17, అక్టోబర్ 2015, శనివారం

కార్తీకమాసమున మహన్యాసపూర్వక శివాభిషేకములు

శ్లో||గమాగమస్థం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాప హారమ్|
పశ్యామితే సర్వజనాన్తరస్థం నమామి హంసం పరమాత్మరూపమ్||

పరమేశ్వరుడు స్వశక్తి సమేతుడు. సర్వఙ్ఞత్వము, సర్వాత్మకత్వము, సర్వాంతర్యామిత్వము మొదలైన మహాలక్షణములు కలిగినవాడు. ఆయన తన లీలావిలాసార్థం బ్రహ్మ, విష్ణువులను సృజించెను. బ్రహ్మయొక్క ఫాలభాగమునుండి తానుద్భివించి రుద్రుడనబడెను. హరి బ్రహ్మలవలె రుద్రుడు మాయావశుడుకాడు. ఇట్టిరుద్రుడు లింగరుపమున జనులందరిచే పూజలందుకొనుచుండును. అట్టి రుద్రుని గూర్చి జప, తర్పణ, హోమ, అభిషేకము లొనరించుటకై కృష్ణయజుర్వేదమున “రుద్రాధ్యాయం” అని కలదు. నమకము, చమకము అను రెండిటిని కలిపి రుద్రాధ్యాయమందురు. సర్వ ఉపనిషత్తుల సారమే ఈరుద్రాధ్యాయమనీ, వేదములో పరమ ఉత్కృష్టమైన భాగమనియు ఈ రుద్రాధ్యాయమును అనేకమంది ఋషులు ప్రవచించిరి. భోగములు కోరువారికి గానీ, మోక్షమును కోరువారికి గానీ, పాప ప్రాయశ్చిత్తము కోరువారికి గానీ రుద్రోపనిషత్తు కంటే అన్య శరణ్యములేదు. పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాశుపతదీక్షను బూని, శరీరమంతా భస్మమును ధరించి తదేక దీక్షగా రుద్రాధ్యాయమును జపించెనని కూర్మపురాణమున గలదు. ఈరుద్రాధ్యాయము నందునే “నమః శివాయ” అను పంచాక్షరీ మంత్రరాజము కలదు. 

శ్లో||నమకం చమకం చైవ పౌరుషం సూక్త మేవచ| నిత్యం త్రయం ప్రయుంజానో బ్రహ్మలోకే మహీయతే||

నమక చమక పురుష సూక్తములను నిత్యమును పారాయణము చేయువాడు బ్రహ్మలోకమునొందును. ఒకసారి చదివినంతనే పాపరాశిని దగ్ధముచేయు నటువంటి పరమ పవిత్రమైన రుద్రాధ్యాయము ను నెలరోజుల పాటు రోజుకు పదకొండు సార్లు జపిస్తూ లింగరూపుడైన పరమశివునికి పంచామృత అభిషేకములు నిర్వహించినచో ఎంతవిశేషమో కదా! 

నారుద్రోరుద్రమర్చయేత్” రుద్రుడు కానటివంటి వాడు రుద్రుని అర్చించరాదు అని ఆర్యోక్తి. విభూతిని, రుద్రాక్షలు, శిఖ ధరించుటచే రుద్ర ప్రతిరూపము కలుగునే కాని, మనో మాలిన్యం తొలగదు కదా!  మరి రుద్రుడగుట ఎట్లు అనగా! మహన్యాస మంత్రములచే భక్తుడు తన దేహములోని ప్రతీ అంగములో, మనసులో ఆరుద్రుని ఆవాహన చేసుకొన వలెనని బోధాయనాది రుషులు మార్గము చూపిరి. ఆయామంత్రములచే తాను రుద్రుడుగా మారి, రుద్రునికి అభిషేకం నిర్వహించాలి.

శ్లో|| దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః| త్యజేదఙ్ఞాన నిర్మాల్యం సో2హంభావేన పూజయేత్||

దేహమే దేవాలయము, అందుండు జీవుడే సనాతనుడైన పరమేశ్వరుడు. మనలోని అఙ్ఞానమనెడి నిర్మాల్యమును తొలగించినచో కలిగెడి నీవే నేను ( సో2హం) అనేభావన కలుగుతుంది. అటువంటి భావనతో రుద్రుని పూజించవలెను. ఇక్కడ ఒక విశేషం గమనించాలి. తాను రుద్రుడై రుద్రుని అభిషేకం చేయడమంటే తనకు తానే అభిషేకం చేసుకోవడం. బాహ్యంలో ఒక శివలింగాని జరుపుతున్న అభిషేకమైనా అది మన అంతరంగాన్ని శుద్ధిచేసే మహాశక్తి సమన్వితమైనది. మన మనస్సులలోని మాలిన్యాన్ని తొలగించి సర్వశక్తి సమన్వితులుగా మార్చగలిగినది ఈ రుద్రాభిషేకం.

శ్లో|| న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్| న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్||

కార్తీక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసము లో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

      అటువంటి కార్తీక మాసము పాడ్యమి (12-11-2015) మొదలు, అమావాస్య (11-12-2015) వరకు ముప్పైరోజులు "వైదికమిత్ర కార్యాలము" (వనస్థలిపురం, హైదరాబాద్ లోని మాగృహము )నందు ప్రతిరోజూ ఉ.6-00 గం.ల నుండి 10-00 గం.ల వరకు “మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము” లు నిర్వహించుటకు సంకల్పించితిమి. కావున భక్తులందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరచుకొనగలరు.   ఆసక్తి ఉన్నవారు రు.1516/- చెల్లించినచో వారి గోత్రనామములతో కార్తీకమాసం నెలరోజులు అభిషేకములు జరుగును.  

ప్రస్థుతం అర్థాష్ణమ శని నడుస్తున్న సింహరాశివారికి, అష్టమ శని నడుస్తున్న మేషరాశివారికి,  ఏలినాటి శని నడుస్తున్న తుల, వృశ్చిక, ధనూ రాశులవారికి వారి కోరికపై  ప్రతిశనివారం ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించబడును. కుజ దోష నివృత్తికొరకు, వివాహప్రతిబంధకములు తొలగి అనుకూల కళత్రము ప్రాప్తించుటకు, దారిద్ర నాశనము కొఱకు, విద్యా ఉద్యోగ అభివృద్ధికొఱకు భక్తులకోరికపై ప్రత్యేక పాశుపత రుద్రాభిషేకములు నిర్వహించబడును. 


భక్తుల కోరికపై ఈకార్తీకమాసములో గోదానము, భూదానము, వస్త్ర దానము, అన్నదానము, దీప దానము మొదలైన వాటికొఱకు ఏర్పాట్లు చేయబడును. 

గమనిక : నేను కేవలం ధనం కోసం మాత్రమే ఈ కార్యం చెయ్యడంలేదు. అలా ధనమే ప్రథానమైతే ఇలా సామూహికంగా చేయనవసరం లేదు. ఎవరో ఒకరు నా మీద అభిమానం కలిగి, ధన సమృద్ధి కలిగిన వారికి చెప్పి ఈ నెలరోజులూ నా భుక్తి నేను చూసుకుని ఉండవచ్చు. కానీ అలా చేస్తే ఎవరో ఒకరికి మాత్రం శుభం చేకూర్చిన వాడిని అవుతాను. అదే సామూహికంగా చేసి అందరినీ భాగస్వాములు కమ్మని ప్రోత్సహిస్తే, చేసిన నాకు, భాగస్వాములైన వారందరికీ శుభం కలుగుతుంది. ఈ అభిషేకాదులు నెలరోజులు జరిపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకరోజుకు సామాగ్రి ఖర్చు కనీసం 1500/-అవుతుంది. మధ్యలో ఒకరోజు రుద్రహోమము, అన్నదానము నిర్వహిస్తాము. వీటన్నిటినీ ఒక్కరుగా చేయించలేని వారు చాలామంది ఉంటారు. వారందరికీ ఇది చక్కటి అవకాశం అవుతుందికదా! మంచి పనిలో నలుగురినీ కలుపుకుని పోవాలి అన్న ఉద్దేశంతోనే అందరికీ తెలపడమైనదిమీగోత్రనామములు తెలుపుటకు, దక్షిణ చెల్లించవలసిన ఎకౌంట్ వివరముల కొఱకు rajasekharuni.vijay@gmail.com కు మెయిల్ చెయ్యగలరు.

భగవత్సేవకుడు
శ్రీ రాజశేఖరుని విజయ్ శర్మ
సెల్ నెం : 90005325633 వ్యాఖ్యలు:

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.