18, జనవరి 2011, మంగళవారం

మీరూ పురోహితులుగా మారండి

  
   హిందూ మతం లోని ఆనందం, ఔన్నత్యం మీకు పూర్తగా తెలియాలంటే మీరు పురోహితులుగా మారాలి. ఏకులం వారైనా ఏమతం వారైనా ఈ పురోహితం చేయవచ్చు. నేను ఓ పురోహితుడిని కనుక ఆ ఆనందమేమిటో దానిరుచేమిటో ఎరిగిన వాడిని కనుక ఆ ఆనందం మీకూ పంచుదామని ఈ ప్రయత్నం. పురోహితులుగా మారాలంటే దానికి ప్రత్యేకమైన యోగ్యతలేవో కావాలి,  మనకి పొద్దున  లేచింది మొదలు ఉద్యోగం చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదు, మళ్లీ ఈ పురోహితం ఎక్కడ వెలగబెట్టగలం, ఇది మనకి కుదరదు అనుకొంటున్నారేమో! అలా అనేముందు దీనిని ప్రయత్నించి అప్పుడు ఆ మాట చెప్పండి. నేనూ ఒప్పుకుంటాను. కనీస ప్రయత్నం లేకుండా ఓ మంచి ఆలోచనని కాదనకండి.  పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.

౧. పురోహితులుగా ఏమి చేయాలి?

 ఏముంది సమాజ హితం.

౨. దానికి నేనెటువంటి గుణాలు కలిగి ఉండాలి?

 కాస్త సాధన - కాస్తనిజాయితీ- కాస్త సాటిమనిషి పట్ల , సమాజం పట్ల ప్రేమ - తెలియనిది తెలుసుకోవాలనే తపన ఇవి ఉంటే మీరు పురోహితులుగా రాణించేస్తారు.

౩. అంటే ఇవి లేక పోతే పనికి రామా?

ఎందుకు పనికి రారు పనికొస్తారు. మీకు కనక శ్రద్ధ - తప్పును ఒప్పుకుని మార్పును స్వీకరించే గుణం  ఉంటే పై విషయాలు అలవరచుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. పైగా మనలో చాలా మందికి నా సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన చాలా ఉంది. కాకపోతే అది ఎలా చేయాలో తెలియదు.

౪. సరే అయితే ఇప్పుడు మేము కూడా పంచ,కండువా కట్టుకుని పూజలూ అవీ చేస్తూ ఉద్యోగాలు మానేసి మీకూడా తిరగాలా ఏమిటి?

అబ్బే అవేవీ అవసరం లేదు. మీమీ ఉద్యోగాలు  నిరభ్యంతరంగా చేస్తూనే పురోహితమూ చేయవచ్చు. పైగా దీనికోసం మీకు ఇష్టంలేకుండా ఏత్యాగమూ చేయనవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఎవరికి మీరు పురోహితంద్వారా మేలు చేయాలనుకుంటున్నారో వారిని వెతుక్కోవడం, పురోహితం ప్రారంభిచడం.  పురోహితుడవ్వాలంటే బ్రాహ్మణుడు మాత్రమే అవ్వాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఆసక్తి ఉన్న ఎవరైనా అవ్వొచ్చు. నిజానికి ఇప్పటికే చాలామంది తమకు తెలియకుండానే పురోహితం చేస్తున్నారు.

౫. అర్థకాలేదు. పూర్తిగా వివరంగా చెప్పండి.

 అదీ అలాఅడిగారుకనుక చెప్తున్నాను. :)

మనం ముందర పురోహితులుగా అవడానికి మానసికంగా సిద్ధపడాలి అంటే ముందు పురోహితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నాదృష్టిలో "ఆధ్యాత్మిక లేమితో బాధపడేవారి హృదయాలను ఆధ్యాత్మికతతో నింపడమే పురోహితం"    అంటే ఓ డాక్టరు వ్యాధిగ్రస్థునికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చినట్లు, మనమూ సమస్యలో ఉన్నవారికి ఆసమస్యకు మూలకారణం వివరించి ఆనందం రుచి చూపిస్తూ, తోటి వ్యక్తులను తద్వారా సమాజాన్ని ఆనందం వైపు నడిపించడమే పురోహితం అంటే.

ఇక మనం పురోహితులము అవ్వాలంటే మనకు కావలసిన అర్హత ఙ్ఞానం. వ్యాధికి సంబంధించిన సంపూర్ణ అవగాహన. వ్యాధి ఏమిటి?  ఆధ్యాత్మిక లేమి ఏ మానసిక సమస్యకైనా మూలకారణం ఇదే అనిగుర్తుంచుకోవాలి . ( అనేక భౌతిక విషయాలలో కూడా ఆధ్యాత్మిక సాధన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ) మరి దాని చికిత్స ఏమిటి? ఆధ్యాత్మిక సాధన. చికిత్స ద్వారా మనం వారికి అందించ గలిగినది ఏమిటి? ఆనంద జీవనం.

మన ఋషులు భారతీయ జీవన విధానాన్ని రూపొందించడంలో ఎంతో తపన చెందారు. ఆనందం ఎక్కడనుండి వస్తోంది? దానిని పరిపూర్ణంగా పొందడం ఎలా? కష్ట సుఖాలకు అతీతంగా నిశ్చల ఆనంద స్థితి ఏవిధంగా పొందగలం? మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వారి తపస్సు ద్వారా పొందారు. దానిని భవిష్యతరాలకు అందించడానికి తపించారు. వారి ప్రేమను తలచినప్పుడల్లా నాకళ్లు చమరుస్తాయి. భారతీయ జీవన విధానం వారు మనకు పెట్టిన భిక్ష. అది ఆనందం అనే పరమావధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించ బడింది. కానీ నేడు ధనం పరమావధి అని ప్రాకులాడడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి. మన పూర్వులకు ఎంత ప్రేమ ఉంటే నేటికీ మనం భారతీయ జీవన విధనాన్ని కళ్లారా చూడగలుగుతున్నాం!?  ఈ విధానం నలుగురూ అమలుపరచేలా చేయడంలో ఎంత తపించి ఉంటారు!? మన మీద ఎంత ప్రేమ ఉంది వారి హృదయాలలో!?   అదే మనకు స్ఫూర్తి కావాలి. మనకున్న బలహీనతలను తొలగించడంలో వేయింతల బలాన్ని ఇవ్వాలి. ఋషులు మనకు ఒక జీవన విధానాన్ని ప్రసాదించారు. దానికి ప్రాతి పదికగా వేదాన్ని వారసత్వంగా ఇచ్చారు. ఆ ఋషుల స్ఫూర్తితో తన ప్రతి చర్యలోనూ ప్రేమను నింపుకుని తాను తరిస్తూ చుట్టూ ఉన్న నలుగురినీ తరింప చేసేవాడే పురోహితుడు. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఙ్ఞానాన్ని, ఎంతో కొంత అఙ్ఞానాన్నీ కలిగి ఉంటారు. ఎవరూ పరిపూర్ణులు కారు. కానీ తమఙ్ఞానాన్ని నలుగురికీ పంచాలనుకునేవారు క్రమక్రమంగా కొత్త విషయాలను తెలుసుకుంటూ పరిపూర్ణ ఙ్ఞానం ( ఆనందం ) వైపు పయనిస్తారు. ముందు మనకుతెలిసినదెంతో మనం ఇంకా సాధించ వలసినదేమిటో విచారణ చేసుకోవాలి. ఆ తరువాత మనకు తెలిసిన పరిధిలో సాటివారికి తగు సహాయమందించాలి. అలా సాయమందించడంలో మననూ అనేక తెలియని విషయాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. వాటికి "సద్గ్రంధ పఠనం-సజ్జన సాంగత్యం- స్వీయ సాధన" మొదలైన వాటి ద్వారా సమాధానాలను రాబట్టుకోవచ్చు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలకు కారణం చాలావరకు ఆధ్యాత్మిక లేమి. ఆధ్యాత్మిక సాధన ఉన్నట్లైతే మనం, మన సమాజం నేడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అసలు సమస్యలే కావు. కనక ఆదిశగా మనం పయనిస్తూ తోటివారిని పయనింప చేసే ప్రయత్నమే పురోహితం అంటే. మీకు కష్టంలో ఎవరైనా కనపడితే చూస్తూ ఊరుకోకండి. దానికి తగిన తరుణోపాయం ఆధ్యాత్మిక సాధన అన్న విషయాన్ని వారికి నచ్చే, వారు మెచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ తపన, తోటి వారిపై గల ప్రేమ, మీకు భగవంతుడి పై గల నమ్మకం, మీ ప్రార్థనలో కల ఆర్తి, గురువుల ఆశీస్సులు మీకు దారి చూపుతాయి. ఇంకా  ఈ విషయంలో  సాధకులైన తోటి మిత్రుల సహకారాన్ని పొందండి. మీకవసరమనుకుంటే నా పూర్తి సహకారాన్ని నేనందిస్తాను.

ఇక్కడ మీకో సందేహం రావచ్చు.  "నాకే ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. ఇక తోటి వారికేమి నేర్పగలను? " అని

నిజానికి చాలామందికి కూడా ఇదే సందేహం. ఆధ్యాత్మికతకు ఒక్క మాటలో వివరణ ఇవ్వడం చాలా కష్టం. కానీ "నిన్ను నిన్నుగా నిలబెట్టుకోవడమే ఆధ్యాత్మికత" అంటాను నేను. మన బుద్ధి అనేక సందర్భాలలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా ప్రశ్నించిన బుద్ధికి సరైన సమాధానాన్నిచెప్పి నేను సక్రమ మార్గంలోనే ఉన్నాను అని నిర్థారించుకుంటూ ముందుకు వెళుతూ ఉండడమే ఆధ్యాత్మికత. ఆ బుద్ధిని నిద్ర పుచ్చి మనసు లాగిన కేసల్లా మళ్లడమే ఆధ్యాత్మిక లేమి. ఇదిఅర్థంకాకనే మనలో చాలామంది ప్రక్కవాళ్లకి సమస్య వచ్చినప్పుడు - ఆ సమస్యకు తగిన పరిష్కారం  వారికి తెలిసినా కూడా సలహా చెప్పడం మానేస్తున్నారు. మనం సలహా చెప్పినప్పుడు వారు వేశే ప్రశ్నలకు మనం సంతృప్తి కరమైన సమాధానాలు ఇవ్వలెమేమో అన్న సందేహం. ఇక్కడ ఆలోచించ వలసినది అది కాదు. అదే సమస్య మనకి ఎదురైతే మనకి మనం సమాధానం చెప్పుకోగలమా లేదా అన్నది ముందు ఆలోచించాలి. నేనే ఆపరిస్థితులలో ఉంటే ఏమిచేస్తాను? అంతకంటే మెఱుగైన పద్ధతి నాదగ్గర ఉందా? అని మనం ఆలోచిస్తే సరిఅయిన సమాధానం దొరుకుతుంది. అప్పుడు మనం ఇతరుల సమస్యకు మూలకారణం, దాని నివారణొ పాయం చెప్పడం మొదలు పెట్టాలి. అదీ వారి స్థాయికి తగిన రీతిలో. ఇదంతా కాస్త మనో బలమున్న ఎవరైనా చెయ్యగలరు. దానికి పెద్ద విధి విధానాలెమీ తెలియనవసరం లెదు. ఏ మంత్రోపాసనలు అవసరం లేదు. కానీ ఆమనో బలం ఎవరికి ఉంటోంది? అన్నది ప్రశ్నించుకుంటే కేవలం భగవత్ భక్తులకు, నిజమైన సంఘ సేవకులకు ఎక్కువగా ఉన్నది. మీరు ఏ కథ తీసుకోండి సాధరణం గా మనసు తీవ్రంగా గాయపడిన వారుకూడా ఈ భగవత్ సేవ లేదా సంఘ సేవ అనే రంగాలలోకి దిగితే వారి మానసిక అశాంతి తొలగి స్వస్థత చేకూరడమే కాక ఆయా రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం కాదు. అది మనసును ఆత్మతో లయంచేసే ప్రక్రియ. ఈ రెండు రంగాలూ ఆధ్యాత్మికతకు బాగా ఊతమునిచ్చేవే.

సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తిని బట్టి అతనికి ఏమార్గంలో తరుణోపాయం చూపాలి అన్నది ఉంటుంది. ఒక మార్గం పూజలు, మంత్రోపాసనలు అయితే ఇక రెండవది మనలోని దుర్గుణాలను,అత్యాశను తగ్గించుకుంటు సంఘ సేవకు నడుంబిగించడము. ఈ రెండిటిలో ఏదైనా ఉత్తమమే. వీటిని మరొకరికి నేర్పడానికి మనకున్న అనుభవానికి తొడు వారికి పూర్తిగా సాయపడాలన్న ఆర్తి ఉండాలి.

 తప్పుదారిన వెళ్లబోవుచున్న మీస్నేహితునికి సరైన సమయంలో సరైనవిధంగా పరిష్కారాన్ని అందించ గలిగారా మీ ఆనందానికి అవధులు ఉండవు. అతడు పూర్తిగ తప్పుడు మార్గం పట్టాక(అంత్య దశలో) సలహా ఇవ్వడం - దానిని అతనిచే పాటింపచేయడం చేయాలంటే ఎంతో అనుభవం కావాలి. అదే మీకు విషయం తెలిసిన(ప్ర్రారంభ దశ) దగ్గరనుండి పురోహితాన్ని(చికిత్సను) మొదలు పెట్టారనుకోండి త్వరగా ఫలితాలు సాధించ గలరు.

నేను నా స్నేహితులతో తఱచు అనే వాడిని. మనకు బాగా దగ్గర స్నెహితులలో ఎవరైనా చెడు మార్గం పట్టి పాడై పోయారంటే, లేదా నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య వంటి వాటికి పాల్పడ్డారంటే దానికి మనము కూడా బాధ్యులమే అని. మనం అతను పాడైపోవడం చూస్తూ - మంచి ఏమిటో తెలిసి కూడా ఎటువంటి స్పందన చూపక పోబట్టే వాళ్లు ఆస్థితిలో ఉన్నారు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఎంత మొఱటు వ్యక్తిలోనైనా మార్పును తీసుకు రావచ్చు. అది నేను చెప్పే పురోహితం వల్ల సాధ్యమే. దీనికి అనుభవం కంటే ఆ తోటి వ్యక్తిపై మీకు కల ప్రేమ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

నేను ఓ పురోహితుడిగా నిలబడటానికి ఎంతో తపించాను. దానికి తగిన అర్హత పొందే క్రమంలో నన్ను నెనే మార్చుకున్నాను. ఎంతో ఆనందాన్ని నా సొంతం చేసుకున్నాను. ఓ పురోహితుడిగా నాకెదురైన ఏ సమస్యనూ నా వల్ల కాదని వదిలేయడం నాకు గుర్తులేదు. నా ప్రతి అడుగులోనూ ఎందరో గురువులు అదృశ్యరూపంలో నన్ను మున్ముందుకు నడిపించారు.వారందరికీ గురుదక్షిణగా నేనీ బ్లాగు ప్రారంభించాను.

8 వ్యాఖ్యలు:

 1. చక్కగా వ్రాశారు. పురోహితుడనే మాటకు సున్నితమైన, చక్కని వివరణ ఇది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నంస్తే శర్మ గారు, బహుకాల బ్లాగ్దర్శనం. పురోహితుడికి మీరిచ్చిన అర్థం బాగుంది.

  హిందూ శ్రాద్ధ కర్మలు గురించి తెలుసుకోవాలని వుంది. అవి ఎక్కడ గ్రంధస్తం చేయబడ్డాయి? కాపీలు ఎక్కడ దొరుకుతాయి? తెలియజేయగలరు. పురోహితులు వీలుకాని చోట, సంవత్సరీకాలు ఎలా చేయాలి కూడా ఓ టపాలో చెప్పండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించారు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. విజయ్ శర్మ గారు

  బాగుంది మీ వివరణ. చక్కని విషయాలు చాలా ఓపికగా వ్రాస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శర్మ గారూ బాగా చెప్పారు. ఇలాంటివి మరిన్ని వ్రాయాలి మీరు. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చాలా మంచి విషయాలను వ్రాశారండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. విజయ్ శర్మ గారు,
  పురోహితుని ధర్మం గురించి చక్కగా చెప్పారు.
  పాండవులకు ధౌమ్యుని పౌరోహిత్యం వలన చాలా మేలు కలిగింది.
  పురోహితుని వలన మంచి జరగాలంటే ముందు ఈ తరానికి పురోహితుని ఔన్నత్యాన్ని గురించి తెలియాలి.
  ఈ విషయం పురోహితులకీ, పురజనులకీ కూడా వర్తిస్తుంది.
  ఈ ఔన్నత్యాన్ని మీ వ్యాసాల్లో చక్కగా వివరిస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.