21, అక్టోబర్ 2009, బుధవారం

మీరు నాస్తికులా? ఆస్తికులా?

మీరు నాస్తికులా? ఆస్తికులా? అసలు నాస్తికత అంటే యేమిటీ? ఆస్తికత అంటే ఏమిటీ? భగవంతుడు ఉన్నాడు (అస్తి) అనేవారు ఆస్తికులా? లేడు( అస్తి ) అనే వారు నాస్తికులా? అసలు ఏది తప్పు? ఎది ఒప్పు? ఇలా ఎపుడైనా ఆలోచించారా?


"భగవంతుడు ఏడి?" అంటూ అతని ఉనికిని ప్రశ్నించడమే నాస్తికత అయితే నేను పరమ నాస్తికుడినే. పూజలు ఎందుకు చేయాలి? భగవంతుడు ఉన్నాడా? ఉంటే పూజలు స్వీకరిస్తున్నాడా? ఇలా అనేక రకాల ప్రశ్నలు నాకు వచ్చేవి.

అది ఎలా అంటే... నేను పురోహితుల కుటుంబంలో పుట్టాను. నేను పూజలు చేసినంతకాలం ఇది తప్పా, ఒప్పా అని ఆలోచించలేదు. పెద్ద వాళ్లు చెప్పారు కాబట్టి చేసే వాడిని. కానీ పురోహితుడిగా పూజలు చేయించ వలసిన సమయం వచ్చిన తరువాత నుండీ నాలో యుద్ధం మొదలైంది. నేను ఒకరికి ఇది చేయండీ మంచి జరుగుతుందీ అని చెప్పాలంటే నాకు దానిగురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి.

ఎందుకంటే నేటి కాలంలో పూజలు, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం మొదలయినవి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వేదమునకు అంత గడ్డు స్థితి ప్రస్థుతానికి లేదుకానీ, జ్యోతీష్యం, వాస్తు శాస్త్రం చాలా వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ నేడో రేపో ఆటు, పోటులు పూజా విధానానికీ, వేదాలకూ కూడా రాకపోదు. ఇప్పటికే పురోహితులు పొట్ట నింపుకోవడానికే అనేక రకాల పూజలు చేయిస్తున్నారు అనే మాటలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినిపిస్తూనే ఉన్నాయి. అలా డబ్బులకోసం చేయాలంటె పురోహితమే చేయనవసరం లేదు అని నా భావన.

ఒకప్పుడు అగ్ర తాంబూలం అందుకొన్న వేదపండితులూ, పురోహితులూ నేడు ఏదో అవసరం కాబట్టి, పెళ్లికీ పేరంటానికీ పిలవక పోతే నలుగురూ నవ్వుతారు కాబట్టి ఆదరించ బడుతున్నారు. నేటి యజమానులే కాదు బ్రాహ్మలూ అలాగే ఉన్నారు. "పూజ చేయించుకునే వాళ్లకు శ్రద్ధ లేనప్పుడు మనకెందుకు కంఠ శోష" అని భావించే పురోహితులే నేటి కాలంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

కాని నాకు అది కష్టం. నేను వృత్తి చేసినా అందులో నాకు తృప్తి ఉండాలి.
అందుకే నేను పురోహితుడిగా పూజచేస్తున్న ప్రతీసారీ నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండే వాడిని.

పూజలు చాలామంది చేస్తున్నారు. కానీ ఎందుకోసం చేస్తున్నారు?
వారాశించిన ఫలితాలు వారికి లభిస్తున్నాయా?
మరి భక్తులు( యజమానులు ) ఆశించిన ఫలితాలు రానప్పుడు, వారికి శుభం చేకూర్చలేనప్పుడూ పుజలూ, పురోహితులూ వ్యర్ధమే కదా!?
ఒక వేళ లోపాలేమైనా ఉన్నాయా?
ఉంటే లోపం ఎవరి దగ్గర ఉందీ...?
చేసే భక్తుల వద్దా...?
చేయించే బ్రాహ్మల వద్దా...?
లేదా భగవంతుడి వద్దా...?

... " మంత్రాలకు చింతకాయలు రాలేనా పెట్టేనా..?" "ఎప్పుడో పూర్వ కాలంలో ఏవో అద్భుతాలు జరిగాయని అదే పద్ధతి ఇప్పుడూ పని చేస్తుంది అనుకోవడం తప్పు" అంటూ కొంతమంది పలికే మాటల్లో ఎంతవరకూ నిజం ఉంది?
ఆలోచించగా ఆలోచించగా నాకు కొన్ని విషయాలు అర్థమవుతూ వచ్చాయి.

దేముడు తమ కోరికలు తీరుస్తూ వచ్చినందు వల్ల అతడిని నమ్మే వారు చాలా మంది కనిపిస్తున్నారు.

అలాగే తమ కోరిక తీర్చ లేదని దేముడిని నమ్మడం మానేసిన వారూ ఉన్నారు.

దేముడిని నమ్మని వారిలో ఇంకో రకమూ ఉన్నారు. వాళ్ళకు పొద్దున్నే లేవటమన్నా, నోరు కట్టుకుని ఉపవాసాలూ మొదలైనవి పాఠించడ మన్నా, నియమముగా ఉండడమన్నా చాలా కష్ట మైన విషయము. అందువల్ల వారు దేముడిపై నాకు నమ్మకము లేదంటూ వాదిస్తూ కాలం గడిపేస్తుంటారు.

పై 3 రకాలవారూ తమని తాము మోసం చేసుకుంటూ ఇతరులనూ మోసంచేస్తున్నారు.
అలాగే ఇతరులు నొచ్చుకునేటట్లు మాట్లాడటం, ప్రవర్తించడం...., వారిని మభ్య పెట్టో, భయ పెట్టో తమ నమ్మకాలను వారిచే పాటింప చేయడం..., అతి స్వార్థం... మొదలగు అనేక గుణాలు కలిగినవారు ఏ పద్ధతి అవలంబించే వారైనా వ్యర్థమే.

ఆస్తికులైనా, నాస్తికులైనా తమ పద్ధతుల వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా , తమ భావాలు రుద్దకుండా ఉన్నంత వరకూ మాత్రమే సన్మార్గంలో ఉన్నవారవుతారు.

అసలు మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు? భోజనం చేయడం, నిద్రపోవడం, ఆటలాడడం, పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం మొదలైన వన్నీ అతనికి ఏమి ఇస్తున్నాయి? సుఖం కోసమా? అయితే ఇది చెప్పండి

కోతమంది తమకు ఎంతమంది పని మనుషులున్నా తమ పిల్లలను తామే స్కూలులో దించి వస్తారు. మరికొందరు తమకు ఎంత ఆస్థి ఉన్నా తాము స్వయంగా సంపాదించడానికే ఇష్టపడతారు.నేటికీ చాలామందికి ముసలి వారైన తమ తల్లి తండ్రులని తమ వద్ద ఉంచుకోవడానికే ఇష్టపడతారు. తమకు తగిన స్థోమత ఉన్నా వృద్ధాశ్రమాలలో చేర్చడానికి చాలా మధన పడతారు. ఎందుకని?

( " మిరింకా ఎక్కడున్నారు? ఇప్పటికే చాలామంది తమ తల్లి తండ్రులని ఆశ్రమాలలో చేర్చేశారు " అని అనుకుంటున్నారు కదూ మనసులో.... :)

అలా చేర్చే వారుకూడ తాము ఆఫీసుకు వెళ్లినప్పుడు ముసలి వారైన తల్లి తండ్రులను చూసే వారు లేరనో, తమ ఇంట్లో కంటే ఆశ్రమం వారి వద్దే సదుపాయాలు ఎక్కువ ఉన్నాయనో మొదలైన అనేక కారణాల వల్ల ఎంతో భాదపడుతూ అలా చేస్తున్నారని నాభావన. )

హాయిగా తిని కూర్చోవడం సుఖంగా ఉంటుంది కదా? మరి అవన్నీ ఎందుకు చేస్తారు?
ఎందుకో తెలుసా ఆనందం కోసం. అంటే సుఖం వేరు, ఆనందం వేరు. సుఖంగా ఉన్న ప్రతీ వారూ ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉన్నవారు సుఖపడుతున్నట్టు కాదు.

ఉద్యోగం చేయవలసిన వయసులో చేయకుండా ఇంట్లో కూర్చుని తినడం సుఖంగా ఉంటుంది. కానీ అలా కొంతకాలం మాత్రమే ఉండగలరు. తరువాతినుండీ యేదో బాధ మొదలవుతుంది.( యేళ్లు గడుస్తున్నా ఇంట్లో వారిపై ఆధారపడుతూ తిని కూర్చునే వారూ నాకు తెలుసు. అలాంటి వారికి వేవేల వందనాలు. ) ఇంట్లో ఉండాలంటే చిరాకు. ఉద్యోగంలో చేరేవరకూ మీ మనసు నిదురకూడా పోనివ్వదు. ఎందుకో తెలుసా అక్కడ సుఖముందేమో కానీ, ఆనందం లేదు.సరిగ్గా అటువంటి ఆనందం కోసమే మనం దేముడిని నమ్మడమైనా, నమ్మక పోవడమైనా. మనం ఆనందంగా ఉన్నంత కాలం, మన వల్ల ఇతరుల ఆనందఆనికి భంగం కలగ నంత కాలం మనం ఏ పద్ధతి పాఠించినా అది సరైనదే.

ఆస్తికత అయినా, నాస్తికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే. రెండు మన శక్తిని పెంచేవే.నిజమైన నాస్తికత్వం ఆస్తికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుకు ఒప్పు? అని ప్రశ్నించుకుంటూ, తనలోని తప్పులను గర్వంలేకుండా ఒప్పుకుని, వాటిని సవరించుకుంటూ చేసే తర్కం సరైనది. అటువంటి తర్కం వల్లనే అనుకుంటా నేను ఆస్తికుడిగా మారాను.
ఇక పూజల వచ్చే లాభనష్టాలు ఏమిటో నేను తెలుసుకున్నది మరో టపాలో వివరంగా చర్చిస్తాను.

20 కామెంట్‌లు:

  1. చాలా బాగా విశ్లేషించారు. దేవుడిని నమ్మని వారికి గల కారణాలను చక్కగా వివరించారు.

    ఆస్థికత అయినా, నాస్థికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే.

    ఇది వరకు నాకు కలిగిన సందేహాన్ని మీ ముందుంచుతున్నాను.

    తన ఆస్థికతను/నాస్థికతను నిజాయితీగా పిల్లలకు నేర్పేవాళ్ళుంటే, వారిద్దరిలో ఎవరు చేసేది ఒప్పు?? ఇద్దరిదీ సరియేనా?

    రిప్లయితొలగించండి
  2. _____________________________________
    నిజమైన నాస్థికత్వం ఆస్థికత్వంతో సమానమని పెద్దలంటారు. తర్కం ఉండాలి. కానీ నాదే సరైనది అనే ధృకపథంతో చేసే తర్కం పనికిరాదు. నేను చేసేది తప్పా, ఒప్పా..? ఒకవేళ తప్పయితే ఎందుకు తప్పు? ఒప్పయితే ఎందుకు ఒప్పు? అని ప్రశ్నించుకుంటూ, తనలోని తప్పులను గర్వంలేకుండా ఒప్పుకుని, వాటిని సవరించుకుంటూ చేసే తర్కం సరైనది.
    ___________________________________
    అమూల్యమయిన విషయాలు తెలియచేసారు. ధన్యవాదములు!

    రిప్లయితొలగించండి
  3. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన విషయాలు, బుద్దితో కాక, మనసుతో చెప్పినట్టు నాకనిపించింది. అందుకే చాలా సున్నితంగానూ, సౌమ్యంగానూ ఉన్నది.

    బ్లాగ్లోకంలో రకరకాల వృత్తుల వాళ్ళున్నారు. మీరు కూడా ఉండడం ఓ పరిపుష్టినిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. @ బృహస్పతి గారు: చిక్కు ప్రశ్నేవేశారు. మీ బ్లాగును ఇదివరకే పలుకరించినట్లు గుర్తు. మీరు చాలా ఆధ్యాత్మిక విషయమున్నవారు అని ఆనాడే తెలిసింది. మీ ప్రశ్నకు నాకు తోచిన సమాధానం చెప్తాను.

    నావరకూ రెండు మార్గాలూ సరీయినవే. అటువంటప్పుడు ఏపద్ధతైనా పిల్లలకు నేర్పుట సరీయినదే. ఏవిద్య అయినా పిల్లవాని మనో వికాసానికి దోహద పడేదే. ఆత్మ విమర్శతో కూడుకున్న మార్గమేదైనా గమ్యమొక్కటే.

    తలిదండృలు లేదా గురువులు వారు ఆస్థికులు కానివ్వండీ , నాస్థికులు కానివ్వండీ తమ పిల్లలకు ఓ విషయం చెప్తున్నారు అంటే అది వారికి తోచినంతలో మంచిదే అయ్యి ఉంటుంది. కానీ ఏ విషయము లోనైనా వారు సూచన ప్రాయముగా దారి చూపగలరే కానీ ఫూర్తిగా ఆ దారిలో నడుపలేరు. అలాగే చెయ్యాలి కూడా. అలాకాక నీవీ దారిలో నడవాలి అని బలవంతముగా నేర్పినచో పిల్లలు ఏదో పెద్దల కంటి తుడుపు కోసం పాఠిస్తారే తప్ప మనస్పూర్తిగా నేర్వరు.

    అలాగే పెద్దలు చెప్పిన దానిలో కూడా పిల్లవానికి ఎంత ప్రాప్తమున్నదో అంత వరకే అవగతమవుతుంది. మిరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేటప్పుడు గమనించే ఉంటారు, వాళ్లు చెప్పే దానిలో కొన్ని భావాలు మనకు పూర్తిగా తెలియనట్లు, ఇంకా ఏదో నిగూఢ అర్థమున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది మరల మరల చదవగా కొంత తేటతెల్లమవుతూ ఉంటుంది. అంటే ప్రతీ దానికీ ఓ సమయముంటుంది.

    మీకు మీరిచ్చుకున్న సమాధానమేమిటో కూడా నాకు తెలియపరచడం మరువ కండి.

    @గణేష్ గారు, రవి గారు : ధన్యవాదాలండీ :)

    రిప్లయితొలగించండి
  5. బృహస్పతిగారు

    నిజాయితీ వేరు ,సత్యం వేరు . నిజాయతీగా సత్యాన్ని చెప్పాలేతప్ప . తాను అసత్యబాటలో నడుస్తూ నిజాయతీగా అదే బాటను పిల్లలకు నేర్పటం ఒప్పుకాదనుకుంటా. ఎందుకంటే దొంగ తనపిల్లవానికి నిజాయతీగా దొంగతనం మెలకువలన్నీ నేర్పటం ధర్మం కాదుకదా . అదివానితోపాటూ పిల్లవాని జీవితాన్ని కూడా వినాశకరపరిణామాలవైపు తీసుకెళుతుంది.

    శర్మగారు చాలా చక్కగా తామ భావాలు విశదీకరించారు .కాలానుగుణంగా ,కాలపరీక్షల సమ్మెట దెబ్బలకు తట్టుకుని నిజమైన సత్యమొక్కటే నిలబడుతుంది మన భావాలలో . అప్పటిదాకా కొన్ని కలాగాపులగంగా మనమనసులో కలసిపోయివుంటాయి. ఇది సహజం.

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగా వివరించారు. ఉత్తమస్థాయి విశ్లేషణ. భగవంతుడిని నమ్మడానికి నమ్మకపోవడానికి గల కారణాలను చక్కగా చెప్పారు. భగవంతుడిని కనుగొనే మార్గం కూడా కనుగొన్నట్లయింది. అద్భుతం! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శర్మ గారూ, నా దగ్గర కూడా ఖచ్చితమైన అభిప్రాయం లేదండీ. అయితే నేను దుర్గేశ్వర గారు చెప్పిన దానితో ఏకీభవిస్తాను. సత్యాన్ని గ్రహించటమన్నది ప్రతి మానవుని లక్ష్యమన్నప్పుడు, ఆస్థికత్వం సత్యానికి దారి చూపెడుతుంది. నిజాయితీ గలిగిన నాస్తికత్వం దారిని కనుగొంటుంది. కనుక దీనిని భావి తరాలకు అందించాలంటే ఆస్థికత్వమే మేలని నా అభిప్రాయం. దారి తెన్ను తెలియని అడవిలో వదిలి, ఇంటికి వెళ్ళమనటం లాంటిది నాస్తికత్వం. రహదారిని ఏర్పరచి ఆ దిక్కున పోతే ఇంటికి చేరుతావని చెప్పటం ఆస్థికత్వం.

    అందుకనే ప్రపంచానికి ఆస్థికత్వం అవసరం ఉందని నేను నమ్ముతాను.

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగా చెప్పారు.

    ముఖ్యంగా " ఆస్థికత అయినా, నాస్థికత అయినా నిజాయితీ కలిగినదైతే రెండూ మంచివే " ఇది చాలా కరక్ట్ గా చెపారు.

    దన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా చెప్పారు.అమూల్యమైన విషయాలు చర్చలోకి వచ్చాయి.
    అయితే నాకో సందేహం.రెండు విధానాలు మంచివే అనడం మీ విచక్షణా జ్ఞానం. కానీ పిల్లలకు నేర్పేవాళ్ళు ఎవరు? తల్లి, తండ్రి, గురువులు..వీరందరూ ఒకేరకమయిన సిద్ధాంతం నేర్పడం సాధ్యమయ్యేనా? అటువంటప్పుడు పిల్లవాని మది సంఘర్షణకి లోను కాదంటారా. ఈ పరిస్థితులు అతని మానశిక పరిపక్వతపై ప్రభావం చూపదంటారా ? అలాగని ఒకే విధానాన్ని బలవంతంగా రుద్దడం న్యాయమేనా? ఏ విధానం ఎంతవరకూ ఒప్పు,తప్పు అనేవిషయమ్లో పెద్దలకే అవగాహన కొరవడినపుడు...?
    ఓ స్థాయి మానశిక వికాశం పొందిన మనకు విచక్షణా జ్ఞానం ఉంటుంది. నిజాయితీతో కూడిన సత్యన్వేషణ సాధించవచ్చు.
    అసలు పిల్లలకి ఈ విధమైన బోధన అవసరమంటారా?
    సందేహ నివృత్తి చేయగలరు.

    రిప్లయితొలగించండి
  10. అన్నట్లు ఓ చిన్న సూచన. ఆస్తికులు, నాస్తికులు అని ఉండాలనుకుంటాను. ఆస్థికులు, నాస్థికులు కాదు.

    రిప్లయితొలగించండి
  11. నిజమే...

    అస్తి అంటే కలదు అని అర్థం. ఆస్థి అంటే ధనము అని అర్థం. తప్పును సరిదిద్దినందుకు ధన్యవాదములు.

    మీ విలువైన అభిప్రాయములు తెలిపిన అందరికీ పేరు పేరునా ధన్యవాదములు.

    తరువాతి టపా మరికొద్ది సేపటిలో ప్రచురిస్తాను. ఇక్కడి ప్రశ్నలకు సమాధానము చాలా వరకు అక్కడ దొరక వచ్చు.

    మీ సత్సంగమును నాకు అక్కడ కూడా ఇవ్వగలరు.

    రిప్లయితొలగించండి
  12. @ శ్రీనిక గారు : మీ బ్లాగు చూశాను. వివాహం గురించి చాలా చక్కని విషయాలు రాస్తున్నారు.

    ఇక మీకు సందేహ నివృత్తి చేసే అంతటి పరిఙానం నాకుందనుకోను. కానీ నాతరువాతి టపా చదివిన తరువాత కూడా ఇదే ప్రశ్న మీకుంటే తప్పక సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. మీ విశ్లేషణ చాలా బావుంది . మీ టపాలతో ఎన్నో విలువైన విషయాలు వివరిస్తున్నందుకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  14. చాలా బాగా చెప్పేరు అండి. మా మాస్టారు చాగంటి శరత్ బాబు గారు రాజముండ్రి లో వుంటారు వారం వారం మా అందరి మీద దయ తో (వ్రుత్తి రీత్యా ఫిజిక్స్ లెక్చరర్, ప్రవృత్తి రీత్యా గొప్ప ఆధ్యాత్మిక భోదకులు.) సత్సంగ్ లో మాట్లాడతారు. ఆయన మాటలు గుర్తు వస్తున్నాయి మీరు చెప్పేవి వింటే. ధన్యవాదాలు మీకు.

    రిప్లయితొలగించండి
  15. One of the best post I read in recent times.

    తన మనోభావాలను మనసుచేత రచించనట్టు వుంది. భగవంతుని ఎవరికి వారు తమ తమ అనుభూతులలో చూడగలరే కానీ వేరే వారికి ఇదిగో ఇక్కడ వున్నాడు చూడండి అని చూపటం అసాధ్యమైన పని అని నా అభిప్రాయం.
    మనం చేసే పనిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించేవారికి ఆ ఆనందంలో భగవంతుడు కనిపిస్తాడు.
    నాస్తికునికి భగవంతుడేడీ అని తను చేసే శోధనలో భగవంతుడు కనిపిస్తాడు.
    దొంగతనం చేసే వారికి పట్టుబడకుండా బయటపడితే భగవంతుడు కనిపిస్తాడు
    శిష్యునికి ప్రియమైన గురువులో భగవంతుడు కనిపిస్తాడు
    గురువు కు తన శిష్యుడు ప్రయోజనకారి అయినప్పుడు ఆ ఆనందంలో భగవంతుని చూస్తాడు.
    పిల్లలు తమ అమ్మ,నాన్నల చిటికిన వ్రేలు పట్టుకుని నడిచిన ప్రతిరోజూ ఆదిదంపతులనే చూస్తాడు.

    ఇలా ప్రతివ్యక్తికి అనునిత్యం కనిపిస్తుంటూనే వుంటాడు. కానీ మీరు చెప్పినట్టు ఆ అనుభూతి కలగడానికి ప్రతి ఒక్కరికి ఒక సమయం వుంటుంది.

    బృహస్పతి గారూ, అస్తికులైనా, నాస్తికులైనా ప్రయోజనకరమైన తర్కవాదం ముఖ్యం. అది లేకపోతే మనిషి ఆలోచన చచ్చి భగవంతుడు కూడా కనుమరుగై పోతాడు.అది మీ దగ్గర పుష్కలంగా వుంది.

    శ్రీనిక గారూ, ఏ ఒక్క మనిషి భావాలూ మరొకరితో పూర్తిగా కలువవు. బిడ్దకు మనము నేర్పాల్సింది ఆలోచనా జ్ఞానం,జీవించడానికి మంచి సూత్రాలు, మానవత్వం. ఈ పునాది బాగుంటే తనే స్వయంగా ఏది మంచో ఏది చెడో విశ్లేషించుకొని అవసరమైన మేరకూ తనకు తానే మంచిని సంగ్రహించుకొని మరో నలుగురికి వెలుగును పంచగలడు.

    రిప్లయితొలగించండి
  16. భారారె!! నేను కరెక్టుగా ఇదే టైపు చేద్దాం అనుకుని కిందకొచ్చా, మీరు టైపు చెసేసారు
    >బిడ్దకు మనము నేర్పాల్సింది ఆలోచనా జ్ఞానం,జీవించడానికి మంచి సూత్రాలు, మానవత్వం. ఈ పునాది బాగుంటే తనే స్వయంగా ఏది మంచో ఏది చెడో విశ్లేషించుకొని అవసరమైన మేరకూ తనకు తానే మంచిని సంగ్రహించుకొని మరో నలుగురికి వెలుగును పంచగలడు.

    విజయ్ - చక్కగా చెప్పావోయి..అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఓహ్... ఈ కామెంట్ ఇప్పుడే చూస్తున్నా,

    భారారె గారూ,
    "అస్తికులైనా, నాస్తికులైనా ప్రయోజనకరమైన తర్కవాదం ముఖ్యం. అది లేకపోతే మనిషి ఆలోచన చచ్చి భగవంతుడు కూడా కనుమరుగై పోతాడు.అది మీ దగ్గర పుష్కలంగా వుంది."

    మీకు నా మీద అంత మంచి అభిప్రాయమున్నందుకు ఆనందమే కానీ, నా ప్రశ్న ఇక్కడ భావి తరాలకు...

    ప్రయోజనకరమైన తర్కవాద ప్రతిపాదన వ్యక్తిగతంగా వినటానికి బాగానే ఉంది. కానీ దాని పరిధి వ్యక్తిగతాన్ని దాటి సమాజానికి పాకినప్పుడు, ఒక కామన్ పాయింట్(ఆస్తికత్వం) లేనప్పుడు, ఈ ప్రయోజనకరమైన తర్కం సమాజానికి విలువలెలా నేర్పగలదు?

    అసలు ఈ ప్రయోజనకరమైన నాస్తిక తర్కవాదం నిరంతరం నీకు నువ్వు తెలుసుకో అని మొదటినుండీ మొదలు పెడితే సమాజానికి ఏమి అనుభవాన్ని ఈయగలదు? సత్యాన్వేషణకు గానీ, జ్ఞాన సముపార్జనకు గానీ పూర్వీకులపై కొంచెమైనా ఆధారపడకుండా ఎప్పటికప్పుడు స్వతర్కాన్ని ఉపయోగిస్తూపోతే ఆ లక్ష్య సాధనకన్నా ముందే జీవితం అయిపోతుంది కదా...! సైన్సు విషయంలోనో, గణితం విషయంలోనో మనం పూర్వీకులపై ఆధారపడినట్లు సత్యాన్వేషణకు కూడా ఆధారపడటం వివేకవంతమైన పని కాదా...! పరిశోధనలుండొచ్చు. కానీ సైన్సులో కూడా కొత్త పరిశోధనలకు అప్పటికే ఆవిష్కరింపబడిన సూత్రాలు ప్రాధమికమే కదా...!

    భాస్కర్ గారూ,

    బిడ్దకు మనము నేర్పాల్సింది ఆలోచనా జ్ఞానం,జీవించడానికి మంచి సూత్రాలు, మానవత్వం.

    వీటిని మనం బిడ్డకు ఆస్తికత్వంతో నేర్పాలా నాస్తికత్వంతో నేర్పాలా అన్నదే నా మీమాంశ.

    రిప్లయితొలగించండి
  18. @ శ్రీనిక గారు : నా తరువతి టపాలో కూడా మీ ప్రశ్నకు పూర్తి స్థాయి సమాధానం లభించలేదనిపించి మళ్లీ ఇక్కడ రాస్తున్నాను.

    నా ఉద్దేశం ప్రకారం పిల్లలకు చిన్న వయసులోనే ఈ భావాల గురించి నేర్పడం అంత అవసరం లేదు.

    భా.రా.రెడ్డి గారు, భా.రా.రాజు గారు చెప్పినట్టు నాస్తికులైనా, ఆస్తికులైనా నిజాయితీ, ఆత్మ విమర్శ పిల్లలకు నేర్ప గలిగితే వారు పెరిగిన తరువాత వారి దారేదో వారే నిర్ణయించుకుంటారు. అదీ బలవంతంగా కాదు. ప్రేమతో...

    రిప్లయితొలగించండి
  19. @ బృహస్పతి గారు : నిజాయితీ, ఆత్మ విమర్శలకు ఆస్తిక / నాస్తికతలతో సంబంధం లేదని నాభావన.

    రిప్లయితొలగించండి
  20. Ooops, I missed this thread.

    బృహస్పతి గారూ, మీరు అస్తికత/నాస్తికత గురించి మాట్లాడుతున్నారు.నేనేమో ఫ్రేమ్ వర్క్ / పునాది గురించి చర్చిస్తున్నాను.
    ఇక మీ ప్రశ్నలు
    >>ప్రయోజనకరమైన తర్కవాద ప్రతిపాదన వ్యక్తిగతంగా వినటానికి బాగానే ఉంది. కానీ దాని పరిధి వ్యక్తిగతాన్ని దాటి సమాజానికి పాకినప్పుడు, ఒక కామన్ పాయింట్(ఆస్తికత్వం) లేనప్పుడు, ఈ ప్రయోజనకరమైన తర్కం సమాజానికి విలువలెలా నేర్పగలదు?

    సమాజం విడిగా అంటూ ఏదీ లేదు. వ్యక్తుల సమూహం. కాబట్టి, వ్యక్తిగతంగా ప్రయోజనకర తర్కవాదం నేర్చుకుంటే చాలు.పదిమంది కలిసిన సమాజంలో వ్యక్తిగత బుద్ధిమాంద్యం లేనప్పుడు సమాజానికి వేరే విలువలు అవసరమంటారా?

    >>అసలు ఈ ప్రయోజనకరమైన నాస్తిక తర్కవాదం నిరంతరం నీకు నువ్వు తెలుసుకో అని మొదటినుండీ మొదలు పెడితే సమాజానికి ఏమి అనుభవాన్ని ఈయగలదు? సత్యాన్వేషణకు గానీ, జ్ఞాన సముపార్జనకు గానీ పూర్వీకులపై కొంచెమైనా ఆధారపడకుండా ఎప్పటికప్పుడు స్వతర్కాన్ని ఉపయోగిస్తూపోతే ఆ లక్ష్య సాధనకన్నా ముందే జీవితం అయిపోతుంది కదా...! సైన్సు విషయంలోనో, గణితం విషయంలోనో మనం పూర్వీకులపై ఆధారపడినట్లు సత్యాన్వేషణకు కూడా ఆధారపడటం వివేకవంతమైన పని కాదా...! పరిశోధనలుండొచ్చు. కానీ సైన్సులో కూడా కొత్త పరిశోధనలకు అప్పటికే ఆవిష్కరింపబడిన సూత్రాలు ప్రాధమికమే కదా...!

    సైన్స్ వేరు ఆధ్యాత్మికత వేరు. సైన్స్ చాలావరకు కంటితో చూసి నిర్థారించుకుంటాము. ఆధ్యాత్మకతలో మనస్సే చక్షువు. పూర్వీకుల జ్ఞాన సముపార్జనపై ఆధారపడాల్సిందే కానీ కేవలం సైన్స్ లాగా ప్రయోగాలు చేసి చూడలేనిదీ సత్యం. అంతే కాదు పూర్వీకుల జ్ఞానం అంతా మంచినే పంచింది అని నేననుకోవటంలేదు. అందుకే శిశువుకు ఏదీ మంచో ఏది చెడో గ్రహించ గల బుద్ధిని మనం నేర్పాలి. తరువాత జీవితం తనిష్టం.

    >>బిడ్దకు మనము నేర్పాల్సింది ఆలోచనా జ్ఞానం,జీవించడానికి మంచి సూత్రాలు, మానవత్వం.
    వీటిని మనం బిడ్డకు ఆస్తికత్వంతో నేర్పాలా నాస్తికత్వంతో నేర్పాలా అన్నదే నా మీమాంశ.

    ఆలోచనా జ్ఞానం,జీవించడానికి మంచి సూత్రాలు, మానవత్వం వీటికి దేవునితోనో లేక ఆస్తికత్వంతోనో లేక నాస్తికత్వంతోనో అస్సలు సంబంధం లేదు.

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.