15, డిసెంబర్ 2009, మంగళవారం

కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా?


"కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి" ఏదేవాలయానికి వెళ్లినా సాధారణంగా దేముడి కంటే ముందుగా పెద్దపెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఈ బోర్డు. కొన్ని దేవాలయాలలో ఉండదు. అంటే అవి ఈ మధ్యే కట్టిన దేవాలయాలు అని తెలుసుకోవచ్చు. ఆ దేవాలయ కమిటీ వారికి ప్రజలనుండి సంపాదించే మార్గాలు ఇంకా పూర్తిగా తెలియలేదు అని అర్థం. అలా అని ఎల్లకాలం అలానే ఉండరండీ. త్వరలోనే వారికి కాస్తో కూస్తో భగవంతుడిమీద ఉన్న భక్తి కాస్తా, ధనం మీదకి మళ్లు తుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎవరినుండి ఎంత ఎలా చందాగా పోందవచ్చు? ఈ చందాలు కాకుండా ధనాన్ని కూడ కట్టడానికి ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయి? అనే అన్వేషణ మొదలవుతుంది ధర్మకర్తలలో. ఇక ఆక్రమంలో ఈ బోర్డు వచ్చేస్తుంది. ఇది సాధారణమైపోయింది ఈమద్య దేవాలయాలలో.

భక్తులు హుండీలో మాత్రమే కానుకలు వేయాలి అని బోర్డు పెట్టడంలో ఆంతర్యం. భక్తులు కానుకలు హుండీలో కాక మరెక్కడ వేస్తున్నారు. ఎక్కడవేస్తారు? అర్చకునికి దక్షిణగా ఇస్తారు. ఇదే ఇదే ఇక్కడే చిక్కంతా. మరి దేవాలయం వారిచ్చే వెయ్యి, రెండు వేలు కాకుండా? వారిచ్చే ఓ స్టోర్ రూములాంటి వసతి గది కాకుండా ఇంకా ఆ అర్చకుడు పై ఆదాయం సంపాదించుకుంటుంటే దేవాలయం ఏమైపోవాలి? దాని అభివృద్ధి ఎమైపోవాలి? అర్చకుడు అభివృద్ధి చెందితే సరిపోతుందా? గుడి గురించి ఎవరు పట్టించుకుంటారు? అని ధర్మకర్తలు తెగ మథనపడి ఇలాంటి ధర్మ నిర్ణయం తీసుకుంటారన్నమాట.

అసలు ఇది ఎంత వరకు సమంజసం. చందాల ద్వారా గుడిని అభివృద్ధి పరచాలనుకోవడం కొంతవరకూ సమంజసం. ఇది కూడా ఓ విధంగా చేతకాని తనమే.
పూర్వకాలంలో రాజులు, లేదా గ్రామ పెద్దలు దేవాలయాలు నిర్మించే వారు. వారికి ధనానికి కొరతేమిటి? దేవాలయ నిర్మాణం ఖర్చులన్నీ ఒక్కరే భరించే వారు. గుడి కట్టిన తరువాత దాని పోషణకు కావలసిన ధనాన్ని ,అర్చకుని జీవనానికి కావలసిన ధనాన్ని కూడా వారే ఇచ్చేవారు. ఇందుకోసమే ఒక్కో దేవాలయానికీ కొన్ని వందల ఎకరాల భూములను రాసిచ్చే వారు. ఆ భూములలో పండిన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ఖర్చులన్నీ నడిచేవి.

కాలం మారింది. తరువాతి కాలంలో ప్రభుత్వాలు ఆ భూములను ఎలా స్వాధీన పరుచుకున్నాయో,అర్చకులకు ఏ మాత్రం మిగిల్చాయో అదంతా జగద్విదితమే.
మరి నేడు కొత్త గా కట్టే దేవాలయాల సంగతి ఏమిటి? దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? చాలా చోట్ల నేడు భూములు అన్యాక్రాంతమవకుండా, దానిమీద కొంత పెత్తనం చెలాయించడానికి దేవాలయాలు కడుతున్నారు. కట్టే వారు వారిధనంతో కట్టేంత ఉద్దాత్త హృదయం ఉండదు ( ఒక వేళ వారి వద్ద ఓ దేవాలయం నిర్మించ గలిగే ధనం ఉన్నా సరే ). అందరివద్దా చందాలు వసూలు చేయాలి. దానీ లో వీరిదీ ఓ 5% వాటా ఉంటుంది . అంతకూడా ఉండదు. మొత్తానికి వారిచిన్న ధనంతోనూ , వీరిచ్చిన ధనంతోనూ దేవాలయం పూర్తిచేస్తారు. మరి గుడి కట్ట గానే కళ్యాణ మవుతుందా? దానికి ఓ అర్చకుని నియమించాలి. అతనికి జీతం సమకూర్చాలి. మరి నిత్యం ఓ కొబ్బరికాయ కొట్టాలన్నా ఖర్చు ఉంటుంది కదా? దీపారాధనకు నల్ల నువ్వుల నూనె ఎంత ప్రియం అయిపోయిందో. ఆ ఖర్చులన్నీ ఎలా? మళ్లీ చందాలకోసం ఎదురు చూపులు. గుడి కడుతున్నామంటే ఏదో చందా ఇస్తారు కానీ. నిత్య ఖర్చులకు అంతగా ఎవరూ చందా ఇవ్వడానికి ముందుకు రారు. కొంత కాలం ఎదో తప్పదనుకుంటూ ఖర్చు పెడతారు మన ధర్మకర్తలు. కానీ అది ఎంతోకాలం సాగదు. మొత్తం సంపాదించిన డబ్బులన్నీ గుడికే ఖర్చుపెడితే ఇంట్లో ఆడవాళ్లు గరిటలు తిరగేస్తారు మరి. దానితో ధర్మ కర్తల దృష్టి అర్చకుని ఆదాయం మీద పడుతుంది. రోజూ వచ్చే భక్తులు ఏవొ పూజలు చేయించుకుని ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటూ ఉంటారు. ఆ ఆదాయంతో అర్చకుడు తెగసంపాదించేస్తున్నాడని వీరికి మనసులో ఆవేదన మొదలవుతుంది. దాని ఫలితమే ఇదంతా?

కొంతమంది దేవాలయాన్ని పూర్తిగా తమఖర్చుతో కట్టించే ధర్మక్ర్తలూ ఉన్నారు. తరువాతి కాలంలో ఖర్చులు కూడా వారే భరిస్తారు. కానీ అర్చకుని ఆదాయం వద్దకు వచ్చేసరికి ఒకరకమైన బాధ మొదలవుతుంది. అతని ఆదాయానికి, తమ హుండీ ఆదాయానికీ పోలిక మొదలవుతుంది. నెమ్మదిగా పైన చెప్పిన బోర్డు వస్తుంది. కుదరదని వ్యతిరేకించిన అర్చకుడు తొలగించ బడి ఓ కొత్త అర్చకుడు వస్తాడు.( ఆ వచ్చే అర్చకుడు ఎందుకు వస్తాడో తెలుసా. అతనికి ఆ గుడి వారిచ్చే వెయ్యా, రెండు వేలు కూడా గతిలెదు కనుక. )

ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు వచ్చే భక్తులు కానుకలు వేసే ఆచారం ఎందుకు వచ్చింది?
1. అర్చకుని చేత పూజ చేయించుకున్న తరువాత అతనికి దక్షణ సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వున్నది. అది ఎందుకో తెలుసా? మన హిందూ వ్యస్థను ప్రధానంగ 4 వర్ణాలు గా విభజించారు. ఒక్కో వర్ణానికీ ఒక్కో బాధ్యత అప్ప గించబడింది. బ్రాహ్మలు వేదవిద్యను అభ్యసించి, అందు గల ధర్మాలను నలుగురికీ తెలియచెప్పాలి. క్షత్రియులు ఆ వేద ధర్మాన్ని అందరూ అనుసరించే టట్టు చూడాలి. వైశ్యులు ధర్మానుసరణకు కావలసిన ధనమును సముపాదించాలి. శూద్రులు కృషీ వలులై అన్న సమృద్ధిని కలిగించాలి. ఈ బ్రాహ్మలు వేదాధ్యయనంలో ఉండి ధర్మ సూక్ష్మాలను గ్రహించి తమతో పాటు నలుగురికీ తగిన ముక్తి మార్గమును ఉపదేశిస్తూ ఉండాలి. మిగతా వర్ణాల వారు ఆ ధర్మాలను ఆచరిస్తూ ధర్మ మును సంరక్షించుటలో ఆ బ్రాహ్మణులకు సహాయపడాలి. విద్యనర్జించటమె కానీ , సంపాదించటం తెలియని బ్రాహ్మల కుటుంబ పొషణ ఎలా జరగాలి? అందుకోసం ప్రతి వర్ణం వారు ఈ బ్రాహ్మణ వర్ణానికి తగిన విధంగా సహాయపడటం మొదలైంది. ఈ క్రమంలో దక్షిణ అనే సాంప్రదాయం ఏర్పడింది. ఇక సంపాదన గురించి దిగులు లెనప్పుడు ఆ బ్రాహ్మణులు ముక్తి మార్గాన్వేషకులై ఆ మార్గంలో నలుగురినీ నడిపి లోక హితం చేసే వారు.


( ఇక్కడ గ్రహించ వలసిన ప్రథాన విషయం ఒకటుంది. ఈ సాంప్రదాయంలో అన్ని వర్ణాలకూ తగిన న్యాయం జరగలేదని వాదించే వారు నేడు చాలా మంది ఉన్నారు. ఈ వర్ణ విభజన ఆర్థికంగా చూస్తే రాజుకు రాజ్యాధికారం వచ్చింది. వైశ్యునకు ఆర్థిక వ్యవహార చక్షతనిచ్చింది. శుద్రునకు భూమిని ప్రసాదించింది. మరి బ్రాహ్మణునకు ఏమి ఇచ్చింది? విద్యను ఇచ్చింది. కేవలం విద్యను మాత్రమే. ఆ విద్యకు గౌరవం ఇచ్చి మిగతా వారు తమ తమ సంపదలను దానం గా ఇచ్చే వారు. అంటే దానం తీసుకునే స్థితిలోనే బ్రాహ్మడు ఉన్నాడు కానీ. ఇవ్వ గలిగే స్థితి కాదతనిది.

సరే ఇది కాదు గమనించ వలసిన విధానం. మన వ్యవస్థ ఆర్థిక దృష్టితో చేయబడినది కాదు. మోక్షం అనే దృష్టితో చేయబడినది. అందరికీ మోక్షం కలగాలి. అదే మన జీవన విధాన ప్రధాన లక్ష్యం. మోక్షం అంటే ... ఎందరో ఎన్నో చెప్పారు. అది మరో టపాలో చూద్దాము. ఒక్కమాటలో చెప్ప్పాలంటే మోక్షమంటే ఆనందం. నిశ్చల ఆనందం. ఆ ఆనందం అందరికీ సమానంగా ఉండాలి అదే మన హిందూ మత సాంప్రదాయ ప్రధాన లక్ష్యం. మరి అందిందా అందరికీ ఆనందం . నిస్సంకోచంగా అందింది. ధర్మం పాఠించిన ప్రతీ ఒక్కరికీ అందింది. జీవించినంతకాలం ఆనందం వారి జీవితాలలో తాండవించింది. ధర్మం తప్పిన ప్రతీ ఒక్కరికీ అది దూరమయ్యింది. దూరమవుతూనే ఉంది. బ్రాహ్మలు కూడా దీనికతీతులు కారు. )
2. భక్తులు మొక్కులు మొక్కి హుండీలలో కొంత ధనాన్ని వేస్తారు. లేదా ఎటువంటి మొక్కూ లేకపోయినా దేవాలయ నిమిత్తం హుండీలో కానుకలు వేస్తారు. దేవాలయం కోసం అని వేసే విశాల హృదయులు నేడు చాలా తక్కువ. మొక్కుల రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ. మొక్కుల ద్వారా వచ్చే ఆదయానికి ఆశపడి కొన్ని దేవాలయాల వారి ప్రచారం మరీ ఎక్కువవుతున్నది.

ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ధర్మ కర్తలు, అర్చకుని ఆదాయాన్ని నియంత్రించే మార్గాలను వెతుకుతారు. అతనికి హారతి పళ్లెంలో వసే చిల్లరతో సహా అతను హుండీలోనే వేయాలి అనే నియమంతో అర్చకుని నియమిస్తారు. ఒక వేళ ఏ భక్తుడైనా ఇదేమిటని ప్రశ్నించి నేను అర్చకునికే వేస్తాను అని వాదించింనా లాభం లేదు. అతను వెళ్ల గనే ఆ దక్షిణ హుండీలో పడాలి. ఎండోన్ మెంటు దేవస్థానాలలో ఇది మరీ అధ్వాన్నం. అలా పళ్లెంలో వేసే ధనాన్ని అర్చకుడు దొంగ తనంగా ఎవ్వరి కంటా కనపడకుండా ఇంటికి తీసుకు వెళ్ల్లాలి. ఇలా మొదలైన దొంగతనాలు నగల వరకూ ప్రాకు తాయి కొందరు అర్చకుల విషయంలో. ఇది నిస్సంకోచంగా ఖండించ వలసిన విషయం. ఇందులో ఎవరూ ఆ అర్చకులను వెనకేసుకు రాకూడదు.అసలు దొంగతనం ఎందుకు చేయాలి అర్చకుడు?
తన డబ్బును దేవస్థానం వారు అదో హక్కులా లాక్కుంటుంటే అర్చకుడు చూస్తూ ఊరుకోవలసిందేనా? దీని కేమిటి పరిష్కారం? మీదృష్టిలో ఇది సబబేనా?

గమనిక: ఏ దేవాలయంలోనూ నేను అర్చకుడిని కాదు. సర్వ స్వతంతృడి నైన పురో హితుడిని. పూజ చేయించమని గౌరవంతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయిస్తాను. లేదా ఇంట్లో కూర్చుంటాను. అర్చకునిగా మొదట కొంతకాలం చేశాను కనుక, తోటి వారి కష్టాలు చూస్తున్నాను గనుక మనసాగక ఇదంతా రాశాను. ఎవరి మనసైనా నొప్పించి ఉంటే మన్నించండి. ఈ విషయంలో మీరు చేయగల సహాయమేమిటో ఆలోచించండి. ఒక్కసారి మీదగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ అర్చకుని జీతం ఎంత? అతని కి వచ్చే ఆదాయం ఎంత? అతనికి వసతి సదుపాయం కల్పించారా? కల్పిస్తే అది ఎలాఉంది? గమనించి వచ్చి మీవ్యాఖ్యను రాయండి.

26 వ్యాఖ్యలు:

 1. శర్మగారు వొక సారి గుళ్ళో ఇలాగె పురోహోతుడి కి ఇద్దామన్న ఉద్దేశం తో హారతి పళ్ళం లో వందరూపాయలు వేస్తె పక్కనే వున్న trustee దాన్ని తీసుకుని హుండీ లో వేసాడు .ఆ తర్వాత నాకు పురోహితుని ద్వార తెలిసిందేంటంటే హారతి పళ్ళం లోవి గుడి కి శతకోపం పెట్టె టప్పుడు వేసేవి పూజారి కి చెందుతాయని .అప్పటినుంచి సటకోపం పెట్టె టప్పుడే వేస్తూ ఉంటా . రెండు వేల రూపాయల జీతం తో వొక కుటుంబం ఎలా బతుకుతుందని ఆలోచించారు గుడి పెద్దలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శర్మగారూ, నేను పొరపాటున కూడా హుండీలో వెయ్యనండీ, మనస్పూర్తిగా దైవాన్ని ప్రార్ధించి, అర్చకునినే మధ్యవర్తిగా భావించి హారతిపళ్ళెంలోనే వేస్తాను. ఇది చిన్నతనం నుంచి మా నాన్న గారు అలవాటు చేసారు. ధర్మకర్తలు గుడిని కూడా ఒక ఆదాయ మార్గంగా భావిస్తున్నారు. మనం హుండీలో వేసిన డబ్బుతో గుడి డెవెలప్ చేసిందానికన్నా వాళ్ళు తినేదే ఎక్కువ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @రవి గారు: నిజమేనండీ ఇలాంటి నియమాలున్న దేవస్తానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువమందికి శఠగోపురం పెట్టినప్పుడు కాక హారతి ఇచ్చినప్పుడు దక్షిణ వేసే అలవాటు ఉంది. :)

  శిశిర గారు: ధన్యవాదాలండీ. :)
  ఉమ గారు: నేను హుండీలో వెయ్యవద్దు అనటం లేదండీ. పేద గుడుల పోషణకు కొంత సహాయం కావాలి. కానీ అర్చకునికి వేసిన కానుకలు అర్చకునికే చెందే మార్గం చూడమంటున్నాను.
  ధన్యవాదాలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మావైపు ప్రతిగుడిలొను అర్చకుని పక్కనే ఒక అధికారి వుంతాడు.. వాడి పని ఎమిటంటే హరతి పళ్ళేం లొ వేసిన డబ్బులు తీసి హుండి లొ వెయ్యడం,. ఒకసారి నేను గుడికి వెళ్ళినప్పుడు అప్పుడే బయటనుండి వచ్చాడు.. అదే టైం కి నేను హారతి పళ్లెం లొ డబ్బులు వేస్తున్నా.. కనీసం పూర్తిగా పడలేదు కూడా వెంటనే తీసేసాడు.. గుడి అని కూడ మర్చిపొయి పిచ్చ తిట్లు తిట్టా.. కానీసం బయటకు వెళ్ళి వచ్చి కాళ్ళు కూడ కడుక్కొకుండా హారతి పళ్ళెం ముట్టుకున్నడని వంక పెట్టి తిట్టల్సిన తిట్లన్ని తిట్టేసా.. ఆ తరువాత తెలిసిన విషయం ఎమిటంటే ఆ ఆఫీసరు ప్రతి ఆదివారం చర్చి కి వెలెతాండంట.. ఇంక వాడికేమి తెలుస్తుంది హారతి పళ్లెం పవిత్రత..
  అందుకె ఇప్పుడు గుడికి వెలితే హుండి వెసే మినిమం వెసేసి.. నేను ఇవ్వలనుకున్నది అర్చకుడీకి పాదాభివందనం చేసి దక్షణగా ఇస్తా..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చిన్న చిన్న దేవాలయాల్లో పని చేసే అనేక అర్చకుల పరిస్థితి చాల చొట్ల దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఈ విషయం తెలీక చాలా మంది సకల పురోహిత వర్గాన్నీ ఒకేగాటన కట్టి వాళ్ళేదో సకల సంపదలనుభవిస్తున్నారని ఆడిపోసుకోవడం ఫాషన్ ఐపోయిందివాళ!

  ఇద్దరు మనుషులు ఒకపూట మంచి రెస్టారెంట్ కి వెళ్ళి అరా కొరాగా భోజనం చేస్తే అవుతుంది వెయ్యి రూపాయల బిల్లు!

  లేనిపోని పూజలు నియమాలు సూచిస్తూ జనాన్ని దోపిడీ చేసే ఒకరో ఇద్దరో పురోహితుల్ని సాకుగా చూపి అందరూ అలాంటి వారే అని జనాన్ని నమ్మించడంలో వారికి మిగిలే ఆత్మ సంతృప్తి ఏమిటో వారికే తెలియాలి.

  నమ్మిన ధర్మాన్ని వీడలేకే గానీ కేవలం బ్రతుకు దెరువు కోసమే అయితే ఈ అర్చకత్వాలు మెతుకు కు కూడా కొరగావు.

  కానుకలు హుండీలోనే వేయాలని సూచించే వణిజ ధర్మ కర్తలు అర్చకుల జీత భత్యాల విషయంలో కూడా ఇంతే లిబరల్ గా ఉంటే ఎంత బాగుండు!

  నా మటుకు నేను హుండీలో కానుకలు వేయను. అర్చకుడికే ఇస్తాను. గుడి అభివృద్ధి కోసం కావాలంటే చందాలు వసూలు చేసుకోమనండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సినిమాల్లో చాలా నీచంగా పురోహితుల్ని చూపించడం (ఒరేయ్ పంతులు, నీ దక్షిణ నీకు ముట్టిందిగా లాంటి) డైలాగులు గురించి మీనుంచి ఒక టపా ఆశించవచ్చా. మీరే రాయచ్చు కదా అని మీరడగవచ్చు. నాకంటే అదే వృత్తిలో ఉన్న మీకు విషయం మీద సరైన, ఎక్కువ అవగాహన వుంటుందని. వీలైతే ప్రయత్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "బ్రాహ్మణునకు ఏమి ఇచ్చింది? విద్యను ఇచ్చింది. కేవలం విద్యను మాత్రమే. ఆ విద్యకు గౌరవం ఇచ్చి మిగతా వారు తమ తమ సంపదలను దానం గా ఇచ్చే వారు. అంటే దానం తీసుకునే స్థితిలోనే బ్రాహ్మడు ఉన్నాడు కానీ. ఇవ్వ గలిగే స్థితి కాదతనిది."

  మీరు ఇది గమనించాల్సింది కాదన్నా...
  మీరు చెప్పినది ముమ్మాటికి నిజం ..
  మా కుటుంబమే దీనికి ఓ పరాకాష్ట ..
  చాలిచాలని జీతం ,నిత్యావసరాలను సమకూర్చటానికే చాలదు .
  ఇక పిల్లల చదువుల మాట దేవుడెరుగు .
  బాగా చదివినా రిజర్వేషన్లు(కనుక ) కొంపమున్చుతున్నాయి.
  నానాటికి బతుకులు దీనమయిపోతున్నాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మంచు పల్లకీ గారు ( ఈ పేరు తో పిలవడం కాస్త ఇబ్బందిగా ఉందండీ. మీ ప్రొఫైల్ లో మీ పేరు/మీ కిష్టమైన పెరు పెట్టుకోండి. పిలవడానికి బాగుండేది. ఇది కూడా బానే ఉంది, కానీ దీనర్థం బాగోలేదు. మంచు అంటే కరిగిపోయేది కదా? ఏమో.... నాకలా అనిపించింది. మిమ్మల్ని నొప్పించుంటే మన్నించండి.):

  "గుడికి వెలితే హుండి వెసే మినిమం వెసేసి.. నేను ఇవ్వలనుకున్నది అర్చకుడీకి పాదాభివందనం చేసి దక్షణగా ఇస్తా.."

  మీ పద్ధతి బాగుంది. హుండీలో కూడా కొంత వేస్తుండాలి. :)

  సుజాత గారు : " నమ్మిన ధర్మాన్ని వీడలేకే గానీ కేవలం బ్రతుకు దెరువు కోసమే అయితే ఈ అర్చకత్వాలు మెతుకు కు కూడా కొరగావు. "

  ఇది నిజంగా నిజమండీ. అయితే కొందరు ఏదారీ లేక ఈ పురోహితం చేపట్టి నప్పటికీ... తరువాత అనేక వేరే అవకాశాలు వస్తున్నప్పటికీ అవన్నీ కాదని ధర్మా పేక్షతో ఈ వృత్తిలోనే ఉంటున్నవారూ ఉన్నారు. అలాగే కేవలం ఏ గతీ లేక ఇందులో వచ్చె అరా కొరా సంపాదన కోసం ఈ వృత్తిలో ఉంటున్న వారూ ఉన్నారు. ఒక్కటి

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కరెంట్ పోవడం వల్ల వ్యాఖ్య మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.

  ఒక్కటి గుర్తించాలి. ధన సంపాదన కోసమే అయితే ఎన్ని సప్లీలు రాసయినా, ఓ డిగ్రీ పొందడం ఓ జాబు సంపాదించండం అంత కష్టమేమీ కాదు. నేడు కాస్త ఇంగ్లీషు వస్తే కాల్ సెంటర్లో పని చేసైనా నెలకో 10, 15 వేలు సంపాదించ వచ్చు. మరి అలాంటిది ఇంకా పురోహితులు, అర్చకులు తమ వృత్తులును చేస్తున్నారంటే అభింనందించ వలసిందే మీరందరూ. :)

  పురోహితులూ, అర్చకులూ అంత మయితే హిందూ వ్యవస్థ అంతరించినట్టే. నుదుట కాస్త బొట్టు పెట్టమని, ఇంట్లో దీపరాధన చెయ్యమనీ కూడా చెప్పే వారుండరు. :(

  శిశిర గారు : తప్పకుండా త్వరలో రాస్తాను. మీరు అడకపోయినా నానుండి అటువంటి టపా వచ్చి ఉండేది. :)

  సంతోష్ గారు : ఇదే విచారకరం అండీ. ఇందుకు మనం కూడా మారుతున్న పరిస్థితులను గమనించి, సంపాదనకు కేవలం ఈ వృత్తి మీదే ఆధార పడక ఇతర మార్గాలు అన్వేషించాలి. చెప్పినంత సులువుకాదిది. నాకు స్వీయానుభవం. ఇదీ సంపూర్ణంగా చెయ్యలేక, మరొక వృత్తినీ సంపూర్ణంగా స్వీకరించలేక సతమతమవ్వాలి. రాబోయే తరాలలో నైనా వేద విద్యతో పాటు, సంపాదనకు ఉపయోగ పడే మరో విద్యను నేర్పాలి. లేక పోతే రాబోయే కాలం వారు చాలా కష్టాలు ఎదుర్కోవాలి.

  ఇప్పుడే మీ బ్లాగుకు వెళ్లి వస్తున్నాను. మీ స్వాగతం చాలా బాగుంది. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నా బ్లాగ్ ను దర్శించినందుకు కృతఙ్ఞతలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అర్చకుడు కూడా నాకు దేవుడు లాగానే అనిపిస్తారండి.ముఖ్యంగా, నల్లకుంట లోని శంకరమఠం లో వయసులో పెద్ద వారైన ఒక పూజారి ఉన్నారు. వారికి ఎంతోకొంత ఇవ్వకుండా నాకు అక్కడనుంచి రాబుద్ధికాదు. చాలా మంచి భావాలు చెప్పారు. మీరేం చేస్తు ఉంటారండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. జయ గారు: నేను పురోహితుడినండీ. అంటే పెళ్లిళ్లు, వ్రతాలు, జపాలు, హోమాలు మొదలైనవి చేయిస్తుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. శర్మగారు మీకు అస్సలేం తెలీదు!

  ఎవరైనా తమ కడుపు నిండిన తరువాతే పక్కవాడి గురించి ఆలోచిస్తారు. పాపం ఈ దేవాలయాల్లో ఉండే అధికారులు కూడా అంతేనండి. కాకపొతే గుడిని వీలయితే గుళ్ళో లింగాన్ని కూడా మింగినా ఇంకా తీరనంత ఆకలితో బాధపడుతున్నారు పాపం. అసలు దేవుడి నిత్యార్చనకే ధూప దీప నైవేద్యాలు పెద్ద ఖర్చుగా భావిస్తారు. ఇంక అర్చకుల గోడు వినిపించుకునే తీరికెవరికి? అయినా ఈ రోజుల్లో గుడి అనేది బడి తరువాత అత్యంత లాభసాటి వ్యాపారం అయిపోయింది. కొన్నాళ్ళు పొతే అర్చకుల జీతం, దక్షిణ రెండూ మిగుల్చుకోడానికి ఏ ఆడియో క్యాసెట్ల ద్వారానో అష్టోత్తరాలు, సహస్రనామాలు చదివించేయగలరు. అంత సమర్దులే మన అధికారులు.

  ఇంక దేవాదాయ శాఖ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ భక్తుడు ఎన్ని తరాల క్రిందట దేవాలయ పోషణకి ఎంత మాన్యం ఇచ్చాడో ఆ శాఖ అధికారుల కన్నా ఆ ఏరియాలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకే లెక్కలు సరిగ్గా తెలుస్తాయేమో. ఇక నగలంటారా, నోరులేని దేవుడు, నోరెత్తే ఆవేశం లేని అర్చకుడు వాటి గురించి జనాలకి ఏం చెప్పగలరు చెప్పండి.

  ఇంకో ముఖ్య విషయం, ఈ మధ్య ప్రముఖ దేవాలయాలలో గర్భగుడులని ఏ.సి చేయిస్తున్నారని విన్నాను. (కొన్ని దేవాలయాలలో చూశా కూడా). ఆ సొమ్మేదో ఇరుకు గదిలో కుటుంబాలతో అవస్థలు పడే అర్చకులకు మరొక్క గది వేయించడానికి ఖర్చు పెడితే బావుంటుందని నా అభిప్రాయం. సాటి మనిషిని పస్తుంచి పరమేశ్వరుడికి పరమాన్నం నైవేద్యం పెడితే ఆయన హర్షిస్తాడా?

  ఇంక హుండీ విషయం అంటారా. గుడిలో దేవుడికే డబ్బులివ్వక్కర్లేదండి ...సాటి మనిషిలో ఉన్న ఆకలి తీర్చేందుకు ఆ డబ్బు వాడినా అదే పుణ్యం కదా అని నా ఫీలింగ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. శర్మ గారూ చాలా బాగా చెప్పారు. మనుషుల తత్వమే అంత. అదే గుడిలో అవసరం లేని ఒక నిర్మాణం చేయాలని చెప్పండి, గుడ్డిగా డబ్బులు ఇస్తారు. నాకు తెలిసి 80% గుళ్ళలో పూజారులు సగటు మధ్యతరగతి కంటే తక్కువ ప్రమాణాలతో జీవిస్తుంటారు. ఇది నిస్సందేహంగా అమానవీయత.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. అబ్బాయ్ శర్మా,

  నీ బ్లాగు చదివాక నాకు నీతో కొంచెం సేపు మాట్లాడాలనిపించి ఈ వాఖ్య వ్రాస్తున్నాను. నీ తపన నాకు అర్దమయినది కానీ అర్చకుల గౌరవాన్ని ఎవరు తగ్గించారు? ముందు నీవు ఆ ప్రశ్న వేసుకో, దానికి సమాదానం నీకు దొరుకుతుంది.

  "కులం చెరిచేవాడున్నాడు కానీ కూడు పెట్టేవాడు లేడు" అని మన పెద్దలు మొత్తుకుంటూనే ఉన్నారు. మన వాళ్ళు దానిని పెడచెవినపెట్టి, స్నేహమనేముసుగులో, ఇతర కులస్తులు మనకి తీయని మాటలు చెప్పి మన చేత తప్పు చెయించి [తినకూడనివి తినిపించి ,తాగకూడనివి తాగించి] సదరు బ్రాహ్మణుడు లేక అర్చకుడు[సాత్వికుడు కనక], స్నేహితుడు బాధపడతాడేమోనని ఊహించి తప్పుచేస్తున్నాడు. అది తెలుసుకోక సదరు అర్చకుడు పప్పులో కాలేస్తుంటే, మన మీద మరియు మన బ్రాహ్మణ్యం మీద గౌరవం ఎందరికి ఉంటుంది? ఎందుకుండాలి? కనుక ఇతర వర్ణాల వాళ్ళెవరైనా మన గురించి ఎందుకాలోచిస్తారు?

  ఇక్కడ నేను నిన్ను ప్రశ్నిస్తున్నానని అనుకోవద్దు. ఇక్కడ కొన్ని నిజాలు మనం తెలుసుకొంటే మంచిదని నాకు తెలిసినవి చెపుతున్నాను. తప్పుగా అనుకోకు!

  పూజారులలో కొంతమంది వర్ణసంక్రమణం చేసి మీలాంటి వారికి అప్రదిష్ట తెస్తున్నారు. అలాంటి వారి వల్ల మీలాంటి వారికి లభించాల్సిన గౌరవం మీకు లభించడం లేదని ఒక వేళ మీకు లభించినా అది మీ ఆలోచనలకు తగ్గట్లుగా మీరు పొందడం లేదని నాఅభిప్రాయం.

  ఇందు మూలముగా తెలియజేయడమేమనగా ఒక నాణానికి రెండు కోణాలున్నట్టు నీవు రాసిన అంశానికి "స్వయంకృతాపరాధం" కూడా ఉంటుందని,[పూజారి బ్రతకలేక పోవడానికి] నాఆలోచన.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఉమా శంకర్ గారు: మరేనండీ తెలిసినా ఇదంతా చెప్పినా తీర్చే దిక్కేది?

  ఈ సమస్యలు కొంత అదుపులొకి రావాలంటే వీటిని ముందు ప్రజల దృష్టిలోకి తేవాలి. మరి ఎవరు తెస్తారు? మామూలుగా రోజూ వచ్చే భక్తులు ఇంత లోతుగా ఆలోచించరు. వారికి చాలా విషయాలు తెలియదు. తెలిసింది అర్చకులకి, ధర్మ కర్తలకు. చేసేది ధర్మకర్తలే కాబట్టి వారు నోరెత్తరు.

  ఇక అర్చకులు చెప్పలేరు. ఎందుకో తెలుసా ఇది (దేవాలయాలు ) ఆధ్యాత్మిక ప్రపంచం. అర్చకులు ఆ ఆధ్యాత్మికతకు ప్రతీకలు గా నిలవాలి. కానీ ఇలా ధన విషయాసక్తితో ఉండకూడదు. ఎవరైనా దరిద్రం భరించలేక జరిగే అన్యాయం గురించి నోరెత్త చెబితే ఈ అర్చకునికి డబ్బు ఆసక్తి ఎక్కువ అంటారే కానీ, అతని కోణంలో ఆలోచించే వారు తక్కువ. ( ఈ వ్యాసం చదివికూడా కొందరు నాకు ధనం గూర్చి చింతన ఎక్కువని ఆలోచించి ఉండవచ్చు. కానీ యదార్థం వెలుగు చూడటం కోసం నన్ను తప్పుగా భావించినా ఫర్వాలేదు. నేను ఇటువంటి వాటికి వెరువను. నేనేమిటో నాకుతెలుసు, నన్ను వ్యక్తిగతంగా ఎరిగినవారికి తెలుసు. )

  కాని ఒక్కసారి ఆలోచిస్తే, భక్తులు అర్చకునికి జరిగే అన్యాయం గురించి ధర్మకర్తలను నిలదీస్తూ ఉంటే తప్పకుండా మార్పు వస్తుంది. ధర్మ కర్తలు పేరు చెడిపోకూడదనే ఉద్దేశంతో నైనా అర్చకునికి మంచి సౌకర్యాలు కల్పిస్తారు. ఇది జరగాలంటే భక్తులను ఆలోచింప చేయాలి.


  అందుకే కాస్త ఆలోచిస్తారని ఈ టపా రాశాను. :)

  జీవని సంతోష్ గారు : ధన్యవాదాలండీ. మరి మీ చుట్టు ప్రక్కల ఆలయాలలో దేవాలయాలలో అర్చకులకు జరిగే అన్యాయాలను గూర్చి ధర్మకర్తలను నిలదీయండి. ఒకటికి రెండు సార్లు ప్రశ్నించండి. క్రమంగా మార్పు రావడం మీరే గమనిస్తారు.
  ఎంత ఎక్కువ మంది ప్రశ్నిస్తే ఆ దేవాలయంలో అంత తొందరగా మార్పు వస్తుంది. ఇదే పని అర్చకుడు చేస్తే వచ్చె మార్పు కంటే ఇది 10 వంతులు ఎక్కువ ఉంటుంది. :)

  రత్నగారు : నమస్కారం అమ్మ :). చాలా చక్కని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న ఎవరైనా వేస్తారేమోనని ఎంతగానో ఎదురుచూశాను.

  మీ రన్నట్టు నాణానికి రెండు పర్శ్వాలూ ఉన్నాయి. ఆ రెండో పార్శ్వం త్వరోలోనే రాయాలని ఈ టాపా రాసినప్పుడే సంకల్పించాను. ఈ లోపు మీరూ ప్రశ్నించారు. త్వరలోనే పురోహితం మీద వచ్చే నా టపా చూడండి. మీ నుండి ఇటువంటి వ్యాఖ్యలు మరిన్ని ఆశిస్తున్నాను. అవినాకు శ్రీరామ రక్ష. (ఏదో మొహమాటం కొద్దీ బాగుందండీ అనడం అందరూ అంటారు. కానీ తప్పొప్పులు నిజాయితీగా ప్రశ్నించేవారే నిజమైన శ్రేయోభిలాషులు )

  మీరు నాతో ఎప్పుడైనా ఫోన్ చేసి మరీ మట్లాడ వచ్చు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. శర్మ గారు మీరు చెప్పిన విషయాలు ఆలయ నిర్వాహుకులకు కనువిప్పు కల్గించాలని అశిద్దాం. అలాగే సుజాత గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకిభవిస్తున్నాను. మంచి విషయాలు రాస్తున్నందుకు అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. మీరు చెప్పిన దానికి నేను కొంత వరకు సమర్ధిస్తున్న కాని నాకు కలిగిన కొన్ని అనుభవాలు కూడ ఇక్కడ ప్రస్తావిస్తున్న. కొందరు అర్చకులు కూడ మరి ఈ మధ్య మనీ మైండెడ్ అయ్యారండి.కేవలం వారి హారతి పళ్ళెం లో పదో,వందో ఎంతొ కొంత వేసిన దానిని బట్టి పూజలు చేస్తున్నారు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి మర్యాద,మత్రాలు మంచిగా చదువుతారు మిగిలిన వారిని చిన్న చూపు చూడటం నెట్టెయడం చేస్తున్నారు. సద్ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి కూడ ఇల విమర్సించి రావల్సిన పరిస్తితికి చింతిస్తున్న.నా వరకు నేను కాళ్ళకి దండం పెట్టి మరి ఎంతో కొంత వారి చేతిలో పెడత. ఇక హుండి అంటార నేను చిలుకూరి బాలాజి దైవాలయం సందర్సించినటప్పడి నుండి(2005 నుండి) సందర్సన టికెట్ కి, కొబ్బరి కాయ టికెట్ కి, హుండి కి నేను చాల దూరం గా జరిగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

  * పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం
  * పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
  * బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
  * జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
  * అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
  * చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
  * చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
  * కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
  * బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
  * తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
  * కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
  * నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
  దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

  * ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]
  * మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
  * కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
  * నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
  * గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

  ప్రత్యుత్తరంతొలగించు
 20. అమర్ గారు ధన్యవాదాలు.
  విజయ్ క్రిష్ణ గారు మీరు చెప్పినది నిజం. పురోహితులలో కూడా నేడు భక్తి కొరవడడం నేడు సోచనీయం. భక్తి కంటే , భుక్తి కోసం ప్రాకులాడడమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ వారి అసహాయతను గుర్తెరగాలి మీరు. వారా స్థితి నుండి బయటపడి, కొంత భక్తి మార్గంలో పడాలంటే మీ వంటి వారి సహాయ సహకారాలు చాలా అవసరం.

  నేను వారిని వెనకేసుకు రావటం లేదు. ఈ టపా ముఖ్యంగా ధర్మ కర్తలను, వారి విషయంలో భక్తులను ఆలో చింప చేయడం కోసం రాసినది.

  అలాగే పురోహితులు/అర్చకులను ఆలోచింప చేసే విధంగా త్వరలోనే మరో టపా రాస్తాను. ఆటపా ఇటు భక్తులకు, అటు పురోహిత,అర్చక వర్గాలకు ఉపయుక్తంగా ఉంటుదనుకుంటున్నాను.

  కనుక ఆ టపాలో ఈ అర్చకుల ఆగడాలు చాలానే వెలుగు చూడవచ్చు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 21. రహమతుల్లా గారు మంచి విషయాలు ప్రస్థావించారు. నేను హరిద్వార యాత్ర కు వెళ్లడం వలన గత వారం రోజులనుండీ నా బ్లాగును చూడలేదు. ఈ రోజే వచ్చి మీ ప్రశ్నలు చూసి మీ అధ్యాత్మిక ఆసక్తికి ఆనందం కలిగింది. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలే (ప్రశ్నలే) మనల్ని నిజం వైపుకు నడిపించేవి. ఎవరో చెప్పారని ఏదో చేయడం కాక,ఎందుకు? ఏమిటి చేస్తున్నాను? అనేది తెలుసుకుని చేయడం ఙ్ఞాన సముపార్జనకు అసలైన మార్గాలని నా అభిప్రాయం. మీలో ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయంటే మీరు నిజం(సత్యం) తెలుసుకోవాలి అనే అన్వేషణలో ఉన్నారన్నమాటే కదా? అందుకు ఆనందమేసింది.

  ఇక మీరు ప్రస్థావించిన అన్ని విషయాలకూ ఇది సరైనది (ప్రశ్నలకూ సమాధానం) చెప్పగల అర్హత, అనుభవమూ నాకున్నాయో లేదో నాకు తెలియదు. కానీ నేను అవే ప్రశ్నలు నన్ను వేసుకుంటే ఏ సమాధానాలు నాకు నేను ఇచ్చుకుంటానో వాటి ని ఇక్కడ తెలియజేస్తాను. అసలు సమాధానం ఎందుకు చెప్పదలచానంటే అవన్నీ మూఢనమ్మకాలని నేను అంగీకరించలేను కనుక. కొన్ని మాత్రం నిస్సందేహంగా ఖండించ దగినవే.కానీ అన్నీ కాదు.

  ఇక మీకు జవాబు రాయడం మొదలు పెడితే అదే ఓ పెద్ద టపా అయ్యింది. ఇంకొద్ది సేపట్లో మూఢ నమ్మకాలపై వచ్చే నా తరువాతి టపాలో చూడండి.ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 22. విజయ్ శర్మ గారు, చాలా మంచి విషయం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ రోజుల్లో వారికిచ్చేది నామమాత్రపు జీతాలు. మీరన్నట్లుగానే ప్రతి విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులలో పౌరోహిత్యాన్ని నమ్ముకున్న వాళ్లకు వచ్చేది తక్కువ అనిపిస్తుంది. కనీసం నేను చూసిన చోట్ల.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. చాల బాగా చెప్పారు విజయ్ ! :) నిజంగానే గుడికి వెళ్ళగానె దేవుడిని కూడ చూడకుండా చిల్లర కోసం వెతుక్కోవటం మనకి అందరికీ తెలిసిందే! మన పిల్లలకీ అదే అలవాటు చెస్తున్నాం :( నేను కూడ అదే బడి చాలనాళ్ళూ. చిలుకూరి బాలాజి గుడికి వెళ్ళాకే నేను చేసిన.. చేస్తూన్న తప్పు తెలిసింది. అప్పటినుంచి కొంచెం మారాను. అర్చకుల విషయాలు తెలుసుకున్నాక వారి మీద గౌరవభావం ఇంకా పెరిగింది. మార్పు అనేది ఒక్కసారిగా యెవరిలోనూ రాదు. మీరు ఇలాగే మంచి మంచి పొస్టులు రాయండి. మీ పొస్ట్ అందరూ అలోచించేదిగా వుంది.
  మార్పు ప్రతీ ఒక్కరి ఇంటినుంచీ మొదలు కావలి. మనం మన పిల్లలకి చెబుతూ వుంటే అదే తరతరాలకి తెలిసి మంచి అలవాట్లు గా మారిపొతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. భగవంతునికి భక్తునికి మద్య వారధి పూజారి. ఎక్కడైతే పూజారి ఆనందంగా వుంటాడో ఆవూరి ప్రజలు సుఖంగా వుంటారు.ఇది నిజం. కాని ఈ మద్య కోంత మంది కలిసి ధర్మకర్తలుగా ఏర్పడి ఆ గుడి నిర్మించి ఆ గుడిని ఓ వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారు.వారి దృష్టి ఎప్పుడూ టెంకయ టెండర్లు,వాహనాల టెండర్లు,ఎవరికిస్తే ఎక్కువ డబ్బులోస్తాయో,అని ఆలోచిస్తరే కాని గుడిలో పూజరి వున్నడు అతనికీ ఓ సంసారం వుంటుంది .మనమిచ్చే జీతం అతనికి సరిపోతుందా.అని ఏ ధర్మకర్త చూడడు. ఎవరైనా భక్తులు పూజరికి డబ్బులిస్తారేమోనని అతనిపై ఓ కెమేరా బిగించేస్తరు. దేవునికి సంబందించిన సమాచారం కన్నా కానుకలు విధిగా మేం ఏర్పాటు చేసిన హుండీల్లోనే వేయాలని పెద్ద అక్షరలతో గుడి మోత్తం రాస్తారు.ఒక్కోసారి నాకనిపిస్తుంది ఆపూజరులు ఎల్లప్పుడూ తనకోసం కాకుండా భక్తుల కోరికలు తీర్చాలని తాపత్రయపడే ఆ పూజరి యోక్క సాధకభాదకాలు చూడాల్సిన భాద్యత భక్తులదే కద. మరితమకోసం పూజ చేస్తే భక్తిలు పూజారికి సంభావనలిస్తే అదేదో తమ సొత్తు అన్నట్లు ఈ ధర్మకర్థలు తీసుకోవటం యెంత వరకు న్యాయం.?ఈ దారుణాన్ని చూస్తూ ఆదేవుడెలా చుస్తున్నాడో !ఏప్పుడూ ధనమే ప్రధానంగా చూసే కోంత ధర్మకర్తలు సుఖంగా ఉంటే, భక్తుల సుఖమే తన సుఖంగ బావించి భగవంతునిమీద భారమేసిన పూజరేమో అర్ధాకలి తో బ్రతుకతాడు

  ప్రత్యుత్తరంతొలగించు

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.