చలస్తిరత్వమీయరా స్వామీ...

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.