20, జులై 2011, బుధవారం

మంత్ర జప సాధన లో తలెత్తే కొన్ని సందేహాలు - సమాధానాలు

శర్మ గారికి నమస్కారములతో!


     ఒక్కొక్క సారి గాయత్రీ జపము లో కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేసుకోవడం కుదురుట లేదు. మనస్స్సు కుదురు గా ఉంచాలంటే ఏమి చేయాలి? ఈ ధ్యానములో, గాయత్రీ మాతను ఊహ చేసుకొని జపం చేయ వచ్చా? లేక ఇతర దేవత లేదా గురు స్వరూపములను ఊహ చేయవచ్చా? ఇది కూడా మనసు ఎక్కువ సేపు నిలబడదు. కొంత సేపు ఒక దేవత, తరువాత కొంత సేపు ఇంకొక దేవత లేదా గురు స్వరూపము  తో జపము చేయవచ్చా? అసలు గాయత్రీ మంత్రం ఎలా చేయాలి? 

  మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

                                      

"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "   పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది  మంత్రము అన్నారు.  గాయత్రీ లేదా మరో దేవతా  జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. వీటిగురించి మరో టపాలో తెలియజేస్తాను. ) ప్రస్థుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.

౧) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం.   ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో  ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు.  ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సంతలు  చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం  బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా  కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు  రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ  మెట్టుకి వెళ్లాలి. 

౨) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి .   ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.

౩) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం.  పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి. ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా  మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.

అ) మరో ఆలోచనలో పడడం
ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. ( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి )  ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.


ఆ) మనసు తొందర పడడం :    నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు  లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం".  అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.

పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి  త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే
కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.

౪) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి.  కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది.  ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి. అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి.  వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు. వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.

మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.


పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.

౧) మొదట గురువు వద్ద  మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.

౨) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి.  క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.

౩) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత  స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.

ఇంకనూ అనేక విషయాలు ఉన్నవి. కానీ కొన్ని మాత్రమే తెలపగలం. కొన్ని ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!

13 వ్యాఖ్యలు:

 1. చాలాచక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "అధమాధమం" అనేది కొంచెం నీచార్ధము సూచిస్తున్నది అనుకుంటాను
  "చిట్టచివరి విధానము" అంటే బాగుంటుందేమో. ప్రధామంలో ఇలా చేసి ముందుకు పోవచ్చు కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మంచి విషయాలు చక్కగా విపులంగా రాశారు.
  "సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు"
  ఆణిముత్యం లాంటి మాట. ఇటీవలనే ఒక పాశ్చాత్య సాధకుని బ్లాగులో చదివాను - టూకీగా సారాంశం ఇది: "ఏదైనా ఆధ్యాత్మిక సాధన ఒక మండలం రోజులు చేద్దామని సంకల్పించామో లేదో, ఇక అక్కణ్ణించీ అడ్డంకులు మొదలవుతాయి. సరిగ్గా మనం జపం చేసుకుందాం అనుకునే సమయానికే ఏదో ఒక బయటి వత్తిడి తగలడం మొదలవుతుంది. ఇట్లాంటి అడ్డంకులు వస్తున్నాయీ అంటే అర్ధం మన సంకల్పం సరైనదనే. ఆయా శక్తులు మన సంకల్పబలాన్ని పరీక్షిస్తున్నాయన్న మాట, చేసుకున్న సంకల్పాన్ని విడిచిపెట్టకుండా నిలబడతామా లేదా అని. ఏ అడ్డంకీ రాకపోతే విచారించాలి గాని, అడ్డంకులు వచ్చాయీ అంటే, మన సంకల్పం సరైనదనే అర్ధం."
  ఈ వాక్యాలు నాకు చాలా నచ్చాయి. మీరు పైన చెప్పింది కూడా ఇంచుమించు అదే బాఒధిస్తున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ "అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషయం మీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత స్థిరమైన సంకల్పం ఉన్నట్లు." అనే మాటలలో నా భావనకూడా అదే!

   తొలగించు
 4. చాలా బాగా చెప్పారు. రోజువారీ జీవనయానానికైనా, అధ్యాత్మిక ప్రగతికైనా, సాధనని మించినది లేదు. "సాధనమున పనులు సమకూరు ధరలోన". సంకల్పబలం గట్టిదైతే ఆరంభంలో ఆవాంతరాలెదురైనా, సాధించాలన్నా తపనా పెరుగుతుంది, సాధనా అలవడుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలాచక్కని వివరణ ఇచ్చారు. ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. nenu oka maasa patrikalo chadivaanu. Bramahanulu kaani vaaru, upanayanam avani vaaru, gayatri matram japincha koodadu ani. Nenu Nithya pooja chestanu, andhulo gayatri manram kooda vundhi.. daya chesi nenu japincha vacho ledo salaha ivvagalaru. nenu bramhana kulam lo puttaledu, naaku Ee janmaki upanayanam cheyinchukone arhata leda ?.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీరు చదివినది నిజమే. ఉపనయన సంస్కారం లేనివారు వేదమంత్రాలు చదవకూడదు అని శాస్త్రం చెబుతోంది. కనుక వేదం చదవడానికి కొన్ని అర్హతలు నిర్ణయించారు. కానీ ఒక్కో సందర్భంలో మనకు కల ఆర్తి కూడా మనకు లేని అర్హతను సంపాదించి పెడుతుంది. అందుకు ఒక గురువును పరిపూర్ణంగా సేవించండి. ఆగురువు అనుగ్రహిస్తే మీకు కావలసినది లభిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శూద్రులు అమంత్రకంగా ఉదయం భానుడికి మూడు దోసిళ్ళ నీళ్ళు తర్పణ చేస్తే చాలు అనీ
  శూద్రులు, స్త్రీలు మంత్ర భాగాలు చదువ కూడదని అలా చేస్తే శాస్త్ర సమ్మతం కాదు కనుక అవిధినాక్రుతం అవిదినాకృతం అకృతం అని కావున కేవలం శూద్రులు, స్త్రీలు నామ జపం మాత్రమే చేయాలని అందుకు శూద్ర యోని నందు జన్మించిన విదురుడే ప్రమాణం అని (విదురునకు నిత్యానుష్టానం లేదు యజ్ఞోపవీతం లేదు భారతంలో ), పెద్దలు చెప్పగా విన్నాను
  మరి ఇప్పుడు చాల మంది విష్ణు సహస్రం, లలితా సహస్రం, ఆదిత్య హృదయం, మొ. నవి పారాయణం చేస్తున్నారు ఇవి మంత్ర భాగాలు కాదా?
  స్తోత్రాలు మననం చేయవచ్చా స్త్రీలు శూద్రులు కూడా?
  తెలుపగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వేద మంత్రములు కావు అవి. ఫలితాలను ఇవ్వడంలో వేదమంత్ర మంత స్థాయిలో ఉన్నవి కనుక అంతటి ఆదరం కలిగినది వాటికి. కానీ గురువు వద్ద ఉపదేశం తీసుకుని సాధన చేయవలసిన పద్ధతి తెలిసుకుని చేస్తే సత్ఫలితాలను ఇస్తాయి. స్త్రోత్రములు అందరూ పారాయణ చేయవచ్చు. ఇప్పటి రోజులలో స్పష్టంగా చదవడం కూడా రాకుండా వేల సార్లు పారాయణలు చేస్తున్నారు. అది చాలా అనర్థాలను కలిగిస్తుంది.

   తొలగించు
  2. కానీ శర్మ గారు స్త్రోత్రములు మంత్ర ములకు ష్దంగముల లొనివి కదా..మరి ........................!

   తొలగించు
 9. ఏమి చదవకుండా ఖాళీగా కూచొని కంటే ఏదొ ఒకటి మొదలు పెట్టడం మంచిది.
  మొదలు పెట్టిన తర్వాత తప్పులు సవరించుకొంటు ముందుకు పొవడం ఇంకా మంచిది.

  చెల్లూరి సుబ్రహ్మణ్య శర్మ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నేను బ్రాహ్మణుడను. కులరీత్యా వైద్యుడను. నేను రుద్రములో నమకము ఒక రోజు మరియు చమకము మరు నాడు చదువుతాను. youtube లో వింటూ అనుసరిస్తాను. నాకు గురువు వద్ద అభ్యసించే సమయము లేదు. ఇలా చెయ్యడము సరి అయినదేనా. దయ చేసి సెలవివ్వగారు
  నరసింహ స్వరూప్

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.