27, ఆగస్టు 2014, బుధవారం

స్నేక్ గ్యాంగ్ కి కఠినమైన శిక్ష విధించాలి. సమాజం అప్రమత్తమవ్వాలి.





వీళ్లకి ఇదే మొదటిదికాదు. తెలియని మత్తులోనో, యాదృశ్చికంగానో జరిగిన పనికాదు. మమ్మల్ని ఎవరేమి చేస్తారన్న అహంకారం, ఒళ్లు తెలియని కామం,  స్త్రీలపైన ఉన్న చులకన భావం వీళ్లని ఈస్థితికి తెచ్చాయి.  పైశాచికత్వం నరనరానా నిండిన వీళ్లకి శిక్ష చాలా కఠినంగా ఉండాలి. ముఖ్యమైన నేరస్తులకి ఉరిశిక్షవిధించాలి.

బాధితులు స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ఆలస్యం చేయడానికి గల కారణాలేమిటి? ఇంతకు ముందు వీరిపై ఇలాంటి అనుమానాలు వచ్చినా పోలీసులు ఎవరూ కంప్లైంట్  ఇవ్వలేదని వారిని విచారించలేదట. ( లక్షల రూపాయల లంచం తీసుకుని వారిని వదిలేశారట ) ఈవార్త నిజమైతే ఆ పోలీసులని ఉద్యోగంలోనుండి తొలగించాలి.

 ఇలాంటి సంఘటనల తరువాత ఆయా స్త్రీల జీవితాలు ఏమిటి? సమాజం వీరి తప్పునే ఎత్తి చూపుతుంది, సూటిపోటి మాటలతో కుళ్లబొడుస్తుంది. అత్యాచారం చేసిన వాడు సిగ్గుపడాలి, భయపడాలి కానీ మన నేటి సమాజంలో అత్యాచారానికి గురి అయిన స్త్రీలు తమ పరువుపోతుందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఒకవేళ ఇద్దామన్నా ఇంట్లోవారి సహకారం ఉండటం లేదు. ఎన్నిటికో సిద్ధపడి కంప్లైంట్ ఇస్తే పోలీస్ లు లంచాలు మరిగో, పై వారికి తలొగ్గో వారి గోడు పట్టించుకోరు. పైగా ఆ మృగాళ్ళ కొమ్ముకాస్తారు.

  పదిమంది గాంగ్ ఇలా చాలాసార్లు అరాచకాలు చేశారంటే ఆదుర్మార్గుల ఇళ్లలో ఒకసారి కాకపోతే మరోసారి ఈవిషయాలు తెలిసి ఉండవా? ఆ ఇళ్లలో స్త్రీలు లేరా? వారెవరూ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? మనంకూడా మన స్నేహితులో, కుటుంబీకులో ప్రవర్తన తేడాగా ఉండడం గమనిస్తూ ఉంటాం! కానీ ఏమిటా అని ఆరా తీయం, ఒకవేళ వాళ్లు విరుద్ధమైన పనులు చేస్తున్నారని తెలిసినా పోలీస్ కంప్లైంట్ వంటివి ఇవ్వం. ఎందుకంటే అది మన బాధ్యత కాదు కదా! బాధితులు ఎవరో వాళ్ల పని అది! వాళ్లే కంప్లైంట్ ఇవ్వ నప్పుడు మన స్నేహితుల మీద మనం ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి?........... ఇలాంటి భావనలతో ఉంటే ఇక సమాజం ఎలా మారుతుంది? తప్పుని పక్కవారిపై నెట్టడం సులభం. దానికి బాధ్యత వహించడం చాలా కష్టం. కానీ సమాజానికి మంచి చేయాలన్న దిశగా ఒక్క చిన్నమార్పు మనలో వచ్చినా అది మన దేశ ప్రగతినే ఎంతో మార్చేస్తుంది.

ఒంటరి మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి.  మహిళలను రక్షించడం, వారికి జీవించే హక్కుని కల్పించడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలి. దురదృష్ట మేమిటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతీ వారూ వేరొకరిని తప్పుపడతారే కానీ, తమ బాధ్యతా లోపాన్ని గుర్తించడం లేదు.  ఇలాంటి వార్తలు చదివి అయ్యోపాపం అనుకుంటున్నారే కానీ, నాకు ఇలాంటి పరిస్తితి ఎదురైతే నేనెలా ఎదుర్కోగలను? ఎంతవరకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆలోచించడం లేదు. కనీసం ఆడవారు అయినా అప్రమత్తమవ్వడం లేదు.  పెప్పర్ స్ప్రే వంటివి ఎందరు దగ్గర ఉంచుకుంటున్నారు? women protection కోసం సెల్ లో కొన్ని యాప్స్ వచ్చాయి. వాటిని గట్టిగా నొక్కి పట్టుకుంటే నిమిషంలో పోలీసులకి, మిత్రులకి మెసేజ్ లు వెళ్లి పోతాయి. సెలో కెమేరా ఆన్ అయి నెట్ ద్వారా మిత్రుల మెయిల్ ఐడీలకి వెళ్లిపోతూ ఉంటుంది. ఇది ఎంతమంది మహిళల సెల్ లో ఉంది? వీటిని స్త్రీలు మాత్రమే కాక పురుషులు కూడా సెల్ లో ఇనిస్టాల్ చేసుకోవాలి. కానీ బాధింప బడుతున్న స్త్రీలకే అప్రమత్తత లేదు, ఇక పురుషులవిషయం చెప్పనవసరం లేదు. 



 సమాజంలో ప్రతీ ఒక్కరు స్త్రీలకి సహాయంగా నిలవడం తమబాధ్యతగా గుర్తించాలి.

2 కామెంట్‌లు:

  1. వీళ్ళకు కఠిన శిక్ష్లు విధించాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ,చట్టాలు ఆపని చేయగలవా?
    వీళ్ళ అరెస్ట్ తరువాత వీళ్ళకు మద్దతుగా లోపాయకారంగా ఎన్ని వత్తిడులొస్తాయో >? అసలు మన రాజకీయ నాయకులకే ఎన్నికలలో అవసరాలకోసం ఎన్నిరకాల లాజిక్కులు అడ్డుపదతాయో?????
    ఇదీ మన సమాజంలో నెలకొని ఉన్న దుస్థితి

    రిప్లయితొలగించండి
  2. ఆధ్యాత్మిక సాధనాల వెలుగుతో నింపే మీ బ్లాగ్లో దీన్ని చేర్చి ఉండకపోతేనే న్యాయంగా ఉంటుంది . సామజిక అవసరాలకు

    వేరే బ్లాగ్ వాడడం మంచిదనే సలహా ఇస్తున్నందుకు మన్నించాలి . http://amma-antarangam.blogspot.com

    శ్రేయోభిలాషి

    శ్రీమతి రాజేశ్వరి సూర్య ప్రకాశ శర్మ .

    రిప్లయితొలగించండి

నానుండి కాస్త ఆలస్యంగా స్పందన రావచ్చు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. అవసరమైన వాటికి తప్పక స్పందిస్తాను. అఙ్ఞాతలు చేసే అనవసర వ్యాఖ్యలని నిర్మొహమాటంగా తొలగిస్తాను. భారతీయ ధర్మముల పట్ల నమ్మకం లేని వారికి ఇది సరిఅయిన ప్రదేశం కాదు.