స్త్రీల వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్త్రీల వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2013, మంగళవారం

గడప గౌరీ నోము




    స్త్రీలు ప్రతిదినము ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, శుచిగల వస్త్రములు ధరించి గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.

“గడప గౌరీ నోము నోచిన పడతికి
గడవరానంతటి గండములుండవు
బడయగా లేనట్టి భాగ్యములుండవు “

 అని చదువుకుని అక్షతలు శిరసున ధరించవలెను.  

ఉద్యాపనము :  పైవిధముగా ఒక యేడాది చేసినపిమ్మట ఒక పళ్లెములో పదమూడు జతల గాజులను, పసుపు కుంకుమలను, చీర రవికెలగుడ్డ మంగళసూత్రములను పెట్టి పుణ్యస్త్రీకి వాయన మొసంగవలెను. ( తదనంతరం యావజ్జీవన పర్యంతరము కొనసాగించుట శుభదాయకము. )

తులసీ వ్రతం




 ఒకానొక గృహస్థునకు ఒక్కతే కుమార్తె. ఆమెకు బాల్యమందే వైధవ్యముండునని జ్యోతిష్కులు తెలుపుటచేత, తండ్రి ఎందరెందరో ధర్మ శాస్త్రవేత్తలను సంప్రదించి తనకూతురుకా గండం తప్పే ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించాడు. ఆపండితులు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆబాలిక చేత తులసీవ్రతాన్ని చేయించమని చెప్పారు. ఆమె ఆవిధంగా తులసీవ్రతాన్ని చేయుటవలన జాతక సంబంధమైన వైధవ్య దొషాలు తొలగి దీర్ఘ సౌభాగ్యవతిగా జీవించినది. కనుక అట్టి మహత్తర వ్రతాన్ని నాటినుండి నేటి వరకూ ఎందరో ప్రతివ్రతలు ఆచరిస్తూ దీర్ఘ సౌభాగ్యాన్ని,పుత్రపౌత్రులను పొంది సుఖజీవినం గడుపుతున్నారు. 






వ్రతవిధానం :
  స్త్రీలు  ప్రతీరోజూ ఉదయం స్నానంచేసి, శుచి శుభ్రతలు గల ( మడి ) వస్త్రాన్ని ధరించి, తులసికోటలో కాసిన్ని నీళ్లు పోసి, ఆనీళ్లు శిరసున చల్లుకోవాలి. పసుపు,కుంకుమ,గంధం మనోహరాలైన పుష్పాలతో తులసీ దేవిని పూజించాలి. ధూపం,దీపం వెలిగించి తులసికి నైవేద్యం సమర్పించాలి. హరతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి.

తులసీ శ్రీ మహాలక్ష్మీః విద్యావిద్యా యశస్వినీ|
ధర్మా దర్మాసనా దేవీ దేవదేవ మనః ప్రియా||
లక్ష్మీ ప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిః అచలా చలా|
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్ హరి ప్రియా||
తులసీ శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే ||
నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే ||

అనే నామాలను స్మరిస్తూ మూడుకు తక్కువకాకుండా శక్తి ననుసరించి ప్రదక్షిణలు చెయ్యాలి. తరువాత తులసికి పెట్టిన పూలలోనుండి ఒకపువ్వు తీసుకుని తలలో పెట్టుకోవాలి. తల్లికి మౌనంగా మనసులోని కోర్కెను నివేదించాలి. 


నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని

ఒక సంవత్సరం పాటు పైవిధంగా తులసిని అర్చించాలి. సంవత్సరాంతాన వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఉద్యాపన చేసుకోవాలి. ( తరువాత జీవించినంత కాలం తులసిని పూజించడం ఆచారంగా వస్తున్నది )
  ఉద్యాపనం : కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీధాత్రీ సమేతంగా లక్ష్మీ నారాయణుల ప్రతిమలను తులసికోట వద్ద ఉంచి షోడశోపచారాలతో పూజించాలి. పరమాన్నమూ మొదలైన మధుర పదార్థాలతో పాటు, వ్రతం పట్టిన వారు తమ కిష్టమైన శాఖాహార పదార్థాలనుకూడా నివేదించాలి. ఆఖరున ఆవునేతితో ఒకదీపం పెట్టి, స్వయంపాకంతో సహా దక్షణ తాంబూలములతో ఒక బ్రాహ్మణునకు వాయనదానంగా ఇవ్వాలి.

గమనిక: స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.

తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

దీక్షలు స్వీకరించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి.

 దీక్ష అనగానే మనకు గుర్తుకు వచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఇది చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత భవానీ దీక్ష కూడా చాలా మందికి పరిచయం. ప్రతీ ఒక్క భక్తుడూ ఏదో ఒకసందర్భంలో దీక్ష తీసుకోవాలని అనుకుంటాడు. దీక్షలు చాలా మంది పడుతూ ఉంటారు. కానీ దీక్షా ఫలాన్ని ఏకొందరో మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. ఇది ఎందువల్ల?

నెలరోజులు ఉద్యోగం చేసి జీతం తీసుకోకుండా మానేయగలరా? ఈ నెల రోజులూ జీతం ఇవ్వం, ఉచితంగా మీ సేవలు అందించండి అంటే ఎంత బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది మన జీవన ఉపాధి కనుక. మనమీద కుటుంబ బాధ్యతలు ఉంటాయి కనుక. తనకు మాలిన ధర్మం పనికిరాదు. అందుకే కంపెనీ ఎంత లాసులో ఉన్నా కనీసం సగం జీతమైనా పొందే వరకూ పోరాడతాం. అలాగే ఈ దీక్షను రోజుల తరబడి చేస్తాము. మరి ఫలితం పొందకుండా ఎలా? పొందితీరాలి. అటువంటి దీక్ష ఎలా స్వీకరించాలి? ఏమి నియమాలు పాఠించాలి? అసలు ఏదీక్ష ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది?

మీరు అయ్యప్ప దీక్ష విని ఉంటారు. దుర్గా దీక్ష విని ఉంటారు. శివ దీక్ష విని ఉంటారు. హనుమత్ దీక్షలు తెలుసు. బ్రహ్మచర్య దీక్ష గురించి కొందరు విని ఉంటారు. విద్యా దీక్ష ఎప్పుడైనా విన్నారా? ఉద్యోగ దీక్ష తెలుసా? మరి మౌన దీక్ష? ఇలా అనేక రకాల దీక్షలు ఉన్నాయి. వీటిలో కొన్ని మనకు తెలిసి, కావాలనుకుని స్వీకరిస్తాం. మరికొన్ని ఇది దీక్ష అని తెలియకుండానే స్వీకరిస్తాం.

ఉదాహరణకు : బ్రహ్మచర్య దీక్ష. ఉపనయనము అయినప్పటి [ పిల్లవాడిని స్కూలులో చేర్చిన దగ్గర ]నుండీ, స్నాతక మహోత్సవం [ డిగ్రీనో, పీజీనో పూర్తి చేసి పట్టా పుచ్చుకునే ] వరకూ మనం బ్రహ్మచర్య దీక్ష అంటాము. ఇది తెలిసినా తెలియక పోయినా మనం దీక్షను పాటిస్తున్నట్టే.

అలాగే మనం ఒక్కో సారి ఓ నెలరోజులలో ఈ ఇంగ్లీషు గ్రామరు పై పట్టు సాధించాలి అని అనుకుని గంటల తరబడి సాధన చేసి ఇంగ్లీషుపై పట్టు సాధిస్తాం. అది కూడా దీక్షే! విద్యా దీక్ష అనవచ్చు.

ఇక ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేవి దైవ దీక్షలు. ఏదో ఒక దైవం మీద నమ్మకంతో ౪౦ రోజులు దీక్షపూని, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. వీటివలన ఆధ్యాత్మిక ఉన్నతి తద్వారా విద్యా ఉద్యోగ ఉన్నతులు కూడా కలగుతాయి. ఇంకా అనేక కోరికలు తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు.

అటువంటి ఉన్నతి మనకు కలగాలంటే ఎలా?

 మనం ఎంతో ఎదిగాము అనుకుంటాం. చాలా నాగరికులం అనుకుంటాము. కానీ ఒక్కోసారి సంతలో గొర్రెలలా ప్రవర్తిస్తాం. పక్కింటి వాళ్ల అబ్బాయి ఇంజనీరుంగు చేస్తున్నాడని మన వాడూ ఇంజనీరైపోవాలి అని పెద్దలు, మన స్నేహితులు అందరూ ఇంజనీరింగే కనుక మనమూ ఇంజనీరై పోవాలి అని పిల్లలు. ఎంసెట్ లో ఎంత రాంకు వచ్చినా ఫర్వాలేదు. ఏదో మారుమూల కాలేజీ లోనైనా ఫర్వాలేదు. మొదట ఓ గొప్ప బ్రాంచ్ అనుకుంటాం. మన రాంక్ చూసి ఇది చాలు లే అనుకుంటాం. తీరా కౌన్సిలింగ్ లో అది కూడా రాదని తెలిసి వాడు ఏదిస్తే దానికి ( మొక్కలకు పందిరెయ్యడం నేర్పే కోర్స్ ఒకటి పెట్టి, దానికి ‘పందిరి బ్రాంచ్’ అని పేరు పెట్టి అందులో సీట్లున్నాయి అంటే దానికి కూడా ) సిద్ధమే మనం. ఏ బ్రాంచ్ అయితే నేముంది. నాలుగుసార్లు తప్పినా ఫర్వాలేదు. చివరికి ఇంజనీరింగ్ అయింది అనిపించుకుంటే చాలు. తరువాత మళ్లీ ఏ కంప్యూటర్ కోర్సో చేసి ఎలాగోలా బి.పి.ఓ. జాబ్ సంపదించకపోతామా... ఇదే మన ఆలోచన, కాదు కాదు ధోరణి అనాలేమో.? ఎందుకంటే అసలు ఆలోచన అనేది ఉంటేగా..? చుట్టూ నలుగురూ చేస్తున్నారు. బాగా సంపాదించొచ్చు. నలుగురితో పాటు నరాయణా!

ఏమి చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదువుతాం. అదీ ఒక చదువేనా..?

 అంటే ఇంజనీరింగ్ ఎందుకూ పనికి రాని చదువని కాదు నా ఉద్దేశం. అది చాలా గొప్పది. అసలు నిరర్ధకమైన విద్య అనేది లేదు. మనం చదివే తీరే అలా ఉంది. ఇంజనీరింగ్ రాయాలంటే ఎవరో అన్నట్టు గట్స్ కావాలి. నేను ఫలానా కాలేజీలో, ఫలానా బ్రాంచ్ లో మాత్రమే చేరతాను. అని నిర్ణయించుకుని దానికి తగిన కృషి చేసి అక్కడే సీట్ సంపాదించి చదవాలంటే చాలా తెగువ, పట్టుదల ఉండాలి. అలా ఉన్ననాడు మీరు చదివింది చదువు అని నలుగురి ముందూ ఒప్పుకోవచ్చు. అలా లేని నాడు అది చదువే కాదు. అలా భ్రమ పడుతున్నారంతే!


 సరిగ్గా దీక్షలు స్వీకరించే విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అయ్యప్ప స్వామి దీక్ష చాలామంది స్వీకరించి ఉంటారు. కానీ ఎంతమంది నియమాలు సరిగ్గా పాటించారు? ఇక్కడా మనం గొర్రెల్లా మరొకరిని అనుసరిస్తున్నామే తప్ప కాస్త ఆలోచించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాం. తిరుగుతాం. కొందరు ధూమపానం కూడా చేస్తారు. మరి తాగే వారు నాకు ఇంకా కనపడలేదు భగవంతుడి దయవలన. తోటి స్వామి పడి పూజ వెయ్యిమందిని పిలిచి చేస్తే , మనం రెండువేలమందిని పిలుస్తాము. రేపటి నుండి దీక్ష కనుక ఈ రోజు ఫుల్లుగా పట్టించేసి రేపు ఆ మందు దిగకుండానే మాలను ధరించాలి. (ఇది నా స్నేహితులైన స్వాములకు స్వీయ అనుభవం. తోటి స్వాములు కొందరు అలా ఉండే వారుట.) సాయంత్రం అల్పాహారం పేరుతో అరవై రకాలు ఆరగించాలి. చుట్టూ ఉన్న స్వాములు అలా చేస్తే మనమూ అలా ఎందుకు చేయాలి? కాస్తైనా ఆలోచన ఉండదా? "మాలధారణం నియమాల తోరణం" అంటూ రోజూ పాడుకుంటాం కానీ, నియమాలు పాటించడం అబ్బో అన్ని నియమాలు పాటించడం కొంచెం కష్టమే. అందుకే మన వీలును బట్టి కుదిరినవి పాటిస్తాం. ఇంకెందుకండీ దీక్ష? దీనివలన వచ్చే పుణ్యమేమో కానీ, పాపం మూట కట్టుకుంటున్నాం. నలుగురికోసం కాదు మనకోసం మనం దీక్షపూనుతున్నాం. నేను ఇన్ని సార్లు దీక్ష స్వీకరించాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. అన్ని సార్లు స్వీకరించడం వలన నా జీవితంలో వచ్చిన మార్పేమైనా ఉందా అని ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఏదైనా లోపం ఉందంటే అది దీక్షలో కాదు పాటించే మనలో ఉంది అని గుర్తించండి. మనలో అహం కారాన్ని పెంచే దీక్షలు వేలసార్లు పూనినా ఏమిటి లాభం? జీవితాన్ని తరింప చేయగల దీక్ష జన్మానికి ఒక్క సారి స్వీకరించినా చాలు.

నేడు మనం స్వీకరిస్తున్న భగవత్ దీక్షల నియమాలు బ్రహ్మచర్య దీక్షనుండి స్వీకరించినవి అయి ఉండవచ్చు. ఉపనయనమయిన బ్రహ్మచారి ఎటువంటి నియమాలు పాఠించాలో మన పెద్దలు చెప్పారు. దాదాపు అటువంటి నియమాలే నేడు స్వామి దీక్షలకూ విధించుకున్నాము.

దీక్ష - నియమాలు

౧.సూర్యోదయాత్ పూర్వం లేవాలి.
౨.సూర్యోదయానికల్లా పూజను ప్రారంభించాలి.
౩.రోజుకు కనీసం ౧౦౦౦ సార్లు నామాన్ని స్మరించాలి. ఏ పని చేస్తున్నా మన నాలుకపై భగవన్నామం ఆడుతూ ఉండాలి.
౪.వార్తా పత్రికలు, టీవీ, ఇంటర్ నెట్ వంటివి ముట్టుకో కూడదు. ఉద్యోగ విషయమై అవసరమైతే తప్ప.
౫.ధూమ పానం, మద్య పానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.
౬.శాఖాహరం ,సాత్వికాహారం తీసుకోవాలి.
౭.కోపం పూర్తిగా వీడాలి. వివేకం పని చేయాలి.
౮.సత్యం మాట్లాడడం చాలా అవసరం.
౯. ఈ దీక్ష మానసిక, వాచిక, కాయికములను మూడింటి ద్వారా జరగాలి.
౧౦.మూడు కాలాలూ భగవంతుని ఉపాసన చేయాలి. ఉద్యోగస్తులు కనీసం ౨ కాలాలు(ఉదయం,సాయంత్రం) అయినా పూజించాలి.
౧౧.నోటితో అసభ్య పదాలు పలకూడదు.
౧౨.చేతితో చెడు చేయకూడదు.
౧౩.మనసుతో చెడు ఆలోచనలు చేయకూడదు. ఇది చాలా కష్టమైనది. కానీ అమ్మమీద భారం వేసి మొదలు పెడితే అంతా శుభం జరుగుతుంది.
౧౪. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ఉండకూడదు.ఎల్లప్పుడూ విబూధి ధరించి, ఎర్రని తిలకాన్ని ధరించాలి. ఉదయం పూజానంతరం గంధాన్ని ధరించాలి. తెల్లని స్ఫటిక పూసలు దీక్షా మాలగా ధరించాలి. శిఖను ధరించాలి. మొలత్రాడు తప్పక ఉండాలి. పూజా సమయంలో పంచె, కండువాలు మాత్రమే ధరించాలి. చేతికి దీక్షా కంకణమును రక్షగా కట్టుకోవాలి.

౧౫. నేలమీద శయనించాలి. నేలమీద కూర్చుని భుజించాలి. నీటిని కూడా కూర్చుని స్వీకరించాలి. ఏక భుక్తము చేయాలి. భోజనము కొరకు కాక, శక్తి కొరకు మాత్రమే అన్నట్లు భుజించాలి.

౧౬. భగవంతుని చిత్రపటమును, కలశమును పెట్టి ఈ దీక్షాసమయంలో పూజించాలి. పూజా ప్రదేశము నిత్యము శుభ్రముగా ఉంచాలి. దీపం వెలుగుతూ ఉండాలి. భజనలు వంటివి జరుపుట శ్రేష్ఠము. నిత్యము ధ్యానము కనీసం ౧౫ నిమిషాలు చేయాలి. ఏపని చేస్తున్నా ఆంతరింగిక పరిశీలన చేయాలి. లోపలి వ్యక్తిని గమనించాలి.

౧౭. మనం మన జీవితంలో ఎటువంటి పురొగతి కోరుకుంటున్నామో, ఆ పనిని ఈ నలభై రొజులలో సాధన చేయడం మొదలు పెట్టాలి. మన ఆశయ సాధనకు మొదటి అడుగును వేయాలి. తరువాతి అడుగులు భగవత్కృపచే వాటంతట అవే పడతాయి.

౧౮. పూజ, ధ్యానం, ఉద్యోగం, లక్ష్య సాధన వీటితో ప్రధానంగా నిండినదై మన దిన చర్య ఉండాలి. మిగిలిన వ్యసనాలు సమయాన్ని పాడు చేయకుండా ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం వంటివి చేయాలి. రోజంతా భగవత్ చింతనలో గడపాలి.

 మీరు స్వీకరించే దీక్ష ఎటువంటి దైనా నియమాలు లేకుండా ఫలించదు. సరదాగా ఆడే క్రికెట్ ఆడాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. బ్యాట్ విసురుతాను నువ్వు బాలుతో తన్నాలి అంటే కుదరదు. బ్యాటుతో బాలుని మాత్రమే తన్నాలి. మరి అలాంటిది మన జీవితానికి ఎన్ని నియమాలు ఉండాలి? నియమాలు లేని జీవితం అందగా ఉండదు. అర్థరహితంగా ఉంటుంది. ఆ నియమాల విలువను తెలిపేందుకే ఇటువంటి దీక్షలు అవసరమౌతాయి.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు|
బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ||
ఇన్ద్రియాణి హయనాహు ర్విషయాస్తేషు గోచరాన్|  - కఠోపనిషత్తు.

ఆత్మ రథికుడు, శరీరం రథం. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం. ఇంద్రియాలు గుర్రాలు, అవి నడిచే దారులు విషయ వస్తువులు.

నేర్పరి అయిన సారథి అనేక వైపులకు పరుగులు తీసే గుర్రాలను కళ్లెంతో అదుపు చేసి, ఒకే గమ్యం దిశగా పయనింప చేస్తాడు. అలాగే బుద్ధి శాలి అయిన వాడు అనేక విషయ వాసనలతో పరి పరి విధాల ఆకర్షింప బడు ఇంద్రియాలను, మనసు అనే కళ్లెంతో అదిలించి, అంతర్ముఖం చేసి, ఒకే దారికి మళ్లించి గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే మనకు మనమే కొన్ని నియమాలను విధించుకుని మంచి మార్గం వైపుకు ఇంద్రియాలను మళ్లించుకున్న నాడు మన గమ్యాన్ని చేరగలుగుతాము.

3, మే 2010, సోమవారం

పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ, కాత్యాయనీ వ్రతమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్య లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా వెతుకుతున్నాను.

అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.



సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్



క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||


|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||


26, జనవరి 2010, మంగళవారం

శ్రీ లలితా దేవి పూజా విధానం

నా పూర్వటపాలు దేవీ పూజా విధానం -1, దేవీ పూజా విధానం - 2 లను కలిపి ఒకటిగా ఇక్కడ ఇస్తున్నాను. వివరణతో పాటుగా చూస్తే ఇది చాలా పెద్దగా అనిపించ వచ్చు. వివరణ లేకుండా కావాలంటే ఇక్కడ చూడండి.





పూజ కానీ, రేపు దేవీ నవరాతృలలో చేసే దుర్గా పూజ కానీ- మరే దేవీ పూజ కానీ మీరు సొంతంగా- రోజూ ఇంట్లో చేసుకోవడానికి వీలుగా టపా రాస్తున్నాను. మీరు చేయ వలసిందల్లా " శ్రీ లలితా దేవీ " అని ఉన్నచోట మీరు పూజించే దేవత పేరు పెట్టు కోవడమే. స్త్రీ స్వరూప దేవతలకు మాత్రమే పనికి వచ్చే శ్లోకాలతో రాయబడుచున్నది. కనుక పురుష స్వరూప దేవతలకు పనికి రాదు.

టపాలో పూజ చేయవలసిన విధానంతో పాటు, లలితా దేవి పూజను కూడా రాస్తున్నాను. అది అందరికీ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. నిజానికి పూజా మంత్రాలతో కూడిన అనేక పుస్తకాలు బయట షాపుల్లో దొరుకుతున్నాయి. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో చెపుతూ ఒకొక్క సేవ వివరిస్తే బాగుంటుంది అనే భావనతో టపా రాస్తున్నాను.

షోడశోపచార పూజ: 16 రకాలైన సేవలను చేయుటయే "షోడశోపచార పూజ" అనబడుచున్నది. మన ఇంటికి వచ్చిన అతిథిని విధంగా గౌరవంతో సేవిస్తామో అదే విధంగా మన అభ్యర్ధనను మన్నించి వచ్చిన భగవంతుని 16 రకాలైన సేవలతో పూజిస్తామన్నమాట. కుదిరితే " పూజ చెయ్యబోతున్నారా..? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి " అనే టపా కూడా చదవండి.


ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.

శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఎంగిలి చేతిని కడగాలి )

( నమస్కారము చేస్తూ క్రింది నామాలు చదవాలి)

ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.

సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.

భూతోచ్ఛాటన: ( క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.

ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని రోగ్యముతో జీవించ వచ్చును.

సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే సంకల్పం పనికి వస్తుంది.)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)

....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో ఏ సంవత్సరమైతే ఆ పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )

( వీలైతే ఈ పూజా విధానం చివరిలో ఈ సంవత్సరాలు, నక్షత్రాలు మొ.గు మొత్తం పేర్లు రాస్తాను.)

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-

శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-

ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )


మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే. ( అని అక్షతలు నీళ్లు పళ్లెంలో వదిలి పెట్టాలి )

టూకీగా ఈ సంకల్పం వివరణ: కలియుగం ప్రథమ పాదంలో-భారతదేశంలో- హైదరాబాదులో- నాకు శుభమును కలిగించు గృహములో- దేముని ముందు ఉన్నటువంటి నేను- ఫలానా సంవత్సర-మాస-తిథి-వార-నక్షత్ర ములు కలిగిన ఈ శుభ దినమున- ....గోత్రంలో పుట్టిన-........ పేరుతో పిలవబడే-

ధర్మ పత్నితో కూడుకున్న వాడనైన( ఆడవారు ఇది చెప్పుకోనవసరం లేదు ) నేను-

శ్రీ లలితా దేవిని ఉద్దేశించి- శ్రీ లలితా దేవి ప్రీతి కొరకు-నాకు శ్రీ లలితా దేవి అనుగ్రహం కలగడం కొరకు- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి 16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను. I





సంకల్పం అయిన పిదప కలశారాధన చెయ్యాలి.
(శ్రీ లలితాపూజాం కరిష్యే. అన్న తరువాత)
తదంగ కలశారాధనం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీరు వదలాలి.

కలశారాధనం

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.

మనము ఆచమనము చేసిన పాత్రను కాక, భగవంతునికి ఉపయోగించడం కొరకు వేరే ఒక కలశములో నీటిని తీసుకుని ఆ కలశమును గంధము,పసుపు,కుంకుమలతో అలంకరించాలి. కలశములో త్రిమూర్తులు, మాతృగణములు, సప్తసాగరములు,సప్తద్వీపములు,చతుర్వేదములు ఆవాహన అగునట్లు భావిస్తూ ఈ క్రింది శ్లోకము చదవాలి. ( ఈ కలశము కేవలం భగవంతుని పూజకోసం వినియోగించడానికి మాత్రమే. మన ఆచమనముకొసం మనకో పాత్ర ఎలా ఉందో, అలాగే అమ్మవారి ఆచమనమునకు,స్నానమునకు మొదలైన వాని కొరకు నీటిని ఉపయోగించుటకు ఈ కలశం. )
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆ కలశములోని నీటి యందు గంగా మొదలైన సప్త నదులు ఆవాహన అయినట్లుగా భావించి ఈ క్రింది శ్లోకములను చదవాలి.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆయాంతు శ్రీ లలితా దేవీ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశములోని నీటిని పూజా ద్రవ్యముల యందు, దేవుని యందు, తన యందు చల్లవలెను.


1.అథ ధ్యానం:

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం

సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం
మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి( భావన చేయాలి ).

2.ఆవాహనం:

నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కృపాకరే.

శ్రీ లలితాదేవ్యైనమః ఆవాహయామి. ( అమ్మా నేను నిన్ను పూజించ తలచి మా గృహమునకు ఆహ్వానిస్తున్నాను. నీవు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసినది. అని భావన చేసి ) అక్షతలు కలశము లేదా విగ్రహముపై వేయవలెను. ( ఇక్కడ కలశము అంటే ప్రథాన కలశం. అంటే సత్యనారాయణ వ్రతంలో వలే దేముని పటము ముందు కలశము పెట్టి, దానిపై కొబ్బరికాయను ఉంచి, దానిమీద వస్త్రమును ఉంచుతారు. )

3.ఆసనం:

అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
మనశ్చిత్రం మనోహారి సింహాసన మిదం తవ.


శ్రీ లలితాదేవ్యైనమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి.
( అమ్మా! నీవు ఈ ఆసనమును అలంకరించ వలసినది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనముపై ) అక్షతలు చల్లవలెను.

4.పాద్యం:

అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతృకే
మనశ్శుద్ధం మయాదత్తం గంగామంబుపదోస్తవ.

శ్రీలలితాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి.
( అమ్మా! నీ పాదముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని (ఆచమనం చేసిన పాత్రకాక మరొక పాత్రకు అలంకారం చేశారు కదా అందులోని ) నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదలవలెను.

5.అర్ఘ్యం:

సర్వ తీర్థమయం హృద్యం బహుపుష్ప సువాసితం
ఇదమర్ఘ్యం మయాదత్తం గృహాణ వరదాయిని.


శ్రీలలితాదేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ( అమ్మా! నీ హస్తముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.

6.ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే
గృహాణాచమనం దేవి నిర్మల రుచి పూరకం.

శ్రీలలితాదేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ( అమ్మా! నీ ఆచమనము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.

మధుపర్కం:

మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరా జల సంయుతం
మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే.

శ్రీలలితాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి. ( అమ్మా! ఈ చల్లని మధుపర్కమును స్వీకరించు అని భావించి ) పెరుగు,బెల్లం/పంచదార కలిపి అమ్మవారికి చూపి పళ్లెములో వదలవలెను. ( దూరమునుండి వచ్చిన అతిథికి, ప్రయాణ బడలిక,వేడి తగ్గడం కోసం మజ్జిగ ఇవ్వడం వంటిది ఈ మధుపర్కం ఇవ్వడం )

7.స్నానం:

ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా స్నానము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశములోని నీటిని అమ్మవారిపై చిన్న పుష్పముతో చల్ల వలెను.

నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే
ఇదం శుద్ధోదక స్మానం స్వీకురుష్వ దయామతే.

శ్రీలలితాదేవ్యైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.

పంచామౄత స్నానం:

ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా! నీ స్నానము కొరకు ఈ పంచామౄతములను, కొబ్బరి నీటిని స్వీకరించు అని భావించి ) పంచామౄతములను ( ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అను అయిదు భూలోకములో అమౄత సమానమైనవి) , కొబ్బరినీటిని అమ్మవారిపై పుష్పముతో కొద్ది కొద్దిగా చల్లవలెను.

దధి క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
నారికేళ జలైర్యుక్తం స్నానమంబ మయార్పితం.

శ్రీలలితాదేవ్యైనమః పంచామౄత స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

8.వస్త్రం:

అంబరంచాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం
వస్త్రమేతన్మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.( అమ్మా! నీ అలంకరణ కోసం ఈ వస్త్రమును స్వీకరించు అని భావించి ) వస్త్రమును గానీ, ప్రత్తితో చేసిన వస్త్రమును గానీ సమర్పించాలి.

వస్త్ర యుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

9.యఙ్ఞోపవీతం:

నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్ర కోటి మనోహరే
ఉపవీతమిదందేవి గృహాణత్వం ప్రసీదమే.

శ్రీలలితాదేవ్యైనమః యఙ్ఞోపవీతం సమర్పయామి ( అమ్మా ఈ యఙ్ఞోపవీతమును స్వీకరించు అని భావించి ) యఙ్ఞోపవీతమును గానీ ప్రత్తితో చేసిన యఙ్ఞోపవీతమును గానీ సమర్పించాలి.

యఙ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

ఆభరణం:
నానా విధాని రత్నాని మాంగళ్యాభరణానిచ
సౌవర్ణాని చ దీయంతే గృహాణ పరదేవతే

శ్రీ లలితాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి. ఆభరణాలు ( గాజులు మొ..వి ) సమర్పించ వలెను.


10.గంధం:

ఇష్ట గంధ ప్రదం దేవి అష్ట గంధాధి వాసితం
అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం.

శ్రీలలితాదేవ్యైనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ( అమ్మా! ఈ శ్రీ చందనమును స్వీకరించు అని భావించి ) పుష్పముతో గంధమును చల్లవలెను.


హరిద్రాచూర్ణం:

హరిద్రా చూర్ణమేతద్ధి స్వర్ణ కాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః హరిద్రాచూర్ణం ( పసుపు ) సమర్పయామి.


కుంకుమాచూర్ణం:

కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే.

శ్రీలలితాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములు సమర్పించ వలెను.

అక్షతాన్:

ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే
స్వర్ణాక్షతామయాదత్తాః కృపయా పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః సువర్ణాక్షతాన్ సమర్పయామి. ( అక్షతలు అంటే క్షతము కానివి. అంటే విరగనివి. )


పుష్పం:

నానా విధైశ్చ కుసుమైః బహు వర్ణైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి. ( పుష్పములు సమర్పించవలెను)

అక్షతైః పుష్పైః పూజయామి. ( అక్షతలతోను, పుష్పములతోను పూజించ వలెను. )

ఇక్కడ 108 లేదా 1008 నామములతో అమ్మవారిని పూజించ వచ్చు. ఆపిదప


11.ధూపం:

జగదంబే నమస్తేస్తు కరుణాపూర పూరితే
ధూపమేతన్మయాదత్తం గౄహాణ వరదేంబికే.

శ్రీలలితాదేవ్యైనమః ధూపం సమర్పయామి. ( సాంబ్రాణి లేదా అగరుబత్తి చూపించాలి )


12.దీపం:

కృపాపరే మహా దేవి జగద్రక్షణ తత్పరే
చంద్ర రేఖాంక మకుటే దీపోయం పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః దీపం దర్శయామి. ( దీపమును చూపవలెను )

ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ( కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను. )

13.నైవేద్యం:

భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వ దేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి. నివేదనకు పండ్లు, కొబ్బరికాయ, పరమాన్నం,పిండివంటలు,పులగము మొదలగునవి యధాశక్తిగా సమర్పించ వలెను. ( అమ్మా! నాశక్తి కొలదీ సమర్పించు ఈ నివేదనను స్వీకరించు అని, కళ్లు మూసుకుని అమ్మ ప్రీతితో స్వీకరిస్తున్నట్లుగా భావించ వలెను. )

మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి. పాదౌ ప్రక్షాళ యామి. పునరాచమనీయం సమర్పయామి. నైవేద్యము అయిన తరువాత అమ్మవారు చేతులు శుభ్రపరచుకొనుటకు, పాదములు శుభ్రపరచుకొనుటకు, దాహము తీర్చుకొనుటకు కలశంలో నీటిని 5 సార్లు అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

తాంబూలం:

తాంబూల పూరితముఖి సర్వ విద్యా స్వరూపిణి
సర్వ మంత్రాత్మికేదేవి తాంబూలం పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి. 3 తమల పాకులు, రెండు వక్కలు,పండ్లు తాంబూలముగా సమర్పించవలెను.

తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

14.నీరాజనం:

కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే
నీరాజనం మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపుతూ ఆ వెలుగులో అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించ వలెను.

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

15.మంత్రపుష్పం:

పుష్పము అక్షతలు పట్టుకుని లెచినుంచుని అమ్మవారిని ఈ క్రింది విధంగాస్తుతించవలెను.

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.


శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

చేతిలోని అక్షతలు, పూలు అమ్మ వారిపై వేయవలెను

ప్రదక్షిణ నమస్కారాః :

మరల పుష్పము, అక్షతలు పట్టుకుని ఈ క్రిది విధంగా చదువుతూ ఆత్మప్రదక్షిణము చేయవలెను

యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపాసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దౄష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే.

శ్రీలలితాదేవ్యైనమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి.

( అని చెప్పి బోర్లా పడుకుని చేతులు చాపి సాష్టాంగ నమస్కారం చేయవలెను. అమ్మవారిని మనసులో స్మరిస్తూ, ఆ తల్లి పాదములను మీచేతులు తాకినట్టుగా, ఆ అమ్మ మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించినట్టుగా భావన చేయవలయును. పొట్ట, శిరసు, కనులు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు అను ఎనిమిదింటి చేత నమస్కారము చేయుట సాష్టాంగ నమస్కారం. స్త్రీలు మోకాళ్లపై మాత్రమె చేయవలెను. )

అపరాధ నమస్కారం:

( అమ్మా! మానవులమై పుట్టిన మేము కలి ప్రభావంచేత తెలిసో,తెలియకో అనేక అపరాధములు చేస్తూ ఉంటాము. అలా తెలిసీ తెలియక చేసిన అపరాధములను పుత్ర/పుత్రీ వాత్సల్యముతో క్షమించి సదామమ్ము కాపాడు దేవీ..! అనే భావనతో ఈ క్రింది శ్లోకములను చదవవలెను )

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి.


శ్రీలలితాదేవ్యైనమః అపరాధ నమస్కారం సమర్పయామి.

యస్యస్మౄత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే.

అనయధ్యాన ఆవాహానాది షోడశోపచారపూజయా
భగవతీ సర్వాత్మకః శ్రీ లలితా దేవీ స్సుప్రీతాస్సుప్రసన్నో వరదో భవతు.


16.ఉద్వాసనం:

శ్రీలలితాదేవ్యైనమః ఉద్వాసయామి.
ఆవాహనం నజానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి

( ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపడం. ఇక్కడ విచిత్రం చూడండి. "అమ్మా! నిన్ను ఆవాహనం చేయడమూ నాకు తెలియదు, ఉద్వాసన చేయడమూ నాకు తెలియదు, అసలు నిన్ను పూజించడమే నాకు తెలియదు ఏమైనా అపరాధములుంటే క్షమించు తల్లీ." అని పైశ్లోకంలో ప్రార్థిస్తున్నాము. అంటే మన ఇంటికి వచ్చిన మనకు అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి ఇంటి నుండి వెళుతుంటే ఏవిధంగా మాట్లాడతామో అలాగే ఉంది కదా!? ఎంత వినయం,విధేయతా ఉంటే ఈ మాటలు అనగలుగుతాము? అందుకే పూజ చేయడం సరిగా వస్తే సాటి మనిషితో ఎలా మెలగాలి? ఎలా ప్రేమించాలి? అనే విషయం మనకు బాగా తెలిసినట్టే అని నేను భావిస్తాను. )

శ్రీలలితాదేవ్యైనమః యధాస్థానం ప్రవేశయామి. అని అమ్మవారిపై అక్షతలు వేసి కొంత సేపు మౌనంగా ప్రార్థించాలి. ఆ తరువాత ( పళ్లెములో వదిలిన ) తీర్థమును, నివేదన చేసిన ప్రసాదమును ప్రీతితో స్వీకరించాలి.