2, జులై 2013, మంగళవారం

లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా?



చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా? ధనవంతులవడం ఎలా? అదృష్టం కలిసిరావడం ఎలా? శ్రీమంతులు అవడం ఎలా? అని అలోచిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలను గూర్చి భారతంలోని శాంతిపర్వంలో ఈ విధంగా తెలిపారు. ధర్మరాజు భీష్ముడిని " పితామహా దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు ఔతాడు. ఏకారణంగా నశిస్తాడు " అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. 

 ఒక రోజు నారదుడు లోక సంచారము చేస్తూ మందాకినీ నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించి ఆ సమయంలో అప్పటికే ఇంద్రుడు మందాకినీ నదిలో స్నానమాచరించి అనిష్టానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషించ సాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు " నీవు ఎవరు ఎక్కడకు పోతున్నావు ? " అని అడిగాడు. ఆ స్త్రీ " ఓ ఇంద్రా ! నేను తామరపువ్వు నుండి జన్మించిన లక్ష్మిని. ఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను " అన్నది. ఇంద్రుడు " అదిసరే ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు ? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చ లేదు ? నిన్ను మెప్పించాలంటే ఏమి చేయాలి ? " అని అడిగాడు. లక్ష్మి " ఇంద్రా ! ఇప్పటి వరకు అసురులు దానములు, వేదాధ్యయనము చేయడము, అతిథులను సత్కరించడం వంటి మంచి పనులు చేసారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచి పెట్టారు. అందుకని నేను వారిని విడిచ పెట్టాను. నీవు సత్యధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కల వారు, పితరులను దేవతలను పూజించు వారు, సత్యమును పలికే వారు, దానశీలురు, ఇతరుల ధనమును కాని భార్యలను కాని కోరనివారు, పగలునిద్రించని వారు, వృద్ధులపట్ల బాలలపట్ల స్త్రీలపట్ల దయ కలిగిన వారు, బ్రాహ్మణులను పూజించు వారు, నిత్యము శుచిశుభ్రత కలిగిన వారు, అతిథులకు పెట్టికాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారివద్ద ఉండడానికి ఇష్ట పడతాను. అలా కాక కామముకు, లోభము, క్రోధములకు లోనై ధర్మమును విడిచిన వారు, గర్విష్టులు, అతిథి సత్కారము చేయని వారు, పరుషవాక్యములు పలుకువారు, క్రూరపు పనులు చేయువారిని నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను " అన్నది లక్ష్మి. ఆ మాటలకు ఇంద్రుడు, నారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితోసహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా ! లక్ష్మీ దేవి నివాస స్థానములు తెలుసుకుంటివి కదా అలా నడచుకో " అన్నాడు. 

కనుక లక్ష్మీ దేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్న వారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు.

 ఏనుగు యొక్క కుంభస్థలం, గో పృష్ఠం, తామరపువ్వు, బిల్వదళం, స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము ) ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.

2 కామెంట్‌లు:

  1. మేష్టారూ
    కనక ధారా స్తవం లో శంకర భగవత్పాదులు ఏమన్నారో చూసారా? ఆయన స్టేజ్ కి ఎదిగి అమ్మా నాకేమీ వద్దు, నాగురించి చింతిస్తూ ఈ చిన్న ఉసిరికాయ ఇచ్చిన ఈవిడకి అన్నీ ఇయ్యి అనే స్తితికి చేరగల్గితే అప్పుడు వస్తుందండీ లక్ష్మీ అనుగ్రహం. మనసు అనేది దేముడికి ఇంపార్టంట్ అంతే గానీ మిగతావి కాదు. అంతేగానీ రోజూ కనకధారా స్తవం చదివేస్తే ఇంటి కప్పులోంచి అమ్మవారు బంగారం కురిపించదు. ఇది నా పెర్సనల్ ఉద్దేశ్యం. మరోలా అనుకోకండేం?

    శంకరులు ఏది రాసినా మొత్తమ్మీద ఇలాగే రాస్తారు. అన్నపూర్నాష్టకం లో కూడా చివర్న ఇలా ఉంటుంది

    "అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
    జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహీచ పార్వతి..

    డబ్బులిమ్మని అడగట్లేదు గమనించారా? అందుకే ఆయన శంకర భగవత్పాదులూ మనం ఇలాగా మిగిలిపోయేం. :-)

    సర్దాగా ఇలా రాసాను; మిమ్మల్ని నొప్పించాలని కాదు. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ! శంకరుల స్థాయి సామాన్యులకెక్కడిది.

      సామాన్య మానవులు నాకు ఇది కావాలి, అదికావాలి అనేస్థాయిలోనే ఉంటారు. సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు కదా! ఇల్లు, పిల్లలు, తిండి,కుటుంబము, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ లక్ష్మీ అనుగ్రహం వల్లే లభిస్తాయి. కనీసం ఫలానాది కావాలి అని దాని నెపంతో నైనా భగవంతుని దిశగా ప్రయాణించ గలిగితే అదే సుకృతం కదా! ఆవిధంగా నైనా మంచి నడవడి అలవాటు చేసుకోగలరనే ఉద్దేశంతో రాసింది మాత్రమే ఈ టపా! :)

      తొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.