బాలసారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాలసారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2013, శనివారం

నామకరణం


జాతానంతరమేవ నామకరణం త్వేకాదశాహేస్ఫుటం

పుత్రస్యైవ సమాక్షరంతు యువతేః కార్యంతతోవ్యత్యయం

శుద్ధిర్జాతకవచ్చనామ్ని సకలై స్తద్ద్వాదేశేషోడశే

ద్వావింశేప్యధవింశకేహ్ని విహితం జాతి వ్యవస్థాంవినా

పుత్రుడు కలిగిన క్షణంబున ( జాతకర్మ అనంతరం ) అతను పుట్టిన నక్షత్ర నామమును ( అనగా రోహిణి నక్షత్రంలొ జననమైతే రౌహిణుడు మొ..గు విధంగా) రహస్యముగా నామకరణము చేయవలెను. తదనంతరం 11 రోజు కుమారునికైతే సరి సంఖ్య ( EVEN numbers అనగా శివః, మహేశ్వరః, కృష్ణః  ) లో, కుమార్తెకైతే బేసి సంఖ్య ( ODD numbers అనగా జానకీ, పార్వతీ, భవానీ )  లో అక్షరములు గల  నామములు నిర్ణయించవలెను. జాతకర్మ వలెనే ఈనామకరణమునకు కూడా ( శుభగ్రహాధిపత్యము గల లగ్నమందు, సోమ-బుధ-గురు-శుక్ర వారములందు )లగ్నాది శుద్ధి చూసుకుని చేయవలెను. జాతి భేదములేక నాలుగు వర్ణములవారు పుట్టినది మొదలు 12,16,20 మఱియు 22 దినములలో నామకరణము చేయవలెను.

  పైన చెప్పబడిన శుభదినములలో ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాలు నిర్వర్తించుకుని, నామకరణమునకు ఉపక్రమింపవలెను.  గణపతి పూజ, పుణ్యాహవాచనము చేసి “పూర్వోక్త .... శుభతిథౌ మమకుమారం సకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం శ్రీ మాసనామ్నా నక్షత్రనామ్నా వ్యావహారనామ్నా సగ్గ్ స్కరిష్యావహే” ( నాకుమారునికి సత్పురుషులందరిలో నామము నిర్దేశించుటకు మాసనామ,నక్షత్రనామ, వ్యవహార నామములను తెలుపుచున్నాను ) అని సంకల్పము చేయవలెను. ఒక రాగి పళ్లెరములో బియ్యము పోసి , రాయిలేని  బంగారు ఉంగరముతో దక్షిణము నుండి ఉత్తరమునకు వచ్చే విధంగా మూడురేఖలు లిఖించవలెను. మొదటి రేఖపై మాసనామమును, రెండవ రేఖపై నక్షత్ర నామమును, మూడవ రేఖపై వ్యవహార నామమును లిఖించాలి. ఉంగరమును బియ్యము మధ్యలో తమలపాకుపై ఉంచి షోడశ ఉపచారపూజలు చేసి పాలు తేనె కలిపి నైవేద్యము సమర్పించాలి.  పూజానంతరం పై మూడు నామములతోపాటు “స్వస్తి దీర్ఘాయుర్భవ, శతాయుర్భవ” అని పలుకుచూ అక్షతలను కుమారునిపై వేయాలి.  అంగాదంగాత్...” అనే మంత్రముతో కుమారుని అభిమంత్రించాలి. తండ్రి కుమారుని కుడి చెవిలో పేరును మూడుసార్లు పలుకాలి. “అగ్నిరాయుష్మాన్ ...” అనే ఐదుమంత్రాలు జపించాలి.  పెద్దలందరూ కుమారుని వ్యవహార నామముతో పిలుస్తూ మంగళహారతి ఇచ్చి ఆశీర్వదించాలి.  బ్రాహ్మణులకు భోజనం పెట్టి అన్నశాంతి చేయాలి.

మాసనామములు :
కుమారుడైతే మాసనామములు ఈక్రింది విధంగా ఉండును.

కృష్ణోనన్తోచ్యుత శ్చక్రీ వైకుంఠోథ జనార్దనః

ఉపేంద్రో యఙ్ఞ పురుషో వాసుదేవ స్తథాహరిః

యోగీశః పుండరీకాక్షో మాసనామా న్యనుక్రమాత్

చైత్రము : కృష్ణః      వైశాఖము: అనంతః    జ్యేష్ఠము : అచ్యుతః     ఆషాఢము : చక్రీ
శ్రావణము: వైకుంఠః       భాద్రపదము : జనార్దనః     ఆశ్వయుజము : ఉపేంద్రః     కార్తీకము : యఙ్ఞపురుషః
మార్గశిరము : వాసుదేవః   పుష్యము : హరిః     మాఘము : యోగీశః      ఫాల్గుణము : పుండరీకాక్షః

కుమార్తె అయితే మాసనామములు ఈక్రింది విధంగా ఉండును.

మార్గశీర్షేచ వాగ్దేవీ పుష్యే పద్మావతీ భవేత్

శ్రీదేవీ చాపి సావిత్రీ భూమిః కళ్యాణికాతథా

సత్యభామా పుణ్యవతీ రూపవతీన్దుమత్యపి

చన్ద్రావతీచలక్ష్మీచ స్త్రీనామ కరణే విదుః

చైత్రము : భూదేవీ   వైశాఖము: కళ్యాణీ  జ్యేష్ఠము : సత్యభామా  ఆషాఢము : పుణ్యవతీ  
శ్రావణము: రూపవతీ   భాద్రపదము : ఇందుమతీ    ఆశ్వయుజము : చంద్రావతీ కార్తీకము : లక్ష్మీ   మార్గశిరము : వాగ్దేవీ    పుష్యము : పద్మావతీ  మాఘము : శ్రీదేవీ   ఫాల్గుణము : సావిత్రీ  

అంటే మాసనామము లిఖించేటప్పుడు వైశాఖమాసములో పుడితే పిల్లవానికైతే “అనంతః” అని, ఆడపిల్లకైతే “ కళ్యాణీ” అనీ రాయాలి.

అలాగే ఆడపిల్లల పేర్లు ఎప్పుడూ దీర్ఘాంతాలు గా ఉంటాయి గమనించండి. పేరులోని అక్షరాలను లెక్కించేటప్పుడు  “సున్నా” లెక్కలేదు. పొల్లు ఉన్న అక్షరాలు కూడా లెక్కలోనికి తీసుకోరాదు. ఉదాక: విజయ్ లో “య్” అనేది పొల్లు ఉన్న అక్షరం కనుక లెక్కలేదు. వి,జ మాత్రమే లెక్కపెట్టాలి. అలాగే సంకర్షణ అనే పేరులో సున్నా లెక్కలేదు కనుక నాలుగే అక్షరాలు అని గ్రహించాలి.
 

పుట్టిన నాటినుండి 11వ ( నామకరణం ) రోజు  శిశువు ని ఉయ్యాలలో వేయడం, పెద్దలు శిశువుకు బహుమతులు సమర్పించడం జరుగుతుంది. అందుకనే బాలునికి ఇచ్చే సారె కనుక "బాలసారె" అంటారు. అదే క్రమేణా రూపాంతరం చెంది బారసాల అయినది. బాలింతరాలిచేత నూతిలో చేదవేయించడం, ఇంటి ముందు ముగ్గు వేయించడం కూడా ఈరోజు చేస్తారు. అంటే నాటినుండి నెమ్మదిగా పనులు చేసుకోవచ్చునని అర్థం.