15, ఆగస్టు 2012, బుధవారం

వైదిక వివాహ పద్ధతులలో - అనాచారములు




వైదికమైన షోడశ సంస్కారములలో వివాహము అతి ముఖ్యమైనది. అది వరునికి, వధువునకు కూడా మరు జన్మ వంటిది. అప్పటి వరకు తాము ఇద్దరిగా ఉన్నవారు వివాహమైన నాటి నుండీ ఇద్దరు కలిసి ఒక్కటిగా అవుతారు. ఆ ఇద్దరిని ఒక్కరిగా మార్చే ప్రక్రియే వివాహ క్రతువు. ఇది ఇద్దరి శరీరాలకు సంబంధించినది మాత్రమే కాదు, అది ఇద్దరి మనసులకు సంబంధించినది. ఆ మనసులను కలిపే ప్రక్రియ వివాహ మంత్రాలకు ఉన్నది అనుటలో ఎటువంటి సంశయము అవసరం లేదు. 

 ఇద్దరు వ్యక్తుల మనసులు కలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక కార్యాలయం ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆ ఆఫీస్ లో బాస్ కి, అతని క్రింది ఆఫీసర్లకీ సరిఅయిన సమన్వయం కుదరాలి. ఓ క్రికెట్ జట్టు గెలవాలంటే ఆ జట్టు కోచ్ కి, లీడర్ కి, జట్టు సభ్యులకి సరిఅయిన మానసిక బధం ఏర్పడాలి. అలాగే ఓ కుటుంబం చక్కని ఉన్నతిని పొందాలంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల మనసుల మధ్య ప్రేమ అంకురించాలి. ఆకుటుంబంలోని భార్య, భర్త ఎలా ఉన్నారు అన్నదానిని బట్టే వారి పిల్లలు ఎలా ఉన్నారు అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకే ఇంటిలో ఇద్దరు వ్యక్తులను సంవత్సరాల తరబడి ఉంచినంత మాత్రాన వారి మధ్య ప్రేమానురాగాలు జనిస్తాయనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.  దానికి మానవ ప్రయత్నంతో పాటు దైవబలం తోడవ్వాలి. అటువంటి దైవబలాన్ని ఇచ్చే ప్రక్రియే మన వైదికవివాహ పద్ధతి.   

 అత్యంత శ్రద్ధతో జరుప వలసిన ఈ వివాహపు తంతు నేడు కలి మాయ వలన ఆర్భాటాలకు లోనై అవైదికమైన పద్ధతులతో జరుగుతున్నది. వైదికంగా వివాహం జరుపుకోవాలన్న ఆసక్తి కలిగిన వారికి నేడు ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పేవారు కరువయ్యారు. ఎంతో కష్టపడి వివాహం గురించి తెలుసుకుని ఆవిధంగా నడుచుకోవాలన్న తపన ఏ ఒక్కరికో ఉన్నా అది మిగతా బంధువులు, స్నేహితులు సాగనివ్వడం లేదు. కానీ ధర్మాన్ని ఆచరించాలంటే ఇతరులు ఏమంటారో అన్న సంశయానికి లోనైతే కుదరదు. మనం ఒంటరిగానే ప్రయాణం ప్రాంరంభించ వలసి ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే మనకు కొందరు తోడవుతారు. తరువాతి తరాలకు మనం ఆదర్శమౌతాము. 

అటువంటి ఆసక్తి ఉన్నవారికి పెద్దలద్వారా తెలుసుకున్న కొన్ని సూచనలు  ఇక్కడ ప్రస్థావించ దలచాను. ఏ ఒక్కరికైనా అవి ఉపయోగ పడితే అది ఈశ్వరకృపగా భావిస్తాను. 

౧.వివాహ ముహూర్త విషయంలో ఆదివారం కావాలి. అదీ ఉదయమే కావాలి. లేదా రాత్రే కావాలి. రిసెప్షన్ చేసుకునే అవకాశం ఉండాలి అన్న విషయాలు గమనిస్తున్నారు. కానీ అది వధూవరుల భావి జీవనాన్ని నిర్ణయించేది. కనుక అటువంటి ముహూర్తము అత్యంత శ్రేష్ఠమైనది ఎప్పుడు కుదురుతుందో అప్పుడు నిర్ణయించండి అని అడిగేవారు చాలా అరుదు.
౨.    పెళ్లి మండపానికి మామిడి తోరణాలే ఉండడం లేదు.
౩. ఘటికా యంత్ర పూజలేదు.
౪. నాగటి కాడి పురోహితులు పట్టుకెళ్లాలి, అది ఆట వస్తువులా చిన్నది ఉంటుంది.  ఎద్దుల మెడపై కట్టి పొలం దున్నిన నిజమైన నాగటి కాడి  వాడాలన్న శ్రద్ధ ఎవరూ వహించడం లేదు.
౫. స్ప్రేల వంటివి చల్లుకోవడం, జీలుగు బండి ఉండలు, చంకీలు ప్లాస్టిక్ ముక్కలు తలంబ్రాల సమయంలో ఒకరిపై ఒక రు పోసుకోవడం, కొబ్బరి బోండాలకు సూదులు గుచ్చడం, మండపంపై బాంబులు పేల్చడం మొదలైన వికారములు మొదలైనవి.
౬. కెమేరా మెన్ వంటి వారు బూట్లతోనే మండపం పై తిరుగుతారుముందు కెమేరామెన్ హిందువాకాదా అన్నది ఎవరూ గుర్తించడం లేదు. ఇతర మతస్థులకు మన మత గౌరవం ఎక్కడ ఉంటుంది? చాలా పెళ్లిళ్లలో దీపం కుందులు పడతోసేది కెమేరామెన్ లే!
౭. పూర్వ సువాసినులు మండపంపై ఆసనాలు వేసుకుని కూర్చుంటారు. ముత్తైదువలు పందిరిలో ఎక్కడో చివరన కూర్చుని కబుర్లాడుతుంటారు.
౮. ఒంటి బ్రాహ్మణునితో వివాహం మొత్తం జరిగి పోతుంది. నలుగురు వేదపండితులని పిలవడం లేదు. ఆశీర్వచనం లేదు. వీడియోలకు, బ్యాండ్ మేళాలకు వేలు ధారపోస్తారు. వేదపండితులకు ఇవ్వడానికి అవసరమా అని అడుగుతారు.
౯. మధుపర్కాలకు బదులు రంగురంగుల పెళ్లి చీరలు వస్తున్నాయి.
౧౦. తెరసల్లా ఆర్భాటాలను ప్రదర్శిస్తుంది. ఒక్క కుంకు బొట్టు ఉండదు. అసలు దీనికి పేయింట్ వెయ్యకూడదు.
౧౧. పూజకు తలంబ్రాలకు - ముక్కిపోయిన విరిగిన ఎందుకూ పనికిరాని బియ్యం వాడుటలో యజమానుల విశాల హృదయం వెల్లడి అవుతుంది
౧౨. భోజనాలలో ఆర్భాటం పెరుగుతున్నది కానీ కాటరింగ్ వారు వడ్డన చేస్తున్నారు. బంధువులు వడ్డించే ఆచారం పోయింది.  కుర్చీలలో ( లేదా )  ప్లేటు పట్టుకుని భోజనం చేయాలి. క్రింద కూర్చుని ఎవరూ చేయడంలేదు, ఎవరూ పెట్టడం లేదుఇది మనం అతి ఆర్భాటానికి పోయి ఎక్కువమందిని పిలుచుకోవడంలో వస్తున్న చిక్కు.

  యజమానులకు చెప్పి సరిగా చేయించ వలసిన బాధ్యత పురోహితులయందు ఉన్నది. పురోహితులు చెప్పినట్లు ఆచరించాలన్న శ్రద్ధ యజమానులకు ఉండాలి. సత్యనారాయణ వ్రతంలో వక్కలు వందగ్రాములు కావాలంటే  తొమ్మిది గ్రహాలే కదా తొమ్మిది వక్కలు చాలు అని వాదించే వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. చెప్పేవారు దొరకడం అరుదు. చెప్పినా వినేవారు దొరకడం మహాఘనం. బ్రహ్మగారు, యజమానులు ఇద్దరూ శ్రద్ధకలవారై, బంధువుల మాటలకు వెరవక ధర్మం ఎదో అది ఆచరించే వారైనప్పుడు అది చక్కని వివాహం అవుతుంది. ఆజంట ఆజన్మాంతం అన్యోన్య అనురాగంతో సహజీవనం సాగిస్తారు. లేకపోతే విపరీతముగానే ఉంటాయి ఫలితాలు.



38 కామెంట్‌లు:

  1. నిజమేనండి.
    ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాని ఆచారాల మీద కనీస శ్రధ్ధ పెట్టడంలేదు.
    పెళ్ళి కోసం వీడియో తీస్తున్నారో, వీడియో తీయడం కోసం పెళ్ళి చేస్తున్నారో తెలియడంలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక తీపి ఙ్ఞాపంగా మిగలడం కోసం ఆధునికంగా ఉన్న సదుపాయాలన్నీ వినియోగించుకోవచ్చు. కానీ అది హద్దు దాటకూడదు. తాళి కడుతూ ఉంటూ ఆపడాంపండి అంటూ వీడియోవాడి అరుపులు, అతనికి ఫోజివ్వడానికి వధూవరుల తాపత్రయం వీటితో బ్రహ్మగారు మంత్రం మధ్యలో ఆపవలసి వస్తుంది. చేసే క్రతువు మీద ధ్యాస నిలపలేక పోతున్నారు కర్తలు. అది ఓ ప్రక్కన సాగుతున్నా మన పూజాదికాలకు అడ్డు రాకూడదు. ఆవిధమైన సూచనలు ముందుగానే చేసుకుని ఉండాలి.

      తొలగించండి
  2. నిజమేనండి చక్కటి విషయాలను బహు చక్కగా వివరించారు! దురాచారాన్ని దూరం చేయడానికి గృహస్థు మరియు నిష్ఠ కలిగిన వెరుపు లేగుండా చెప్పగలిగిన బ్రహ్మ గారు అవసరం. స్థాయీ ప్రదర్శన కోసం చేసే దుబారా ఖర్చులు చేయక సాంప్రదాయంగా చేస్తేనే వివాహ బంధానికి సరైన సార్ధక్యం కలుగుతుంది. మీ ఈ ప్రయత్నం అభినందించా దగినది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగా తెలియని విషయాలు తెలుపవలసిన బాధ్యత బ్రహ్మగారికే ఎక్కువగా ఉన్నా, గురువు చెప్పినది వినవలసిన బాధ్యత యజమానికీ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగా లేకపోయినా కార్యక్రమం వైదికంగా జరిగదు. సత్ఫలితాలను ఇవ్వదు.

      నేడు వేదమంత్ర పూర్వకంగా జరిగిన వివాహాలు కూడా విడాకుల వరకు వెళ్లడానికి వివాహం జరపడంలో శ్రద్ధలోపించడమే ప్రథాన కారణం.

      తొలగించండి
  3. జరుగుతున్న కాలానికి తగినట్లు సాంప్రదాయాల్లో కొన్ని మార్పులు జరగాలి.
    ఆధునిక హిందూ మతం అనుసరించే వారికి కాలానుగుణంగా సరళమైన విధి విధానాలు, మార్గ దర్శక సూత్రాలు, ఆచారాలు మతపెద్దలు రూపొందిస్తే బాగుంటుందేమో. పశుసేద్యం పల్లెల్లోనే అంతరించిపోతుంటే, సిటీల్లో వుండే వాళ్ళకు నాగటి కాడి లాంటివి దొరకడం కష్టమే. పగటి పూట అరుంధతి చూపడం, కనిపించని నక్షత్రాన్ని చూశాము అని వధూవరులు చెప్పడం లాంటివి కూడా మార్చాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాలం మారుతున్నది కదా అని సాంప్రదాయాల్ని మారుస్తూ కూర్చుంటే రేపటికి మనదంటూ ఏ సాంప్రదాయమూ మిగలదు. :)

      మట్టి ముంతలు, వెద్దురు బుట్టలు, నాగటి కాడి, బంగారు ఆభరణాలు, చేనేత వస్త్రాలు ( మథుపర్కాలు ) మొదలైన వన్నీ మన వివాహంలో వాడతాము. ఇవన్నీ ఆయా వృత్తుల వారి ప్రాముఖ్యతను తెలుసుకోమనకి సూచికలు. ఒక వివాహం జరిగితే బ్రాహ్మణుడు, సన్నాయి మంగళి, చాకలి,కమ్మరి, కుమ్మరి, చేనేత కారుడు, వ్యవసాయదారుడు మొదలైనవారందరూ సంతోషపడేటట్లు సత్కరించాలి. వారి వృత్తులను ప్రోత్సహించాలి. :)

      తొలగించండి
  4. నిజమేనండీ! మా వైపు (నెల్లూరు జిల్లాలో) పెండ్లిళ్ళలో మధుపర్కాలు అనే మాటే లేదు. రంగు పట్టు చీరలతోనే పెళ్ళి చేస్తున్నారు. మా ఆడపడుచు కూతురి అత్తగారు విశాఖ జిల్లావారు. వారు పెళ్ళికి తెల్ల చీర కొనాలని చెప్పగానే - వధువు తరపు వారు అదొక పెద్ద ఎగతాళి చేసే విషయంగా మాట్లాడారు. తెల్లచీర - తలంబ్రాల, అక్షింతల పసుపు అంటి పసుపు బట్టలుగా మారాలి - ! వారి వైవాహిక జీవితం పచ్చగా ఉండాలి అనేది దాని అర్ధం అని నేను అనుకుంటాను. కానీ ఖరీదైన బట్టలతో పెళ్ళి చేస్తున్నారు కనుక ఆ బట్టలు పాడు అవకూడదని తలంబ్రాల బియ్యంలో పసుపు ఊరికే చిటికెడు కలుపుతున్నారు. పెళ్ళి అనేది ఆర్భాటం గా జరుగుతోందే కానీ ఎవ్వరూ పధ్ధతులని పాటించడంలేదు. జనాలకి మన సంప్రదాయాలని అపహాస్యం చేయడం ఒక సరదా అయిపోయింది. కొన్ని చోట్ల మాత్రం నేను పధ్ధతిగా పెళ్ళిళ్ళు చేయడాన్ని గమనించాను - అది ఇంటి యజమానుల శ్రధ్ధ. మా బాబాయి గారి అమ్మాయి పెళ్ళిలో అదిపనిగా ఆయన కేవలం ఆశీర్వచనం కోసమే 4గురు వేద పండితులని పిలిపించారు. అక్కడక్కడా మాత్రమే ఇలాటి పెళ్ళిళ్ళు చూడడం బాధాకరంగా ఉంది. నాకొక సందేహం ఉంది - మధుపర్కాలు, నడుముకు దర్భ తాడు కట్టడం వంటివి బ్రహ్మణుల పెళ్ళిళ్ళకి మాత్రమే పరిమితమా? లేక పెళ్ళిలో జరిగే ప్రతీ తంతూ అన్ని కులాల వారికీ వర్తిస్తాయా? ఎందుకంటే - వెరే కులాల పెళ్ళిళ్ళలో నేను వివాహానికి ముందు జరిగే నాంది, గౌరీ పూజ, ఆఖరున జరిగే అప్పగింతలు వంటి క్రతువులు జరగక పోవడం గమనించాను. యఙ్ఞోపవీత ధారణ, సదస్యం వంటివి బ్రాహ్మణులకు పరిమితమైనవని అంటే అది సమంగానే తోస్తుంది కానీ ఇలా చాలా క్రతువులని వదిలేసి కేవలం జీలకఱ్ఱ బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాల వంటివి మాత్రమే పెళ్ళిళ్ళలో చూస్తున్నాము. అందరూ విధిగా చేయాల్సిన క్రతువును తెలిపితే ఉపయుక్తంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ మధ్య ఆర్భాటాల కోసం రంగు రంగుల పట్టు చీరలు పెళ్లి చీరగా వాడుతున్నారు. కానీ తేనె రంగులో ఉండి అంచు ఉన్న చీరనే మధుపర్కాలుగా వాడాలి. ఈ మథుపర్కాలు వథువుకొరకు మేనమామ తెస్తాడు. యోక్ర్తం ( దర్భతాడు ) బ్రాహ్మణులకు మాత్రమే. కానీ నాందీ సమారాథన, కులదేవతా పూజ, గౌరీపూజ అందరికీ ఉన్నాయి. కానీ గౌరీపూజ మాత్రమే మండపానికి వచ్చినతరువాత జరుగుతుంది. మిగిలినవి ఇంటివద్ద జరుపుకుని వస్తారు.

      తొలగించండి
  5. వివాహ పద్ధతుల విషయంలో నేను మీ నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకోగోరుతున్నాను... వివాహ సమయంలో ఏ ఏ పూజలు నిర్వర్తిస్తారు? అవి ఎందుకొరకు నిర్దేశింపబడ్డాయి..?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటినుండో రాయాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు రాసే ప్రయత్నం తప్పక చేస్తాను. :)

      తొలగించండి
  6. ఎన్నో చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

    రిప్లయితొలగించండి
  7. మన ఆచారాలు , వాటి వెనక ఉద్దేశాలు చక్కగా రాస్తున్నారు . పెళ్ళి తంతులో జరిగే ప్రతిదానియొక్క మర్మమును రాయవలసినదిగా ప్రార్థన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు. ఎప్పటినుండో రాయాలనుకుంటున్నాను. జరిగ వలసిన వైదిక క్రతువు, దాని ఆవస్యకత, నేటి సామాజిక పరిస్థుతులు, ఆధునిక యుగంలో సాధక బాధకములు మొదలవన్నీ చర్చిస్తూ నాకు తెలిసినంత వరకు రాసే ప్రయత్నం తప్పక చేస్తాను. :)

      తొలగించండి
  8. మేము రిగ్వేదులం. మిగిలిన వారికి, మాకు పెళ్ళి తంతులోనూ, ఉపనయన తంతు లోనూ, చాలా మార్పు వుంటుంది. దయచేసి, మీకు రిగ్వేదం తెలిసినా లేదా మీ మిత్రుల ద్వారానైనా, రిగ్వేద వివాహ తంతును తెలియ చేయండి. కొన్ని సార్లు రిగ్వెడ పద్ధతిలో చేయించేవారు లేక, మిగిలి వారే, పుస్తకం పెట్టి చదువుతారు. దయచేసి, మా లాంతి వాళ్ళ సహాయార్ధం, కనీసం జిల్లాకు ఒక బ్రహ్మ గారి పేరు, దూరవాణి సంఖ్య తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ ఋగ్వేదంలో పురోహితం చేయించేవారు చాలా తక్కువగా ఉన్నారు. త్వరలో నాకు తెలిసిన వారి వివరాలు తెలియజేస్తాను.

      తొలగించండి
    2. ఆచార్యా, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదాలకు తంతు మారుతుందా? తేడాలు ఏమిటో తెలియజేయ గలరు.

      తొలగించండి
    3. శర్మ గారు,

      దయచేసి ౠగ్వేదంలో తంతు గురించి, రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలిసినంతమంది ౠగ్వేద పురోహితుల చరవాణి సంఖ్యలు ప్రచురించ గలరు.

      తొలగించండి
  9. పెళ్ళికూతురి చెవులలో దూది పెట్టటమే మర్చిపోయారు. స్త్రీలకు చెవులలో దూది అంటే పిల్లా పాపలతో బాగా ఉండటం అన్న విషయం ఎవరికీ తెలియటం లేదు. యోత్ర బంధనమప్పుడు వరుని చేత వధువు రెండు చెవులలో దూది పెట్టిస్తారు. బ్రాహ్మలు చెప్పాలి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేయాలి అలా జరగటం లేదు.

    రిప్లయితొలగించండి
  10. చాలా రోజుల తరువాత పెళ్ళికూతురి చెవులలో దూది గురించి ఇక్కడ చదివాను. నా చిన్నప్పుడు అంటే యాభై సంవత్సరాల క్రిందట మా చుట్టాల ఇంట్లో పెళ్ళిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురి చెవుల్లో దూది పెట్టటం చూశాను. పందిట్లో ఉన్న ముత్తైదువులు కూడా వాళ్ళ చెవుల్లో దూదులు పెట్టుకున్నారు. చిన్న పిల్లను నేను నాకు కూడా చెవుల్లో దూది పెట్టారు. మిగతావి గుర్తు లేకపోయినా ఇదొక్కటి గుర్తు ఉన్నది. కాలక్రమాన చాలా ఆచారాలు మారిపోతున్నాయి, మర్చిపోతున్నారు.

    రిప్లయితొలగించండి
  11. ఇంతకాలానికి పెళ్ళికూతురి చెవుల్లో దూది గురించి చదివాను. నా చిన్నప్పుడు అంటే సుమారు యాభై సంవత్సరాల క్రిందట మా చుట్టాల ఇంట్లో పెళ్ళిలో పెళ్ళికొడుకు మా అక్కయ్య అవుతుంది పెళ్ళికూతురు ఆమె చెవులలో దూది పెట్టటము చూశాను. పందిట్లో ఉన్న ముత్తయిదువలు కూడా తమ చెవులలో దూడులు పెట్టుకున్నారు. చిన్న పిల్లను నాకు కూడా చెవుల్లో దూది పెట్టారు. మిగతావి గుర్తులేవు కానీ ఇదొక్కటే బాగా గుర్తుండిపోయింది. కాలక్రమాన ఆచారాలు మారుతున్నాయి, బుగ్గన చుక్క, చెవుల్లో దూది పెళ్లి కూతురి అలంకారాలు గా ఉండేవి.

    రిప్లయితొలగించండి
  12. ఇంతకాలానికి పెళ్ళికూతురి చెవులలో దూది గురించి చదువుతున్నాను. నా చిన్నప్పుడు అంటే యాభై సంవత్సరాల క్రిందటి మాట. పెళ్ళికొడుకు చేత పెళ్ళికూతురి చెవుల్లో దూది పెట్టించారు. నాకు బాగా గుర్తు. పందిట్లో ఉన్న ముత్తైదువులు కూడా తమ చెవులలో దూది పెట్టుకున్నారు. చిన్న దానిని అయినా నాకు కూడా చెవుల్లో దూది పెట్టారు. అది ఒకటే గుర్తు ఉన్నది. కాలక్రమాన మన ఆచారాలు కూడా మారిపోతున్నాయి. మళ్ళీ పెళ్లి పందిళ్ళలో వధువుల చెవులలో దూదులు ఎప్పుడు చూస్తామో.

    రిప్లయితొలగించండి
  13. ఇంత కాలానికి పెల్లికూతుళ్ళ చెవులలో దూది గురించి చదువుతున్నాను. నాకు బాగా గుర్తు. నా చిన్నపుడు అంటే యాభై సంవత్సరాల క్రిందటి మాట. పెళ్ళికొడుకు చేత పెళ్ళికూతురు చెవుల్లో దూది పెట్టించారు. పందిట్లో ఉన్న ముత్తైదువలు కూడా తమ చెవులలో దూదులు పెట్టుకున్నారు. చిన్న పిల్లనైనా నాకు కూడా చెవుల్లో దూది పెట్టారు. అది ఒక్కటే నాకు బాగా గుర్తు ఉండిపోయింది. కాలక్రమేణా మన ఆచారాలు మారిపోతున్నాయి. మళ్ళీ పెల్లిపందిళ్ళలో వధువుల చెవులలో దూది ఎప్పుడు చూస్తానో.

    రిప్లయితొలగించండి
  14. బొటన వేలు చూపుడు వేలు కలిపి సున్నా లాగా చిన్ముద్ర లా పట్టుకుంటే మేధ పదును గా ఉంటుందని మనకు తెలుసును. అసలు స్త్రీలకు శరీర బలహీనత ప్రథమ రజస్వల నుంచే మొదలవుతుంది. స్త్రీలు చెవులలో దూది పెట్టుకుంటే చెవులలోని నాడులు ప్రకోపానికి లోనై శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం improve అవుతుందిట. మన వారు ఎప్పుడో శతాబ్దాల క్రిందట కనిపెట్టిన విషయాన్ని ఈ మధ్య ఒకాయన ఇంగ్లాండులో ప్రయోగాత్మకంగా నిరూపించారు. అందుకనే మన వారు స్త్రీల చెవులలో దూది పెట్టుకోవటానికి అంత ప్రాముఖ్యతను ఇచ్చారు. అది ఒక ఆచారంగా నిలిచి పోయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దూది పెట్టుకుంటే ఆరోగ్యంగా వుంటామనే విషయాన్ని చక్కగా చెప్పారు, శాస్త్రీయత వివరించగలరు. పెళ్ళప్పుడు మాత్రమే ఎందుకో వివరించండి. పెళ్ళికొడుకు చెవుల్లో కూడా ఇంకాస్త ఎక్కువ దూది కూరాలి. దూది పెట్టుకుంటే కలిగే లాభాలు చెవుల్లోనేనా ఇంకా వేరే వేరే భాగాలు ఏవైనా వున్నాయా అన్న విషయం మీద పరిశోధన జరగాలి.

      తొలగించండి
    2. స్త్రీలకు ముఖ్యం గా బలహీనతను దూరం చేయటం కోసం చెవులలో దూది పెట్టుకోవాలి. అది పెళ్లి లోనే కాదు, ప్రథమ రజస్వల నుంచే మొదలవుతుంది. పెళ్ళిలో పెళ్ళికొడుకు చేత పెళ్లి కూతురు చెవుఅలో దూది పెట్టించటం అంటే భార్య ఆరోగ్యం గురించి భర్త బాధ్యతను గుర్తు చేయటం వంటిది. చెవులలో దూది పెట్టినప్పుడు చెవులలోని నాడులు ఒత్తిడి కి గురి అయి నాడీ మండలాన్ని ఉత్తేజపరిచి శరీర ఆరోగ్యానికి దోహద పడుతుంది. అందుకే బాలింతలకు త్వరగా ఆరోగ్యం కుడురుకోవటానికి చెవుల్లో దూది పెట్టుకోమని సూచిస్తారు. ఈ విషయాన్ని ఇంగ్లాండు లో ఒకాయన ప్రయోగాత్మకంగా నిరూపించాడు.

      తొలగించండి
  15. మా బాబాయి గారి అమ్మాయి, 24 సంవత్సరాలు వయస్సు, Software Engineer, కొన్ని సంవత్సరాలు గా ఆమె కు అరి కాళ్ళలో మంటలు, నెప్పులు ఎన్ని మందులు విటమినులు వాడినా తగ్గలేదు, ఇక్కడ చదివాను, నా సలహా మేరకు చెవులలో దూది పెట్టుకుంటే రెండు రోజుల లోనే కొంత మేరకు తగ్గింది, మంచి గుణం కనిపించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ఒక విచిత్రం జరిగింది. రాస్తున్నాను. నా మరదలు కొంచెం తిక్క మనిషి. మా పెళ్లి నిశ్చయమైంది. ఒక రోజు మా మామయ్యా గారి ఇంటికి వెళ్లి ఆమెను కారులో ఎక్కించుకొని నా స్నేహితుని ఇంట్లో ఉపనయనానికి వెళ్తున్నాము. కొద్ది దూరం వెళ్లి కారు ఆపి దూది చేతిలోకి తీసుకున్నాను. ఎందుకు అన్నది ఆమె. నీ చెవులలోకి అన్నాను. ఏ కళన ఉన్నదో మారు మాట్లాడకుండా తన చెవుల్లో నేను దూది పెడుతుంటే ఊరుకున్నది. వారి ఇంటికి వెళ్ళినా రోజంతా చెవులలో దూది ఉంచుకున్నది. సాయంత్రం మా మామయ్యా గారింట్లో తనను దిగబెట్టే ముందు తన చెవుల్లో దూది తీయబొతే వద్దన్నది. కాని ఆ రోజు నుంచీ తను చెవుల్లో దూది పెట్టుకుంటూనే ఉన్నది, కొంత తిక్క తగ్గినట్టు అనిపిస్తున్నది. చెవులలో దూది పెట్టితే రక రకాల లాభాలు ఉన్నట్లున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భార్యకు జడ వేయటం, ఆమెకు వంటలో సహాయం గా కూరలు తరిగి పెట్టటం, ఆమె కాళ్ళు వొత్తటం, ఆమె నిద్ర లేచి ముఖం కడుక్కొని వచ్చేటప్పటికి కాఫీ చేసి తీసుకొని వచ్చి ఇవ్వటం, అట్లు పోసి టిఫిను తయారుచేయటం, వంటి పనులు భార్యాభర్తలు మానసికం గా కూడా దగ్గరవటానికి తోడ్పడతాయి. అలాంటిదే ఆమె తలను తన ఒడిలోనికి తీసుకొని ఆమె చెవులలో దూది పెట్టటం కూడాను. మీరు మీ కాబోయే భార్య చెవులలో దూది పెట్టటాన్ని ఆమె ఒక ఆర్ద్రతతో కూడిన ఒకరికొకరు దగ్గర ఆయె చర్య గా భావించి ఆమెకు కొంత తిక్క తగ్గటానికి దోహద పడిందేమో.

      తొలగించండి
  17. గురువుగారు చాలా మంచి విషయం తెలియచేసారు. ఐతే ఇప్పటి పెండ్లిలలో దివిటి ప్రస్తావన ఉండుట లేదు 2దివిటీలు ఉండాలని విన్నాను. నిజమేన?

    రిప్లయితొలగించండి
  18. అయ్యా శర్మ గారు నేనూ పురోహితుడినే మీరు చెప్పింది నిజమే మనం చెప్పింది ఎవ్వరూ వినడం లేదు వారు చెప్పింది మనం వినవలిసి వస్తోంది క్రతువు గురించి వారికి ఆఖర్లేదు తూతూ మంత్రం గా చేసేయాలి

    రిప్లయితొలగించండి
  19. మరీ దారుణం ఏంటి అంటే ఈ మద్య పెళ్ళిలలొ వచ్చిన వారు అక్షింతలు వేయడం మాని ఫోటోలు తీయడానికి ఉత్సాహం చూపే వారు ఎక్కువ అయ్యారు.

    రిప్లయితొలగించండి
  20. మరొక తమాషా అన్ని పెళ్ళిళ్ళలోనూ కనిపిస్తోంది. బోలెడుమంది పొలోమని వేదికమీద చేరి అందరికీ అడ్డంగా నిల్చుంటారు. క్రింద ఉన్నవాళ్ళకు మంటపంలో ఏమి జరుగుతోందో కూడా అర్థం కాని పరిస్థితి. జనాల వీపులు చూడటానికి శుభకార్యాలకు వెళ్తున్నామా మనం?

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.