16, మార్చి 2011, బుధవారం

ఆబ్దికాదులను ఆచరిస్తున్నారా? అయితే "ఆబ్దిక శ్రాద్ధవిధి" ని తెలుసుకొనండి.

     నేటి మన జీవనం పరిగెత్తుటకే సరిపోతున్నది. సౌకర్యాలు అనేకం వచ్చాయి. కాలు కదపనవసరం లేకుండా కావలసిన పనులన్నీ చేసుకోగలిగిన ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు నిత్యం పరుగే. ఒక్క క్షణం తీరిక ఉండని జీవితం. ఎందుకోసమో ఆరాటం. దేనికోసమో పోరాటం.  ఈ నవ నాగరిక జీవితం మనకు సుఖాన్నిస్తోందా!?  ఏమో ఈ పరుగులలో పొందే సుఖం కూడా ఒక అనుభూతినివ్వలేక పోతోంది.   ఆశ్చర్యకరమైన, అర్థం కాని విషయమేమిటంటే ఎంతగా సౌకర్యాలు పెరుగుతున్నాయో- అంతగా మన జీవితంలో పరుగు పెరిగిపోతున్నది. ఏ సౌకర్యాలు లేని రోజులలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణం కూడా కష్టమైన రోజులలో మన పూర్వుల జీవనం ఎంతో సాఫీగా, ఎటువంటి తొందరా లేకుండా సవ్యంగా సాగిపోయింది. మనకు నేడు ప్రపంచీకరణ పుణ్యమా అని అమెరికాలో ఉన్న సౌకార్యాలు అనకాపల్లిలోనూ లభ్యమౌతున్నాయి( ధనముంటే ). కానీ మన పూర్వీకులకు ఉన్న ప్రశాంత జీవనం మనకులేదు. ఆప్రశాంతత బయట నుండి వచ్చేది కాదు, అది ఆంతరంగికమైనది. ఎన్ని ఆధునిక సౌలభ్యాలున్నా ఇంకా ఏదో కావాలని తాపత్రయం. అందుకే అశాంతి. ఈ తాపత్రయంలో మన సాంప్రదాయాలను వదిలేస్తున్నాం. మన దేశాన్ని వదిలేస్తున్నాం. మనల్ని మనమే వెలివేస్తున్నాం. అందులో భాగంగా పూజాదికాలను మానివేస్తున్నారు. ఇక ఆబ్దీకాదులను ఎందరు నిర్వహిస్తున్నారు? వాటి ప్రాముఖ్యత ఎంతమంది గుర్తిస్తున్నారు?
   పూర్వం మన వారు ఆబ్దీకానికి అత్యంత శ్రద్ధవహించేవారు. మామూలుగా రోజూ చేసే పూజలో పాటించే మడికంటే ఇంకా కఠినతరమైన మడిని ( శుభ్రతను )  పాఠించేవారు. నేటికీ అది అమలులో ఉంది. అయితే ఈ ఆచారవ్యవహారాలలో నేటి తరానికి అవగాహన అంతగా లేక, చెప్పే వారులేక ఈ ఆబ్దిక విధిలో శ్రద్ధ కరువవుతున్నది. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అన్నారు. బ్రాహ్మణులలో అయితే భోక్తలను ( బ్రాహ్మణులను ) పిలిచి భోజనం పెట్టడం ఆచారంగా ఉంది. బ్రాహ్మణులు అన్న( అన్నముతో చేసే )శ్రాద్ధమును, మిగతావారు ఆమ ( బియ్యము,పచ్చి కూరలు మొదలైన వానితో ) శ్రాద్ధమును ఆచరించాలి. పూర్వము మేషము ( మేక ) ను, మధువు ( మద్యము) ను పితృదేవతా ప్రీతికొఱకు బ్రాహ్మణులకు సమర్పించేవారు. ఇప్పుడు మేషము బదులుగా మాషములతో( మినుముతో ) చేసిన  గారెలు , మద్యమునకు బదులుగా తేనెను బ్రాహ్మణునికి సమర్పించాలి. కలియుగములో మధుమాంసములు బ్రాహ్మణులు స్వీకరించడం నిషిద్ధం.


   రోజూ పూజచేస్తే పుణ్య బలంతో సుఖములను పొందుతారు. చేయకపోతే పూర్వపాపఫలితాన్ని ఈజన్మలో ఎదుర్కొనలేక అనేక ఇబ్బందులు పడుతారు. అంతే కానీ ప్రత్యేక పాపం రాదు. అయితే ఆబ్దికాదులను నిర్వహించకపోతే పితృదేవతల శాపాన్ని పొందవలసి ఉంటుంది. ఆబ్దికాన్ని నిర్వహించడం ప్రతి గృహస్థుని విధి. మనకి సంవత్సరకాలం, పితృదేవతలకి ఒక రోజు అవుతుంది. వారు రోజూ ఆకలితో పీడింపబడుతూ ఉంటారు.  ప్రతీ సంవత్సరం పితృతిథినాడు ఆబ్దీకమును నిర్వహించి పలు  ( గోవులు, బ్రాహ్మణులు, పక్షులు, అగ్ని హోత్రము, జల చరముల ) రూపాలలో కల వారికి పితృదేవతల నుద్దేశించి భోజనమును సమర్పిస్తాము. అలా ప్రతీసంవత్సరం ఆబ్దీకమును నిర్వహించడం వారికి రోజూ భోజనమును పెట్టడం వంటిది. ఆసమయములో చేసే దాన,ధర్మములు ఊర్ద్వలోకాలలోని పితృదేవతలకు అనంతములై అందుతాయి అని శాస్త్ర వచనం. ఆవిధంగా తృప్తులైన పితృదేవతలు వంశాభివృద్ధి జరగాలని, అక్షయముగా నున్న సిరిసంపదలతో వంశములోని వారు సుఖించాలని దీవిస్తారు. సాధారణముగా పితృశాపం తగిలిన వారికి సంతానముండదు. సంతానం లేకపోవడానికి కల ప్రధాన కారణాలలో ఇది ఒకటి.  ఆర్తితో వారిని ప్రార్థించి, ఈ ప్రత్యాబ్దికాదులను శ్రద్ధతోనిర్వహించడమే దానికి నివారణోపాయం .

 
   చనిపోయిన రోజు ఏ తిథి ఉందో ఆ తిథినే ఆబ్దీకమును ఆచరించాలి. ( పుట్టిన రోజునుకూడా తిథుల ప్రకారం జరుపుకోవాలి ) పెద్దలు చనిపోయిన మొదటి సంవత్సరములో ( ప్రతీ నెలా ఆ తిథినాడు వచ్చే ) పన్నెండు మాసికములను వదలకుండా నిర్వహించాలి. కొందరు తెలియక ఈ నెలలలో కొన్ని వదులుతున్నారు. అది మా ఆచారం అని చెప్తున్నారు. అది సరైన పద్ధతికాదు. తప్పక ఆచరించాలి. మనకు కుదరకపోతే మాకు ఆచారం లేదు అని చెప్పుకోవడం నేడు కనిపిస్తోంది. ఇది కలిప్రభావం తప్ప మరొకటి కాదు.

  పూజాదికాలు కాస్త ఎక్కువగా చేస్తేనే వ్యంగ్యంగా మాట్లాడే జనం మధ్యలో జీవనం సాగిస్తూ - ప్రత్యాబ్దీకమును, పుష్కర శ్రాద్ధాదులను తెలిసో తెలియకో, నమ్మకం ఉండో లేకో నేటికీ  ఇంకా ఆచరిస్తున్న వారున్నారు. అటువంటి వారికి ప్రయోజన కరంగా ఉంటుందని నాదగ్గర కల కీ.శే.లు చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రిగారిచే రచింపబడిన "ఆబ్దికశ్రాద్ధవిధి" అనే పుస్తకమును PDF గా పొందుపరుస్తున్నాను. అది ఆస్తికులకు మరింత ఆసక్తిని, సంగ్ధిగ్ధంలో ఉన్నవారికి కొంత అవగాహనను కలిగిస్తుందని ఆశిస్తున్నాను.  ఇది చాలా వరకు బ్రాహ్మణులు శ్రాద్ధము ఆచరించడానికి గల నియముములను వివరించినను, కొన్ని అందరికీ ఉపయోగపడు నియమములును కలవు. ఎవరికి సంబంధించినవి వారు తెలుసుకొనగలరు.

పుస్తకం కొరకు ఈ క్రింది లింక్ లో చూడండి. 

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B0Zi3RYt07USMzdmNzc1YWYtYWRlZS00Y2QxLWFmOTgtNWM3MmIwN2I4Y2M2&hl=en

7 వ్యాఖ్యలు:

 1. ఒక్కొక్కసారి ఆబ్దీకం పెట్టవలసిన తిధి ఏ సాయంకాలానికో వస్తుంది.మరునాడు వుదయం వరకే వుంటుంది.అలాంటప్పుడు యేం చేయాలి?తద్దినానికి తగులు,పండగలకి మిగులు చూడాలని విన్నాను.ఇది సరియేనా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పుష్కరాలు మొదలైన వాటిలో ఎవరెవరికి పిండ ప్రదానం చెయ్యవచ్చు?

  వరుసగా

  తండ్రి, తాత, ముత్తాత -
  తల్లి, నాయనమ్మ, ముత్తమ్మ (తండ్రికి నాయనమ్మ)
  తల్లి తండ్రి, తల్లి తాత, తల్లికి ముత్తాత -
  అమ్మమ్మ, తల్లికి నాయనమ్మ, తల్లికి ముత్తమ్మ -

  ( ఈ పై వరసలలో మొదటి వారు జీవించి ఉంటే మిగతా ఇద్దరికీ పెట్టనవసరం లేదు.)

  తన భార్య - కుమారుడు - సోదరులు - తండ్రి సోదరులు -మేనమామ - కుమార్తె - తోబుట్టువు - కూతురి కొడుకు - మేనల్లుడు -మేనత్త - తల్లి తోబుట్టువులు - అల్లుడు - బావగారు - కోడలు - పిల్లనిచ్చిన మామ - పిల్లనిచ్చిన అత్త - భార్య సోదరుడు - ప్రభువు - బ్రహ్మోపదేశము చేసిన గురువు( తండ్రి ) - అప్పు పెట్టిన వారు మొదలైన వారందరికీ పిండప్రదానము చేయవచ్చును.

  ౨. కాశీ, ప్రయాగ, గయా మొదలైన వాటిలో శ్రాద్ధము చేసిన తరువాత ప్రతీ సంవత్సరమూ ఆ బ్దీకములను పెట్ట నవసరం లేదంటారు. అది ఎంతవరకూ నిజం?

  ఇది చాలా తప్పు. పై పుణ్య క్షేత్రాలలో పెట్టి నప్పటికీ ప్రతీ సంవత్సరం వచ్చే ఆబ్దికాదులను ఆచరించ వలసినదే. అనోకోని పరిస్థితులలో ఒక్కో సారి ఆబ్దీకాదులను పెట్టలేక పోతాము, అటువంటి వాటి దోషమును ఈ పుణ్యక్షేత్రములలో పెట్టడం వలన తొలగించు కోవచ్చు. అంతేకానీ ఇక జీవితాంత ఆబ్దీకాదులను మానేయడం అనేది తప్పు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కాలప్రమాణాన్ని విభాగించి నపుడు 30 ముహూర్తముల కాలము చేత ఒకరోజు (రాత్రి - పగలు కలిపి) ఏర్పడుతుంది. ఇందులో 3 ముహూర్తములకాలం ప్రాతఃకాలం. తదుపరి 3ము|| కాలం సంగవము. అటుపైన 3 ము|| కాలం మధ్యాహ్నం. తర్వాతి 3 ము|| కాలం అపరాహ్ణం. ఆపైన 3 ము|| కాలం సాయాహ్ణం. ఈ ప్రకారం ఐదేసి విభాగాలు (5x3=15) పగలు మరో ఐదేసి విభాగాలు రాత్రి మొత్తం 30 ము|| కాలం ఒకరోజు అని లెక్కింపబడింది.

  అపరాహ్ణ కాలమునకు తిథి ఉన్నరోజునే ఆబ్దీకమును చేయవలెను. రెండు దినములలోనూ అపరాహ్ణ సమయానికి తిథి లేక పోతే బ్రాహ్మణులు మొదటి రోజు, ఇతరులు రెండవ రోజు చేయవలెను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వివరంగా విశదీకరించి మా సందేహాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలండీ శర్మ గారూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. namaskaram sir,nenu chaala pedda porapaatu chesanu.sariga thelusukookunda mangala gouri vrathanni 5 vaaralu chesthanani mokkanu.alage pusthakamlo chusi 3 weeks chesanu ithe e roju computerlo chusanu okasari pasupu gourini cheste 5 vaaralu ade unchalata.naku thelika nenu prathgi varam kottadi chesthu vasthunnanu....diniki emainadoosham vassthunda......sir plz naku help cheyyandi diniki samadhanam ivvandi................naku chala bhayanga undi.......

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మా అది కొందరి ఆచారమే కానీ, అలాగే 5 వారాలూ అదే పసుపు గౌరికి పూజ చేయాలని ఏమీ శాస్త్రం కాదు. అలా అవసరం లేదుకూడా! మీవల్ల ఏమీ పొరపాటు జరగలేదు. చింతించ నవసరం లేదు.


  మీరు ఏమి చేశారు? ఏమి నైవేద్యం పెట్టారు అన్నదానికంటే మీరు ఎంత శ్రద్ధతో పూజ చేశారు అన్నది ప్రథానం.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.