పేజీలు

సోమవారం 23 జనవరి 2012

అరుణాచల శివా!






 " స్వామీ! మేము అఙ్ఞానంలో పడిపోతున్నాం! మాయా మోహితులమై పుణ్యగతులు పొందలేకున్నాము. మోక్షమార్గమెరుగకున్నాము. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కలియుగంలో మానవులకు తగిన మార్గమేటి? సులభంగా మోక్షం పొందే విధము తెలుప వలసినది. "  అని ఋషులు ఒకానొక సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేశారట. అందుకు ఈశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చారు.

దర్శనాత్ అభ్ర సదశీ జననాత్ కమలాలయే
కాశ్యాంతు మరణాన్ముక్తిః  స్మరణాత్ అరుణాచలే!

  
చిదంబరంలో ( ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా ) దర్శన మాత్రము చేత,  కమలాలయం ( తిరువాయూరు ) లో పుట్టుక చేత, కాశీలో మరణము చేత, అరుణాచల  స్మరణ మాత్రము చేత ముక్తి లభిస్తుంది. 
                 



 
చిదంబరములో దర్శనము చేత : చిదంబరములో అసలు విగ్రహమే లేదు కదా మరి దర్శనమెలాగ!? అదే చిదంబర రహస్యం అన్నారు. అక్కడ ఉన్నది ఆకాశ లింగం. ఆకాశము అంతటానిండిఉన్నవాడు ఎవరున్నారో అతడే అక్కడ కొలువై ఉన్నాడు. అటువంటి ఈశ్వరుని దర్శనం అంటే మాటలు కాదు. ఎందరో మహపురుషులకు సైతం ఇది కష్టతరమైనది. కనుక ఇంకాసులువైన మార్గం చెప్పవలసింది అనివేడుకున్నారు.

కమలాలయంలో పుట్టుక చేత : పుట్టుక మన చేతులలో ఉండదు కదా! అది పూర్వకర్మ వలన మాత్రమే లభిస్తుంది. కనుక ఇది కూడా బహు కష్టమైనది. ఇంకా సులువైనది తెలుపవలసినది.

కాశీలో మరణము చేత : మరణము నకు కాశీ వెళ్లడానికి కూడా ఇల్లు, పిల్లలు అంటూ అనేక బంధాలు అడ్డుపడతాయి. ఇంతకంటే సులభమార్గమును సెలవివ్వవలసినది మహాదేవా!

అరుణాచల స్మరణ మాత్రము చేత : అయితే అరుణాచల స్మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదిస్తాను అన్నారు.


బిడ్డలమీద ఎంతటి ప్రేమ!? బోళాశంకరునడం అందుచేతకదూ! 






అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచల శివా!

  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసముల ఆధారంగా http://te.srichaganti.net/Pravachanams.aspx  మీరుకూడా వినండి.

బుధవారం 18 జనవరి 2012

దేవాలయ నిర్వహణా సమస్యలు - 2

వంద గుళ్లు కడతారు. ఒక అర్చకుని పెడతారు. నిజంగా పూజ చేసుకోవాలనుకునే అర్చకునికి ఒక గుళ్లో చెయ్యడానికి తక్కువలో తక్కువ ఉదయం తొమ్మిదింటి వరకు అర్చన, జపతపాలు సరిపోతాయి. మరి ఇతర దేవాలయాలలో ఎప్పుడు చేయాలి? ఈలోపు వచ్చే భక్తులను ఎవరు చూసుకోవాలి?  వచ్చే భక్తులు ఎక్కువగా ఉద్యోగాలకు వెళతారు కనుక ఉదయం తొమ్మిదిలోపే వస్తారు. మరి పూజకు సంకల్పం చేసుకున్న తరువాత ఎవరో భక్తుడు వస్తే వారికి హారతులు, తీర్థప్రసాదాలు ఇచ్చేది ఎవరు? సంకల్పించిన పూజ మధ్యలో ఆపి లేవాలా? అలా లేవకపోతే మేము వస్తే అర్చకస్వామి మమ్మల్ని అసలు పలకరించనుకూడా పలకరించలేదని ధర్మకర్తలకు కంప్లైంట్.

అర్చకునికి దక్షిణగా ఓ రెండు వేలు ఇస్తారు. అదే ఎక్కువ అనుకుంటారు. నిజానికి ఓ జీతగాడిని నియమించుకున్న భావనలో ఎక్కువమంది ధర్మకర్తలు ఉంటారు. జీతం ఇంత ఇస్తాం అంటారు గానీ, అయ్యా మీకు జీవన భృతిగా ఇంతమాత్రమే దక్షిణ ఇవ్వగలం అనే సంస్కారం ధర్మకర్తలలో కొరవడుతున్నది.  అటువంటి ధర్మకర్తలకు ఇక అర్చకుడు ఎటువంటి సూచనలు ఇవ్వగలడు? ఏమి పూజలు చెయ్యగలడు. పేరుకుమాత్రం గురువు, కార్య రూపంలో జీతగాడు గా అర్చకులు మిగిలి పోతున్నారు.


 ఒక ఇల్లు కూడా ఇవ్వరు, ఎక్కడో కర్మకాలి ఓ స్టోర్ రూమ్ వంటి గది ఇవ్వగలిగే వసతి ఉంటే ఇంకేంటి మీకు మహోపకారం చేసేస్తున్నామన్న భావన లో ఎక్కువమంది ఉంటున్నారు. ఒక్క గదిలో అసలు ఎలా ఉండగలరు? ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బంది రోజులలో ఎక్కడ ఉండాలి? ఒకవేళ అర్చకుడు వాళ్లిచ్చే గదిలో ఉండడానికి సిద్ధపడితే..., అర్చకుడు, అతని కుటుంబము దేవాలయానికి కాపలా దారులుగా ఉండవలసి వస్తుంది. దేవాలయ పాత్రల శుభ్రతకు ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రసాదాలు అవీ అర్చకుని భార్య వండి పెట్టాలి. అదేమంటే ధనంలేదు అంటారు. కానీ కొత్తగుడి ప్రారంభిస్తారు.  రెండు మూడు వేలలో ఇలా అన్ని సదుపాయాలు కలిసొచ్చే అర్చకుడు కావాలి చాలా మందికి. భోజనానికి ఎలా గడుస్తున్నది అనికాని, కుటుంబ పోషణ జరుగుతున్నదా అని కానీ అడుగరు. అంత తెలివి తక్కువ ప్రశ్న మరొకటి లేదని వారికి తెలిసు.

ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక దేవాలయానికి ఇద్దరు అర్చకులు కావాలి. ఒక ప్రధానా ర్చకులు, ఒక సహాయకులు.   అర్చకునికి మడి ఆచారానికి సరిపోయే ఇల్లు ఇవ్వాలనే అవగాహన ధర్మకర్తలకు ఉండాలి. జీతం కనీసం కుంటుంబ పోషణకు సరిపడా ఉండాలి. అర్చకుని కుటుంబం కాక, వాచ్ మెన్ కుటుంబం కూడా ఆ దేవాలయానికి దగ్గరలో ఉండాలి. దేవాలయ కాపలా, శుభ్రత మొదలైన వి వారు నిర్వహించాలి. ఎక్కువ ప్రసాదాలు వండ వలసి ఉంటే వంటవారిని పెట్టడం మంచిది.

దేవాలయ నిర్వహణా సమస్యలు

నేను చేస్తున్నాను అనే భావన తగ్గాలి : దేవాలయంలో దేవునికి రోజూ ఒక పూలమాల కూడా వేయలేని స్థితిలో ఉంటారు ధర్మ కర్తలు, కానీ గుడి మీద గుడి కడతారు. ఆలయ నిర్వహణకు ధనం ఉండదు. రోజూ దేవుడికి దేవాలయం తరపు న ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితి. అఖడం అంటే నూనె చాలా ఖర్చవుతుందని దీపం పెట్టి వదిలి వేయమంటారు. పోనీ ఎవరైనా దాతలను వారు అడుగరు. దానికి అహం అడ్డు వస్తుంది. వారు ఎవరినీ అడగకుండానే ఎవరో రావాలి. ధనం కురిపించాలి. పోనీ ఎవరో వచ్చి ఇచ్చినా అది మరో దేవాలయ నిర్మాణానికి ఖర్చు పెడతారు. దర్శనానికి వచ్చేవారే రోజూ ఎవరూ ఉండరు. కానీ అర్చనకు, అభిషేకానికీ, హోమానికి చివరికి కొబ్బరకాయ కొట్టుకోడానికి కూడా టికెట్ పెడతారు.

    దేవాలయ నిర్వహకులకు ఉండవలసిన ప్రధాన అర్హత ధనం కలిగి ఉండడమా? ధర్మాచరణ కలిగి ఉండడమా? అని ప్రశ్నించుకుంటే ధర్మాచరణ కలిగి ఉండడమే అని చెప్పవచ్చు. వేద మార్గాన్ని నమ్మి ఆ ధర్మాన్ని ఆచరణలో చూపగలిగే శ్రద్ధ, భగవద్భక్తి ఉన్న ధర్మకర్త నిర్వహణలో ఉన్న దేవాలయాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. కేవలం ధనం ఉండి, పేరుకోసం, డాబుకోసం దేవాలయాలను నిర్మించడం అనర్థదాయకమే అవుతుంది. రెండూ కలిగిన ధర్మకర్త అయితే ఇక ఆదేవాలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లుతుంది అనడంలో సందేహంలేదు. భక్తి కలిగిన ధర్మకర్త తన శక్తి వంచనలేకుండా దేవాలయానికి తన వంతు ఆర్థిక సహయం చేయాలి. కానీ దేవాలయాలు నేటి రోజులలో ఒక్క వ్యక్తి సహాయంతో నడపలేము కనుక తన వద్ద ధనం చాలని పక్షంలో నలుగురి సహాయం అర్థించడానికి మొహమాట పడకూడదు. "నేను చేస్తున్నాను, నాకొసం చేస్తున్నాను అనుకున్నప్పుడు అహం అడ్డువస్తుంది. అదే భగవంతుడు నడిపిస్తున్నాడు, భగవత్కార్యం చేస్తున్నాను అనుకున్నప్పుడు అలా అడిగి మరీ కార్యం పూర్తిచెయ్యడంలో ఒక తృప్తిఉంటుంది." ఇది గుర్తెరిగి భగవత్కార్యానికి నలుగురి సహాయాన్ని తీసుకుని మరీ ముందుకు వెళ్లినప్పుడు దేవాలయ నిర్వహణ అనేది సుగమం అవుతుంది.



శుక్రవారం 13 జనవరి 2012

సంక్రాంతి శుభాకాంక్షలు


నమస్కారం!

 మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు! 


అన్ని సంక్రాంతులు వచ్చినట్టు ఈ సంక్రాంతీ వచ్చి వెళ్లి పోతుంది. మనమూ నాలుగు పిండివంటలు ’స్వగృహ ఫూడ్స్’ నుండి తెచ్చి తింటూ టీవీలో వచ్చే కొత్త సినిమాలు చూస్తూ కూర్చుంటే అది కృతకంగా ఉంటుంది. పండుగకు వచ్చే సంతృప్తి అందులో ఉండదు.

ఆసక్తి, అవకాశం ఉన్నవారు ఈ క్రింది విషయాలు పాఠించే ప్రయత్నం చేద్దాం.

సాంప్రదాయ పంచకట్టు, చీర మరియూ లంగా ఓణీలు ధరించడం.
ఈ మూడు రోజులూ రెండు పూటలా దీపారాధన, కులదేవతా పూజ ప్రతీ ఒక్కరూ చేసే ప్రయత్నం చేద్దాం.
సంక్రాంతి పూట పిల్లలు, పెద్దలతో కలిసి విష్ణు సహస్ర నామ పారాయణ చెయ్యడం మరువవద్దు.
పిల్లలు, పెద్దలు, బంధువులు మొదలైన వారందరితో కలిసి దేవాలయ దర్శనం చేద్దాం.

సంక్రాంతి నాడు పెద్దలకు తర్పణలు విడువడం మరువ వద్దు. ఇక పెద్దల పేరుతో బ్రాహ్మణునకు భోజనం పెట్టడం, దాన ధర్మాలు మొదలైన చెయ్యాలి.

స్త్రీలు ముంగిలి ముగ్గులతో అలంకరిస్తుంటే -  రంగులవీ అద్దడంలో మొగవారు, పిల్లలు సాయపడుతుంటే - చిన్న చిన్న చలోక్తులతో బంధువులు చుట్టాలూ నవ్వుల పూవులు పూయిస్తూ ఉంటే సరదాగా గడిపే ప్రయత్నం చేద్దాం.

పిండి వంటలు వండే టప్పుడు ఏటీవీ ముందో కూర్చోకుండా అందరూ సాయం చేస్తూంటే చకోడీలు, జంతికలు, అరిశలు, బొబ్బట్లు ఇలా ఒక్కటే మిటి అన్నీ చకచకా తీపి కబుర్ల కలబోతలో తేనెలూరవూ!?

చిన్నపిల్లలు వచ్చీ పోతూ అటో అరిశ, ఇటో అరిశ తీసుకు వెళుతుంటే - "ఒరేయ్! ఒరేయ్! దేముడికి పెట్టకుండా అలా లాక్కు వెళితే ఎలారా!"  అని ఒకరంటే, "ఆ ఈరోజుకి పిల్లలే దేముళ్లు. అగ్రపూజ్యులు కదటే!" అని నాయినమ్మలు వెనకేసుకొస్తుంటే ఆ సరదానే వేరు.  :)

మామిడి తోరణాలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, సాంప్రదాయ వస్త్రధారణలు, పిండివంటల ఘుమఘుమలు, చిన్నపిల్లల కేరింతలు, పెద్దల ఆశీర్వాదాలు, భగవత్పూజలు మొదలైన వాటితో మనందరి ఇళ్లూ ఈ మూడురోజులూ సంక్రాంతి శోభను చేకూర్చాలని మనసారా కోరుకుంటూ మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

శనివారం 31 డిసెంబర్ 2011

దేవాలయ నిర్మాణానికి సహాయం అందించండి

      ఈశ్వరుని అనుగ్రహం వలన దేవాలయ నిర్మాణం కొరకు  చిలుకూరుకు వెళ్లే దారిలో స్వామినారాయణ గురుకుల్ దగ్గరలో కొంత స్థలాన్ని నాకు అప్పగించడానికి ముందుకు వచ్చారు. నాకు సాధ్యమైనంత ఎక్కువ ఉపాసన చేస్తు జీవనం సాగించడం ఇష్టం. అటువంటి ఉపాసనకు పురోహితం కంటే అర్చకత్వం బహు అనుకూలమైనది. కానీ యాజమాన్య లోపం వలన దేవాలయాలలో చేయడానికి ఇప్పటివరకు నెను వెనుకాడాను. అందుకు ఈశ్వరుడే ఓ మార్గాన్ని ఈవిధంగా చూపించారు.  

  అయితే నిర్మాణం చెయ్యడానికి కూడా నేను ఏవిధంగానూ సమర్థుడను కాను. కేవలం అర్చకత్వం ద్వారా నెను తరిస్తూ నలుగురినీ తరింపచేయాలన్నదే నా జీవన లక్ష్యం. దానికి తగిన అర్హతను, ఆర్ధిక వసతినీ ఆయనే ప్రసాదిస్తాడని నమ్ముతున్నాను.

 త్వరలో జరుగ బోయే "రామాలయ"  నిర్మాణానికి మీవంతు సహాయం అందించడానికి ముందుకు రండి. ఆసక్తి ఉన్నవారు నాకు మెయిల్ చెయ్యగలరు.

బుధవారం 21 డిసెంబర్ 2011

అప్పుల బాధ తీరాలంటే ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ పారాయణ చెయ్యండి

ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ I

బ్రహ్మోవాచ : 
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ I

 ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య I గౌతమ ఋషిః I అనుష్టుప్ చ్ఛందః I అంగారకో దేవతా I మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః I 

ధ్యానమ్ :

రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I 
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II 

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I 
స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II  

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II   

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I 
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II 

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I 
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II  

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్ 


మూలమంత్రః 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష  ఋణ మాశు విమోచయ II

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II
అర్ఘ్యమ్ :

అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I 
నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ  II 

భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I 
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II

ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను.   

ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి. ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి -  దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి - ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

            ఓం మంగళాయ నమః - ఓం భూమి పుత్రాయ నమః - ఓం ఋణ హన్త్రే నమః - ఓం ధన ప్రదాయ నమః - ఓం స్థిరాసనాయ నమః - ఓం మహా కాయాయ నమః - ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః - ఓం లోహితాయ నమః - ఓం లోహితాక్షాయ నమః - ఓం సామగాన కృపాకరాయ నమః - ఓం ధరాత్మజాయ నమః - ఓం కుజాయ నమః - ఓం భౌమాయ నమః - ఓం భూమిజాయా నమః  - ఓం భూమి నందనాయ నమః - ఓం అంగారకాయ నమః - ఓం యమాయ నమః - ఓం సర్వరోగాపహారకాయ నమః - ఓం స్రష్ట్రే నమః - ఓం కర్త్రే నమః - ఓం హర్త్రే నమః - ఓం సర్వదెవ పూజితాయ నమః 

అని పూజించ వలెను.  

తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.  
ఉదాహరణకు :

------------------


రు. 50,400 - 00


------------------

పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి  ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది. 

ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు !
     

శుక్రవారం 25 నవంబర్ 2011

గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు


   గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు  ప్రస్తావిస్తాను.

   గ్రహణ స్పర్శ సమయమున స్నానమును, మధ్యకాలమున హోమము-దేవతార్చనము-శ్రాద్ధములను, విడుపు సమయమున దానము, పూర్తిగా విడిచిన తరువాత మరల స్నానమును చేయాలి.

     " సర్వేషా మేతవర్ణానాం సూతకం రాహుదర్శనే" అనుటచేత  ఈ గ్రహణ సమయంలో అన్ని వర్ణముల వారికీ జాతాశౌచముండును. కనుక అప్పుడు ముట్టిన వస్త్రములన్నిటినీ తడుపవలెను.  కనుక ఈ సమయంలో ఏమీ ముట్టుకోకుండా స్నానమాచరించి జపాదికాలు చేసుకోవాలి. గ్రహణమునకు ముందు మూడు రోజుల నుండి గానీ, ఒక రోజు నుండి గానీ ఉపవాసముండి ఈ గ్రహణ స్నానాదులు చేసినచో మహాఫలము.  పుత్రపుత్రికలు కలవారు గ్రహణ సంక్రాంతులందు ఉపవాసము ఉండనవసరం లేదని కొందరి మతము.

      గ్రహణ సమయంలో అందరూ పట్టు స్నానం చేసి , వారి వారి ఉపదేశ మంత్రాలను జపించాలి.  మధ్యలో మరోసారి స్నానంచేసి, మళ్లీ గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేస్తారు.  ఈ సమయంలో స్నానానికి : ఉష్ణోదకము కంటే సీతోదకము, వేరేవారు సంపాదించిన ( తోడి పెట్టిన ) దానికంటే స్వయముగా సంపాదించినది, బావులలో జలముకంటే కొండలు మొదలైనవాటిలో పుట్టి స్రవించి పారునది, అంతకంటే సరోవరము లోనిది, దానికంటే నదీ జలము, దానికంటే గంగా జలము, దానికంటే సముద్రోదకము క్రమముగా ఉత్తమములు. ఈ గ్రహణ సమయానికి జాతాశౌచ, మృతాశౌచములున్నప్పటికీ గ్రహణ సంబంధమైన స్నానదానాదికాలు చేయాలి.  స్త్రీలు  ఆ సమయంలో రజస్వలై ఉన్నప్పటికీ  కూడా వేరేగా ఒక పాత్రలో ఉన్న జలముతొ స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించ వలెను.  గ్రహణస్నానము కట్టిన బట్టలతోనే చేయవలెను. తడిసిన బట్ట పిండకూడదు. వేరొక వస్త్రమును ధరించ రాదు.

" సర్వం గాంగా సమం తోయం సర్వేవ్యాస సమాద్విజాః
సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర సూర్యయోః " 


సూర్యచంద్ర గ్రహణ సమయంలో దొరికె జలమంతయూ గంగా సమానము, ద్విజులందరూ వ్యాససమానులు, చేసే ప్రతి దానమూ భూదాన సమానము. 

  శ్లో: " చంద్ర సూర్య గ్రహే తీర్థే మహాపర్వాదికే తథా
మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాసనక్షత్రాదీన్నశోధయేత్"


      చంద్ర సూర్యగ్రహణ సమయములలోను, తీర్థ ప్రదేశమందును, మహాపర్వదినములలోను మంత్ర పురశ్చరణ దీక్షకు కానీ, ఉపలక్షణముచే మంత్రోపదేశమును చేయుటాకు కానీ  మాసనక్షత్రాది శోధన అవసరములేదు

అనుట చేత కొత్తగా మంత్రోపదేశం తీసుకోవాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో సద్గురువుల వద్ద జపదీక్ష తీసుకుని జపిస్తారు. మంత్రోపదేశమునకు సూర్యగ్రహణమే ఉత్తమమని, చంద్రగ్రహణము దారిద్ర్యాది దోషకారి అని కొందరి మతము.


"చంద్ర సూర్యో పరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః
జపాద్దశాంశతో హోమ స్తథా హోమాచ్చతర్పణం
హోమా2శక్తౌ జపంకుర్యాద్ధోమసంఖ్యా చతుర్గుణం"


చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి, స్పర్శ కాక మునుపే స్నానము చేసి, అది మొదలుకొని శుద్ధమోక్షము వరకు మంత్రము ఏకాగ్రతతో జపించ వలెను. జప సంఖ్యకు పదవవంతు హోమము, దానికి పదవ వంతు తర్పణము చేయవలెను. హోమము గానీ, తర్పణము గానీ చేయలేని పక్షమున ఆ సంఖ్యకు నాలుగు వంతులు జపమే చేయవలెను. ( ఉదాహరణకు గ్రహణ సమయంలో మొత్తము 1,000 సార్లు జపం చేయగలిగితే అందులో పదవ వంతు 100 సార్లు హోమము, అందులో పదవ వంతు 10 సార్లు తర్పణము చేయవలెను. హోమము చేయలేని పక్షమున 100 కు నాలుగురెట్లు ఎక్కువగా అనగా 400 సార్లు మరల జపమే చేయాలి. అదే విధంగా తర్పణము చేయలేనిచో 40 సార్లు జపం చేయాలి. ) ఈ పురశ్చరణాంగమైన ఉపవాసమును పుత్రవంతులైన గృహస్థులును చేయవచ్చును. గ్రహణ సమయంలో పురశ్చరణ చేయదలచినవారికి మిగతా స్నాన దానాది నైమిత్తికములు చేయుటకు వీలవదు, కనుక అవి భార్యా పుత్రులు మొదలైన వారితో చేయించ వలెను.  పురశ్చరణ దీక్షపూనని వారు కూడా తమ తమ ఇష్టదేవతా మంత్ర జపమును, గాయత్రీ మంత్ర జపమును తప్పక చేయవలెను. లేనిచో ఆయా మంత్రములకు మాలిన్యమగును.

గ్రహణ సమయంలో శయనించినచో రోగము, మూత్రము విడచినచో దారిద్ర్యము, పురీషము విడచినచో క్రిమిజన్మము, మైధునము చేసినచో ఊరపంది జన్మము, అభ్యంగనము( తలంటి స్నానము ) చేసినచో కుష్టు రోగము, భోజనము చేసినచో నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము - గ్రహణానంతరము భుజింపరాదు. నిలువ ఉంచిన జలమునూ వర్జనీయము. కానీ మీగడ, మజ్జిగ, తైలపక్వము ( నువ్వుల నూనెతో వండినది ), క్షీరము  మొదలైనవి గ్రహణ పూర్వమందువి ఐనను గ్రహించ వచ్చును. కానీ వాటియందు దర్భ లు ఉంచ వలెను.

ఈ గ్రహణ సమయంలో చేసే గోదానము, భూదానము, సువర్ణ దానము మహా ఫలవంతములు.


గ్రహణ సమయంలో చేయుశ్రాద్ధము ఆమ ద్రవ్యము చేతగానీ, హిరణ్యము చేతగానీ చేయవచ్చును. సంపన్నులైన ఎడల వండిన అన్నము చేత కూడా చేయవచ్చును. తీర్థయాత్రల యందు ఏవధముగా శ్రాద్ధము చేయుదురో అదే విధముగా ఘృత ( నెయ్యి ) ప్రధానముగా చెయ్యవలయును. ఈసమయంలో భోక్తకు మహా దోషము.  

సర్వంశ్రీగురు చరణారవిందార్పణమస్తు