పూజ కానీ, రేపు దేవీ నవరాతృలలో చేసే దుర్గా పూజ కానీ- మరే దేవీ పూజ కానీ మీరు సొంతంగా- రోజూ ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ టపా రాస్తున్నాను. మీరు చేయ వలసిందల్లా " శ్రీ లలితా దేవీ " అని ఉన్నచోట మీరు పూజించే దేవత పేరు పెట్టు కోవడమే. స్త్రీ స్వరూప దేవతలకు మాత్రమే పనికి వచ్చే శ్లోకాలతో రాయబడుచున్నది. కనుక పురుష స్వరూప దేవతలకు పనికి రాదు.
ఈ టపాలో పూజ చేయవలసిన విధానంతో పాటు, లలితా దేవి పూజను కూడా రాస్తున్నాను. అది అందరికీ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. నిజానికి ఈ పూజా మంత్రాలతో కూడిన అనేక పుస్తకాలు బయట షాపుల్లో దొరుకుతున్నాయి. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో చెపుతూ ఒకొక్క సేవ వివరిస్తే బాగుంటుంది అనే భావనతో ఈ టపా రాస్తున్నాను.
షోడశోపచార పూజ: 16 రకాలైన సేవలను చేయుటయే "షోడశోపచార పూజ" అనబడుచున్నది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా గౌరవంతో సేవిస్తామో అదే విధంగా మన అభ్యర్ధనను మన్నించి వచ్చిన భగవంతుని 16 రకాలైన సేవలతో పూజిస్తామన్నమాట. కుదిరితే " పూజ చెయ్యబోతున్నారా..? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి " అనే టపా కూడా చదవండి.
ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.
శ్రీ దేవి పూజా ప్రారంభః
గణపతి ప్రార్ధన:
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
పార్వతీ పరమేశ్వర ప్రార్థన:
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
గురు ప్రార్థన:
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం
ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఆ ఎంగిలి చేతిని కడగాలి )
( నమస్కారము చేస్తూ ఈ క్రింది నామాలు చదవాలి)
ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.
తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.
భూతోచ్ఛాటన: ( ఈ క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.
ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ఈ ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి ఆ మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. ఆ తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని ఆ రోగ్యముతో జీవించ వచ్చును.
సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.)
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)
....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో ఏ సంవత్సరమైతే ఆ పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )
( వీలైతే ఈ పూజా విధానం చివరిలో ఈ సంవత్సరాలు, నక్షత్రాలు మొ.గు మొత్తం పేర్లు రాస్తాను.)
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-
శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-
ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే. ( అని అక్షతలు నీళ్లు పళ్లెంలో వదిలి పెట్టాలి )
టూకీగా ఈ సంకల్పం వివరణ: కలియుగం ప్రథమ పాదంలో-భారతదేశంలో- హైదరాబాదులో- నాకు శుభమును కలిగించు గృహములో- దేముని ముందు ఉన్నటువంటి నేను- ఫలానా సంవత్సర-మాస-తిథి-వార-నక్షత్ర ములు కలిగిన ఈ శుభ దినమున- ....గోత్రంలో పుట్టిన-........ పేరుతో పిలవబడే-
ధర్మ పత్నితో కూడుకున్న వాడనైన( ఆడవారు ఇది చెప్పుకోనవసరం లేదు ) నేను-
శ్రీ లలితా దేవిని ఉద్దేశించి- శ్రీ లలితా దేవి ప్రీతి కొరకు-నాకు శ్రీ లలితా దేవి అనుగ్రహం కలగడం కొరకు- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి 16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను. I
సంకల్పం అయిన పిదప కలశారాధన చెయ్యాలి.
(శ్రీ లలితాపూజాం కరిష్యే. అన్న తరువాత)
తదంగ కలశారాధనం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీరు వదలాలి.
కలశారాధనం
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.
మనము ఆచమనము చేసిన పాత్రను కాక, భగవంతునికి ఉపయోగించడం కొరకు వేరే ఒక కలశములో నీటిని తీసుకుని ఆ కలశమును గంధము,పసుపు,కుంకుమలతో అలంకరించాలి. కలశములో త్రిమూర్తులు, మాతృగణములు, సప్తసాగరములు,సప్తద్వీపములు,చతుర్వేదములు ఆవాహన అగునట్లు భావిస్తూ ఈ క్రింది శ్లోకము చదవాలి. ( ఈ కలశము కేవలం భగవంతుని పూజకోసం వినియోగించడానికి మాత్రమే. మన ఆచమనముకొసం మనకో పాత్ర ఎలా ఉందో, అలాగే అమ్మవారి ఆచమనమునకు,స్నానమునకు మొదలైన వాని కొరకు నీటిని ఉపయోగించుటకు ఈ కలశం. )
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆ కలశములోని నీటి యందు గంగా మొదలైన సప్త నదులు ఆవాహన అయినట్లుగా భావించి ఈ క్రింది శ్లోకములను చదవాలి.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.
ఆయాంతు శ్రీ లలితా దేవీ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశములోని నీటిని పూజా ద్రవ్యముల యందు, దేవుని యందు, తన యందు చల్లవలెను.
1.అథ ధ్యానం:
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం
సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం
మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి( భావన చేయాలి ).
2.ఆవాహనం:
నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కృపాకరే.
శ్రీ లలితాదేవ్యైనమః ఆవాహయామి. ( అమ్మా నేను నిన్ను పూజించ తలచి మా గృహమునకు ఆహ్వానిస్తున్నాను. నీవు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసినది. అని భావన చేసి ) అక్షతలు కలశము లేదా విగ్రహముపై వేయవలెను. ( ఇక్కడ కలశము అంటే ప్రథాన కలశం. అంటే సత్యనారాయణ వ్రతంలో వలే దేముని పటము ముందు కలశము పెట్టి, దానిపై కొబ్బరికాయను ఉంచి, దానిమీద వస్త్రమును ఉంచుతారు. )
3.ఆసనం:
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
మనశ్చిత్రం మనోహారి సింహాసన మిదం తవ.
శ్రీ లలితాదేవ్యైనమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ( అమ్మా! నీవు ఈ ఆసనమును అలంకరించ వలసినది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనముపై ) అక్షతలు చల్లవలెను.
4.పాద్యం:
అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతృకే
మనశ్శుద్ధం మయాదత్తం గంగామంబుపదోస్తవ.
శ్రీలలితాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి. ( అమ్మా! నీ పాదముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని (ఆచమనం చేసిన పాత్రకాక మరొక పాత్రకు అలంకారం చేశారు కదా అందులోని ) నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదలవలెను.
5.అర్ఘ్యం:
సర్వ తీర్థమయం హృద్యం బహుపుష్ప సువాసితం
ఇదమర్ఘ్యం మయాదత్తం గృహాణ వరదాయిని.
శ్రీలలితాదేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ( అమ్మా! నీ హస్తముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.
6.ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే
గృహాణాచమనం దేవి నిర్మల రుచి పూరకం.
శ్రీలలితాదేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ( అమ్మా! నీ ఆచమనము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.
మధుపర్కం:
మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరా జల సంయుతం
మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే.
శ్రీలలితాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి. ( అమ్మా! ఈ చల్లని మధుపర్కమును స్వీకరించు అని భావించి ) పెరుగు,బెల్లం/పంచదార కలిపి అమ్మవారికి చూపి పళ్లెములో వదలవలెను. ( దూరమునుండి వచ్చిన అతిథికి, ప్రయాణ బడలిక,వేడి తగ్గడం కోసం మజ్జిగ ఇవ్వడం వంటిది ఈ మధుపర్కం ఇవ్వడం )
7.స్నానం:
ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా స్నానము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశములోని నీటిని అమ్మవారిపై చిన్న పుష్పముతో చల్ల వలెను.
నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే
ఇదం శుద్ధోదక స్మానం స్వీకురుష్వ దయామతే.
శ్రీలలితాదేవ్యైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
పంచామౄత స్నానం:
ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా! నీ స్నానము కొరకు ఈ పంచామౄతములను, కొబ్బరి నీటిని స్వీకరించు అని భావించి ) పంచామౄతములను ( ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అను అయిదు భూలోకములో అమౄత సమానమైనవి) , కొబ్బరినీటిని అమ్మవారిపై పుష్పముతో కొద్ది కొద్దిగా చల్లవలెను.
దధి క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
నారికేళ జలైర్యుక్తం స్నానమంబ మయార్పితం.
శ్రీలలితాదేవ్యైనమః పంచామౄత స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
8.వస్త్రం:
అంబరంచాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం
వస్త్రమేతన్మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.( అమ్మా! నీ అలంకరణ కోసం ఈ వస్త్రమును స్వీకరించు అని భావించి ) వస్త్రమును గానీ, ప్రత్తితో చేసిన వస్త్రమును గానీ సమర్పించాలి.
వస్త్ర యుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
9.యఙ్ఞోపవీతం:
నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్ర కోటి మనోహరే
ఉపవీతమిదందేవి గృహాణత్వం ప్రసీదమే.
శ్రీలలితాదేవ్యైనమః యఙ్ఞోపవీతం సమర్పయామి ( అమ్మా ఈ యఙ్ఞోపవీతమును స్వీకరించు అని భావించి ) యఙ్ఞోపవీతమును గానీ ప్రత్తితో చేసిన యఙ్ఞోపవీతమును గానీ సమర్పించాలి.
యఙ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
ఆభరణం:
నానా విధాని రత్నాని మాంగళ్యాభరణానిచ
సౌవర్ణాని చ దీయంతే గృహాణ పరదేవతే
శ్రీ లలితాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి. ఆభరణాలు ( గాజులు మొ..వి ) సమర్పించ వలెను.
10.గంధం:
ఇష్ట గంధ ప్రదం దేవి అష్ట గంధాధి వాసితం
అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం.
శ్రీలలితాదేవ్యైనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ( అమ్మా! ఈ శ్రీ చందనమును స్వీకరించు అని భావించి ) పుష్పముతో గంధమును చల్లవలెను.
హరిద్రాచూర్ణం:
హరిద్రా చూర్ణమేతద్ధి స్వర్ణ కాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః హరిద్రాచూర్ణం ( పసుపు ) సమర్పయామి.
కుంకుమాచూర్ణం:
కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే.
శ్రీలలితాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములు సమర్పించ వలెను.
అక్షతాన్:
ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే
స్వర్ణాక్షతామయాదత్తాః కృపయా పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః సువర్ణాక్షతాన్ సమర్పయామి. ( అక్షతలు అంటే క్షతము కానివి. అంటే విరగనివి. )
పుష్పం:
నానా విధైశ్చ కుసుమైః బహు వర్ణైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి. ( పుష్పములు సమర్పించవలెను)
అక్షతైః పుష్పైః పూజయామి. ( అక్షతలతోను, పుష్పములతోను పూజించ వలెను. )
ఇక్కడ 108 లేదా 1008 నామములతో అమ్మవారిని పూజించ వచ్చు. ఆపిదప
11.ధూపం:
జగదంబే నమస్తేస్తు కరుణాపూర పూరితే
ధూపమేతన్మయాదత్తం గౄహాణ వరదేంబికే.
శ్రీలలితాదేవ్యైనమః ధూపం సమర్పయామి. ( సాంబ్రాణి లేదా అగరుబత్తి చూపించాలి )
12.దీపం:
కృపాపరే మహా దేవి జగద్రక్షణ తత్పరే
చంద్ర రేఖాంక మకుటే దీపోయం పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః దీపం దర్శయామి. ( దీపమును చూపవలెను )
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ( కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను. )
13.నైవేద్యం:
భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వ దేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి. నివేదనకు పండ్లు, కొబ్బరికాయ, పరమాన్నం,పిండివంటలు,పులగము మొదలగునవి యధాశక్తిగా సమర్పించ వలెను. ( అమ్మా! నాశక్తి కొలదీ సమర్పించు ఈ నివేదనను స్వీకరించు అని, కళ్లు మూసుకుని అమ్మ ప్రీతితో స్వీకరిస్తున్నట్లుగా భావించ వలెను. )
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి. పాదౌ ప్రక్షాళ యామి. పునరాచమనీయం సమర్పయామి. నైవేద్యము అయిన తరువాత అమ్మవారు చేతులు శుభ్రపరచుకొనుటకు, పాదములు శుభ్రపరచుకొనుటకు, దాహము తీర్చుకొనుటకు కలశంలో నీటిని 5 సార్లు అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
తాంబూలం:
తాంబూల పూరితముఖి సర్వ విద్యా స్వరూపిణి
సర్వ మంత్రాత్మికేదేవి తాంబూలం పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి. 3 తమల పాకులు, రెండు వక్కలు,పండ్లు తాంబూలముగా సమర్పించవలెను.
తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
14.నీరాజనం:
కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే
నీరాజనం మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపుతూ ఆ వెలుగులో అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించ వలెను.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
15.మంత్రపుష్పం:
పుష్పము అక్షతలు పట్టుకుని లెచినుంచుని అమ్మవారిని ఈ క్రింది విధంగాస్తుతించవలెను.
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
చేతిలోని అక్షతలు, పూలు అమ్మ వారిపై వేయవలెను
ప్రదక్షిణ నమస్కారాః :
మరల పుష్పము, అక్షతలు పట్టుకుని ఈ క్రిది విధంగా చదువుతూ ఆత్మప్రదక్షిణము చేయవలెను
యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపాసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దౄష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే.
శ్రీలలితాదేవ్యైనమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి.
( అని చెప్పి బోర్లా పడుకుని చేతులు చాపి సాష్టాంగ నమస్కారం చేయవలెను. అమ్మవారిని మనసులో స్మరిస్తూ, ఆ తల్లి పాదములను మీచేతులు తాకినట్టుగా, ఆ అమ్మ మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించినట్టుగా భావన చేయవలయును. పొట్ట, శిరసు, కనులు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు అను ఎనిమిదింటి చేత నమస్కారము చేయుట సాష్టాంగ నమస్కారం. స్త్రీలు మోకాళ్లపై మాత్రమె చేయవలెను. )
అపరాధ నమస్కారం:
( అమ్మా! మానవులమై పుట్టిన మేము కలి ప్రభావంచేత తెలిసో,తెలియకో అనేక అపరాధములు చేస్తూ ఉంటాము. అలా తెలిసీ తెలియక చేసిన అపరాధములను పుత్ర/పుత్రీ వాత్సల్యముతో క్షమించి సదామమ్ము కాపాడు దేవీ..! అనే భావనతో ఈ క్రింది శ్లోకములను చదవవలెను )
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః అపరాధ నమస్కారం సమర్పయామి.
యస్యస్మౄత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే.
అనయధ్యాన ఆవాహానాది షోడశోపచారపూజయా
భగవతీ సర్వాత్మకః శ్రీ లలితా దేవీ స్సుప్రీతాస్సుప్రసన్నో వరదో భవతు.
16.ఉద్వాసనం:
శ్రీలలితాదేవ్యైనమః ఉద్వాసయామి.
ఆవాహనం నజానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి
( ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపడం. ఇక్కడ విచిత్రం చూడండి. "అమ్మా! నిన్ను ఆవాహనం చేయడమూ నాకు తెలియదు, ఉద్వాసన చేయడమూ నాకు తెలియదు, అసలు నిన్ను పూజించడమే నాకు తెలియదు ఏమైనా అపరాధములుంటే క్షమించు తల్లీ." అని పైశ్లోకంలో ప్రార్థిస్తున్నాము. అంటే మన ఇంటికి వచ్చిన మనకు అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి ఇంటి నుండి వెళుతుంటే ఏవిధంగా మాట్లాడతామో అలాగే ఉంది కదా!? ఎంత వినయం,విధేయతా ఉంటే ఈ మాటలు అనగలుగుతాము? అందుకే పూజ చేయడం సరిగా వస్తే సాటి మనిషితో ఎలా మెలగాలి? ఎలా ప్రేమించాలి? అనే విషయం మనకు బాగా తెలిసినట్టే అని నేను భావిస్తాను. )
శ్రీలలితాదేవ్యైనమః యధాస్థానం ప్రవేశయామి. అని అమ్మవారిపై అక్షతలు వేసి కొంత సేపు మౌనంగా ప్రార్థించాలి. ఆ తరువాత ( పళ్లెములో వదిలిన ) తీర్థమును, నివేదన చేసిన ప్రసాదమును ప్రీతితో స్వీకరించాలి.
ధన్యవాదములు సర్..
రిప్లయితొలగించండిExcellent blog Sarma garu, keep up the good work!
రిప్లయితొలగించండిఆస్థికులకు ఉపయోగ పడుతుందని ఇదే పూజా విధానాన్ని పూర్వం రెండు టపాలుగా రాసినప్పుడు పలువురు రాసిన వ్యాఖ్యలను ఇక్కడ పొందు పరుస్తున్నాను. త్వరలో ఆ టపాలు తొలగించాలనుకొంటున్నాను.
రిప్లయితొలగించండి1. Shyam అన్నారు...
రిప్లయితొలగించండిమంచి పని చేస్తున్నారు.
2 సెప్టెంబర్ 2009 4:49 pm
2. anagha అన్నారు...
chala manchi pani chesthunnaru,me katha kuda bagundi.
14 సెప్టెంబర్ 2009 9:58 pm
3. creativekurrodu అన్నారు...
deepavali subhakankshalu
17 అక్టోబర్ 2009 10:48 am
4. యడవల్లి శర్మ అన్నారు...
అయ్యా శర్మ గారూ...కేశవ నామాలలో జనార్దనాయ నమ: మాత్రమే..
వత్తు లేదు.(జనార్థనాయ నమః కాదు).
దయచేసి సవరించగలరు.
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
29 అక్టోబర్ 2009 12:41 am
5. tiyyanitenugu అన్నారు...
అయ్యా శర్మ గారూ...కేశవ నామాలలో జనార్దనాయ నమ: మాత్రమే..
వత్తు లేదు.(జనార్థనాయ నమః కాదు).
దయచేసి సవరించగలరు.
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
29 అక్టోబర్ 2009 12:42 am
6. రాజశేఖరుని విజయ్ శర్మ అన్నారు...
ధన్యవాదాలు శర్మ గారు. సరిదిద్దాను.
29 అక్టోబర్ 2009 8:14 pm
7. పరుచూరి వంశీ కృష్ణ . అన్నారు...
శర్మ గారు చాలా మంచి టపాలు అందచేస్తున్నారు మీకు ధన్యవాదములు ....మీ బ్లాగ్ బాగుంది
19 డిసెంబర్ 2009 12:50 pm
8. sraddha అన్నారు...
శాస్త్రి గారు ..
ఆచమనం అంటే అర్ధం తెలుసుకోవచ్చా?
నీటిని తీసుకోవటం వదిలివేయటం వెనుక అర్ధం ఏమిటి?
5 జనవరి 2010 7:38 pm
9. రాజశేఖరుని విజయ్ శర్మ అన్నారు...
శ్రద్ధ గారు మంచి ప్రశ్న వేశారు. నాకు జటిలమైన ప్రశ్న వేసి నన్ను ఇరుకున పడ వేశారు. :)
ఆచమ్య అంటే -ఆచమనము చేసి అని అర్థం.
ఇక్కడ ‘చం’ అనే ధాతువుకు ముందు ‘ఆ’ అనే ఉపసర్గ, తరువాత ‘య’ అనే ల్యప్ చేరి
ఆచమ్య అయ్యింది.
చం-త్రాగుట/తినుట
చమతి -తాగుచున్నాడు/తినుచున్నాడు
ఆచమనము అంటే నీటిని త్రాగుట.
ఇంతవరకూ నేనూ ఎవరినో అడిగి తెలుసుకుని మరీ రాస్తున్నాను. ఎందుకంటే నాకు సంస్కృత పరిచయమే కానీ, పాండిత్యం లేదు.
ఇక మీ రెండవ ప్రశ్న:
సంధ్యావందన సమయంలో ఎక్కువ సార్లు ఆచమనము చేయవలసి ఉంటుంది. అలాగే ప్రాణాయామము కూడా.
మినప గింజ మునిగే ప్రమాణము గల నీటిని మూడు సార్లుగా శబ్దము రాకుండా స్వీకరించడం వలన ఒకటి దాహము తీరడము, రెండు కంఠము నుండి అన్న నాళము గుండా జీర్ణాశయము వరకు శుద్ధిచేయ బడడము, మూడు మనసుకూడా శుద్ధి అవడము అనే ప్రయోజనాలు నేను గమనించాను.
ఈ మూడవ ప్రయోజనం అంత త్వరగా అవగతమవ్వదు. ఈ ఆచమనము ద్వారా మనసు త్వరగా ఓ నిశ్చలస్థితికి రావడాన్ని నేను స్వయంగా గమనించాను. దీనికి ప్రాణాయామము మరింత సహాయపడుతున్నది. ఈ రెండూ ఎక్కువసార్లు జరపడం వలన త్వరగా మనసు భగవంతుని పై లగ్నమవుతున్నది.
ఇక నీటిని వదలడమంటే చేతిని శుభ్రపరచడం కోసం ఎక్కువ సార్లు చేస్తాము. కానీ " కరిష్యే " అన్నప్పుడు నేను ఈ పూజ చేస్తాను అని నీటి పూర్వక సంకల్పం చేస్తున్నామన్నమాట.
ఇటువంటి మంచి ప్రశ్నలు మరిన్ని మీనుండి రావాలనీ, తద్వారా మన ఆలోచనా శక్తికి మరిన్ని మెరుగులు దిద్దాలనీ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
5 జనవరి 2010 11:40 pm
1. కొండముది సాయికిరణ్ కుమార్ అన్నారు...
రిప్లయితొలగించండిఎప్పటి నుంచో అనుమానం. శ్రీసూక్త విధానంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీత ధారణ అర్ధంకాని విషయంగా ఉంది. వీలువెంట వివరించగలరు.
21 జనవరి 2010 4:53 pm
2. రాజశేఖరుని విజయ్ శర్మ అన్నారు...
మీ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు.
"స్త్రీ లకు యఙ్ఞోపవీతం ఏమిటీ?"
అనేనా మీసందేహం.
పూర్వం స్త్రీలు కూడా యఙ్ఞోపవీతం ధరించేవారు. అందువలన అది పూజా విధానంలో కూడా ఉన్నది. దేవాలయానికి వెళ్లినప్పుడు సరిగ్గ గమనిస్తే దేవతలకు కూడా యఙ్ఞోపవీతాలు కనిపిస్తాయి చూడండి.
21 జనవరి 2010 6:11 pm
భోజనానంతరం ఔపాసన చేసె టప్పుడు మత్రం మేమిటొ వివరించ గలరు.
రిప్లయితొలగించండిశర్మ గారూ,
రిప్లయితొలగించండిదీపారాధన ఎప్పుడు చెయ్యాలి? ఆచమనము ముందా? తర్వాత? అప్పుడు చెప్పే మంత్రము ఏదైనా ఉందా?
అఙ్ఞాత గారు భోజన విధిని ఒక టపాగా రాశాను క్రింద ఇచ్చే లింక్ లో చూడగలరు.
రిప్లయితొలగించండిhttp://rajasekharunivijay.blogspot.com/2009/10/blog-post_25.html
సత్యం గారికి
రిప్లయితొలగించండిదీపారాథన ముందు ఆచమనము చేసి దీపారాథన చేసి మరల దీప సన్నిధిలో ఆచమించ వలెను.
దీపమువెలిగించుచు ఈ క్రింది విధంగా చదవవలెను.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ.
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాద్ఘోరా ద్దివ్యజ్యోతిర్నమోస్తుతే.
శర్మ గారు, సంకల్పం యొక్క ఆంతర్యం ఏమిటి?
రిప్లయితొలగించండిభగవతుడికి మన అడ్రస్ తెలీయదనా?
(అర్ధం అయ్యీ కానట్లుగా ఉంది, అందుకనే అడుగుతున్నాను.)