28, ఏప్రిల్ 2010, బుధవారం

తిరుపతి దర్శనం - పిట్ట కథ


రామం,చంద్ర ,సత్య అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారు ఓ సారి తిరుపతి కొండకు స్వామి దర్శనానికి వెళ్లారు. సాధారణంగా గుడిలో స్వామి వారి దర్శనం చేయాలంటే చాలాసేపు వరుసలో నిలబడవలసిందే. ధర్మదర్శనంలో వెళ్లిన ఎవ్వరికైన 3 గంటలు తక్కువ కాకుండా పడుతుంది. అలాగే ఈ స్నేహితులు కూడా వేచి ఉండవలసి వచ్చింది. ఓ అరగంట తరువాత రామం అనేవాడు తన ఇద్దరు స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. "అరేయ్! మనం అనవసరమైన మాటలతో కాలం వ్యర్థం చేస్తున్నామనిపిస్తోంది. భగవత్ దర్శనానికి వచ్చి కూడా ఇలా అనవసర విషయాలను గురించి కాలం వ్యర్థ పరచడం ఎందుకు. అందరమూ బిగ్గరగా ! "ఓం నమో నారాయణాయ" అంటూ నామస్మరణ చేద్దాము. " అని చెప్పాడు.

దానికి చంద్రం సరే నన్నాడు. సత్యం ఏమీ మాట్లాడలేదు. మొదటి ఇద్దరూ నామస్మరణ మొదలు పెట్టారు. సత్యం మౌనంగా తిలకిస్తున్నాడు. కొంత సమయానికి వీరిని చూసి వరుసలో వేచి ఉన్న చుట్టు ప్రక్కల భక్తులు కూడా కొంతమంది నామస్మరణ మొదలు పెట్టారు. అలా ఓ అరగంట గడిచింది. కొద్ది సేపు విశ్రాంతి కోసం నామస్మరణ ఆపాడు రామం.

ఆ సమయంలో రామం సత్యంని అడిగాడు. " ఇంతమంది నామస్మరణ చేస్తున్నారు. నువ్వు ఎందుకు చేయడం లేదు?" అని.

దానికి సత్యం " భక్తి అనేది మన మనసులో ఉంటే సరి పోతుంది. నామస్మరణ చేయనంత మాత్రాన నా భక్తికేమీ తరుగు రాదు. దర్శనం కనులారా చేసుకుని ప్రార్థిస్తే సరిపొతుంది. అంతే కానీ దారంతా ఇలా బిగ్గరగా అరిస్తేనే భక్తి అని నేనకోవడం లేదు" అని జవాబిచ్చాడు.

రామం సరే ఎవరి అభిప్రాయాలు వారివి అనుకొన్నాడు. ఈలోపు ఏవో మాటలలో పడ్డారు స్నేహితులు ముగ్గురూ. కొంత సేపటి తరువాత రామానికి నామస్మరణ ఆపివేశామన్న సంగతి స్ఫురించింది. ॒అరే! మనం నామస్మరణ ఆపివేశామురా..! మరల మొదలు పెడదాము ॒ అని తనస్నేహితులతో చెప్పాడు. అయితే చంద్రం " బిగ్గరగా చేయడం నావల్ల కావడం లేదు. శ్వాసకు కాస్త ఇబ్బందిగా ఉంది. నెను మనసులో చేస్తాను. " అని అన్నాడు.

"ఈ తోపులాటలో బయటకు చెప్తూ ముందుకు వెళ్లడం వల్ల నాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ , మనం చేస్తుంటే చూసి ఇంత మంది భక్తులు నామస్మరణ చేస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది" అని రామం మాత్రం పైకి చేయడం ప్రారంభించాడు. చంద్రం మనసులో చేస్తున్నాడు. సత్యం పైకి నేను చెయ్యను అన్నా లోపల మాత్రం మనం కూడా చేద్దాంలే అని ప్రారంభించాడు కానీ ఎక్కువ సేపు అతని మనసు దానిపై నిలువలేదు. చంద్రం చేశాడు కానీ అతనూ చివరి దాకా చేయలేక పోయాడు. మనసు చంచల మైనది. అది మన మాట విని నట్టే విని మరల ఎటో వెళ్లిపోతుంది. అలాగే చంద్రం మనసులో చేయడం వలన మధ్యలోనే ఆమనసు మరో విషయం పైకి మళ్లిపోయింది. రామం మాత్రం చేస్తూ ఉన్నాడు.

ఆ రోజు ఎంత సేపటికీ లైను కదలటం లేదు. భక్తులలొ తొందర మొదలైంది. ఎంత తొందరగా మున్ముందుకి వెళ్దామా అన్న ఆశతో ఒకరిని ఒకరు తోసుకుంటూ ముందుకి వెళుతున్నారు. అంత సేపు నుంచో వడం చాలా కష్టంగా ఉంది. సత్యం కూడా అలా తోసు కుంటూ మున్ముందుకి వెళ్తున్నాడు. చంద్రం వెనక వాళ్లు తొయ్యడం వల్ల్ల కొంత తన ప్రయత్నం వల్ల కూడా కొంత ముందుకు వెళుతున్నాడు. పాపం రామం మాత్రం ఆ ఆలయ శిల్పకళను, చరిత్రను తలపోస్తూ, కాసేపు కనులు మూసి మనసారా స్వామి రూపాన్ని చింతించి, ఆ స్వామి వారి పాదాలను మనసులో ఊహిస్తూ, నామస్మరణ చేస్తూ స్వామి దర్శనం ఎంత కనుల విందుగా ఉంటుందో అని తపిస్తూ పరవశిస్తూ కాస్త నెమ్మదిగా నడుస్తున్నాడు. ఈలోపు వెనుకాల ఉన్న వాళ్లు ముందరకి వెళ్లి పోతున్నారు. ఇలా మిత్రులు ముగ్గురూ విడిపోయారు. ఒకళ్లు ముందు ఒకళ్లు వెనక అయ్యారు. ముందుగా సత్యంకి దర్శనం దొరికింది. అతను సరిగ్గా దేముని ముందుకు వచ్చే సమయానికి ముందు ఎవరో రాజకీయ నాయకుడు రావడం వల్ల లైను కదలడాన్ని ఆపివేశారు. ఏ ఆర్భాటమూ లేకుండా వచ్చిన ఆ నాయకునికి హారతులు ఇవ్వడంకోసమని కొద్ది సేపు ఆపిన ఆవరుసలో ముందు ఉండడం వల్ల, సరిగ్గా ఆ రాజకీయ నాయకునికి కాస్త ఎడంగా వెనుకాల ఉండడం వల్ల సత్యంకు అదృష్టంకొద్దీ దేముడు సుస్పష్టంగా కనిపిస్తున్నాడు. అలా 10 నిమిషాలు ఏ తోపుడూ లేకుండా అలానే స్వామిని దర్శించే అవకాశం దొరికింది. కొంతసేపటి తరువాత చంద్రానికి దర్శనం లభించింది. అతనికి 5 నిమిషాలు దర్శనం చేసుకునే అవకాశం లభించింది.

చివరగా చాలా ఆలస్యంగా రామానికి దర్శనం చేసుకునే అవకాశం లభించింది. రామానికి పాపం 1 నిమిషం మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం లభించింది. అతను కనులారా స్వామిని వీక్షించి, నీల మేఘశ్యాముడైన ఆ స్వామి అందాన్ని కనులతో జుర్రుకుని, మనసులో ముద్రించుకుని, బయటుకు వచ్చి మనసులో ముద్రిచిన స్వామిని పదే పదే తలపోస్తూ, ధ్వజ స్థంభం వద్ద సాష్టాంగం చేసి " స్వామీ! నాయందు నీకు గల నిర్హేతుకమైన కృపచేత నాకు ఇంత అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చావా తండ్రీ...! " అని తలచుకుని మురిసిపోతూ ఆలయం వెలుపలికి వచ్చాడు.

ముందరే అనుకున్న ఓ ప్రదేశంలో మిగిలిన స్నేహితులిద్దరినీ కలిసిన రామం " ఆహా...! ఈ రోజు నా జన్మ ధన్యమైనదిరా! మునుపెన్నడూ కలగని ఆనందం ఈ రోజు నా మనసుని ఉప్పెనలా ముంచి వేస్తున్నది. నేను ప్రతీ సంవత్సరం ఒకసారి స్వామి కొండకు రావాలనుకుంటున్నాను." అని తనకు కలిగిన పరమానందాన్ని వెలిబుచ్చాడు. చంద్రం కూడా " అవును రా! ఆ స్వామిని చూస్తూనే మనసు ఓ ఆనందానికి లోనయి పోయింది. కానీ ఇంత సేపు లైనులో నుంచోడమే నాకు కొద్దిగా కష్టంగా తోచింది, ప్రతీ సంవత్సరం రావడం అంటే కొంచ కష్టమే." అని చెప్పాడు. సత్యం మాత్రం మౌనంగా ఉండి పోయాడు.

" ఏమీ మాట్లాడవేమిటిరా!? " అని రామం ప్రశ్నించే టప్పటికి " నాకు మాత్రం చాలా అసహనం కలిగిందిరా. ఈ దేవాలయమంతా ధనానికి దాసోహమన్నట్టుగా నడుస్తున్నది. డబ్బున వాడికి నిమిషాలలో దర్శనాలు, లేని వాడు గంటలకు గంటలు నిరీక్షించాలి. నిజం చెప్పాలంటే నాకు ఎప్పుడౌతుందిరా బాబూ ఈ దర్శనం అనిపించింది. నా జన్మకి ఈ పుణ్యం చాలు. నేను మళ్లీ మళ్లీ రాలేను. నాకంత ఓ పికలేదు. " అని జవాబిచ్చాడు.

అలానే తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి ఎంతో మంది వెళ్తున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే స్వామి అనుగ్రహానికి పాతృలవుతున్నారు. వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ దర్శనం క్యూనుండి ఎంత తొందరగా బయటపడతామా!? ఎంత తొందరగా దర్శనాన్ని ముగించుకుని ఇంటికి చేరుకుంటామా!? అని అలోచించే వారే. ఎవరో కొందరు రామం లాంటి వారు తప్ప. పైన ముగ్గురు స్నేహితులూ స్వామిని దర్శించారు. కానీ అమితమైన ఆనందం మాత్రం రామానికి మాత్రమే కలిగింది. అతనికి లభించిన దర్శనం కేవలం ఒక్క నిముషం మాత్రమే! కానీ లభించిన ఆనందం అతడు ఊరు చేరినా కూడా వెంటాడుతునే ఉంది. స్వామి రూపాన్ని తలుచుకున్న ప్రతీ సారీ వేయింతలు అవుతూ వచ్చింది. అదే చంద్రానికి 5 ని.లు లభించింది. అతనికి దర్శించినంత సేపూ అమితమైన ఆనందంగా అనిపించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. సత్యానికి కలిగిన ఆనందంకంటే కష్టమే ఎక్కువ అని చెప్పాలి. 10 ని.లు దర్శించే భాగ్యం లభించినా కూడా అతను స్వామిని తనివితీరా దర్శించలేకపోయాడు. ఆ స్వామి ఆపాదమస్తకమూ తనమనసులో నిలిచిపోయేటట్లు స్వామి అందాన్ని కనులతో త్రాగలేకపోయాడు. స్వామి ముందు నిలబడిన ఆ 10 ని.లు కూడా రాజకీయనాకుడి భోగమును చూడడంలోనూ, తిరుమల దేవస్థానం వారికి వచ్చే ఆదాయాన్ని అంచనా వేయడంలోనూ లగ్నమైన అతని మనసు స్వామి దర్శనంలో ఆనందాన్ని రుచి చూడలేకపోయింది.

మనం మనకి ఇష్టమైన సినిమాచూస్తూనో, ఏదైనా ఇష్టమైన పని చేస్తూనో అలా గంటల తరబడి గడపగలం. కానీ ఇష్టం లేని పని చేస్తూ నిమిషం కూడా ఉండలేం. ఎప్పుడు ఆపని నుండి బయట పడదామా అని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇష్టమైనది, ఇష్టం లేనిది అని ఎలా నిర్ణయించ గలం? మన మనసు దేనిమీద ఎక్కువసేపు నిలబడ గలదో అది ఇష్టం గా చేయగలం. మన మనసు నిలవని పని ఎక్కువసేపు చెయ్యలేం. ఈ సత్యం తెలిసిన నాడు మన అభివృద్ధికి దోహదపడే విషయాలపై మన మనసును నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అది మన చదువే కావచ్చు , ఆఫీసు పనే కావచ్చు లేదా భగవంతుడే కావచ్చు. అలా నిలబెట్టే ప్రయత్నం చేసిన వాడు వృద్ధిలొకి వస్తున్నాడు. అలా కాక మనసు కోరిన ప్రతివైపూ పరిగెట్టిన వాడు దుఃఖంలో కూరుకు పోతున్నాడు.


ఒక్కనిమిషం లోనే రామం మనసు స్వామిపై ఎలా లగ్నమవ్వగలిగింది? 10 నిమిషాలు దర్శించినా సత్యం మనసు ఎందుకు లగ్నమవ్వలేదు? దీనికి మూల కారణం ఒక్కటే. రామం నామస్మరణ చేత తన మనసును భగవంతునిపై లగ్నం చెయ్యడానికి ప్రయత్నించాడు. సత్యం మనసు ఎటు మళ్లితే అటు మాత్రమే ఆలో చించాడు. ఫలితంగా దుఃఖాన్ని కూడ గట్టుకుని ఇంటికి వెళ్లాడు.


"కలౌ నామస్మరణాన్ముక్తిః " ఈ కలికాలములో ముక్తి లభించడానికి నామస్మరణమొక్కటే మార్గము. ఎవరు నిరంతరమూ నామస్మరణము చేస్తారో వారికి యఙ్ఞ యాగాదులు చేసిన సమస్త ఫలములూ లభిస్తాయి.

ఇప్పుడు చెప్పండి ఆనందాన్ని పొందే మార్గం ఏది? :)

6 వ్యాఖ్యలు:

 1. chaala baavundi.

  naku oka sandeham; roju chesukune pooja ki edaina paddati vunda? nenu roju snanam chesina taruvata devudiki dandam pettukuntanu, naku telisina konni (3/4) slokalu chaduvutanu ante. Dayachesi rojuvaari pooja vidhanam gurinchi oka post cheyyandi.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రోజూ మీకున్న సమయాన్ని బట్టి పూజ అనేది ఉంటుంది. ప్రతీ వారు కనీసం 30 ని.లు అయినా పూజకు కేటాయిస్తే వారి ఆధ్యాత్మికత బాగుంటుంది.

  దీపారాధన చేసి మీకు నచ్చిన ఇష్ట దైవానికి షోడశోపచార పూజ చేసుకుని చివరన 5 ని.లు ధ్యానం చేయాలి. ఆపూజ ఎలా చేసుకోవాలో నా దేవీ పూజా విధానం అనే దానిలో వివరంగా చెప్పాను. చూడడానికి ఆ టపా పెద్దగా ఉన్నా, నేర్చుకున్న తరువాత అది 30 నిముషాల కంటే ఎక్కువ పట్టదు. చివరన్ ధ్యానం అనేది మాత్రం చాలా ముఖ్యం.

  వీలైతే త్వరలో ఓ టపా రాస్తాను. ధన్యవాదాలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగుంది అండి. బాగా చెప్పేరు.. నామస్మరణ ఎంత ముఖ్యమో చక్కగా పిట్టకధ రూపం లో బాగుంది. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగా చెప్పారండి. పూర్వం భగవంతుని దర్శనం కోసం ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, కాలి నడకన ఎంతో దూరం నడిచి దర్శనం చేసుకునే వారు. ఈ రోజు చాలా రకాల సదుపాయాలూ, సౌకర్యాలు అనుభవిస్తూ కూడా ఇలా క్యు లో నుంచోవాలి, ఎక్కువ సేపు పడుతోంది, వారెవరో మనకన్నా ముందుగా దర్శనం చేసుకుంటున్నారు.. లాంటి చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూస్తూ, భగవంతుని చూసిన సంతోషం పూర్తిగా పొందలేకపోతున్నాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా బాగా చెప్పారు.
  నేను గమనించిన మరో సంగతి చెప్తాను.
  ఇదివరకు తిరుమల వెళ్ళేవాళ్ళు వీలైంతసేపు గోవిందా గోవిందా అంటూ స్మరించుకునేవారు.
  ఇప్పుడు అలా నామస్మరణ చేయడానికి కూడా మనవాళ్ళు నామోషీగా ఫీలవుతున్నారు.
  ఒకసారి క్యూలో నా ముందు పెద్ద గుజరాతీ కుటుంబం శ్రీనివాసుని పాటలు పాడుకుంటూ భజన చేస్తూ వెళుతున్నారు.
  అసలు వాళ్ళ భాషలో ఈ భక్తిపాటలు ఉన్నాయని నాకు తెలియదు.
  మన తెలుగులో అన్నమయ్యవి వేలాది కీర్తనలు, ఘంటసాల పాటలు ఉన్నాయి.
  కాని ఎవరూ పాడరు. దేవుని దగ్గర అంత నామోషీ ఎందుకో?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కథ, తద్వారా మీరు చెప్పిన సందేశం బాగున్నాయి. చిన్న వయసులో ఈ లోపలి ధ్యానం - బయటికి చెప్పే స్తోత్రం లాగుడు పీకుడూ నేనూ అనుభవించినవాణ్ణే. మెల్లగా చేస్తున్న పని మీద శ్రద్ధ పెరగడం వల్ల పైకి గట్టిగా స్తోత్రం చదువుతున్నా లోపల మనసు ఎలా అంతర్ముఖం అవుతుందో నాకు అనుభవమే.

  @ bonagiri .. మన అన్నమయ్య లాగానే మహారాష్ట్రలో తుకారాం, గుజరాత్‌లో నరసింహ మెహతా అనే మహా వైష్ణవులు ప్రజల భాషలో గొప్ప సంకీర్తనలు రాశారు. పైగా గుజరాతీలు అధిక శాతం వైష్ణవులు - వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోవడమే జై శ్రీకృష్ణ అనుకుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.