18, జూన్ 2012, సోమవారం

మడి అంటే ఏమిటి?

మడి అంటే ఏమిటి? : మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి.  నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి? : రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం.  ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక  ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల  అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )  మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే  సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు.  ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు.  ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.   
 
మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని  గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో  గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.  ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి. 

  నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.  

శుభంభూయాత్!

9 వ్యాఖ్యలు:

 1. మంచి వ్యాసం.
  అందరకూ నూలు బట్టల గురించీ, పట్టు బట్టల గురించీ బాగానే తెలుసుసు. కాని యీ ధావళి గురించి సరిగా యెవరికీ యీ రోజుల్లో తెలియకపోవచ్చును. దయచేసి ధావళి అనే దాని గురించి విపులంగా వ్రాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అపార్ట్‌మెంట్లలో నివశించేవారికి ఈ మడి ఆచారాలు పాటించడం కష్టం. బావి ఉండదు, మోటారు నీళ్ళు రోజూ అంటే కష్టం. అపార్ట్‌మెంట్ కల్చర్‌కు తగ్గట్లుగా ఈ మడి ఆచారాలను కూడా సింప్లిఫై చేస్తే ఈకాలంలో పాటించడానికి అనువుగా ఉంటుంది. లేకపోతే ఈ సాంప్రదాయాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళడం కష్టం. కలికాలానికి తగ్గట్టుగా ఏ మార్పులు చెయ్యాలో ఖచ్చితంగా ఏదో ఒక శాస్త్రంలో ఉంటుంది. అదేదో కనుక్కొని ప్రజలకు అందిస్తే ఉత్తమమని నా అభిప్రాయం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాస్పబెరీ రామలింగం గారు, ఆచారాలను ముందుకు తీసుకోపోవాలనే వుద్దేశ్యంతో వాటిని పాటిస్తారా? మోటారు నీళ్ళు కాకుంటే కుళాయి నీళ్ళు అనుకోండి. ఇంకా సింప్లిఫై చేయాలని గోల చేయడం ఎందుకు? అంత కష్టమైతే వదిలేస్తే పోలేదూ? ఎందుకు పట్టుకు వేళాడటం?

   తొలగించు
  2. ఈ శౌచము అనేదానిని తగ్గించడం కుదరదు. కానీ మీకు నిజంగా పాఠించే ఆసక్తి ఉండి అశక్తులైన ( మోటరు నీళ్లుకూడా లేని ) నాడు దొరికిన దానితో చేయడం దోషంలేదు. కానీ ఇందులో శ్రద్ధ ముఖ్యం. మనసు పెట్టిన కొద్దీ మార్గం ఉంటుంది. కొందరు మడికి కుదరడం లేదని మళ్లీ ఊళ్లకు వెళ్లి పోయిన వారున్నారు. అది మన ఆసక్తి ని బట్టి ఉంటుంది. లోతుకు వెళ్ళిన కొద్దీ సనాతన ధర్మంలోని తీయ్యందనమేమిటి అనేది తెలుస్తుంది. :)

   తొలగించు
 3. sir, assalu ee madi vastram ante emiti ane o sandeham undedi , chakkagaa vivrinchaaru, aachaara vyavahaaraalu evainaa subratha pradaanam , urdulo kuudaa " paakee aadaa imaan " antaaru subrata valla nirmalatwm chese pani patla bhakti nammaka kalugutundi antaaru.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.