సహాయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సహాయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, మే 2011, ఆదివారం

ఈ పేద పిల్లల చదువుకు సహాయమందించండి

నమస్కారం
     నేను పురోహితుడినైనా అనవసర భేషజాలకు పోకుండా నేను నివసించే ప్రాంతంలోని గుడిసెలలోని వారితో అప్పుడప్పుడు మాటలు కలుపుతుంటాను. వారి పిల్లలో గల ఆత్మన్యూనతను పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి అవీ ఇవీ పెట్టి మాటలలో వారి వివరాలు తెలుసుకుంటూ ఉంటాను. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ పాఠాలు ఎలా జరుగుతున్నాయో పిల్లల ద్వారా తెలుసుకుంటాను. వారికి ఆడుకోవడానికి కావలసిన వస్తువులు, చదువుకు కావలసిన నోటు పుస్తకాలు కొనిపెడుతుంటాను. వారికి అప్పుడప్పుడూ చిన్న చిన్న తరగతులు నిర్వహిస్తూ ఉంటాను.

అలా నాకు తెలిసిన ఒక అమ్మాయి పదవ తరగతి పాసయింది. కానీ తల్లికి పక్షవాతం రావడంతో ఇంటి పని వల్ల, పెద్దలు ప్రోత్సహించక పోవడం వల్ల, ధనము లేక ఇంటర్ కు వెళ్ల లేక పోతోంది. ఒక సంవత్సరం ఖాళీగా గడిపింది. చాలా రోజుల తరువాత మొన్న నాకు కలిసి విషయం చెప్పి నాకు చదువుకోవాలనుంది అని చెప్పింది.  "ఎవరైనా సహాయం చేస్తే నువ్వు చదువుకుంటావా?" అని అడిగితే తప్పకుండా చదువుతాను అని చెప్పింది.

తల్లి తండ్రులు కూలి పని చేసుకునే వారు. వాళ్ల ఇళ్లలో పదవతరగతి పూర్తిచేసినది ఈ అమ్మాయి మాత్రమే. ఇంటర్ చదవాలను కుంటోంది. సంవత్సరానికి ఎనిమిది నుండి తొమ్మిది వేలు అవుతాయి. రెండుసంవత్సరాలు సహాయం కావాలి. ఇది ఒక్కరే అందించినా ఫర్వాలేదు. నలుగురైదుగురు కలిసైనా ఫర్వాలేదు. ఏదో విధంగా ఆ అమ్మాయిని చదివించగలిగితే తప్పక ఆ అమ్మాయి వృద్ధిలోకి వస్తుంది. 

అలాగే మరో అమ్మాయి ఉంది. ఆమెకు పన్నెండు సంవత్సరాలు ఉంటాయేమో. ఇళ్లలో పాచి పనికి వెళుతుంది. కానీ ఆ అమ్మాయి పనిచేస్తూ పాటలు పాడుతుంది. ఉన్నది ఉన్నట్టు గా అద్భుతంగా పాడుతుంది. ఈశ్వర ప్రసాదం వలన ఆ అమ్మాయికి చక్కటి స్వరం ఉంది. ఎవరైనా సహాయపడి సంగీతం నేర్ప గలిగితే ఆ సినిమా పాటలకు బదులు చక్కటి కీర్తనలు పాడుకుంటూ తరిస్తుంది. దయచేసి ఎవరైనా సహాయం అందించండి.

ఆసక్తి కలిగిన వారెవరైనా ఉంటే నాకు మెయిల్ చెయ్యగలరు.


rajasekharuni.vijay@gmail.com


Cell no : 9000532563

నేను చెయ్యగలిగినది మధ్యవర్తిత్వం ఒక్కటే. నాదగ్గర ధనములేదు. కానీ అవసరం ఎక్కడ ఉందో నేను సూచించ గలను. ఎవరైనా స్పందించి సహాయపడితే ఆపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అన్నదే నాతపన. అందుకే ఈ చిన్ని ప్రయత్నం.  ఈశ్వరానుగ్రహం కలిగి ధన సమృద్ధులైన వారు ముందుకు వచ్చి సహాయం అందించండి. ఒక వేళ మీరు సహాయం చేయలేక పోయినా, దానికి సమర్థులైన మీ స్నేహితులకు ఈ టపా చిరునామా ( post link ) ని మెయిల్ చెయ్యండి. మీరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదించిన వారవుతారు.

ధన్యవాదములు

25, ఏప్రిల్ 2011, సోమవారం

ఈ విద్యార్థులకు ఆర్థిక సహాయమందించండి

నమస్కారం.

మనలో చాలామంది చదువుకునే విద్యార్థులకు సహాయపడే వారుంటారు. అలాగే ఆసక్తి కలిగిన వారుంటే నా స్నేహితులైన శాస్త్ర విద్యార్థులకు సహాయమందించండి. వీరు "న్యాయశాస్త్రం" చదువుతున్నారు. అంటే లాయర్ లు చదివేది కాదు. భారతీయ సనాతన శాస్త్రం. వ్యాకరణం, జ్యోతీష్యము వలే న్యాయము కూడా ఒకటి.  వీరు విద్యకోసం మన రాష్ట్రం వదిలి, గురువుని వెతుక్కుంటూ వెళ్లి తమిళనాడులో నివశిస్తున్నారు.

  ప్రస్థుతం ఇటువంటి శాస్త్రాలను అభ్యసించేవారు చాలా అరుదు. వేదమును, శాస్త్రాలను బాగా తెలిసినవారుంటేనే మన భారతీయ హిందూ మతం నిలబడుతుంది. వేద పారాయణ చేస్తే చాలు వారికి పూర్వం రాజులు అనేకవిధాల సహాయపడేవారు. వారికి భూములు, గోవులు ఇచ్చి పోషించేవారు. నేడు అటువంటి పోషకులు లేక వేదమును చదివిన వారుకూడా బ్రతుకు తెరువు కోసం పురోహితులుగా మారిపోతున్నారు. పురోహితం కంటే వేదపారాయణ ఉత్తమమైనది. పురోహితులందరికీ వేదం పూర్తిగా రాదు. అందులో కొంత భాగం మాత్రమే వస్తుంది. దానిని "స్మార్తం" అంటారు. అంటే నిత్యం ఇళ్లలో జరిగే యఙ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి వీలైనంత వరకు మాత్రమే వస్తుంది. పురోహితులు వేదపండితులని ఆశ్రయించి, ఈ శాస్త్ర పండితులతో స్నేహం చేసి వారికి తెలియని విషయాలను తెలుసుకుని తమ యజమానులకు పంచుతూ ఉంటారు.

  శాస్త్ర పండితలు లేకపోతే ఆయా వేదమంత్రాలకు భాష్యాలను చెప్పేవారు ఉండరు. దాని ప్రాముఖ్యం ఏమిటో తేలుసుకొనలేము. వేదమార్గము ద్వారా నిత్య ఆనంద స్థితిని లేదా ఆధ్యాత్మిక ఉన్నతిని ఎలా పొందవచ్చో చెప్పేవారు ఉండరు. కనుక శాస్త్ర పండితుల అవసరం హిందూ సమాజానికి చాలా అవసరం. పూర్వం వేదమును, శాస్త్రాలను బ్రాహ్మణులందరూ నేర్చుకొనే వారు. కాల క్రమంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటున్నారు.  నేడు వేదపండితులకు, పురోహితులకు కూడా ఆదరణ కరువౌతున్నది. ఇక శాస్త్ర పండితుల అవసరమేమిటో కూడా నేడు ఎవరికీ తెలియదు. వారితొ ప్రత్యక్ష సంబంధాలు ప్రజలకు ఉండడం లేదు. ఆ పరిస్థుతులలో శాస్త్రాన్ని అభ్యసించడానికి ముందుకు రావడం నిజంగా చాలా ధైర్యముంటే గానీ చేయలేరు.  వారు పూర్తి విద్యనేర్చుకున్నాకూడా పోషకులు దొరకరు. అయినా వారు సాహసించి శాస్త్ర విద్య నేర్చుకొంటున్నారు.

కేవలం ఓ ఇంజనీరుకో, డాక్టరుకో ( విద్యనభ్యసించుటలో) సహాయ పడితే  వారు పెరిగిన తరువాత ఈ సమాజానికి మంచే చేస్తారన్న నమ్మకం లేదు. కానీ నేను చెప్పే ఈ శాస్త్ర విద్యార్థులవలన సమాజానికి చాలా మంచి జరుగుతుంది. మన శాస్త్రము మరొక తరం పాటు నిలిచి ఉంటుంది.

  కనుక వారికి రెండు సంవత్సరాలపాటు పోషకులు కావాలి. ప్రస్తుతం వారిద్దరకీ స్కాలర్ షిప్ వంటి ఆర్థిక సహాయం కావాలి. నేడు ఓ ఇంజనీరునో, డాక్టరు విద్యార్థినో ఎవరైనా ముందుకు వచ్చి చదివిస్తారు. కానీ ఇటువంటి శాస్త్ర విద్యార్థులను, వేద విద్యార్థులను పోషించాలంటే మన సనాతన విద్యపై అత్యంత నమ్మకముండాలి. ప్రేమ ఉండాలి. వీరిని చదివించడం కేవలం వరిఒక్కరికే సహాయ పడినట్లు కాదు. హిందూ సమాజానికే ఒక జ్యోతిని ప్రసాదించినట్లు. కనుక అటువంటి ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించ గలరు.  పూర్తి వివరాలు తెలియజేయగలను.



cell no : 9000532563

ధన్యవాదములు