23, అక్టోబర్ 2009, శుక్రవారం

ఆస్తిక - నాస్తిక వాదన

ఈ టపా కాస్త ఆలస్యంగా రాద్దామనుకున్నాను. కానీ ఇక్కడ ఇంతకు ముందు రాసిన టపా లోని ప్రశ్నలు అప్పటి దాకా ఆగనిచ్చే విధంగా లేవు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేక వారం తరువాత రాద్దామనుకున్న ఈ టపా ఇప్పుడే మీముందుంచుతున్నాను.


దేముడిని నమ్మి రోజూ పూజలూ, ప్రార్థనలూ చేస్తూ ఉండే వారు ఆస్తికులు. దేముడు లేడని నమ్మి ఎటువంటి పూజలూ, ప్రార్థనలూ చేయని వారు నాస్తికులు. కానీ నేను తెలుసుకున్నది ఏమంటే ఈ ఇరు వర్గాల వారూ భగవంతుని కృపకు పాతృలవుతున్నారని.

అయితే ఆస్తికుల దృష్టిలో నాస్తికుల గురించి ఇంకా చాలా అభిప్రాయాలున్నాయి. ఏమనంటే నాస్తికులు భగవంతుని కృపకు పాతృలు కాలేరని, అందుకు కారణం వారికి ఒక నీతి నియమము లేకపోవడమేనని, ఇటువంటి వారు జాతికే భ్రష్టత తెస్తారనీ ఇలా చాలా రకాల అభిప్రాయాలు నాకు ఆస్తికులలో కనిపించాయి. ఇది నేను సమ్మతించలేను. ఎందువలనంటే భగవంతుని నమ్మే చాలా మందిలో కూడా అనేక దురలవాట్లు, వ్యసనాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసిన ఓ భక్తుడు ఖూనీ చేసి జైలుకెళ్లి వచ్చాడు. కానీ అతను ప్రతిరోజూ శివ పూజచేస్తాడు. రోజూ దేవతార్చన చేస్తూ కన్న తల్లిని తిట్టే, స్త్రీని మితిమీరిన కామంతో చూసే ఎంతో మందిని నేను చూశాను.

మరి అటువంటప్పుడు ఆస్తికులు కూడా భగవంతుని కృపను పొందలేరు అని అనడం సముచితమేగా...? కాదు. ఎందువల్లనంటే ఎవరో ఒక్కరు తప్పు చేశారని ఒక వర్గం మొత్తాన్నీ తప్పు పట్టలేము కనుక. ఇదే కారణంచేత నేను నాస్తికులను కూడా తప్పు పట్ట వద్దు అంటున్నాను. నాస్తికులైనా, ఆస్తికులైనా తప్పుదారి పట్టక, ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్న వారైతే వారికి తప్పక సత్యం బోధ పడుతుంది.

మనం నేడు తినే తిండీ, త్రాగే నీరు, పీల్చే గాలీ ప్రతీదీ కలుషితమైనట్లే మన భావ సంపదకూడా కలుషిత మయంగానే ఉంది. అదే విధంగా నేటి మన ఆస్తిక, నాస్తిక జనులు కూడా కలుషితమైన భావాలతో ఉన్నారు.


అసలు భగవంతుడు ఎవరు? అతనికృపకు పాతృలము ఎలా అవుతాము?

అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు నాకు మన మతము, ఇందు పొందు పరచబడిన క్రమబద్ధమైన విధానాలూ ఒక మార్గంలా మాత్రమే అనిపిస్తాయి. అలాగే ఇతర మతాల మార్గాలు కూడా.

శ్లో.. దేహో దేవాలయహ్ ప్రోక్తో జీవో దేవస్సనాతనహ్
త్యజేదఙాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్

మనదేహమే దేవాలయము. అందు ఉండు జీవుడు సనాతనమైనటువంటి భగవంతుడే. నాలో ఉండు అఙానమును తొలగించి నీవే నేనను భావనతో నిన్ను పూజించెదను. అంటూ మహన్యాస పారాయణంలో భక్తుడు స్తుతిస్తాడు. అలాగే " నారుద్రో రుద్రమర్చయేత్ " అనికూడా న్యాసంలో చెప్పబడి ఉంది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుని పూజించలేడు.

ఇటువంటి ఉదాహరణలు అనేకం వేదంలో ఉన్నాయి. వీటి వల్ల మనలోని జీవుడు, ఆ దేముడు వేరు వేరు కాదనీ ఇద్దరూ ఒకటే ననీ తెలుస్తున్నది. అంతెందుకు మనం చేసే వృత్తిలో, పీల్చే గాలీలో, నీరులో , ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలోని ప్రతి వస్తువూలోనూ ఆభగవంతుడున్నాడు అని ఆస్తికులందరూ అంగీకరిస్తారు. మరి వీటి యందు భగవంతుడున్నాడని నమ్మి ఆస్తికులు సేవించినా, భగవంతుడి సేవ అనే భావనతో కాక వాటి యందు ఇష్టంతో మాత్రమే నాస్తికులు వాటిని సక్రమంగా ఉపయోగించినా ( అంటే వృత్తిని చిత్త శుద్ధితో చేయడం, చెట్లను పెంచుతూ వాటితో మాట్లాడుతూ గడపడం మొ..వి ) ఇద్దరికీ సమానమైన ఆనందమే కలుగుతున్నది కదా!? ఇది ఆస్తికులు ఒప్పుకునే ఉదాహరణ. ఇది ఇక్కడ ఆపి మరో ఉదాహఋరణ చూడండి.


నాకు ఇద్దరు స్నేహితులున్నారు అనుకుందాము. ఒకరు ఆస్తికులు, ఒకరు నాస్తికులు. ఇద్దరూ ఒకసారి మనసు కలత చెందింది అంటూ నావద్దకు వచ్చారు. అప్పుడు స్నేహితుడిగా నాకర్తవ్యం వారికి ఏ కారణం వలననో కలత చెంది చలించిన మనసును శాంత పరచడం. అప్పుడు నేనేమి చేస్తానో తెలుసా?

ఆస్తిక మిత్రునిచేత కొంతసేపు ధ్యానము చేయించడమో, మంత్రాలు చదువుకోవడమో చేయిస్తాను.

మరి నాస్తిక స్నేహితునికి అలా చేయడం ఇష్టముండదు. ఎందుకంటే అతడు భగవంతుని నమ్మడు కనుక. ఒకవేళ అతడు నామీద ప్రేమావల్ల నేను చెప్పినవి పాఠించినా అవి అతనికి శాంతిని ఇవ్వలేవు. ఎందుకోతెలుసా అతనికి వాటియందు నమ్మకం లేదు. నమ్మకంలేని చోట భగవంతుడు ఉండడు. అతడు లేకుండా ఎన్నిమంత్రాలు చదివి ఏమిలాభం? కనుక నేను అతనిని కొంతసేపు పాటలు పాడమనో, బొమ్మలు వేయమనో, ఏవైనా ఆహ్లాద కరమైన రచనలు చేయమనో, నాట్యం చేయమనో, ప్రశాంతమైన ప్రకృతిని సరదాగా పలుకరించమనో... ఇలా అతనికి ఇష్టమైనవి ఏమిటో గ్రహించి వాటిలో అప్పటికి ఉపయేగపడే పనిఏదో అది చేయమని చెప్తాను.

ఇక్కడ ఇద్దరి చేతా వేరు వేరు పనులు చేయించాను. కానీ కలిగే ఫలితం మాత్రం ఒకటే. ఒక ప్రశాంతమైన చెరువులో రాయిపడి నప్పుడు నీరు చెదిరినట్లు, ఏదో విషయం వలన కలతపడిన వారు పదే పదే ఆవిషయమును స్మరిస్తూ మరింత చలించిన మనసుతో నావద్దకు వచ్చారు. నేను చేసిందల్లా పూర్వపు సంఘటనను పదే పదే స్మరించకుండా ఉండుటకు వేరొక విషయముపై వారి మనసును ఏకాగ్రపరచుటమాత్రమే. అలా వేరొక విషయం పై మనసు నిలుపుట వల్ల చలించిన వారి మనసు మరల నిశ్చలమైంది. నిశ్చలతలో మనకు తెలియకుండానే ఆనందం లభిస్తుంది.

తిరిగి వారి మనసు కలత చెందదని నమ్మకమేమిటీ అని మీరడగవచ్చు. అవును అది నిజమే మరల కలత చెందే అవకాశం లేకపోలేదు. కనుకనే నేను వారిచేత రోజుకు కొంతసేపు మనసును ఏకాగ్రపరచు ఇటువంటి పనులను చేయిస్తాను. అందువల్ల ఈ పూర్వపు విషయముచేతనే కాక, భవిష్యత్తులో మరే కలతపెట్టు విషయము వల్లనైననూ అంతత్వరగా మనసు చెదురదు. పైగా ఎంతో ఉల్లాసంగా జీవనం సాగుతూ ఉంటుంది. ఆనందం అణువణువున తాండవిస్తుంది.

ఇప్పుడు చెప్పండి నాస్తికులకు, ఆస్తికులకు ఆనందాన్ని పొందేఅవకాశం ఉన్నదా? లేదా? ఉంది కదా!? ఈ ఉదాహరణవల్ల మరో విషయం స్పష్టమవుతున్నది. ఆనందాన్ని పొందుటకు పుజలూ ప్రార్థనలే కాక ఇంకా అనేక మార్గాలు ఉన్నవి అని. ఈ ఉదాహరణ ఇరువర్గాల వారికీ సమ్మతమవ్వ వచ్చు. కానీ ఆస్తికులు మరో ప్రశ్న వేసే అవకాశం ఉంది. ఆనందం పొందటమేనా జీవిత పరమావధీ అని.

అబ్బో ఇది చాలా పెద్ద చర్చ అవ్వవచ్చునేమో!? కనుక మరో టపాలో ప్రయత్నిద్దాము. ఒక్కమాటలో చెప్పాలంటే అవును ఆనందమే జీవిత పరమావధి అని నేను నమ్ముతాను. బ్రహ్మ ఙానం కలిగినప్పుడు ( సత్యం బోధ పడినప్పుడు ) నిశ్చల ఆనందం కలుగుతుంది. నిశ్చల ఆనందం కలిగినప్పుడు జన్మ రాహిత్యం కలుగు తుంది.

ఇటువంటి అనేక భావాల వల్ల " నిజాయితీతో కూడిన " నాస్తిక, ఆస్తిక జనులిద్దరిది సరీయిన పద్ధతే అనినేను నమ్ముతాను. కానీ నేను మాత్రం ఆస్తికతనే పాటిస్తాను. ఎందువల్లనంటే ఇది నా స్వధర్మం. అంతేకాక ఇందు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ముందే ఋషులు నిర్ణయించి ఉంచారు. కనుక ఇక్కడ కొత్తగా కనిపెట్టవలసినది ఏమీ లేదు. వారు చూపిన మార్గంలో నడవడం తప్ప. కానీ నాస్తిక మార్గం అంత సులువుగా పట్టుబడునది కాదు. దానికి ఇవి నియమములని ఎవరూ నిర్ణయించి ఉండక పోవుట వల్ల జనులు తప్పు మార్గము పట్టు అవకాశములెక్కువ. కనుక మార్గ సౌలభ్యము కొరకూ మాత్రమే నేను ఈ ఆస్తిక మార్గమును అనుసరించుచున్నాను.

10 వ్యాఖ్యలు:

 1. చాలా విలువైన విషయాలు చెప్పారు. అంతకన్నా ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే ఈ విషయాలేవీ కూడా ఓ మహాత్ముని బోధనలునుటంకించి కాకుండా సూటిగా మీ హృదయంలోనుండి/అనుభవాల్లోనుండి వచ్చిన ఆలోచనలతో చెప్పారు. ఈ ప్రత్యేకత చాలా ఆకట్టుకుంది.

  మీరు చెప్పిన 'అహం బ్రహ్మస్మి', 'ఆనందమే జీవిత పరమావధి' సిధ్ధాంతాలను నేను కూడా ఇది వరకు చెప్పటానికి ప్రయత్నించాను. అయితే నేనందుకు వివేకానందుడినో, తీర్థ రాముణ్ణో ఆశ్రయించవలసి వచ్చింది.

  చివరగా మీరన్నట్లు నాస్తికత్వం ద్వారా సత్యాన్ని కొత్త మార్గంలో కనిపెట్ట యత్నించే బదులు మనకిప్పటికే ఉన్న ఆస్తికత్వాన్ని ఉపయోగించటం వివేకవంతమైనది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. విజయ్ గారు నమస్సులు __^__
  మీ టపా నాలో ఉన్న చాలా సందేహాలు నివృత్తి చేసింది.
  ______________________
  " నారుద్రో రుద్రమర్చయేత్ "
  _______________________
  మంచి మాట గుర్తు చేసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాస్తికతను, మీరు ఆలోచిస్తున్న విధానానికి అన్వయిస్తే (అంటే ఆస్తికతకు విరుద్ధం కాక, ఒక ప్రత్యేక ఆత్మ పరిశీలన పద్ధతి) అది కూడా ఒక మార్గం అవుతుంది. బుద్ధ దేవుడి మార్గం అదేనని నా ఊహ.

  అయితే రెండు మార్గాలలోనూ (సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల) అహంకారానికి బీజములు ఉన్నాయి. నాస్తికుడు, ఆస్తికుని దేవుడు ఎక్కడో చూపమని హేళన చేస్తే, ఆస్తికుడు మాది వేల సంవత్సరాల సంప్రదాయం, మధ్యలో నువ్వెవడని ఈసడించడం జరుగుతున్నది.

  ఆత్మవిమర్శ ఆవశ్యకత తప్పనిసరి. ఇదే మీరు చెప్పారనుకుంటున్నాను.

  చక్కటి రచన అందించారు.అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆనందం అన్వేషించడం లో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి.. మీ నమ్మకం పైన మీరు ఆస్తికులు గా మీ ప్రయాణం నడిపిస్తున్నారు.. మీరన్నట్టే అది ఇంతకు మునుపే ఏర్పాటు చేయ బడ్డది.. కాని నా ఆలోచన ఇలా వుంది.. అందరికీ జీవితం లో ఒకే రకమైన విధానం. పుట్టుక, బాల్యం, కౌమారం, యవ్వనము మరియు వార్ధక్యము. కాని ఏ ఒక్కరి అనుభవాలు మరొకరితో కలవవు. కలిసినా వాటిని వారు అర్ధం చేసుకోవడం, పాటించడం లో వత్యాసాలు వుంటాయి.. కనుక .. చూడడానికి ఒకలా కనిపించినా ఎవరి తీరూ.. మరొకరి తో పోల్చలేము...ఇందులో ఆస్తికత .. నాస్తికత .. అని లేవు..కేవలం జీవన ప్రయాణపు అనుభవాలను మనం విశ్లేషించుకోవడం. .. అర్ధం చేసుకునే ప్రయత్నం చేయడం.. తప్పులను సరి దిద్దుకోవడం ... ముందుకు వెళ్ళడం.. నాకు తెలిసినంత వరకు ఎవరి దారి వారే తయారు చేసుకోవాలి.. కాకుంటే.. దానికి ఇతరుల అనుభవాలను మనం మనకి నచ్చినంత వరకు .. పనికి వచ్చినంత వరకు జోడిస్తాం ...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఆస్తికత, నాస్తికత అన్న అంశాలను ప్రక్కనుంచి, ఆత్యాత్మిక పరంగా చూస్తే - ప్రతివారు ఆత్మ పరిశీలన [విమర్శగా చూస్తే అందులో కొంత నిజాయితీ లోపిస్తుంది] చేసుకుని, తనని తాను సందర్శించుకోవటమో, అనుకున్న రీతిలో మలచుకోవటంలోనో/ఆవిష్రించుకోవటం లోనో మార్గాన్వేషి కావాలి. కొందరికి మార్గ దర్శకత్వం కావాలి [అక్కడే దైవం మతం రీతి రివాజులు ఉపకరిస్తాయి] కొందరికి వారి మనోబలమే సంకల్పసిద్దినిస్తుంది. మన పూర్వ గాధల్లో ఎన్నో దృష్టాంతాలు విశ్వమిత్ర, జనకుడు, ..

  నేను ఆస్తిక-నాస్తిక వర్గాలకి చెందని మూడొ తరహా మనిషిని.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శర్మ గారు బాగా చెప్పారు.....
  భగవంతుని పూజించడం అంటే నాకు తెలిసిన పద్దతి వెరే ఉంది... నా మనసుని ఎక్కదైనా ప్రతిబింబిస్తారేమోనని వెతికాను దొరక లేదు ...... ఐనా నేను మీ భావాలను గౌరవిస్తున్నను. భాగా రాసారు .....

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అందరికీ ధన్యవదాలు.
  @ రవి గారు: చాలా సరిగ్గా చెప్పారు. మీకు బాగా అర్థమైంది నా అంతరార్థం. :)

  @ శివ గారు : ఇక్కడే స్వార్థం ప్రవేశించే అవకాశముంది జాగ్రత్త :)

  @ ఉష గారు : నేడు చాల మంది ఆస్తికులు పూర్తి ఆస్తికులుగా లేరు. భగ వంతుణ్ని నమ్ముతారు, కానీ క్రమ బద్ధమైన పూజో, ధ్యానమో చేయటానికి తెలియనిదేదో అడ్డు వస్తుంది. వీరే నాకు తెలుసున్న మూడో తరహా వ్యక్తులు :)

  మిగతా మీ భావనలన్నీ బాగున్నాయి.

  @ కార్తీక్ గరు: మీకు తెలిసిన పద్ధతిని కూడ కొద్దిగా తెలుప వలసింది. అది పురోహితంలో నాకు ఎదురయ్యే కొందరికి పరిచయం చెయ్యడానికి ఉపయోగ పడ వచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఆస్తికుల కంటే నాస్తికులే దేవుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.రాముడు మిధ్య,రామాయణం మిధ్య అని కేంద్రప్రభుత్వం,కరుణానిధి అన్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది శ్రద్ధగా రామాయణం చదివారు.ఒక్కొక్కసారి నాస్తికుల చర్చలు వినే ఆస్తికత్వం పెరిగేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

  * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
  * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
  * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
  * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
  * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
  * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
  * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
  * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
  * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
  * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
  * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
  * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
  దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

  * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు
  * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
  * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
  * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
  * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

  ప్రత్యుత్తరంతొలగించు
 10. -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ గారు: అవునండీ అలాకూడా జరగవచ్చు. ధన్యవాదాలు.

  రహమతుల్లా గారు మంచి విషయాలు ప్రస్థావించారు. మీ వ్యాఖ్యకు జవాబు రాయబోతే ఓ టపానే తయ్యారయ్యింది. ‘మూఢనమ్మకాలు‘ అనే టపా చూడండి.

  ఆలోంచింప చేసే ఇటువంటి మరిన్ని వ్యాఖ్యలు మీనుంచి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.