26, జనవరి 2013, శనివారం

పూజల పేరుతో ద్రవ్యాన్ని వృథా చేస్తున్నామా? - 2


మొదటి భాగం ఇక్కడ చదవండి


       మనం కొనుక్కునే బ్రాండెడ్ డ్రస్ ల ఖర్చు తగ్గించి లేనివారికి సహాయపడదామనే ఆలోచన మనకు రాదు. . పట్టు చీర పదివేలు పెట్టి కొని ఎన్నిసార్లు కడుతున్నారు చెప్పండిరెండు ఫంక్షన్ లకు వేసుకు వెళ్లగానే అది చాలా ఫొటోలలో వచ్చేసిందనో మరోటనో దానిమీదనుండి మనసు మళ్లుతుంది. మళ్లీ  వచ్చే పేరంటానికి వేరే చీరకావాలి.  
       ఇంటిలో విలాసాలను తగ్గించి నలుగురికి సేవచేద్దామనే ఆలోచనరాదు. టీవీ ఎవరు చూసినా చూడకపోయినా వాగుతూనే ఉండాలి.   ఒకళ్ళకి నచ్చిన ప్రోగ్రాం ఒకరికి నచ్చదు. కనుక బెడ్ రూమ్ లో ఒకటి హాలు లో ఒకటి . కంప్యూటర్ ఆన్ చేసి ఆఫ్ చెయ్యాలంటే బద్దకం. అందువలన అది ఆన్ లోనే ఉండాలి. నేను చాట్ చేసుకోడానికే సమయం సరిపోదు. ఇక చెల్లెలో అక్కో పోటీకివచ్చి కావాలంటె ఇవ్వలేను. అందుకే నాన్నకోడెస్క్ టాప్, అబ్బాయికో లాప్ టాప్, అమ్మాయికో టాబ్లెట్. మాట్లాడే ఫోన్ బిల్లు వేలు చేరుతున్నా పట్టించుకోం. ఆంగ్ల సంవత్సరాదికి ఇచ్చే పార్టీ అదిరిపోవాల్సిందే! సినిమా బ్లాక్ లోనైన సరే మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే! 
     ఇక పెళ్ళిళ్లు, పేరంటాల పేరుతో తమదర్పాన్ని చాటుకోవడం కోసం పడే ఆరాటం ఖర్చు కోట్లు చేరుతుంది. ఈ పూట వండినది మరొ పూట వండకుండా పూటకో వందరకాల వంటకాలు. అందరూ డైటింగ్ పేరుతో వాసను చూసి వెళ్లే వాళ్లే. ముట్టుకునే వాడు ఉండడు. మిగిలినవన్నీ మురిక్కాలవలో పోస్తారు రెండో రోజు.  ఇలా చెప్పుకుంటూ పోతే నిత్య జీవనంలోనే వృథా చేసే సందర్భాలు కోకొల్లలు. వీటిలో ఏఒక్క సందర్భంలోనూ అయ్యో వృథాచేస్తున్నామే అన్న ఆలోచనరాదు. అవన్నీ ఆలోచిస్తూకూర్చుంటే కార్యక్రమం ఆస్వాదించలేం మరి. 
     కానీ భగవంతునికి కాసిని పాలు పొయ్యాలనే టప్పటికి మాత్రం అయ్యో ఇవన్నీ అనవసరంగా వృథా అయిపోతున్నాయేమో అనే ఆలోచన పెరిగిపోతుంది. నిజంగా సంఘ సేవలో మునిగి తేలుతున్నవారికి రాదు ఈ అనుమానం. ఎందుకంటె వారికి తెలుసు పరులకు సహాయపడినప్పుడు కలిగే ఆనందానికి, భగవదారాదనలో కలిగే ఆనందానికీ తేడాలేదని. ఇటు పూజలు చేయిస్తున్నవారికీ కలుగదు ఈ అనుమానం. ఎందుకంటే దేనికి ఎంత ఎప్పుడు ఎలా కేటాయించాలొ వారికి తెలుసుకనుక. ఇటువంటి అనుమానాలన్నీ ప్రక్కన నుంచుని చూడడానికి వచ్చే వారికే! ఏదేవాలయానికో వెళతాం. అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది.  పాలతో స్వామికి అభిషేకిస్తూ ఉంటారు.  మనసు నిల్పి ఆస్వాదించ గలిగితే నిజానికి అది ఓ అద్భుతఘట్టం. మనసు నిలుస్తుందా!? అలా సజావుగా సాగనిస్తే  దానిని కోతితో ఎందుకు పోలుస్తారు? ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తుంది. అరెరే ఇన్ని పాలు వృథాగా నేలపాలవుతున్నాయే! ఏ కాసిని పాలు పోసి మిగతావి మిగతావి పేదలకు పంచితే వారి కడుపు నిండుతుంది కదా?” అని.రోజూ అభిషేకం చేస్తున్నా మీరు కేటాయించే పాలు ఎన్ని. మహా అయితే రోజుకు ఒకలీటరు. కానీ ఇక్కడ వచ్చే అనుమానమేమంటే " ఒక లీటరు అయితే ఫర్వాలేదు. కానీ లీటర్లు లీటర్లు పాలు అలా వృథా అయిపోతున్నాయి " అని. మీ ఇంటిలో అభిషేకం చేస్తే ఒక లీటరు. అదే పదిమంది కలిసి ఒక ఆలయంలో చేస్తే పది లీటర్లు. వంద మంది చేరితే వందలీటర్లు. మీరు చూసేది ఒకే దేవాలయంలోని దేమునికి ఒకే రోజు వందలీటర్ల పాలు పోయడం.  ఒక వ్యక్తి హోమం చేస్తే ఒక లీటరు నెయ్యి ఖర్చు అవ్వవచ్చు. అదే వందమంది చేస్తె వంద లీటర్లు అవుతుంది. . దేవాలయాలు శక్తికేంద్రాలు. ఒక దేవాలయంలో జరిగే వైదిక క్రతువులను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ఆదేవాలయంలోని శక్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. ఆశక్తి ముందుగా చుట్టుప్రక్కల ప్రాంతాలను, శక్తి పెరిగే కొద్దీ ఆనగరాన్ని, రాజ్యాన్నీ రక్షణ నీయగలిగే స్థితిని పొందుతుంది. కనుక  శక్తి ప్రసారం చేయడంలో అంతటి ఆవశ్యకత కలిగిన దేవాలయాలలో ఎంత ద్రవ్యాన్ని వినియోగించినా ఇంకా తక్కువే అవుతుంది.  భగవంతునికి భక్తితో సమర్పించే ప్రతి ద్రవ్యం సద్వినియోగం అవుతున్నది అని కొందరు అనుకుంటున్నారు.  వృథా అవుతున్నది  కొందరు అనుకుంటున్నారు.


ఇక్కడ వచ్చే మరో ప్రశ్న ఏమిటంటే భగవంతునికి భక్తితో సమర్పించే నీటి చుక్కకూడా ఫలితాన్ని ఇస్తున్నది అంటారు కదా! మరి ఈ పాలు, కొబ్బరికాయలు మొదలైనవన్నీ ఎందుకు? అని...

   ఒక సారి ఆలోచించండి. మనం ఏమితిన్నా ఆకలితీరుతుంది కదా. అలాంటప్పుడు ఈరోజు పప్పు, రేపు కూర, మరో రోజు వేపుడు ఎందుకు? ఉత్తి అన్నం ఉడికించుకు తింటే చాలదా? మనకడుపు చల్లబడడానికే ఇన్ని రకాలు కావల్సి ఉంటి లోకాలన్నీ చల్లబడాలని చేసే క్రతువులుక ఎన్ని ఇస్తే మాత్రం సరిపోతుంది చెప్పండి? అంతెందుకు... మనం బస్టాండ్ లో నుంచుని ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలేస్తోంది సారి ఏమైనాఇవ్వండి అంటాడు.మనకు డబ్బులు ఇవ్వడం కన్నా తినేది ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది అనుకోండి. ప్రక్కనే ఉన్న హొటలు కు తీసుకు వెళతాం. అక్కడ ఇడ్లి, వడ, దోశ, ఉప్మా, భోజనం ఏదైనా ఇరవై రూపాయలే అనుకోండి అప్పుడు మనకిష్టమొచ్చింది ఇప్పిస్తామాలేక అతని ఇష్టమేంటో కనుక్కుంటామా? ఏది పెట్టినా అతని ఆకలి తీరుతుంది. కానీ నీకేంకావాలొ తీసుకోవోయ్ అంటాం. మరి ఒక బిచ్చగాడికి అన్నం పెడితేనే అంత ఉదారంగా వ్యవహరించే మనం, సర్వేశ్వరుని సేవచేసే అవకాశం వస్తే పాలుపొయ్యాలా? నీళ్లుపొయ్యాలా? అని ఆలోచిస్తామా!? ఎలా చేస్తే అతనికి ప్రీతికలుగుతుందని చెప్తారో అలానే చేస్తాం? అలానే కొందరు తమ కష్టాలు తీర్చుకోవాలని పూజలుచేస్తుంటారు. ఇలా కోరికలు కల వారు కొన్ని ప్రత్యేక వస్తువులతో స్వామిని సేవించవలసి ఉంటుంది.   
 నేడు కలిమాయ వలన ఆయా సందర్భాలలో చాలా  పదార్థాలను వృధా చెస్తున్నామనే చెప్పాలి.  కానీ పూజలకై ఖర్చు చేసే ద్రవ్యాన్ని మాత్రమే వృథా అని వాపోవడం కలి ప్రభావమే!
భక్తితో చేసే పూజమాత్రమే సత్ఫలితాన్నిస్తుంది. ఆడంబరంకోసం చేసే దయితే ఒక లీటరైనా, వెయ్యి లీటర్లైనా అది వినాశనాన్నే కలుగ జేస్తుంది. ఒక వేళ మీపూజలో శ్రద్ధకనుక ఉండి భగవంతుని ప్రీతికొరకు, నామనసారా స్వామిని సేవిస్తాను అని తలచి పూజిస్తే వెయ్యిలీటర్లతో చేసినా( ఒక వ్యక్తి అంత ద్రవ్యం వాడడం సరికాదు. తాను పెంచే లేదా తన అధీనంలో పెంచే ఆవు తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను అభిషేకిస్తే చాలు. ఒకవేళ అతనికి ఓ వంద ఆవులు ఉండి వచ్చిన పాలన్నీ అభిషేకానికి వినియోగిద్దాము అనుకుంటే ) అది తప్పుకాదు. అది స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.  అభిషేకానంతరం ఆప్రసాదం పేదవారికి పంచడం చాలా మంచి పద్ధతి. కానీ అలాకాక తీర్థం నేలమీద పారడం వలన ఆతీర్థం వృథా అయినట్లుభావించడం సబబుకాదు. అదికూడా సద్వినియోగ పడినట్లే!
కేవలం మన పొట్టకూటికోసమో, మరోదానికో వినియోగించిన ద్రవ్యం మాత్రమే సద్వినియోగమైనట్లు భావిచడం సరికాదు. భగవంతునికి అర్పించే ఏ ద్రవ్యమూ వృథాకాదు. భగవన్నిర్మాల్యం ప్రకృతిలో కలవడం ద్వారా అందరికీ అన్ని పూటలా కావాల్సిన ఆహారం దొరుకుతోంది. భగీరథుని కోరిక మేరకు శివుని శరీరాన్ని అభిషేకించిన గంగమ్మ త్రిపథగగా మారి సగరులకు తర్పణాలివ్వడానికి పనికి వచ్చినప్పటికీ పెద్ద నదిగా మారి ఇప్పటికీ ఎందుకు భూమి మీద పారుతున్నది? ఆకాశంలో ఉండవలసిన గంగ, దేవతల అవసరాలకు వాడవలసి వచ్చే గంగా జలం భూమిమీద ఉండడం వ్యర్థం ఎలాకాదో ఇదీ అంతే. అభిషేక జలం నేల మీద పడి చుట్టూ ఉండే భూమిని పవిత్రంచేస్తుంది. ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ ఆధ్యాత్మిక తరంగాలతో ప్రభావితం చేస్తుంది. ఈ ద్రవ్యాలు పరమాత్మ శరీరాన్ని తగిలి వచ్చినవి అతి శక్తి వంతమైనవి. అవి ఆనేలలో ఇంకడం వల్ల ఆ ప్రదేశంలో శక్తి తరంగాలు పెరుగుతూ ఉంటాయి. ఇది వ్యర్థం అన్న మాటే లేదు. వ్యర్థం అన్నది ఇక్కడ అన్వయమూ అవ్వదు. ఒక మనిషికో మరోదానికి ఇస్తే వ్యర్థం అయ్యిందనుక్కోవచ్చేమోకానీ, పరమాత్మకి సమర్పించేసాక వ్యర్థమన్న మాటకి తావేది? పరమాత్మకి సమర్పించినది ప్రకృతిలో కలుస్తున్నది. దాని వల్ల ప్రకృతి పరవశించి చల్లగా చూస్తున్నది, పంటలిస్తున్నది... వ్యర్థమౌతున్నదేమో అన్న భావన వదిలి చక్కగా అభిషేకాదులలో పాల్గొని ఆధ్యాత్మికోన్నతిని, భగవదనుగ్రహాన్ని పెంపొందించుకొనగలరు.

2 వ్యాఖ్యలు:

  1. దేవుడు మనకి ఇచ్చే దాని ముందు మనం ఆయనకి సమర్పించేది ఎంత ? ఆయన ఇచ్చిన దానిని తిరిగి ఆయనకే సమర్పించి తెగ దానం చేసేసాము వృధా చేసేసాము అని మనల్ని మనమే మభ్య పెట్టుకుంటాము. మంచి విషయం రాసారు రాజ శేఖర్ గారు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఎంతో బాగా చెప్పినారండి. వృథా అయిపోతుంది, పేదపిల్లలకు పాలు పంచమని చెప్పటమే కాని పెళ్ళిళ్ళల్లో విందుల్లో అలవాట్లలో విద్యుత్, బట్టల వాడకంలో ఇంతమంది చేస్తున్న వృథా ఖర్చు ఎందుకని అనరు, అక్కడ పేదపిల్లలు జ్ఞాపకం రారు. భక్తులు చేసేది మాత్రమే మూఢనమ్మకంగా కనపడుతుంది కొందరికి.
    విషయాలన్నీ ఘంటాపథంగా చెప్పినారు.
    వీలైనప్పుడల్లా వ్రాస్తూఉండగలరు. మీలాంటి వారి అమూల్యమైన బోధలు అగమ్యగోచరంగా ప్రయాణిస్తున్న నేటి సమాజానికి ఎంతో ముఖ్యం.

    ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.