ఒకానొక గృహస్థునకు ఒక్కతే కుమార్తె. ఆమెకు
బాల్యమందే వైధవ్యముండునని జ్యోతిష్కులు తెలుపుటచేత, తండ్రి ఎందరెందరో ధర్మ
శాస్త్రవేత్తలను సంప్రదించి తనకూతురుకా గండం తప్పే ఉపాయాన్ని చెప్పమని
ప్రార్థించాడు. ఆపండితులు అనేక గ్రంథాలను పరిశీలించి చివరగా ఆబాలిక చేత తులసీవ్రతాన్ని
చేయించమని చెప్పారు. ఆమె ఆవిధంగా తులసీవ్రతాన్ని చేయుటవలన జాతక సంబంధమైన వైధవ్య
దొషాలు తొలగి దీర్ఘ సౌభాగ్యవతిగా జీవించినది. కనుక అట్టి మహత్తర వ్రతాన్ని
నాటినుండి నేటి వరకూ ఎందరో ప్రతివ్రతలు ఆచరిస్తూ దీర్ఘ
సౌభాగ్యాన్ని,పుత్రపౌత్రులను పొంది సుఖజీవినం గడుపుతున్నారు.
వ్రతవిధానం
:
స్త్రీలు ప్రతీరోజూ ఉదయం
స్నానంచేసి, శుచి శుభ్రతలు గల ( మడి ) వస్త్రాన్ని ధరించి, తులసికోటలో కాసిన్ని
నీళ్లు పోసి, ఆనీళ్లు శిరసున చల్లుకోవాలి. పసుపు,కుంకుమ,గంధం మనోహరాలైన పుష్పాలతో
తులసీ దేవిని పూజించాలి. ధూపం,దీపం వెలిగించి తులసికి నైవేద్యం సమర్పించాలి.
హరతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి.
తులసీ శ్రీ మహాలక్ష్మీః
విద్యావిద్యా యశస్వినీ|
ధర్మా దర్మాసనా దేవీ
దేవదేవ మనః ప్రియా||
లక్ష్మీ ప్రియసఖీ దేవీ
ద్యౌర్భూమిః అచలా చలా|
తులసీ భూర్మహాలక్ష్మీః
పద్మినీ శ్రీర్ హరి ప్రియా||
తులసీ శ్రీ సఖీ శుభే పాపహారిణి పుణ్యదే ||
నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే ||
అనే నామాలను స్మరిస్తూ మూడుకు తక్కువకాకుండా శక్తి
ననుసరించి ప్రదక్షిణలు చెయ్యాలి. తరువాత తులసికి పెట్టిన పూలలోనుండి ఒకపువ్వు
తీసుకుని తలలో పెట్టుకోవాలి. తల్లికి మౌనంగా మనసులోని కోర్కెను నివేదించాలి.

నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
ఒక సంవత్సరం పాటు పైవిధంగా తులసిని అర్చించాలి.
సంవత్సరాంతాన వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఉద్యాపన చేసుకోవాలి. ( తరువాత
జీవించినంత కాలం తులసిని పూజించడం ఆచారంగా వస్తున్నది )
ఉద్యాపనం
: కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీధాత్రీ సమేతంగా లక్ష్మీ
నారాయణుల ప్రతిమలను తులసికోట వద్ద ఉంచి షోడశోపచారాలతో పూజించాలి. పరమాన్నమూ మొదలైన
మధుర పదార్థాలతో పాటు, వ్రతం పట్టిన వారు తమ కిష్టమైన శాఖాహార పదార్థాలనుకూడా
నివేదించాలి. ఆఖరున ఆవునేతితో ఒకదీపం పెట్టి, స్వయంపాకంతో సహా దక్షణ తాంబూలములతో
ఒక బ్రాహ్మణునకు వాయనదానంగా ఇవ్వాలి.
గమనిక: స్త్రీలు ఎన్నడూ
తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని
అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో
ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు.
ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ,
ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.
తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా
పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం
నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక,
తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.
చాలా చక్కగా వివరించారు
రిప్లయితొలగించండిజైశ్రీరాం