15, నవంబర్ 2009, ఆదివారం

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు?

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు? అని అప్పుడప్పుడూ పూజల సందర్భంలో కొందరు ప్రశ్నిస్తుంటారు.

వాటికి నేను ఇలా సమాధానం ఇస్తుంటాను. భగవంతుడికి కోపం వస్తుంది. అది అందరి కోపం వంటిది కాదు. మనం తప్పు చేసినప్పుడు ఆయనకు కోపం కలుగుతుంది. అది అమ్మకు తన బిడ్డ ( తప్పు చేసినప్పుడు అతని ) మీద కలిగేటటువంటి కోపం. తన బిడ్డ తప్పుచేయగానే అతను మరోసారి అలా చేయకుండా ఉండేందుకు, అతనిని సక్రమ మార్గంలో నడిపేందుకు ఆ తల్లి తన బిడ్డను ( తెచ్చిపెట్టుకున్న ) కోపంతో దండిస్తుంది. అది నిజమైన కోపం కాదు. తెచ్చిపెట్టుకున్న కోపం. అంటే కోపం వచ్చినట్లుగా అతన్ని భ్రమింపచేసి, తద్వారా అటుల మరల తప్పు చేయకూడదు అని తెలియజేయుటే ఆమె లక్ష్యం. అది ఎక్కువ కాలం ఉండే కోపం కాదు. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా మాయమవుతుంది.

అది ఎప్పుడు మాయమవుతుంది?

ఆ బిడ్డ తల్లి కొట్టగానే అమ్మా! అంటూ ఏడుస్తాడు. తన బిడ్డ నోటి నుండి ఎప్పుడైతే తన కోసమైన ఆర్తి తో కూడిన పిలుపు వినిపిస్తుందో ఆ క్షణాన్నే ఆమె కోపం మాయమై ఆ స్థానంలో ప్రేమపొంగుకొస్తుంది.

” అయ్యో! కన్నా! గట్టిగా తగిలిందా నాన్నా!? ఇంకెప్పుడూ కొట్టనులే. ఎందుకురా నాన్నా నాకు కోపంతెప్పిస్తావు? మరోసారి ఇలాచెయ్యకే మరీ? ”
అంటూ అతన్ని ప్రేమతో లాలించి బాధను మరిపిస్తుంది.

సరిగ్గా అటువంటిదే భగవంతుని కోపం కూడా. మనం తప్పు చేసినప్పుడు, మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి అతను కోపాన్ని నటిస్తాడు. అది శాశ్వతమైన కోపం కాదు. ఎల్ల కాలమూ ఉండ బోదు. ఎప్పుడైతే మనం మన కొచ్చిన బాధలకు/ కష్టాలకు తాళలేక అతని శరణు ఆర్తితో అర్థిస్తామో ఆక్షణమే అతని కోపాన్ని ఉపశమించి, ప్రేమను కురిపిస్తాడు.

మళ్లీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది.

భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేటప్పుడు ఇందరు అవినీతి పరులు ఎలా పుట్టుకు వస్తున్నారు? భగవంతుడు వారందిరినీ సరిదిద్దడేమి?

అలా అర్థించిన ప్రతీ ఒక్కరి కష్టాలు తీరే టట్లైతే ఇందరికి ఇన్ని విధాలైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? వారి బాధలు తొలగిపోవేమి? అని


భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేందుకే ఉన్నాడు. తల్లి తన అందరు బిడ్డలనూ ఒకే విధంగా చూస్తుంది. ఒకరిని ఒకలా, వేరొకరిని మరోలా చూడాదు. అందరూ మంచి మార్గంలోనే నడావాలని కోరుకొంటుంది. అందువల్లనే తప్పుచేసిన అందరినీ దండిస్తుంది. కానీ అందరూ తమను దండించింన వెంటనే ఆమెను శరణు వేడరు. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. ఒకరు ఆమెనుండి దూరంగా ఉండడం ప్రారంభించవచ్చు ( భగవంతుడి వల్ల తమకు జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయని అతని పూజించడం మానిన భక్తుల వలే ), వేరొకరు ఆమెను మోసం చేయడానికి అంటే ఆమె సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరోలా ప్రవర్తించడానికి ప్రయత్నించ వచ్చు ( రోజూ గుడిలో పూజలు చేస్తూ, బయటకు రాగానే ఇతరులను మోసంచేస్తూ ఉండే భక్తుల వలే )

కానీ ఏ కొడుకు ఎలా ప్రవర్తించాడో దానికి తగిన విధంగా స్పందిస్తుంది తల్లి. అమ్మా అని అర్థించిన వాడిని అక్కున చేర్చిన ఆ తల్లే , తననుండి దూరమవ్వడానికి యత్నించే కొడుకు విషయంలో , మోసంచెయ్యడానికి యత్నించే కొడుకు విషయంలో వేరు వేరు విధాలు గా స్పందిస్తుంది. ఏది ఏమైనా ఆమె అంతిమ లక్ష్యం తన బిడ్డను సక్రమ మార్గంలో పెట్టడమే. విద్య ఒక్కటే అయినా అది నేర్చుకునే పిల్లవాడిని బట్టి దాన్ని వేరు వేరు విధాలుగా నేర్పుతాడు గురువు.

సరిగ్గ అదే విధంగా భగవంతుడు కూడా మనందరినీ సమానంగానే చూస్తున్నప్పటికీ, మన ఙ్ఞానాన్ని బట్టి మనకు వేరు వేరు విధాలైన పరీక్షలు పెట్టి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంటాడు.

అంటే భగవంతుడు మనల్ని చూసే విధానంలొ ఎటువంటి తేడాను లేదు. ఆ భగవంతుడి చర్యలను మనం స్వీకరించే విధానంలోనే ఉంది ఈ తేడా అంతా. ఒకడుతనకు కించిత్ ఆపద కలుగ గానే భగవంతుడిని శరణు వేడితే, మరొకడు తన తలకు ఎన్ని బొప్పిలు కట్టినా ఆభగవంతుడి మహిమను గుర్తించి, అతని శరణు వేడడానికి త్వరపడడు. అయినప్పటికీ ఆ భగంవతుడు వేరు వేరు పధ్ధతులలో అతనిని అనుగ్రహిస్తాడు.

4 కామెంట్‌లు:

  1. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా ! నీలోనే ,అంటే నువ్వే .
    మాట ,చూపు,వినికిడి, స్పర్శ,వాసన మనకి తెలిసిన శక్తి లేదా ఇంద్రియాల రూపంలో ఉంటాయి .
    వీటిని మనం నిలవ చేసుకోవడం / గుర్తుంచుకోవడం అనేది మన మెదడు చేస్తుంది .
    మనం లేదా మనలోని దేవుడు చేసే ఆలోచనల శక్తి వేఱొకచోట(ప్రకృతి/అంతరిక్షం ) నిల్వ అవుతుంది .
    తప్పు, ఒప్పు,మోసం ,నేరం ,న్యాయం,అన్యాయం అనేవి ఈ నిల్వ నుంచే మనకు అందజేయబడ తాయి
    అంటే మోసపోయినవాడు తన పూర్వపు (చెడు) ఆలోచన వలన కలిగిన నిల్వ నుండి పలితాన్ని అందుకొని మోసగించిన వాడి ఖాతాలో బదిలీ /జమచేస్తున్నాడు .
    తప్పు అని నీకు / నీలోని దేవుడికి (౧ మిల్లి సెకండు అయినా ) అనిపిస్తే నీ ఖాతా లో నిల్వ అయినట్టే
    అలా కాకుండా కరక్టే అని నీకనిపిస్తే ఎలాంటి నిల్వ నీకు జమ కాదు
    ఈ నిల్వ నే మనం కర్మ అని అంటాం.
    తప్పని మనకి అనిపించినాక ఎన్ని గుళ్ళు తిరిగినా ,మసీదులు తిరిగినా ,చర్చి లో ప్రార్ధించినా
    ఈ నిల్వ తరగదు .దాన్ని అనుభవించి వేరొకరికి బదిలీ చేయక తప్పదు.
    చిన్న చెడు ఆలోచనలు కూడా మనకి మంచిది కాదు .మనకి తెలియకుండానే వాటి ఫలితాన్ని పొందుతాం ఉదా : న్యూస్ చూసి కొన్నిసార్లు భయపడతాం,బాధపడతాం ,ఆవేశపదతాం .
    అ చెడు నిల్వ లేకపోతే ఈ న్యూస్ మనకి తెలియకుండానే పోతుంది .
    దేవుడు ఒక్కడే అదే నువ్వు ,నీ మంచి ఆలోచన .
    దెయ్యం /చెడు ఒక్కటే అది నీ చెడ్డ ఆలోచన ,నీ నిల్వ ఫలితం

    రిప్లయితొలగించండి
  2. చాలా చక్కగా చెప్పారు. మీ ప్రతి వాక్యంతోనూ నేను ఏకీభవిస్తాను. దాదాపు ఇలాంటి భావననే నా ఆస్తిక-నాస్తిక వాదన, మీరు ఆస్తికులా? నాస్తికులా? అనే టాపాలలో వివరించాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. నేను ఎప్పుడు అందరితో ఇదే చెప్తుంటాను శర్మ గారు..
    మొక్కు చెల్లించక పోతే ఏదో జరుగుతుందని దేవుడు కోప్పదతాడని అనుకుంటారు..
    ఆ మాత్రం అర్థం చేసుకోక పోతే అసలు దేవుదేండు కవుతాడు మీరే చెప్పండి...

    మీరన్నట్లు క్రోదముంటే అతను దేవుదేన్డుకవుతాడు.. దైవం రూపానికి లేదు విలువ(ఇది నిజం ) దైవత్వ గుణాలకే విలువ ... ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  4. కార్తీక్ గారు: మొక్కుకోవడ మెందుకు? అది చెల్లించక పోవడమెందుకు? మీ స్నేహితుడికి మీరు ఏదైనా బహుమతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగవేశారనుకోండి, మరోసారి అతని ఇంటికి వెళ్లడానికి మీకే ఇబ్బందిగాఉండదా?

    ఆ భగవంతుడు మననుండి ఏమీ కోరడు. నాకిది చెస్తే నీకిది చేస్తా అంటూ మనమే ఏవేవో మొక్కుకుంటాము. దానివల్ల ఆ భగవంతునికి, మనకు నిజమైన బంధం ఏర్పడదు. ఆయన మన కోరిక తీర్చినా, తీర్చక పోయినా మనం ఆయనకు చేయదలచిన పూజలో, సేవో చేస్తూ పోతే ఆ భక్తిలోని అసలైన రుచి తెలుస్తుంది.

    ధన్యవాదములు :)

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.