దేవీ పూజావిధానం-1 లో సంకల్పం వరకు రాశాను. కలశారాధన నుండీ మిగిలిన భాగం ఈ 2 వ టపాలో పూర్తిచేస్తాను. ( ఈ వివరణలేవీ లేకుండా కేవలం పూజా శ్లోకాల వరకే కావాలంటే ఇక్కడ నొక్కండి. )
సంకల్పం అయిన పిదప కలశారాధన చెయ్యాలి.
(శ్రీ లలితాపూజాం కరిష్యే. అన్న తరువాత)
తదంగ కలశారాధనం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీరు వదలాలి.
కలశారాధనం
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.
మనము ఆచమనము చేసిన పాత్రను కాక, భగవంతునికి ఉపయోగించడం కొరకు వేరే ఒక కలశములో నీటిని తీసుకుని ఆ కలశమును గంధము,పసుపు,కుంకుమలతో అలంకరించాలి. కలశములో త్రిమూర్తులు, మాతృగణములు, సప్తసాగరములు,సప్తద్వీపములు,చతుర్వేదములు ఆవాహన అగునట్లు భావిస్తూ ఈ క్రింది శ్లోకము చదవాలి. ( ఈ కలశము కేవలం భగవంతుని పూజకోసం వినియోగించడానికి మాత్రమే. మన ఆచమనముకొసం మనకో పాత్ర ఎలా ఉందో, అలాగే అమ్మవారి ఆచమనమునకు,స్నానమునకు మొదలైన వాని కొరకు నీటిని ఉపయోగించుటకు ఈ కలశం. )
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆ కలశములోని నీటి యందు గంగా మొదలైన సప్త నదులు ఆవాహన అయినట్లుగా భావించి ఈ క్రింది శ్లోకములను చదవాలి.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.
ఆయాంతు శ్రీ లలితా దేవీ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశములోని నీటిని పూజా ద్రవ్యముల యందు, దేవుని యందు, తన యందు చల్లవలెను.
1.అథ ధ్యానం:
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం
సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం
మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి( భావన చేయాలి ).
2.ఆవాహనం:
నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కృపాకరే.
శ్రీ లలితాదేవ్యైనమః ఆవాహయామి. ( అమ్మా నేను నిన్ను పూజించ తలచి మా గృహమునకు ఆహ్వానిస్తున్నాను. నీవు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసినది. అని భావన చేసి ) అక్షతలు కలశము లేదా విగ్రహముపై వేయవలెను. ( ఇక్కడ కలశము అంటే ప్రథాన కలశం. అంటే సత్యనారాయణ వ్రతంలో వలే దేముని పటము ముందు కలశము పెట్టి, దానిపై కొబ్బరికాయను ఉంచి, దానిమీద వస్త్రమును ఉంచుతారు. )
3.ఆసనం:
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
మనశ్చిత్రం మనోహారి సింహాసన మిదం తవ.
శ్రీ లలితాదేవ్యైనమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ( అమ్మా! నీవు ఈ ఆసనమును అలంకరించ వలసినది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనముపై ) అక్షతలు చల్లవలెను.
4.పాద్యం:
అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతృకే
మనశ్శుద్ధం మయాదత్తం గంగామంబుపదోస్తవ.
శ్రీలలితాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి. ( అమ్మా! నీ పాదముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని (ఆచమనం చేసిన పాత్రకాక మరొక పాత్రకు అలంకారం చేశారు కదా అందులోని ) నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదలవలెను.
5.అర్ఘ్యం:
సర్వ తీర్థమయం హృద్యం బహుపుష్ప సువాసితం
ఇదమర్ఘ్యం మయాదత్తం గృహాణ వరదాయిని.
శ్రీలలితాదేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ( అమ్మా! నీ హస్తముల కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.
6.ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే
గృహాణాచమనం దేవి నిర్మల రుచి పూరకం.
శ్రీలలితాదేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ( అమ్మా! నీ ఆచమనము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.
మధుపర్కం:
మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరా జల సంయుతం
మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే.
శ్రీలలితాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి. ( అమ్మా! ఈ చల్లని మధుపర్కమును స్వీకరించు అని భావించి ) పెరుగు,బెల్లం/పంచదార కలిపి అమ్మవారికి చూపి పళ్లెములో వదలవలెను. ( దూరమునుండి వచ్చిన అతిథికి, ప్రయాణ బడలిక,వేడి తగ్గడం కోసం మజ్జిగ ఇవ్వడం వంటిది ఈ మధుపర్కం ఇవ్వడం )
7.స్నానం:
ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా స్నానము కొరకు ఈ నీటిని స్వీకరించు అని భావించి) కలశములోని నీటిని అమ్మవారిపై చిన్న పుష్పముతో చల్ల వలెను.
నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే
ఇదం శుద్ధోదక స్మానం స్వీకురుష్వ దయామతే.
శ్రీలలితాదేవ్యైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
పంచామౄత స్నానం:
ఈ క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా! నీ స్నానము కొరకు ఈ పంచామౄతములను, కొబ్బరి నీటిని స్వీకరించు అని భావించి ) పంచామౄతములను ( ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అను అయిదు భూలోకములో అమౄత సమానమైనవి) , కొబ్బరినీటిని అమ్మవారిపై పుష్పముతో కొద్ది కొద్దిగా చల్లవలెను.
దధి క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
నారికేళ జలైర్యుక్తం స్నానమంబ మయార్పితం.
శ్రీలలితాదేవ్యైనమః పంచామౄత స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
8.వస్త్రం:
అంబరంచాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం
వస్త్రమేతన్మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.( అమ్మా! నీ అలంకరణ కోసం ఈ వస్త్రమును స్వీకరించు అని భావించి ) వస్త్రమును గానీ, ప్రత్తితో చేసిన వస్త్రమును గానీ సమర్పించాలి.
వస్త్ర యుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
9.యఙ్ఞోపవీతం:
నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్ర కోటి మనోహరే
ఉపవీతమిదందేవి గృహాణత్వం ప్రసీదమే.
శ్రీలలితాదేవ్యైనమః యఙ్ఞోపవీతం సమర్పయామి ( అమ్మా ఈ యఙ్ఞోపవీతమును స్వీకరించు అని భావించి ) యఙ్ఞోపవీతమును గానీ ప్రత్తితో చేసిన యఙ్ఞోపవీతమును గానీ సమర్పించాలి.
యఙ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
ఆభరణం:
నానా విధాని రత్నాని మాంగళ్యాభరణానిచ
సౌవర్ణాని చ దీయంతే గృహాణ పరదేవతే
శ్రీ లలితాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి. ఆభరణాలు ( గాజులు మొ..వి ) సమర్పించ వలెను.
10.గంధం:
ఇష్ట గంధ ప్రదం దేవి అష్ట గంధాధి వాసితం
అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం.
శ్రీలలితాదేవ్యైనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ( అమ్మా! ఈ శ్రీ చందనమును స్వీకరించు అని భావించి ) పుష్పముతో గంధమును చల్లవలెను.
హరిద్రాచూర్ణం:
హరిద్రా చూర్ణమేతద్ధి స్వర్ణ కాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః హరిద్రాచూర్ణం ( పసుపు ) సమర్పయామి.
కుంకుమాచూర్ణం:
కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే.
శ్రీలలితాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములు సమర్పించ వలెను.
అక్షతాన్:
ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే
స్వర్ణాక్షతామయాదత్తాః కృపయా పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః సువర్ణాక్షతాన్ సమర్పయామి. ( అక్షతలు అంటే క్షతము కానివి. అంటే విరగనివి. )
పుష్పం:
నానా విధైశ్చ కుసుమైః బహు వర్ణైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి. ( పుష్పములు సమర్పించవలెను)
అక్షతైః పుష్పైః పూజయామి. ( అక్షతలతోను, పుష్పములతోను పూజించ వలెను. )
ఇక్కడ 108 లేదా 1008 నామములతో అమ్మవారిని పూజించ వచ్చు. ఆపిదప
11.ధూపం:
జగదంబే నమస్తేస్తు కరుణాపూర పూరితే
ధూపమేతన్మయాదత్తం గౄహాణ వరదేంబికే.
శ్రీలలితాదేవ్యైనమః ధూపం సమర్పయామి. ( సాంబ్రాణి లేదా అగరుబత్తి చూపించాలి )
12.దీపం:
కృపాపరే మహా దేవి జగద్రక్షణ తత్పరే
చంద్ర రేఖాంక మకుటే దీపోయం పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః దీపం దర్శయామి. ( దీపమును చూపవలెను )
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ( కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను. )
13.నైవేద్యం:
భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వ దేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి. నివేదనకు పండ్లు, కొబ్బరికాయ, పరమాన్నం,పిండివంటలు,పులగము మొదలగునవి యధాశక్తిగా సమర్పించ వలెను. ( అమ్మా! నాశక్తి కొలదీ సమర్పించు ఈ నివేదనను స్వీకరించు అని, కళ్లు మూసుకుని అమ్మ ప్రీతితో స్వీకరిస్తున్నట్లుగా భావించ వలెను. )
మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి. పాదౌ ప్రక్షాళ యామి. పునరాచమనీయం సమర్పయామి. నైవేద్యము అయిన తరువాత అమ్మవారు చేతులు శుభ్రపరచుకొనుటకు, పాదములు శుభ్రపరచుకొనుటకు, దాహము తీర్చుకొనుటకు కలశంలో నీటిని 5 సార్లు అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
తాంబూలం:
తాంబూల పూరితముఖి సర్వ విద్యా స్వరూపిణి
సర్వ మంత్రాత్మికేదేవి తాంబూలం పరిగృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి. 3 తమల పాకులు, రెండు వక్కలు,పండ్లు తాంబూలముగా సమర్పించవలెను.
తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
14.నీరాజనం:
కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే
నీరాజనం మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.
శ్రీలలితాదేవ్యైనమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపుతూ ఆ వెలుగులో అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించ వలెను.
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.
15.మంత్రపుష్పం:
పుష్పము అక్షతలు పట్టుకుని లెచినుంచుని అమ్మవారిని ఈ క్రింది విధంగాస్తుతించవలెను.
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా
వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
చేతిలోని అక్షతలు, పూలు అమ్మ వారిపై వేయవలెను
ప్రదక్షిణ నమస్కారాః :
మరల పుష్పము, అక్షతలు పట్టుకుని ఈ క్రిది విధంగా చదువుతూ ఆత్మప్రదక్షిణము చేయవలెను
యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపాసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దౄష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే.
శ్రీలలితాదేవ్యైనమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి.
( అని చెప్పి బోర్లా పడుకుని చేతులు చాపి సాష్టాంగ నమస్కారం చేయవలెను. అమ్మవారిని మనసులో స్మరిస్తూ, ఆ తల్లి పాదములను మీచేతులు తాకినట్టుగా, ఆ అమ్మ మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించినట్టుగా భావన చేయవలయును. పొట్ట, శిరసు, కనులు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు అను ఎనిమిదింటి చేత నమస్కారము చేయుట సాష్టాంగ నమస్కారం. స్త్రీలు మోకాళ్లపై మాత్రమె చేయవలెను. )
అపరాధ నమస్కారం:
( అమ్మా! మానవులమై పుట్టిన మేము కలి ప్రభావంచేత తెలిసో,తెలియకో అనేక అపరాధములు చేస్తూ ఉంటాము. అలా తెలిసీ తెలియక చేసిన అపరాధములను పుత్ర/పుత్రీ వాత్సల్యముతో క్షమించి సదామమ్ము కాపాడు దేవీ..! అనే భావనతో ఈ క్రింది శ్లోకములను చదవవలెను )
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి.
శ్రీలలితాదేవ్యైనమః అపరాధ నమస్కారం సమర్పయామి.
యస్యస్మౄత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే.
అనయధ్యాన ఆవాహానాది షోడశోపచారపూజయా
భగవతీ సర్వాత్మకః శ్రీ లలితా దేవీ స్సుప్రీతాస్సుప్రసన్నో వరదో భవతు.
16.ఉద్వాసనం:
శ్రీలలితాదేవ్యైనమః ఉద్వాసయామి. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి
( ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపడం. ఇక్కడ విచిత్రం చూడండి. "అమ్మా! నిన్ను ఆవాహనం చేయడమూ నాకు తెలియదు, ఉద్వాసన చేయడమూ నాకు తెలియదు, అసలు నిన్ను పూజించడమే నాకు తెలియదు ఏమైనా అపరాధములుంటే క్షమించు తల్లీ." అని పైశ్లోకంలో ప్రార్థిస్తున్నాము. అంటే మన ఇంటికి వచ్చిన మనకు అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి ఇంటి నుండి వెళుతుంటే ఏవిధంగా మాట్లాడతామో అలాగే ఉంది కదా!? ఎంత వినయం,విధేయతా ఉంటే ఈ మాటలు అనగలుగుతాము? అందుకే పూజ చేయడం సరిగా వస్తే సాటి మనిషితో ఎలా మెలగాలి? ఎలా ప్రేమించాలి? అనే విషయం మనకు బాగా తెలిసినట్టే అని నేను భావిస్తాను. )
శ్రీలలితాదేవ్యైనమః యధాస్థానం ప్రవేశయామి. అని అమ్మవారిపై అక్షతలు వేసి కొంత సేపు మౌనంగా ప్రార్థించాలి. ఆ తరువాత ( పళ్లెములో వదిలిన ) తీర్థమును, నివేదన చేసిన ప్రసాదమును ప్రీతితో స్వీకరించాలి.
పురోహిత విషయాలు మరియు జ్యోతిష్య విషయాలు చర్చిస్తాను. ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చిన జ్యోతిష్యం మీకూ సాధ్యమైనంత సులభ పద్ధతిలో నేర్పే ప్రయత్నం చేస్తాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎప్పటి నుంచో అనుమానం. శ్రీసూక్త విధానంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీత ధారణ అర్ధంకాని విషయంగా ఉంది. వీలువెంట వివరించగలరు.
రిప్లయితొలగించండిమీ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు.
రిప్లయితొలగించండి"స్త్రీ లకు యఙ్ఞోపవీతం ఏమిటీ?"
అనేనా మీసందేహం.
పూర్వం స్త్రీలు కూడా యఙ్ఞోపవీతం ధరించేవారు. అందువలన అది పూజా విధానంలో కూడా ఉన్నది. దేవాలయానికి వెళ్లినప్పుడు సరిగ్గ గమనిస్తే దేవతలకు కూడా యఙ్ఞోపవీతాలు కనిపిస్తాయి చూడండి.
devi pooja vidhanam lo ammavariki vasthram samarppinchina tharuvatha yagnopaveetham samarpinchali ani vundhi ante emi samarpinchali.meeru emi anukovadhu.naku nijamga teliyadhu.naku pooja vidhanalu anni kotha.e madhyane chesthunnanu.ippati varaku cheyaledhu,eppudu choodaledhu.yagnopaveetham samarpinchatam ante emi samarpinchalo teliyadhu
రిప్లయితొలగించండిసునీత గారికి
రిప్లయితొలగించండియఙ్ఞోపవీతము కానీ అది లేనిచో ప్రత్తితో చేసిన యఙ్ఞోపవీతము కానీ అమ్మవారికి సమర్పించాలి.
లేదా కనీసము దారపు పోగునైనను సమర్పించాలి.